You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపుల యాడ్స్: మెటాకు నోటీసులు పంపాలని కేంద్రం నిర్ణయం
(హెచ్చరిక: ఈ కథనంలో లైంగిక హింస గురించిన వివరణలు ఉన్నాయి)
భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ ప్రకటనల ద్వారా పిల్లల లైంగిక వేధింపుల కంటెంట్ వ్యాప్తి చెందుతోందని 'బీబీసీ-ఐ' పరిశోధనలో తేలింది.
ఈ కథనం ప్రచురితమైన వెంటనే కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఈ ఘటనపై మెటా సంస్థ నుంచి వివరణ కోరాలని, ఆ సంస్థ ప్రతినిధులను పిలిపించి మాట్లాడాలని అధికారులను ఆదేశించారు.
అధికారిక వర్గాల ద్వారా బీబీసీకి ఈ సమాచారం అందింది.
ఈ వ్యవహారంలో మెటా సంస్థ నుంచి కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ వివరణ కోరనుందని వార్తాసంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.
ఈ ప్రకటనలలో 'రేప్ వీడియో', 'చైల్డ్ వీడియో' లాంటి పదాలను ఉపయోగించారని బీబీసీ పరిశోధనలో తేలింది. యూజర్లను టెలిగ్రామ్ చానల్ లింకుల వైపు మళ్లించి, 99 రూపాయలకు ఈ కంటెంట్‌ను విక్రయిస్తున్నారు.
మెటా సంస్థపై ఐటీ శాఖ తీసుకున్న తాజా చర్య ఇది. కొన్నిరోజుల ముందే, వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త యూజర్‌నేమ్ ఫీచర్‌పై భారత ప్రభుత్వం మెటాకు నోటీసులు పంపింది.
మెటా ఏమంటోంది?
ఒక యువతి ఏడుస్తూ ఉన్న వీడియోలో తనను లైంగికంగా హింసించారని రాసి ఉన్న ఒక ప్రకటన (యాడ్) గురించి బీబీసీ ఇన్‌స్టాగ్రామ్‌కు ఫిర్యాదు చేసింది.
దీనిపై ఇన్‌స్టాగ్రామ్ 24 గంటల తర్వాత స్పందిస్తూ.. "ఆ ప్రకటన మా నిబంధనలను ఉల్లంఘించలేదని మా రివ్యూ టీమ్ తేల్చింది, కాబట్టి దాన్ని తొలగించలేం" అని సమాధానమిచ్చింది.
అదే సమయంలో, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ 'మెటా'ను బీబీసీ నేరుగా వివరణ కోరినప్పుడు, తాము ఇప్పటికే పలు ప్రకటనలను నిలిపివేశామని, వాటిని పోస్ట్ చేసిన అకౌంట్లను సస్పెండ్ చేశామని పేర్కొంది.
బీబీసీ ఇన్వెస్టిగేషన్ తర్వాత, మరికొన్ని ప్రకటనలను తొలగించామని, అకౌంట్లను డిజేబుల్ చేశామని, తమ పాలసీని ఉల్లంఘిస్తున్న ఇతర కంటెంట్ యూఆర్‌ఎల్‌లను బ్లాక్ చేశామని కంపెనీ తెలిపింది.
మరోవైపు టెలిగ్రామ్ స్పందిస్తూ, తాము 2026లో బాలల లైంగిక వేధింపులు, హింసాత్మక కంటెంట్‌తో ముడిపడి ఉన్న 2 లక్షల 74 వేల గ్రూపులు, ఇతర చానళ్లను తొలగించామని వెల్లడించింది.
"ఏ వ్యవస్థ కూడా పరిపూర్ణమైంది కాదు. పాలసీ ఉల్లంఘనలన్నింటిని మా రివ్యూ ప్రక్రియ గుర్తించలేదు" అని మెటా బీబీసీకి వివరించింది.
"ప్రకటనలు లైవ్ అయిన తర్వాత కూడా, వాటిలో నిబంధనల ఉల్లంఘనలను కనిపెట్టేందుకు మా 'ప్రోయాక్టివ్ డిటెక్షన్ సాంకేతికతను' నిరంతరం ఉపయోగిస్తూనే ఉంటాం. ఆ ప్రకటనలు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే ఎవరైనా మాకు ఫిర్యాదు చేయవచ్చు" అని తెలిపింది.
అంతేకాకుండా, ఎక్కడైనా పిల్లలపై లైంగిక అఘాయిత్యాలు లేదా వేధింపులు జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తే.. దాని గురించి చట్టప్రకారం 'నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్' (ఎన్‌సీఎంఈసీ) దృష్టికి తీసుకొస్తామని మెటా పేర్కొంది.
ఆన్‌లైన్‌లో పిల్లలపై జరిగే ఇలాంటి అఘాయిత్యాలను ఎన్‌సీఎంఈసీకి రిపోర్టు చేయవచ్చు. ఇది ఒక అంతర్జాతీయ కేంద్రీకృత సంస్థ.
‘బీబీసీ ఐ’ పూర్తి ఇన్వెస్టిగేషన్‌ను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)