మహిళల టీ20 వరల్డ్ కప్: భారత జట్టులో ఎవరెవరున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సయీదుజ్జమాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 10 నిమిషాలు
ఉమెన్ టీ20 వరల్డ్ కప్ టోర్నీ జూన్ 12నుంచి ప్రారంభమైంది. ఈసారి ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తోంది.
కప్పుకొట్టడమే లక్ష్యంగా హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో టీమ్ ఇండియా బరిలోకి దిగుతోంది. 2025 వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత్ జట్టులో జోష్ ఉన్నప్పటికీ, ఇప్పటివరకూ ఆరు సార్లు టీ 20 వరల్డ్ కప్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ మెగా టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, పాకిస్తాన్, ఐర్లాండ్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ సహా మొత్తం 12 జట్లు తలపడుతున్నాయి. మరి ఈ పొట్టి కప్పును గెలిపించడానికి భారతజట్టులో ఎవరెవరున్నారు?


ఫొటో సోర్స్, Barrington Coombs-ICC/ICC via Getty Images
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్)
భారత్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.
ఆమె మిడిలార్డర్‌లో శక్తిమంతమైన బ్యాటర్.
గత దశాబ్ద కాలానికి పైగా భారత్ మహిళా జట్టును అగ్రగామి జట్టుగా నిలబెట్టడంలో హర్మన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
పంజాబ్‌లో ఓ సాధారణ సిక్కు కుటుంబంలో జన్మించారు కౌర్. తన ఇరుగు పొరుగు అబ్బాయిలతో హాకీ స్టిక్‌తో క్రికెట్ ఆడేవారు.
‘‘సాధారణంగా ఈ గల్లీ క్రికెట్‌లో ఆల్ రౌండర్లకే ఎక్కువ అవకాశాలు వస్తాయని, అందుకే తాను ఆల్ రౌండర్ కావాలనుకున్నానని’’ హర్మన్‌ప్రీత్ కౌర్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
అంతర్జాతీయ క్రికెట్‌లోకి 2009లో అడుగుపెట్టిన కౌర్ తరువాత ఒంటి చేత్తో ఆట స్వరూపాన్నే మార్చేయగల నమ్మకమైన మ్యాచ్-విన్నర్‌గా ఎదిగారు.
ఇప్పుడు భారత్ జట్టు కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలోనూ సారథ్యం వహిస్తున్నారు.
భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప క్షణమైన 2025 వరల్డ్ కప్ గెలవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

ఫొటో సోర్స్, Harry Trump/Getty Images
స్మృతి మాందన
ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాటరైన స్మృతి మాందన భారత జట్టుకు వైస్ కెప్టెన్. జట్టులో అత్యంత నమ్మకమైన ఆటగాళ్లలో ఒకరిగా ఆమె గుర్తింపు పొందారు.
మహారాష్ట్రలోని సాంగ్లీ నగరానికి చెందిన స్మృతికి క్రికెట్ ఆడాలనే కోరిక ఆమె తండ్రి, సోదరుడి వల్లే కలిగింది. వారిద్దరూ జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడేవారు.
స్మృతి 2013లో అండర్-19 జోనల్ టోర్నమెంట్ లిస్ట్-ఎ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించారు.
రెండుసార్లు (2018, 2021) 'ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకున్నారు. 2019లో భారత ప్రభుత్వం ఆమెను ప్రతిష్టాత్మక 'అర్జున అవార్డు'తో సత్కరించింది.
ఆమె వన్డేలు, టీ20లు రెండింటిలోనూ భారీగా పరుగులు సాధించడమే కాకుండా పలు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలోనూ (టెస్ట్, వన్డే, టీ20) సెంచరీలు నమోదు చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డు నెలకొల్పారు.
2024లో ఆమె 1,659 పరుగులు చేయడం ద్వారా, అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బెలిండా క్లార్క్ 28 ఏళ్ల నాటి రికార్డును బద్దలుకొట్టారు.
స్మృతి సాధించిన విజయాలు మహిళా క్రికెట్‌కు ఆదరణను పెంచడంతో పాటు, ఈ ఆట వైపు కొత్త అభిమానులను ఆకర్షించాయి.

ఫొటో సోర్స్, Andy Kearns/Getty Images
షెఫాలీ వర్మ...
మహిళా క్రికెట్‌లో దూకుడైన బ్యాటర్లుగా గుర్తింపు పొందినవారిలో షెఫాలీ వర్మ ఒకరు. ఆమె చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టారు. భయమెరుగని శైలి, దూకుడైన స్ట్రోక్ ప్లేతో స్వల్ప కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే, 2024 వన్డేల్లో ఆమె ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేకపోవడంతో 2025 వన్డే ప్రపంచకప్‌కు ఎంపికైన భారత జట్టు నుంచి ఆమె దూరమయ్యారు.
కానీ, ఆమె స్థానంలో వచ్చిన ప్లేయర్ ప్రతికా రావల్ సరిగ్గా సెమీఫైనల్‌కు ముందే గాయపడటంతో షెఫాలీకి జట్టులో మళ్లీ అవకాశం దక్కింది.
ఆ అవకాశాన్ని ఆమె చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 87 పరుగులు చేసి, రెండు వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచారు.

ఫొటో సోర్స్, Harry Trump/Getty Images
జెమీమా రోడ్రిగ్స్...
జెమీమా రోడ్రిగ్స్‌కు దాదాపు 11 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే, ''నువ్వు క్రికెట్ ఆడతావా లేక హాకీ ఆడతావా?'' అని ఆమె తండ్రి అడిగారు.
ఆ ప్రశ్న వినగానే జెమీమా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె ఆ రెండు ఆటల్లోనూ మంచి ప్లేయర్ అయినప్పటికీ, చివరికి క్రికెట్‌నే ఎంచుకున్నారు.
జెమీమా సీనియర్ స్థాయిలో 2018 ప్రారంభంలో అరంగేట్రం చేశారు. ఆమెకు ఓపెనర్‌గా అనుభవం ఉన్నప్పటికీ, వన్డేల్లో మిడిలార్డర్‌లోనే ఎక్కువ విజయాలు అందుకున్నారు.
ఆ తర్వాతి వన్డే వరల్డ్ కప్ కోసం ఆమె జట్టులోకి ఎంపికైనప్పటికీ, మధ్యలో జట్టు నుంచి దూరమయ్యారు. ఆ తర్వాత అద్భుతమైన రీతిలో పునరాగమనం చేసి, ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో 134 బంతుల్లో 127 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
ఆమె అందించిన ఈ అసాధారణ సహకారంతో... మహిళా వన్డే చరిత్రలోనే అత్యంత భారీ లక్ష్యమైన 339 పరుగులను ఛేదించి భారత్ జట్టు చరిత్రాత్మక విజయం సాధించింది.

ఫొటో సోర్స్, Darrian Traynor/Getty Images
దీప్తి శర్మ - ఆల్‌రౌండర్
లెఫ్టార్మ్ బ్యాటర్, రైటార్మ్ ఆఫ్-స్పిన్నర్ అయిన దీప్తి శర్మ 2014లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన దీప్తి 2016లో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 20 పరుగులే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టారు. వన్డే క్రికెట్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయ మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించారు.
ప్రపంచ స్థాయి స్పిన్నర్‌గా గుర్తింపు పొందిన దీప్తి, తన బ్యాటింగ్‌ను మెరుగుపరుచు కోవడానికి పడిన కష్టం ఫలించి, ఆమె భారత జట్టుకు విలువైన ఆల్‌రౌండర్‌గా మారారు.

ఫొటో సోర్స్, David Rogers/Getty Images
రిచా ఘోష్...
మహిళా క్రికెట్‌లో రిచా అటాకింగ్ బ్యాటర్లలో ఒకరు. వికెట్ కీపింగ్ కూడా చేయగల ఆమె ఒక అత్యుత్తమ ఫినిషర్.
రిచా అంతర్జాతీయ కెరీర్ 2020 మహిళల టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకోవడంతో ప్రారంభమైంది.
పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో జన్మించిన రిచా ఓ అద్భుతమైన టెస్ట్ క్రికెటర్ కూడా. ఆస్ట్రేలియాపై భారత్ 2023లో గెలిచిన టెస్ట్‌మ్యాచ్‌లో రిచా అర్థశతకం సాధించారు. మరుసటి ఏడాది దక్షిణాఫ్రికాపై 86 పరుగులు చేశారు.
2025 వరల్డ్ కప్‌లో ఆమె మరోసారి దక్షిణాఫ్రికాపై తన సత్తా చాటారు. లీగ్ మ్యాచ్‌లో 94 పరుగులు చేయడమే కాకుండా, ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 24 బంతుల్లో 34 పరుగులు చేసి, భారత్ 298 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

ఫొటో సోర్స్, Andy Kearns/Getty Images
యాస్తికా భాటియా...
యాస్తికా భాటియా భారత మహిళా క్రికెట్ జట్టులో వికెట్ కీపర్-బ్యాటర్. ఆమె లెఫ్ట్‌హ్యాండర్. 2021-22 ఆస్ట్రేలియా పర్యటనలో మూడు అంతర్జాతీయ ఫార్మాట్ల (టెస్ట్, వన్డే, టీ20)లోనూ అరంగేట్రం చేసి, స్వల్ప కాలంలోనే తనదైన ముద్ర వేశారు.
2022 వన్డే వరల్డ్ కప్‌లో యాస్తిక రెండు అర్ధశతకాలు సాధించారు. అదే ఏడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్‌లో తానియా భాటియా స్థానంలో 'కంకషన్ సబ్‌స్టిట్యూట్'గా ఆమె బరిలోకి దిగారు.
అయితే, ఎడమ మోకాలి గాయం కారణంగా ఆమె 2025 ఐసీసీ మహిళా క్రికెట్ వరల్డ్ కప్‌కు దూరం కావాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Bradley Kanaris/Getty Images
రేణుకా సింగ్...
రేణుకా సింగ్ ఠాకూర్ తొలుత తన వీధి క్రికెట్ ఆడటం ప్రారంభించారు.
ఆ తర్వాత ఆమె ధర్మశాలలోని 'హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్' రెసిడెన్షియల్ అకాడమీలో చేరారు. ఇది భారత్‌లో మహిళా క్రికెటర్ల కోసం ఏర్పాటు చేసిన తొలి రెసిడెన్షియల్ అకాడమీల్లో ఒకటి.
2023 డిసెంబర్‌లో టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రేణుక భారత్ తరఫున ఆల్-ఫార్మాట్ ప్లేయర్‌గా మారారు.
క్రమక్రమంగా, ఆమె భారత బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించే ప్రధాన బౌలర్‌గా ఎదిగారు. అంతేకాకుండా, 2025లో ఐసీసీ మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన భారత్ జట్టులో ఆమె కూడా ఒకరు.

ఫొటో సోర్స్, Andy Kearns/Getty Images
అరుంధతి రెడ్డి...
తెలంగాణ రాష్ట్రానికి చెందిన అరుంధతి రెడ్డి రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ఆల్‌రౌండర్. జట్టుకు అవసరమైన సమయంలో కీలక వికెట్లు తీయడంతో పాటు, ఉపయోగకరమైన పరుగులు చేయగల సామర్థ్యం ఆమె సొంతం.
అరుంధతి 2018లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చారు. ఆ తర్వాత 2018, 2020, 2024 మహిళల టీ20 వరల్డ్ కప్‌లలో దేశానికి ప్రాతినిధ్యం వహించారు.
కాలక్రమేణా ఆమె భారత టీ20 జట్టులో క్రమంతప్పకుండా చోటు దక్కించుకునే రెగ్యులర్ మెంబర్‌గా మారారు. 2025లో దేశానికి మొట్టమొదటి ఐసీసీ మహిళా క్రికెట్ వరల్డ్ కప్‌ను అందించిన భారత జట్టులో ఆమె కూడా ఒకరు.
ఇది ఆమె కెరీర్‌లోనే అత్యంత గొప్ప విజయాలలో ఒకటిగా నిలిచింది.

ఫొటో సోర్స్, Jack Thomas-ICC/ICC via Getty Images
శ్రేయాంక పాటిల్...
భారత మహిళా క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతులైన యువ ఆల్‌రౌండర్లలో ఒకరిగా శ్రేయాంక పాటిల్ గుర్తింపు తెచ్చుకున్నారు. బెంగళూరుకు చెందిన శ్రేయాంక, 2023 ఏసీసీ మహిళల ఎమర్జింగ్ టీమ్స్ కప్‌లో అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు.
ఆ టోర్నమెంట్‌లో భారత్-ఎ తరఫున ఆడుతూ 9 వికెట్లు పడగొట్టారు. ఆ టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. అలాగే 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును కూడా ఆమె గెలుచుకున్నారు.

ఫొటో సోర్స్, Abhishek Chinnappa/Getty Images
భారతి ఫుల్మాలి...
మహారాష్ట్రలోని అమరావతికి చెందిన భారతి ఫుల్మాలి మిడిలార్డర్ బ్యాటర్.ఆమె 2019లో గువహటిలో జరిగిన ఇంగ్లాండ్ మహిళల టీ20 మ్యాచ్ ద్వారా భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. ఆ సమయంలో ఆమె కేవలం కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే ఆడారు.
తర్వాత ఆమె చాలా ఏళ్ల పాటు జాతీయ జట్టుకు దూరమైనప్పటికీ, దేశవాళీ క్రికెట్‌లో మాత్రం నిలకడగా రాణిస్తూ వచ్చారు.
ఆమె అంతర్జాతీయ అరంగేట్రం చేసిన దాదాపు ఏడేళ్ల తర్వాత, ఇప్పుడు మళ్లీ భారత జట్టులోకి ఎంపికవ్వడం ఆమె బలమైన పునరాగమనాన్ని సూచిస్తోంది.

ఫొటో సోర్స్, Alex Davidson-ICC/ICC via Getty Images
శ్రీచరణి...
శ్రీచరణి భారత మహిళా క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతులైన యువ స్పిన్ బౌలింగ్ సంచలనాలలో ఒకరిగా ఎదిగారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్, దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అత్యంత వేగంగా రాణిస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.
చరణి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడుతూనే తనదైన ముద్ర వేశారు.
శ్రీలంకపై వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఆమె, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టారు.
ఒక భారతీయ మహిళా క్రికెటర్ తన కెరీర్‌లోని తొలి టీ20 మ్యాచ్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనగా ఇది రికార్డుల్లో నిలిచింది.

ఫొటో సోర్స్, Andy Kearns/Getty Images
నందిని శ్యామ్ సుందర్ శర్మ...
చండీగఢ్‌కు చెందిన నందిని శ్యామ్‌సుందర్ రైటార్మ్ ఫాస్ట్-మీడియం బౌలర్. 2026లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి తన ప్రతిభను చాటారు.
2026 ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టుకు శర్మ ఎంపికైంది.

ఫొటో సోర్స్, David Rogers/Getty Images
క్రాంతి గౌడ్...
మధ్యప్రదేశ్‌కు చెందిన క్రాంతి గౌడ్ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్. ఆమె భారత మహిళా క్రికెట్‌లో స్వల్పకాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతమైన ప్రదర్శనతో 52 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి భారత్ జట్టుకు విజయాన్ని అందించారు.
కేవలం 21 ఏళ్ల వయసులోనే వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కురాలైన భారత మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించారు.
ఆమె విజయ పరంపర 2025 ఐసీసీ మహిళా క్రికెట్ వరల్డ్ కప్‌లోనూ కొనసాగింది.ఆ టోర్నీలో 9 వికెట్లు పడగొట్టి, భారత్ జట్టు వరల్డ్ కప్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.

ఫొటో సోర్స్, Alex Davidson-ICC/ICC via Getty Images
రాధా యాదవ్...
దక్షిణాఫ్రికాతో 2018లో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రాధా యాదవ్ లెఫ్టార్మ్ స్పిన్నర్, అద్భుతమైన ఫీల్డర్.
దేశవాళీ క్రికెట్‌లో ఆమె కనబరిచిన అద్భుత ప్రదర్శన చాలా త్వరగానే జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడానికి దోహదం చేసింది. ఆ తర్వాత ఆమె ప్రపంచ స్థాయిలో తన సత్తా నిరూపించుకున్నారు.
2018 మహిళల టీ20 వరల్డ్ కప్ కోసం ఆమె భారత జట్టుకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ టీ20ల్లో 100 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన కేవలం ఇద్దరు భారతీయ మహిళా క్రికెటర్లలో ఆమె ఒకరు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























