అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు: 38 మందికి ఉరిశిక్ష.. 2008 జులై 26న ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు-2008లో ప్రత్యేక కోర్టు తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది.
ఈ కేసులో 38 మందికి ప్రత్యేక కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేసినట్లు వార్తాసంస్థ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
ఇది కాకుండా, మరో 11 మందికి విధించిన జీవిత ఖైదు శిక్షను కూడా అలాగే కొనసాగించిందని తెలిపింది.
ఏఎన్ఐ కథనం ప్రకారం, జస్టిస్ అల్పేష్ కొగ్జే, జస్టిస్ సమీర్ దవేల ధర్మాసనం గత రెండున్నర ఏళ్లుగా ఈ కేసును విచారిస్తూ మంగళవారం తీర్పును వెల్లడించింది.
"మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కూడా గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. నిందితులు దాఖలు చేసిన అన్ని అప్పీళ్లను కోర్టు తిరస్కరించింది" అని బీబీసీ ప్రతినిధి భార్గవ్ పరీఖ్ తెలిపారు.

అంతకుముందు ప్రత్యేక కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది?
అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు 2022 ఫిబ్రవరిలో తీర్పు వెలువరించింది.
ఈ కేసులో మొత్తం 77 మంది నిందితులలో 49 మందిని దోషులుగా, 28 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. దోషుల్లో 38 మందికి ఉరిశిక్ష, 11 మందికి కోర్టు జీవిత ఖైదు విధించింది.
ఈ కేసులో త్వరితగతిన తీర్పు రావడం కోసం ప్రత్యేక కోర్టులో విచారణ జరిపారు. దోషులకు యూఏపీఏ, ఐపీసీ సెక్షన్ 302 కింద శిక్షలు విధించారు.
బాంబు పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు లక్ష రూపాయల పరిహారం అందివ్వాలని ప్రత్యేక న్యాయమూర్తి ఎ.ఆర్. పటేల్ తీర్పులో చెప్పారు.
అంతేకాకుండా తీవ్రంగా గాయపడిన బాధితులకు 50 వేల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 వేల రూపాయల పరిహారాన్ని కూడా ఇవ్వాలని ఆదేశించారు.

ఫొటో సోర్స్, Getty Images
70 నిమిషాల్లో 21 పేలుళ్లు
2008 జూలై 26న కేవలం 70 నిమిషాల వ్యవధిలో అహ్మదాబాద్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 21 బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా గాయపడ్డారు.
ఈ పేలుళ్లకు తామే బాధ్యులమంటూ ఇండియన్ ముజాహిదీన్, హరకత్-ఉల్-జిహాద్-అల్-ఇస్లామీ అనే సంస్థలు ప్రకటించుకున్నాయి.
ఈ కేసు విచారణ సమయంలో కొందరు నిందితులను అహ్మదాబాద్‌లోని అత్యంత సురక్షితమైన సబర్మతి జైలులో ఉంచారు. అక్కడ వారు సొరంగం తవ్వి తప్పించుకోవడానికి ప్రయత్నించారు, కానీ ఆ కుట్ర బయటపడటంతో అది విఫలమైంది.

ఫొటో సోర్స్, Getty Images
700 గ్రాముల అమ్మోనియం నైట్రేట్‌తో..
2008 జూలై 25న బెంగళూరులో ఒకదాని తర్వాత ఒకటిగా ఎనిమిది బాంబు పేలుళ్లు జరిగాయి.
ఆ మరుసటి రోజే అహ్మదాబాద్‌లోని నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు, ప్రజా రవాణా వ్యవస్థలు, ఆసుపత్రులలో 70 నిమిషాల వ్యవధిలో వరుసగా 21 పేలుళ్లు జరిగాయి.
మణినగర్, హాట్కేశ్వర్ సర్కిల్, ఎల్‌జీ ఆసుపత్రి, సివిల్ ఆసుపత్రిలోని ట్రామా సెంటర్ సహా పలు ప్రాంతాలలో ఈ పేలుళ్లు సంభవించాయి.
ప్రతి బాంబు తయారీకి సుమారు 700 గ్రాముల అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించినట్లు ఎఫ్ఎస్ఎల్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























