అర్హులైన అభ్యర్థులు లేనిచోట పరీక్ష రాస్తే చాలు... గ్రామ సచివాలయ కొలువు: ప్రెస్ రివ్యూ

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ ఎస్టీల్లో కొన్నిచోట్ల అర్హులైన అభ్యర్థులు లేనందున అక్కడ పరీక్ష రాసిన వారందరికీ గ్రామ సచివాలయాల్లో ఉద్యోగావకాశం లభించనుందని ఈనాడు తెలిపింది.

కడప జిల్లాలో ఇప్పటికే సున్నా మార్కులొచ్చిన ఉద్యోగార్థులను పరిగణనలోకి తీసుకునే ప్రక్రియ మొదలైంది. అభ్యర్థుల కొరత ఉంటే మిగతా జిల్లాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. ఎస్సీ ఎస్టీల్లో అర్హులైన అభ్యర్థులు చాలా జిల్లాల్లో తక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో ఇప్పటికే కటాఫ్‌ మార్కులను 30 నుంచి 25 శాతానికి తగ్గించారు.

అప్పటికీ అర్హులైన అభ్యర్థులు లేనిచోట నియామక ప్రకటనలో (నోటిఫికేషన్‌) ప్రస్తావించిన జీవో ప్రకారం కటాఫ్‌ మార్కులను తగ్గించుకుంటూ వెళ్లినా ఫలితం ఉండటం లేదు. దీంతో సున్నా మార్కులొచ్చిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలని కడప కలెక్టర్‌ అధికారులను తాజాగా ఆదేశించారు.

అభ్యర్థుల కొరత తీవ్రంగా ఉన్నచోట ఇదే విధానాన్ని అమలు చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మిగతా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. బీసీ, ఓసీలకూ కటాఫ్‌ మార్కులను తగ్గించాలని ప్రభుత్వానికి అభ్యర్థుల నుంచి వినతులొస్తున్నాయి. ఇప్పటివరకైతే వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత అధికారి ఒకరు తెలిపారని ఈనాడు వెల్లడించింది.

'సెల్ఫ్‌ డిస్మిస్‌' చట్టాల్లో ఉందా?

తెలంగాణ ఆర్టీసీ సమ్మె పదమూడు రోజులుగా కొలిక్కిరాని నేపథ్యంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రంగంలోకి దిగారని, 'అసలేం జరుగుతోంది' అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి ఆరా తీశారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

సమ్మె తీవ్రత, సెల్ఫ్‌ డిస్మిస్‌ పేరుతో కార్మికుల తొలగింపు వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. కార్మిక చట్టాల్లో 'సెల్ఫ్‌ డిస్మిస్‌' అనే పదం ఉందా? అని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. ఆ పదం లేకుండా కొలువుల నుంచి 48 వేల మంది కార్మికులు తొలగిపోయినట్లు ఎలా చెబుతారని నిలదీసినట్లు తెలిసింది.

ఆర్టీసీ జేఏసీతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు ఇప్పటికే పలు దఫాలుగా గవర్నర్‌ను కలిసి సమ్మె గురించి నివేదించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే సమ్మె జరుగుతోందని ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన గవర్నర్‌... సుమారు 40 నిమిషాల పాటు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. టీఎ్‌సఆర్టీసీ సమ్మె తీవ్రత, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయనకు వివరించారు. ఆ తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఆమెతో బీజేపీ రాష్ట్ర నాయకులు మరోసారి భేటీ అయ్యారు. మరుసటి రోజే (గురువారం) ఆమె ఆర్టీసీ సమ్మెపై రంగంలోకి దిగారు.

కార్మికులతో చర్చలు జరపాలని, పూర్తిస్థాయి ఎండీని నియమించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల అమలు ఎంతవరకు వచ్చింది? కార్మికులతో చర్చలు జరపడానికి, ప్రజారవాణా వ్యవస్థను మాములు స్థితికి తెచ్చేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు? అని అజయ్‌కుమార్‌ను ఆమె ఫోన్‌లో ఆరా తీశారు. ప్రజలు ఇబ్బంది పడకుండా బస్సులను నడుపుతున్నామని, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ వచ్చి పూర్తిగా వివరిస్తారని ఆయన చెప్పారు.

అనంతరం సునీల్‌ శర్మను రాజ్‌భవన్‌కు గవర్నర్‌ పిలిపించారు. ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆయన్ను గవర్నర్‌ అడిగి తెలుసుకున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. ప్రజలకు రవాణా సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం పలు చర్యలు చేపడుతున్నాయని గవర్నర్‌కు సునీల్‌ శర్మ వివరించారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

2 సెంట్లలోపు వరకు..రూపాయికే రిజిస్ట్రేషన్‌

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాంతాల్లో అభ్యంతరాల్లేని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించే విషయంలో ప్రభుత్వం పేదలకు చక్కటి అవకాశం కల్పించిందని సాక్షి తెలిపింది. రెండు సెంట్లలోపు వరకు మొత్తం రూపాయికే రిజిస్ట్రేషన్‌ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అంతకు మించితే క్రమబద్ధీకరణ ఫీజు ఎంత ఉండాలన్న దానిపై ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన సూచించారు.

అలాగే, వీటి క్రమబద్ధీకరణకు విధివిధానాలు తయారు చేయాలన్నారు. ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే విషయమై గురువారం ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) పిల్లి సుభాష్‌ చంద్రబోస్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.

నదీతీరాల వెంబడి, కాల్వగట్ల వెంబడి ఉన్న ఇళ్ల కారణంగా ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు పొంచి ఉన్నందున, స్థలాలు, ఇళ్ల కేటాయింపులో ఇక్కడి వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

గతంలో స్థలం ఇచ్చినా రిజిస్ట్రేషన్‌ చేసే వారు కాదని, ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామన్నారు. చంద్రబాబు పేదలకు ఇచ్చిన స్థలాలను లాక్కున్నారని.. ఒకసారిఇచ్చిన తర్వాత ఎలా లాక్కుంటారని జగన్‌ ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణానికి వీలైనంత మేర ప్రభుత్వ స్థలాలనే వాడుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్నచోట పేదలకు అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు కన్నా.. ఇళ్ల స్థలాలు కేటాయించి వాటిలో విడివిడిగా ఇళ్లు కట్టించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం పేదలు ఉంటున్న బహుళ అంతస్తుల సముదాయాల్లో నిర్వహణ సరిగ్గాలేదని, ఫలితంగా ఫ్లాట్లు దెబ్బతింటున్నాయని ముఖ్యమంత్రి వివరించినట్లు సాక్షి పేర్కొంది.

మేమూ సమ్మెకు వెనకాడం

ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని, దాంతోపాటే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ కారం రవీందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

''ప్రభుత్వానికి గడువు ఇచ్చాం. ఆలోగా సమస్యలు పరిష్కారం కాకపోతే మేమేం చేయాలో నిర్ణయించుకుంటాం' అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 16 అంశాలతో కూడిన డిమాండ్ల పత్రాన్ని ప్రభుత్వం ముందు ఉంచారు. ఏడాదిగా పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నామని, రెండు డీఏలు పెండింగులో ఉన్నాయని గుర్తు చేశారు.

గురువారం ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని కలిశారు. తమ సమస్యలను విన్నవించారు. అనంతరం కారం రవీందర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. అన్ని అంశాల పట్ల సీఎస్‌ సానుకూలంగా స్పందించారని, త్వరలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారని వెల్లడించారు.

24వ తేదీ తర్వాత సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని, సీఎ్‌సను కలిశాక నమ్మ కం ఏర్పడిందని చెప్పారు. నెలాఖరులోగా సమస్యలు పరిష్కరిస్తారనే ఆశతో ఉన్నామన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే తప్పకుండా సమ్మెలోకి వెళతామని ప్రకటించారు.

ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన తహసీల్దార్లను వెనక్కు తేవాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలను రద్దుచేసి, ఉద్యోగులకు నేరుగా వేతనాలివ్వాలని సూచించారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)