ఎయిర్ ఇండియా విమానం హఠాత్తుగా 300 అడుగులు కిందకు దిగిన ఘటన: పైలట్ మత్తులో ఉన్నారన్న అనుమానంతో టెస్టులు, నిజమని తేలితే ఏమవుతుంది

ఎయిర్ ఇండియా, పైలట్,టర్బులెన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుండి దిల్లీకి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఆగష్టు 4న గాలిలో ఉండగానే అకస్మాత్తుగా 300 అడుగులు కిందకు పడిపోయింది (ప్రతీకాత్మక చిత్రం)
ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

గతవారం ఎయిర్ ఇండియా విమానం ఒకటి ప్రయాణంలో కుదుపులకు లోనైంది. ఆ సమయంలో విమానం ఒక్కసారి 300 అడుగులు కిందికి దిగినట్లు గుర్తించారు.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు పైలట్‌పై విచారణ జరుగుతోంది.

పైలట్‌కు నిర్వహించిన రెండో డ్రగ్ టెస్ట్‌లో కూడా పాజిటివ్‌ వచ్చినట్లు మీడియా రిపోర్టులు వెల్లడించాయి.

ఈ విమానం థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి దిల్లీకి వస్తుండగా ఘటన జరిగింది.

ప్రస్తుతం ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ -ఏఏఐబీ) ఈ విషయాన్ని విచారిస్తున్నందున దీనిపై ప్రస్తుతం ఏమీ మాట్లాడలేనని, తుది రిపోర్ట్‌లు వచ్చిన తర్వాత స్పందిస్తానని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఎయిర్ ఇండియా, పైలట్,టర్బులెన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా సుమారు 2.3 బిలియన్ అరబ్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది (ప్రతీకాత్మక చిత్రం)

ఈ కేసు డ్రగ్స్ వాడకంతో ముడిపడి ఉందని, నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

ఈ ఘటనలో వివిధ అంశాలకు సంబంధించిన అన్ని ఆధారాలను ఏఏఐబీ పరిశీలిస్తోంది.

మంగళవారంనాడు, ఫుకెట్-దిల్లీ విమాన ప్రమాదానికి సంబంధించి ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్‌ను భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పిలిపించింది. ఆయన త్వరలోనే పదవీ విరమణ చేయబోతున్నారు.

పైలట్‌కు టెస్టులు

ఆగస్టు 4న జరిగిన ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. ఎయిర్‌బస్ ఏ320 విమానంలో 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు.

మీడియా రిపోర్టుల ప్రకారం, ఏఐ 2379 ఫ్లైట్‌ను ఆ రోజు నడిపిన పైలట్-ఇన్-కమాండ్‌కు మరోసారి డ్రగ్ టెస్ట్ నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. పైలట్‌కు నిర్వహించిన తొలి పరీక్షలో 'నాన్-నెగటివ్' ఫలితం వచ్చింది. అయితే ఇది ప్రాథమికంగా నిర్వహించే ర్యాపిడ్ టెస్ట్. ఇందులో వచ్చిన ఫలితాన్ని ఫైనల్‌గా పరిగణించరు.

ఇలాంటి తీవ్రమైన సంఘటనలపై దర్యాప్తు చేసేటప్పుడు, మత్తు పదార్థాలు వాడారా అన్న కోణంలో సిబ్బందిని పరీక్షించడం ఒక ప్రామాణిక ప్రక్రియ.

తొలి పరీక్షలో నాన్-నెగెటివ్ ఫలితం వస్తే, నిర్ధరణ కోసం రెండో టెస్ట్ నిర్వహిస్తారు. అయితే రెండో పరీక్షలో కూడా పైలట్‌కు పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయంటూ యూఎస్ మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్ ఒక వార్త ప్రచురించింది.

"దర్యాప్తు ఫలితాలు గోప్యం. కాబట్టి, వారు తమ గుర్తింపు వెల్లడించకుండా ఈ సమాచారాన్ని అందించారు" అని బ్లూమ్‌బెర్గ్ తన రిపోర్టులో పేర్కొంది. పైలట్ డ్రగ్ టెస్ట్ ఫలితాలపై వ్యాఖ్యానించడానికి ఎయిర్ ఇండియా ప్రతినిధి నిరాకరించారు.

ఫ్రాన్స్ విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ, ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ సాంకేతిక నిపుణులు కూడా ఏఏఐబీ దర్యాప్తులో సహకరిస్తున్నారు.

గత సంవత్సరం ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌కు సంబంధించిన ఒక ఘోరమైన ప్రమాదం తర్వాత భారతదేశ విమానయాన రంగంలో భద్రతపై అనేక ప్రశ్నలు వినిపించాయి.

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాకు ఈ సంఘటన మరో సవాల్ విసురుతోంది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థ సుమారు 2.3 బిలియన్ అరబ్ డాలర్ల రికార్డు నష్టాన్ని చవిచూసింది.

తాజా ఘటన ఆ సంస్థ కొత్త సీఈఓ టెవోల్డే గెబ్రెమరియమ్‌కు ముందు అనేక సవాళ్లున్న విషయాన్ని గుర్తు చేస్తోంది.

1. డ్రగ్ టెస్ట్ ఫలితం పాజిటివ్‌ అయితే ఏమవుతుంది?

భారత విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి మొదటిసారి డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్‌గా తేలితే, అతనిని డీ-అడిక్షన్ సెంటర్‌కు పంపుతారు.

డ్రగ్ టెస్ట్‌కు నిరాకరించడాన్ని కూడా పాజిటివ్ ఫలితం వచ్చినంత తీవ్రంగానే డీజీసీఏ పరిగణిస్తుంది. మొదటిసారి టెస్టుకు నిరాకరించిన వెంటనే ఆ ఉద్యోగిని విధుల నుంచి తప్పిస్తారు. ఆ వ్యక్తి తిరిగి 48 గంటల్లో డ్రగ్ టెస్ట్‌లో పాల్గొని నెగెటివ్ ఫలితం సాధించాల్సి ఉంటుంది.

అలా చేయడంలో విఫలమైతే, ఆ పైలట్ లైసెన్సును ఏడాదిపాటు సస్పెండ్ చేస్తారు. తిరిగి విధుల్లో చేరడానికి ముందు ఆ వ్యక్తి డీ-అడిక్షన్‌ ప్రోగ్రామ్‌కు హాజరుకావాలి.

తిరిగి తన పదవిని చేపట్టాలంటే ఆ ఉద్యోగి మళ్లీ పరీక్ష చేయించుకుని నెగటివ్ ఫలితం పొందాలి. రెండోసారి పాజిటివ్‌గా తేలితే లైసెన్సును మూడేళ్లపాటు సస్పెండ్ చేస్తారు. మూడోసారి కూడా పాజిటివ్‌గా తేలితే శాశ్వతంగా లైసెన్సును రద్దు చేస్తారు.

ఎయిర్ ఇండియా, పైలట్,టర్బులెన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(ఫైల్ ఫోటో).

2. పౌర విమానయాన శాఖా మంత్రి ఏమన్నారు?

ఫుకెట్-దిల్లీ మధ్య నడిచే ఒక ఎయిర్ ఇండియా విమానానికి జరిగిన ప్రమాదాన్ని ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని, తదుపరి నిర్ణయం తీసుకునే ముందు విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ ఇచ్చే రిపోర్టు కోసం వేచి చూస్తున్నామని మంగళవారంనాడు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

ఈ ఘటనను ఎయిర్ ఇండియా ఎలా చూస్తోంది, సెక్యురిటీ ప్రోటోకాల్స్‌లో, ముఖ్యంగా పైలట్లు మత్తుపదార్థాలు వాడటంపై ఉన్న నిబంధనల విషయంలో ఏవైనా లోపాలు ఉన్నాయా అనే విషయాలను అర్థం చేసుకోవడానికి పదవీ విరమణ చేయబోతున్న ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్‌తో తమ మంత్రిత్వ శాఖ ఒక సమావేశం నిర్వహించిందని రామ్మోహన్ నాయుడు విలేఖరులతో అన్నారు.

తమ ప్రభుత్వానికి ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యమైన విషయమని, ఇందులో ఎక్కడా రాజీపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

పైలట్లు మత్తుపదార్థాలు వాడిన సందర్భంలో, దానికి సంబంధించి డీజీసీఏ నిబంధనలు ఏం చెబుతున్నాయనేదానిపై కూడా మంత్రిత్వ శాఖ తాజా సమాచారం కోరిందని, ప్రస్తుత నిబంధనలు సరిపోవని తేలితే, మార్పులు చేసే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు.

3. నిబంధనలు ఏం చెబుతున్నాయి?

విమానయాన సిబ్బంది డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం వస్తే వారికి పరీక్షలు నిర్వహించడానికి సంబంధించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) 2021 సెప్టెంబర్‌లో మార్గదర్శకాలు జారీ చేయగా, అవి 2022 జనవరి 31నుంచి అమల్లోకి వచ్చాయి.

ఈ నిబంధనలు ప్రధానంగా పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లపై దృష్టి సారించినప్పటికీ, భద్రతకు సంబంధించిన విధులు నిర్వర్తించే ఇతర విమానయాన సిబ్బందికి కూడా ఇవి వర్తిస్తాయి. ఫ్లయిట్ మెయింటెనెన్స్ ఇంజినీర్లు, సర్టిఫైయింగ్ సిబ్బంది, ట్రైనింగ్ పొందుతున్న పైలట్లు, ట్రైనర్లు కూడా దీని పరిధిలోకి వస్తారు.

ఫ్లైట్ సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు మాత్రమే తప్పనిసరిగా యాన్యువల్ ర్యాండమ్ డ్రగ్ టెస్టులకు హాజరుకావాల్సి ఉంటుంది. మొత్తం సిబ్బందిలో వీరు సుమారు 10 శాతం ఉంటారు.

ఈ వర్గంలోని లేని ఉద్యోగులకు... నియామకం సమయంలో లేదంటే ఏవైనా అనుమానాలు వ్యక్తమైనప్పుడు మాత్రమే డ్రగ్ టెస్టులు నిర్వహిస్తారు. ర్యాండమ్ టెస్టులతోపాటు ఆగస్టు 4 నాటి ఘటనల్లాంటివి జరిగినప్పుడు కూడా ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తారు.

ఎయిర్ ఇండియా, పైలట్,టర్బులెన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విమాన సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు మాత్రమే యాన్యువల్ ర్యాండమ్ డ్రగ్ టెస్ట్‌కు హాజరుకావల్సి ఉంటుంది.

4. విచారణ ఎలా జరుగుతుంది?

డీజీసీఏ నిబంధనల ప్రకారం ఉద్యోగుల యూరీన్ శాంపిల్స్‌లో ఆరు రకాల సైకోయాక్టివ్ పదార్థాలు ఉన్నాయోమోనని పరిశీలిస్తారు. వీటిలో ఎంఫెటమైన్‌లు లేదా ఎంఫెటమైన్ లాంటి ఉత్ప్రేరకాలు, ఓపియేట్లు, వాటి మెటబొలైట్లు, టెట్రాహైడ్రో కానబినాల్ (గంజాయి), కొకైన్, బార్బిట్యురేట్లు, ఇంకా బెంజోడియాజెపైన్లు ఉన్నాయేమో పరీక్షిస్తారు.

టెస్టుకు శాంపిల్స్ ఇస్తున్న పైలట్ లేదా ఉద్యోగి యూరీన్ శాంపిళ్లను రెండు భాగాలుగా విభజించి, వేర్వేరు కంటైనర్లలో నిల్వ చేస్తారు. మొదటి కంటైనర్‌లోని శాంపిల్స్‌పై వెంటనే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించడంతో టెస్టింగ్ ప్రక్రియ మొదలవుతుంది.

ప్రాథమిక పరీక్ష ఫలితం 'నాన్-నెగటివ్' అని వస్తే అంటే సైకోయాక్టివ్ పదార్థాలు ఉన్నట్లు సూచిస్తే, నిర్ధరణ పరీక్ష ఫలితం వచ్చే వరకు పైలట్‌ను వెంటనే విధుల నుంచి తొలగిస్తారు.

రెండో కంటైనర్‌లోని శాంపిల్‌ను నిర్ధరణ కోసం ఒక లేబరేటరీకి పంపుతారు. అక్కడ అత్యాధునిక పరీక్షా పరికరాలను ఉపయోగిస్తారు. గ్యాస్ క్రోమాటోగ్రఫీ/మాస్ స్పెక్ట్రోమెట్రీ లేదా లిక్విడ్ క్రోమాటోగ్రఫీ-మాస్ స్పెక్ట్రోమెట్రీని ఉపయోగించి శాంపిళ్లను విశ్లేషిస్తారు.

సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్ (సీఏఆర్) నిబంధనల ప్రకారం ‘‘ఒకవేళ శాంపిల్‌ A పరీక్షలో నెగటివ్ అని తేలితే, శాంపిల్ Bని నిర్ధరణ పరీక్ష కోసం లేబరేటరీకి పంపాలి. దానిపై శాంపిల్స్ సేకరించిన వ్యక్తి, ఇచ్చిన వ్యక్తి, సంబంధిత సంస్థ వైద్య సిబ్బంది సంతకాలు ఉండాలి"

ఎయిర్ ఇండియా, పైలట్,టర్బులెన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎయిర్ ఇండియా విమానాల్లో భద్రతకు సంబంధించి గతంలోనూ సందేహాలు వ్యక్తమయ్యాయి.(ఫైల్ ఫోటో).

5. పైలట్లకు ఎలాంటి సూచనలు ఇస్తారు?

ప్రస్తుత ఘటనలో జరిగినట్లుగా, పరీక్ష ఫలితం పాజిటివ్‌గా వస్తే, సంబంధిత సంస్థ మెడికల్ ఇన్‌చార్జ్ ఒక మెడికల్ రివ్యూ ఆఫీసర్ (ఎమ్మార్వో)ను సంప్రదించాల్సి ఉంటుంది.

ఆ పాజిటివ్ ఫలితం మాదకద్రవ్యాల తీసుకున్నందువల్ల కాకుండా, చట్టబద్ధమైన వైద్య చికిత్స లేదా ఇతర సాధారణ కారణాల వల్ల వచ్చిందా అని నిర్ధరించడమే దీని ఉద్దేశ్యం. ఉదాహరణకు, కోడైన్ ఆధారిత నొప్పి నివారణ మందు తీసుకోవడం వల్ల ఓపియేట్స్ కోసం చేసే పరీక్షలో పాజిటివ్ ఫలితం రావచ్చు.

ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఎల్‌పీఏ-ఇండియా) జారీ చేసిన ఒక సూచన ప్రకారం, పైలట్లు సొంతంగా మందులు వాడకూడదు. భారతదేశంలో సాధారణ జలుబు, దగ్గు, అలర్జీలు, నిద్ర సమస్యల కోసం లభించే ఓవర్-ది-కౌంటర్ మందులలో, పరీక్షల సమయంలో తనిఖీ చేసే ఆరు వర్గాలకు చెందిన పదార్థాలు ఉండవచ్చు.

పైలట్లకు ఏఎల్‌పీఏ-ఇండియా మరో సలహా కూడా ఇచ్చింది: ఏదైనా కొత్త మందులు వాడటం ప్రారంభించే ముందు వారి సంస్థ మెడికల్ ఇన్‌చార్జ్‌ను సంప్రదించాలి. వారు వాడే అన్ని మందుల గురించి కచ్చితమైన వివరాలు అందించాలి. పరీక్ష తర్వాత ఎమ్మార్వో సమీక్ష అవసరమైతే సమర్పించడానికి వీలుగా ప్రిస్క్రిప్షన్‌లు, ఆయా మందులు కొన్నప్పటి రసీదులను భద్రపరచుకోవాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)