''సినిమా షూటింగ్‌లను స్టూడియోల నుంచి పల్లెటూర్లకు తీసుకెళ్లిన దర్శకుడు''

భారతీరాజా మృతి

ఫొటో సోర్స్, KV MANI

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

తమిళ సినిమా దర్శకుడు భారతీరాజా ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు.

"ఇయక్కునార్ ఇమయం సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ సభ్యులలో ఒకరైన దర్శకుడు భారతీరాజా ఈ ఉదయం కన్నుమూశారని తెలియజేయడానికి చింతిస్తున్నాం" అని తమిళ చిత్ర నిర్మాతల మండలి పత్రికా ప్రకటన విడుదల చేసింది.

రాజకీయ పార్టీలు, సినీ ప్రముఖులతో సహా చాలా మంది భారతీరాజా మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విజయ్, చెన్నై

ఫొటో సోర్స్, TNDIPR

ముఖ్యమంత్రి నివాళి

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా వెళ్లి నివాళులు అర్పించారు.

దర్శకుడు భారతీరాజా ఇల్లు చెన్నైలోని నీలన్‌కరైలో ముఖ్యమంత్రి విజయ్ ఇంటికి సమీపంలో ఉంది.

సినిమా రంగానికి భారతీరాజా చేసిన సేవలను గౌరవిస్తూ, ఆయనకు నివాళిగా ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చెప్పినట్టు సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

"సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషికిగాను దేశ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీతో సహా పలు జాతీయ, రాష్ట్ర పురస్కారాలను అందుకున్నారు. ఎన్నో తరాల కళాకారులను తయారు చేసిన ఆయన సేవలు తమిళ సినిమా చరిత్రలో నిలిచిపోతాయి" అని ముఖ్యమంత్రి విజయ్ అన్నారు.

డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్

ఫొటో సోర్స్, MK Stalin

"సినిమా భాషలో తనదైన శైలిలో మాట్లాడి ఒక ప్రత్యేక శకాన్ని సృష్టించిన వ్యక్తి భారతీరాజా" అని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అన్నారు.

తమిళనాడు హక్కుల పోరాటాలలో చిత్ర పరిశ్రమను భాగస్వామ్యం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, సినీ అభిమానుల హృదయాలలో, తమిళ ప్రజల హృదయాలలో చిరకాలం నిలిచిపోతారని స్టాలిన్ అన్నారు. ఇంటికి వెళ్లి భారతీ రాజాకు నివాళులర్పించారు స్టాలిన్.

దర్శకుడు భారతీరాజా మరణవార్త విని బాధపడ్డానని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు.

తమిళ నేల విలువలతో తమిళ సినిమా వైపు ప్రపంచం తిరిగి చూసేలా భారతీరాజా కృషి చేశారని పళనిస్వామి అన్నారు. సినిమా ఉన్నంత కాలం "నా ప్రియమైన తమిళ ప్రజలారా" అనే భారతీరాజా స్వరం వినిపిస్తూనే ఉంటుందని పళనిస్వామి పేర్కొన్నారు.

భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. భారతీరాజా భౌతికకాయానికి నివాళులర్పించారాయన.

పలువురు సినీ ప్రముఖుల సంతాపం

మన ప్రేమ, గౌరవాలకు పాత్రుడైన దర్శక దిగ్గజం భారతీరాజా ఇక లేరన్న వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని ఖుష్బూ అన్నారు.

"ఆయన చిత్రాలు తమిళ చిత్రసీమలో మైలురాళ్లు. ఆయన ఎప్పుడూ నాకు రెండు జడలు వేయించి ఒక సినిమా చేయాలని కోరుకునేవారు. కానీ అది నెరవేరని కలగానే మిగిలిపోయింది" అని ఖుష్బూ గుర్తుచేస్తున్నారు.

భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్న నటి రేవతి, తాను నటి కావడానికి భారతీరాజాయే కారణమని పేర్కొన్నారు.

'16 వయదినిలే' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన భారతీరాజా, గ్రామీణ నేపథ్య కథలకు దర్శకత్వం వహించి తమిళ సినిమా పరిశ్రమకు భారీ విజయాలను అందించారు.

తమిళ సినిమా రంగంలో భారతీరాజా రాకను ఒక మలుపుగా పరిగణిస్తారు.

స్టూడియోలలో తీసే సినిమాలను పల్లెటూరికి తీసుకెళ్లి, మట్టి వాసనతో కూడిన చిత్రాన్ని అందించిన వ్యక్తిగా చిత్ర పరిశ్రమ ఆయన్ను గుర్తిస్తుంది.

అందంగా ఉండే హీరోనే కథానాయకుడు అనే అభిప్రాయాన్ని మార్చి, సాధారణ గ్రామీణ యువకుడినీ హీరోగా చూపించారు. ఆ తర్వాత తమిళ చిత్రసీమలో అగ్రతారలుగా ఎదిగిన కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరి కెరీర్‌లోనూ '16 వయదినిలే' చిత్రం కీలకంగా నిలిచింది.

భారతీరాజాగా మారిన చిన్నస్వామి

తేని జిల్లా అల్లినగరంలో జూలై 17, 1941 న భారతీరాజా జన్మించారు.

ఆయన తండ్రి పేరు పెరియ మాయదేవర్. తల్లి పేరు కరుత్తమ్మాళ్ అలియాస్ మీనాక్షి అమ్మాళ్. భారతీరాజా అసలు పేరు చిన్నస్వామి.

సినిమాల్లోకి రాకముందు తన స్వస్థలంలో కొంతకాలం హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు భారతీరాజా .

సినిమా రంగంలో అవకాశం కోసం ప్రయత్నిస్తూ, ఒకవైపు రంగస్థల నాటకాలలో పాల్గొనేవారు. మరోవైపు పెట్రోల్ బంక్‌లో పనిచేసేవారు.

దర్శకుడు పి. పుల్లయ్య దగ్గర సహాయ దర్శకుడిగా భారతీరాజా పనిచేశారు. తర్వాత ఆయన ప్రముఖ కన్నడ దర్శకుడు పుట్టన్న దగ్గర చిత్ర పరిశ్రమలోని మెలకువలను నేర్చుకున్నారు.

ఇళయరాజా

ఫొటో సోర్స్, KV MANI

భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రాలు

భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రాలలో 16 వయదినిలే, సిగప్పు రోజాక్కళ్, కిళక్కె పోగుమ్ రైల్, నిరమ్ మారాద పూక్కళ్, నిళల్ ‌గళ్, అలైగళ్ ఓయివదిల్లై, పుదుమై పెణ్, మన్ వాసనై, ఒరు కైదియిన్ డైరీ, ముదల్ మరియాదై, కడలోర కవిదైగళ్, వేదం పుదిదు, ఆరాధన, కొడి పరక్కుదు, పుదు నెల్లు పుదునాత్తు, నాడోడి తెండ్రల్, కిళక్కు సీమయిలే, కరుత్తమ్మ తదితర చిత్రాలున్నాయి.

కార్తీక్, రాధ, రాధిక, సుధాకర్, రుక్మిణి వంటి ఎందరో ప్రముఖులను భారతీరాజా సినిమా రంగానికి పరిచయం చేశారు. వారంతా తమిళ సినిమాపై గొప్ప ప్రభావాన్ని చూపారు.

అవార్డులు, గౌరవాలు

2004లో భారతీరాజాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

సీతాకోక చిలుక, ముదల్ మరియాదై, కరుత్తమ్మ, అంది మందారై, కాదల్ పూక్కళ్ చిత్రాలకు జాతీయ అవార్డులు దక్కాయి.

కిళక్కె పోగుమ్ రైల్ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కించుకున్నారు.

16 వయదినిలే, పుదియవార్పుగళ్, అలైగళ్ ఓయివదిల్లై, ఈర నిలమ్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు.

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన కలైమామణి అవార్డును కూడా అందించింది.

ఆయన 1981లో 'సీతాకోక చిలుక' సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు.

అవార్డులు

ఫొటో సోర్స్, THENI ESWAR

కొడుకు మరణంతో కుంగుబాటు

భారతీరాజా కుమారుడు మనోజ్ 2025 మార్చిలో కన్నుమూశారు. తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా, సహాయ దర్శకుడిగా, దర్శకుడిగా పలు హోదాల్లో పనిచేసిన మనోజ్ గుండెపోటుతో మరణించారు.

కుమారుడి మరణం తర్వాత అనారోగ్యంపాలైన భారతీరాజా ఏడాదిగా చికిత్స పొందుతున్నారు. ఇటీవల రాధికతో సహా పలువురు ప్రముఖులు ఆసుపత్రిలో ఆయనను పరామర్శించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)