ఏఐ సాయంతో వ్యాక్సిన్ తయారీ, ఇకపై వైరస్ ‘వేషాల’కు చెక్ పెట్టొచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గల్లాఘెర్
- హోదా, హెల్త్, సైన్స్ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
అనేక రకాల వైరస్‌లనుంచి రక్షణ కల్పించగల, మహమ్మారిలను అడ్డుకోగల ఓ కొత్త వ్యాక్సిన్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అభివృద్ధి చేశామని పరిశోధకులు చెప్పారు.
టీకాకు సంబంధించిన కీలకమైన భాగాన్ని ఏఐ రూపొందించడం, దాన్ని ప్రజలపై ప్రయోగించడం ఇదే మొదటిసారని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బృందం తెలిపింది.
కరోనా వేరియంట్లన్నింటిపైనా, ప్రస్తుతం జంతువులను ఇన్‌ఫెక్షన్లకు గురిచేస్తున్న వైరస్‌లపైనా పనిచేయగలిగేలా వ్యాక్సిన్‌ను తయారుచేశారు. జంతువులను ఇన్‌ఫెక్షన్లకు గురిచేసే వైరస్‌లు మహమ్మారికి కారణమయ్యే ప్రమాదముంటుంది.
ప్రస్తుతం టీకా అభివృద్ధి ప్రాథమిక దశల్లో ఉంది.
అయితే ఇప్పటికే ఆ బృందం ఫ్లూ, ఎబోలాలను అరికట్టగలిగేలా వేర్వేరు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసింది.

వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది?
ఇన్‌ఫెక్షన్లను గుర్తించి, దానిపై మన శరీరం పోరాడే అవకాశాలను వ్యాక్సిన్లు పెంచుతాయి.
కానీ కొన్ని వైరస్‌లు వాటి ఉనికిని మార్చుకుంటుంటాయి. లేదా మ్యుటేషన్ చెందుతాయి. అందుకే వ్యాక్సిన్లు ప్రభావం చూపే సమయం తక్కువ ఉంటుంది. కోవిడ్, చలికాలంలో సోకే ఫ్లూలకు సంబంధించిన వ్యాక్సిన్లను నిరంతరం అప్‌డేట్ చేస్తుండాలి.
''మనం ఎప్పుడూ వైరస్‌లకంటే ఒకడుగు వెనకబడే ఉంటాం. దాన్ని అధిగమించేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం. కొత్తగా వృద్ధిచెందే వైరస్‌లను, భవిష్యత్ మహమ్మారుల నుంచి రక్షించగల వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాం'' అని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ జొనాథన్ హీనే చెప్పారు.
సాధారణంగా వ్యాక్సిన్లను వైరస్‌లోని స్ట్రెయిన్‌ను ఉపయోగించి తయారుచేస్తారు.
భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే వైరస్‌లను గుర్తించే కార్యక్రమాల్లో రికార్డయిన అనేక కరోనా వైరస్‌ల జన్యుకోడ్‌లను కేంబ్రిడ్జి పరిశోధకులు సేకరించారు.
ఈ జన్యుకోడ్‌లను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విశ్లేషించింది. తర్వాత సూపర్ యాంటీజెన్‌ను రూపొందించింది. ఇది రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇచ్చి మ్యుటేట్ అయిన వైరస్‌లు, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే కొత్త ఇన్‌ఫెక్షన్లు..ఇలా అన్ని రకాల వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది.
యాంటీజెన్‌లు వ్యాక్సిన్లలో ముఖ్యమైన భాగాలు. వాటి ద్వారానే రోగనిరోధక వ్యవస్థ వైరస్ లేదా వ్యాధి కారకాన్ని గుర్తించి, పోరాడడం నేర్చుకుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
‘మానవాళికి ఎంతో మేలు చేయచ్చు’
ఏఐ రూపొందించిన యాంటీజెన్‌ను మనుషులపై ప్రయోగించడం ఇదే తొలిసారని హీనే చెప్పారు. ఈ సాంకేతికత మనందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని, మానవాళికి మేలు చేసేందుకు దీంతో ఎంతో చేయవచ్చని హీనే చెప్పారు.
మనల్ని ఇప్పుడే కాదు భవిష్యత్తులో రాబోయే వ్యాధుల నుంచి కూడా రక్షించగలిగే వ్యాక్సిన్లను తయారుచేస్తామని హీనే బీబీసీతో చెప్పారు.
మహమ్మార్లను ఎదుర్కోవడానికి మానవాళి సన్నద్ధమయ్యే విధానంలో ఇదో పెద్ద మార్పు అని తెలిపారు.
ఈ వ్యాక్సిన్లు సురక్షితమా, కాదా అన్నది అంచనా వేయడానికి 39మందిపై ప్రయోగాలు జరిపారు. రెండో అధ్యయనంలో దాదాపు 200మందిపై ప్రయోగాలు జరిపారు. రోగనిరోధక వ్యవస్థకు ఈ టీకా ఎలా శిక్షణ ఇస్తుందో అర్ధం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశమని హీనే అన్నారు.
ఈ పరిశోధన వివరాలను జర్నల్ ఆఫ్ ఇన్‌ఫెక్షన్‌లో ప్రచురించారు. రోగనిరోధక వ్యవస్థపై దీని ప్రభావం ఓ మోస్తరు స్థాయిలో ఉంది. అయినప్పటికీ ఈ ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.
ఏఐ డిజైన్‌కు చాలా సామర్థ్యముందని, ఇది నిజంగా సంతోషం కలిగించే విషయమని సౌతాంప్టన్ యూనివర్శిటీలో కొన్ని పరీక్షలు నిర్వహించిన ప్రొఫెసర్ సాల్ ఫాస్ట్ చెప్పారు.
మార్పు చెందే వైరస్‌లు, భవిష్యత్తు మహమ్మారులను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్లను రూపొందించడంలో ఈ సాంకేతికత అద్భుతంగా ఉండడం చాలా ఆసక్తికరమైన విషయమని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘అనేక రకాల వైరస్‌లను ఎదుర్కొనేలా వ్యాక్సిన్ల తయారీ’
ప్రతి సంవత్సరం మార్చాల్సిన అవసరంలేని యూనివర్సల్ ఫ్లూ వ్యాక్సిన్‌ను జంతువులపై కేంబ్రిడ్జ్ బృందం ఇప్పటికే పరిశీలిస్తోంది.
దీంతో పాటు ప్రస్తుతం పక్షులకు తీవ్ర నష్టం కలగజేస్తున్న వైరస్ మనుషులకు వ్యాప్తిచెంది మహమ్మారిxe మారే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని హెచ్5ఎన్-1బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
ఎబోలా లాంటి వైరస్‌ల వల్ల కలిగే తీవ్ర వైరల్ జ్వరాలు(వైరల్ హీమరాజిక్ -శరీరంలో రక్తస్రావం)వంటివాటికి వ్యాక్సిన్ల కోసం కూడా పరిశోధనలు సాగుతున్నాయి. ప్రస్తుతం కాంగోలో వ్యాపిస్తోన్న ఎబోలా రకాన్ని ఎదుర్కొనేందుకు ఇంకా ఎలాంటి వ్యాక్సిన్ అభివృద్ధి చేయలేదు.
జంతువులపై జరిగిన పరిశోధనల్లో ఇది బలమైన ఆధారాలను చూపుతోందని ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆండీ పొల్లార్డ్ చెప్పారు. అయితే ఈ అధ్యయనంలో ఆయన పాలుపంచుకోలేదు.
''ఇది చాలా ఆసక్తి కలిగించే సమాచారం. ఇలాంటి రోగనిరోధక ప్రతిస్పందనలను సృష్టించుకోగలమని చాలా మంది ఊహించి ఉండరు'' అని ఆయన బీబీసీతో చెప్పారు.
అయితే మనుషులపై నిర్వహించే ట్రయల్స్‌లోనే అసలు ఫలితం తేలుతుందని ఆయన చెప్పారు. ఎందుకంటే మనుషుల రోగనిరోధక వ్యవస్థ ప్రయోగశాల ఎలుకలకంటే భిన్నంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
‘గేమ్ ఛేంజర్‌గా ఏఐ’
మొత్తంగా చూస్తే వ్యాక్సిన్ పరిశోధనలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఒక గేమ్ ఛేంజర్ అవుతుందని ఆయన చెప్పారు. టీకాకు రోగనిరోధక వ్యవస్థ ఎలా స్పందిస్తుందో ముందుగానే అంచనా వేయగల సామర్థ్యం ఏఐకి ఉందని, దీంతో టీకా అభివృద్ధి ప్రక్రియ వేగవంతమై అనేక ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు.
ఏఐ రూపొందించిన సూపర్-యాంటీజెన్ ట్రయల్ విజయవంతం కావడం వైరస్ నుంచి దీర్ఘకాలిక రక్షణ కల్పించే సామర్థ్యాన్ని అందించడంలో కీలక ముందడుగని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్, కేర్ రీసెర్చ్ శాస్త్రీయ డైరెక్టర్ ప్రొఫెసర్ మారియన్ నైట్ చెప్పారు.
''పరిశోధనానైపుణ్యాన్ని ఏఐతో కలిపి కొత్త చికిత్సలను ఎలా రూపొందించవచ్చో దీనివల్ల తెలుస్తుంది. ఇది బ్రిటిష్ శాస్త్రరంగంలో మరో విజయగాథ'' అని సైన్స్ మంత్రి లార్డ్ వల్లాన్స్ చెప్పారు.
''మనుషులపై చేసిన మొదటి ట్రయల్స్ సానుకూల ఫలితాలు రావడంతో ఈ పరిశోధన ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే వ్యాక్సిన్‌ల అభివృద్ధిని వేగవతం చేయగలదు'' అని ఆయన తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























