‘స్పీడ్ పోస్టులో గంజాయి’.. 21 రాష్ట్రాల్లో సాగుతున్న దందాను హైదరాబాద్ పోలీసులు ఎలా ఛేదించారంటే..

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

స్పీడ్ పోస్టులో పత్రాలు, వస్తువులు, బహుమతులు పంపడం చూశాం. కానీ, ఝార్ఖండ్‌కు చెందిన ఒక ముఠా భారత తపాలా శాఖ 'స్పీడ్ పోస్టు' సేవను ఉపయోగించుకుని గంజాయి సరఫరా చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్ సిటీ పోలీస్, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్-న్యూ) సంయుక్త ఆపరేషన్లో ఇది వెలుగులోకి వచ్చింది.

''మా పరిశోధనలో 21 రాష్ట్రాల్లో ఈ సిండికేట్ నడుస్తోందని గుర్తించాం. ఐదుగురు సభ్యుల ఈ ముఠాలో కీలక వ్యక్తి అయిన ఝార్ఖండ్ వాసి సత్యం మిశ్రాను అరెస్టు చేశాం. మరో నలుగురు పరారీలో ఉన్నారు'' అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రకటించారు.

సత్యం మిశ్రాను విచారించగా కీలక విషయాలు బయటపడినట్లు సజ్జనార్ బీబీసీతో చెప్పారు.

సత్యం మిశ్రాది ఝార్ఖండ్‌లోని గిరిధ్ జిల్లా నిమ్రియాఘాట్ మండలం తాంబగుడియా గ్రామం.

''అతను మొదట్లో పెయింటర్‌గా, లారీ డ్రైవర్‌గా పనిచేశాడు. వివిధ రాష్ట్రాలకు సరకులను చేరవేసే క్రమంలో ముంబయికి వెళ్లినప్పుడు 2018లో గంజాయికి బానిసయ్యాడు'' అని సజ్జనార్ చెప్పారు.

సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో తన అన్న శుభం మిశ్రా అలియాస్ శుభం దాదా అలియాస్ భయ్యాతో కలిసి దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేయాలని సత్యం మిశ్రా ప్రణాళిక వేసుకున్నాడని సజ్జనార్ వివరించారు.

ఝార్ఖండ్ నుంచి 21 రాష్ట్రాలకు సరఫరా

సత్యం, శుభం కలసి తమ పొలాల్లో గంజాయిని పండించినట్లు పోలీసులు గుర్తించారు. గ్రామంలో మరికొందరిని ఈ దిశగా ప్రోత్సహించినట్లు చెబుతున్నారు.

''మా టీం సభ్యులు సత్యం మిశ్రా సొంతూరు తాంబగుడియా గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ గంజాయి పెద్ద ఎత్తున కనిపించింది. అక్కడక్కడ పంట వేసి సాగు చేస్తున్నారు'' అని సజ్జనార్ చెప్పారు.

అలా పండించిన గంజాయిని హైదరాబాద్, ముంబయి, చెన్నై, బెంగళూరు నగరాలతో పాటు కేరళ, రాజస్థాన్, ఝార్ఖండ్ సహా దాదాపు 21 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

వాట్సాప్‌లో ఆర్డర్లు.. 'స్పీడ్ పోస్టు'లో డెలివరీ

గంజాయి రవాణాకు స్పీడ్ పోస్టు సేవను వాడుకుంటున్నట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు.

గంజాయిని పార్శిళ్ల రూపంలో చిన్న బాక్సుల్లో పెట్టి 'స్పీడ్ పోస్టు' ద్వారా ఆయా రాష్ట్రాలకు చేరవేస్తున్నారని సజ్జనార్ చెప్పారు.

''ఝార్ఖండ్‌లోని ఇస్రీ బజార్, ఫుస్రో బజార్ పోస్టాఫీసుల ద్వారా గంజాయి పార్శిళ్లను పంపేవారు. బాక్సుల్లో మెడిసిన్ ఉందని పోస్టాఫీసు వాళ్లకు అబద్ధం చెప్పేవారు'' అన్నారు.

సత్యం, శుభం గంజాయి పార్శిళ్లు సిద్ధం చేస్తే, రాహుల్ ఝా అనే వ్యక్తి పోస్టాఫీసుకు వెళ్లి బుకింగ్ పూర్తి చేసే బాధ్యత తీసుకునేవాడని ఆయన చెప్పారు. అవసరమైతే సత్యం, శుభం స్వయంగా వెళ్లి కూడా స్పీడ్ పోస్టు చేసేవారని సజ్జనార్ తెలిపారు.

కస్టమర్ల నుంచి వాట్సాప్, ఇతర సోషల్ మీడియాల ద్వారా ఆర్డర్లు తీసుకునే వారని పోలీసుల విచారణలో వెల్లడైంది.

స్పీడ్ పోస్టులో రోజుకు 8 నుంచి 10 పార్సిళ్లను 50 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు ప్యాకెట్లుగా చేసి డెలివరీ చేసేవారని పోలీసులు గుర్తించారు.

ఈ పార్శిళ్లను పోస్టాఫీసుల్లో స్కాన్ చేయకుండా పంపించడంతో నాలుగైదు ఏళ్లుగా అక్రమ దందా కొనసాగుతోందని సజ్జనార్ చెప్పారు.

''వీరు ఒకే పోస్టాఫీసు నుంచి కాకుండా రెండు వేర్వేరు తపాలా కార్యాలయాల నుంచి పార్శిళ్లు పంపేవారు. మెడిసిన్ అని చెప్పడంతో పోస్టాఫీసు సిబ్బంది కూడా తనిఖీ చేయకుండా వదిలేశారని మాకు తెలిసింది'' అని సజ్జనార్ చెప్పారు.

అయితే, స్పీడ్ పోస్టు సేవలను వాడుకొని అక్రమంగా గంజాయి పార్శిళ్లు పంపించడం, స్కాన్ చేయకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యం వంటి విషయాలపై భారత తపాలా శాఖ పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ జితేంద్ర గుప్తాను ఈ-మెయిల్ ద్వారా బీబీసీ సంప్రదించింది. ఆయన వివరణ రావాల్సి ఉంది. రాగానే అప్డేట్ చేస్తాం.

''స్పీడ్ పోస్టు ద్వారా అక్రమంగా గంజాయి సరఫరా చేయడంపై తపాలా శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నాం. స్పీడ్ పోస్టు పార్శిళ్లను స్కానింగ్ చేయాలని సూచించాం'' అని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ చెప్పారు.

ఎలా బయటపడిందంటే..

హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు గంజాయి తాగుతున్నట్లు ఇటీవల పోలీసులకు సమాచారం వచ్చింది. గంజాయి తీసుకుంటున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అది తనకు పార్శిల్ ద్వారా వచ్చిందని చెప్పాడని గుడిమల్కాపూర్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్.రామయ్య బీబీసీతో చెప్పారు.

''అతని వద్ద ఉన్న పార్శిల్ బాక్సు స్వాధీనం చేసుకున్నాం. ఝార్ఖండ్‌లోని ఇస్రా బజార్ పోస్టాఫీసు నుంచి పార్శిల్ వచ్చినట్లు గుర్తించాం. ఇదే తరహాలో గంజాయి పార్శిల్ వ్యవహారం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోనూ వెలుగులోకి రావడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీస్ కమిషనర్ విచారణ చేపట్టారు'' అని ఆయన చెప్పారు.

గుడిమల్కాపూర్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో హైదరాబాద్‌కు చెందిన సుశాంత్‌ వ్యాస్‌, లడ్డు అనే వ్యక్తులను అరెస్ట్‌ చేసి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు చెప్పారు. వీరికి వచ్చిన పార్శిళ్ల పోస్టాఫీసు అడ్రస్ ద్వారా ముఠాను గుర్తించినట్లు చెప్పారు.

ముంబయికి లోకల్ రైళ్లు, ఆటోలలో రవాణా

గంజాయి దందాను ముంబయిలో సచిన్ మిశ్రా, సంతోష్ పండిట్ సమన్వయం చేస్తున్నారని విచారణలో సత్యం మిశ్రా వెల్లడించారని పోలీసులు తెలిపారు.

''మా విచారణలో సత్యం మిశ్రా కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ముంబయిలోని వెయ్యి మందికిపైగా కస్టమర్లకు నేరుగా వెళ్లి, కలిసి ఇచ్చేవారు. నిందితుడు శుభం మిశ్రా స్వయంగా ఝార్ఖండ్ నుంచి రైళ్లలో గంజాయిని ముంబయికి తరలించేవాడు. అక్కడ సచిన్ మిశ్రా, సంతోష్ పండిట్ అనే వారి ఇళ్లలో గంజాయిని రహస్యంగా నిల్వ చేసి, చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి, డోర్ డెలీవరీలు చేసేవారు'' అని కమిషనర్ సజ్జనార్ తెలిపారు.

వాట్సాప్‌లో ఆర్డర్లు తీసుకునేప్పుడు నేరుగా గంజాయి అని పదం వాడకుండా మ్యాంగో, స్టిక్, ఫ్లవర్ వంటి కోడ్ పదాలతో విక్రయించేవారని తెలిపారు.

''ఒక మ్యాంగో అంటే 50 గ్రాముల గంజాయి, రెండు మ్యాంగోలు అంటే 100 గ్రాములు అన్నట్లుగా కోడ్ పెట్టుకున్నారు. యూపీఐ ఖాతాల ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ పూర్తయిన వెంటనే ఆ వివరాలను సత్యం, శుభం ముంబయిలోని తమ అనుచరులకు పంపేవారు. అప్పుడు వారు గంజాయిని చిన్న ప్యాకెట్లుగా మార్చి, లోకల్ ట్రైన్లు, ఆటో రిక్షాలలో వెళ్లి కస్టమర్లకు చేరవేసే వారని సత్యం మిశ్రా చెప్పారు'' అని కమిషనర్ సజ్జనార్ తెలిపారు.

ఈ ముఠా సభ్యులు దేశవ్యాప్తంగా రోజుకు సగటున 80 నుంచి 100 ఆర్డర్లు సరఫరా చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు.

''కస్టమర్ల నుంచి ఆర్డర్ పరిమాణాన్ని బట్టి రూ.1,500 నుంచి రూ.8,000 వరకు వసూలు చేసేవారు. ఇలా నెలకు దాదాపు రూ. 30 నుంచి రూ.35 లక్షలు ఆర్జిస్తూ, ఏడాదికి సుమారు రూ. 4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారు'' అని విచారణలో తేలినట్లు పోలీసులు చెప్పారు.

గంజాయి విక్రయాల ద్వారా వచ్చే సొమ్మును పొందేందుకు సత్యం మిశ్రా వివిధ బ్యాంకు ఖాతాలను, ఫోన్ పే యాప్ ద్వారా పలు యూపీఐ ఐడీలను ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

''గంజాయి విక్రయం ద్వారా సంపాదించిన సొమ్మును నిందితులు పంచుకునేవారు. ఆ డబ్బుతో బంగారు ఆభరణాలు, లగ్జరీ కార్లు కొనుగోలు చేశారని దర్యాప్తులో వెల్లడైంది'' అని సజ్జనార్ చెప్పారు.

ప్రతి పార్శిల్ స్కాన్ చేయండి: సజ్జనార్

అన్ని కొరియర్ ఏజెన్సీలు తాము బుక్ చేసే, డెలివరీ చేసే ప్రతి పార్సిల్‌ను విధిగా స్కాన్ చేయాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సూచించారు.

''కొరియర్ ద్వారా గంజాయి రవాణా అవుతున్న విషయం వెలుగులోకి రావడంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మీకు సంబంధం లేని లేదా మీరు ఆర్డర్ చేయని పార్సిళ్లు మీ అడ్రసుకు వస్తే అస్సలు తీసుకోకూడదు.. ఏదైనా అనుమానం వస్తే 100 నంబరుకు లేదా హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ నంబర్ 8712661601 కు ఫోన్ చేసి తెలియజేయాలి'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

ఏమిటీ స్పీడ్ పోస్టు?

స్పీడ్ పోస్టును భారత పోస్టల్ శాఖ 1986 ఆగస్టు 1న ప్రారంభించింది.

తక్కువ ధరలో వస్తువులను వినియోగదారులకు చేరవేసేందుకు ఇది ఉపయోగపడుతోందని ఇండియా పోస్టు ప్రకటించింది. ఇందులో 50 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు బరువు ఉండే వస్తువులను 2 వేల కిలోమీటర్ల పైబడి దూరాలకు పంపించే వీలుంటుంది. దీనికి తగ్గట్టుగా తపాలా శాఖ విధించిన రుసుములు చెల్లించి ఈ సేవను పొందే వీలుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)