వైభవ్ సూర్యవంశీ: ‘పది నుంచి ఇరవయ్యేళ్ల పాటు క్రికెట్‌లో నా ఆధిపత్యం ఉండాలి’

టీ20, వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్, రాజస్థాన్ రాయల్స్

ఫొటో సోర్స్, Photo by Ashley Allen-ICC/ICC via Getty Images

ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలోనూ ఆడటమే తన కల అని రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

కేవలం ఆట ఆడటం కోసమే తాను క్రికెట్ ఆడాలనుకోవడం లేదని పది నుంచి ఇరవై ఏళ్ల పాటు క్రికెట్‌‌లో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలనుకుంటున్నానని చెప్పాడు.

రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీ ఇంటర్వ్యూను షేర్ చేసింది.

తన కలలు, భవిష్యత్తులో క్రికెట్ ప్రణాళికల గురించి వైభవ్ మాట్లాడాడు.

దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి కూడా మాట్లాడాడు.

వైభవ్ సూర్యవంశీ ఇటీవల భారత టీ20 జట్టులోకి ఎంపికయ్యాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
టీ20, వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్, రాజస్థాన్ రాయల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మూడు ఫార్మాట్లలో ఆడాలన్నది తన కల అని వైభవ్ సూర్యవంశీ చెప్పాడు.

టెస్ట్ క్రికెట్ ఆడటంపై వైభవ్ ఏమంటున్నాడు?

ఇంటర్వ్యూ సమయంలో వైభవ్‌ను టెస్ట్ క్రికెట్ ఆడటానికి సంబంధించిన ఒక ప్రశ్న అడిగారు.

తాను కూడా టెస్ట్ క్రికెట్ ఆడాలనుకుంటున్నానని వైభవ్ సూర్యవంశీ చెప్పాడు.

"నేను రెడ్ బాల్ చాలా ఎక్కువగా ఆడతాను. నేను ప్రాక్టీస్ చేస్తాను. నేను మా రాష్ట్రం తరపున కూడా రెడ్ బాల్ ఆడాను. నాకు ఆడాలని ఉంది. అందుకే ప్రాక్టీస్ చేస్తాను" అని తెలిపాడు.

దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గావస్కర్‌తో భేటీ గురించి అడిగినప్పుడు

" భవిష్యత్తులో రెడ్ బాల్ క్రికెట్ ఆడతానా లేదా అని చాలామంది అనుకుంటారు. సునీల్ గావస్కర్ కూడా అదే విషయం మాట్లాడారు. నేను రెడ్ బాల్‌తో చాలా ప్రాక్టీస్ చేశానని, ఇప్పటికీ చేస్తున్నానని సమాధానమిచ్చాను. మా రాష్ట్రం తరఫున రెడ్ బాల్‌తో చాలా మ్యాచ్‌లు ఆడాను. నేను రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి, టెస్ట్ క్రికెట్ ఆడాలనుకుంటున్నాను"

"ఈ ఫార్మాట్‌లో (టీ20) నేను ఇలా బ్యాటింగ్ చేస్తాను. ఎందుకంటే ఈ ఫార్మాట్ అదే కోరుతుంది. టెస్ట్ క్రికెట్‌లో అవసరాన్ని బట్టి నా బ్యాటింగ్‌ను మారుస్తాను. వన్డేలలో అవసరానికి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటా. మూడు ఫార్మాట్లలోనూ ఆడాలన్నదే నా కల" అని వైభవ్ సూర్యవంశీ చెప్పాడు.

టీ20, వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్, రాజస్థాన్ రాయల్స్

ఫొటో సోర్స్, ANI

‘మానసిక సన్నద్ధత చాలా ముఖ్యం’

ఐపీఎల్ ఒక సుదీర్ఘ టోర్నమెంట్ అని దానికి శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఫిట్‌గా ఉండాలని వైభవ్ అన్నాడు.

"మ్యాచ్‌కు ముందు ఎలా ఆడాలో మేము నిర్ణయించుకునేవాళ్ళం. మ్యాచ్ తర్వాత కూడా కూర్చుని తర్వాతి మ్యాచ్‌లో ఏం చేయాలో నిర్ణయించుకునేవాళ్ళం. చేయాల్సిన వాటిలో ఏం చేయలేదో గమనించుకునేవాళ్లం. ఏ తప్పు జరిగిందో చూసుకుని తర్వాతి మ్యాచ్‌లో పునరావృతం చేయకూడదని చర్చించుకునేవాళ్ళం.

దీంతో జట్టుకు ఎంతో ప్రయోజనం కలిగింది. మేం ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు చాలా విషయాలు తెలుసుకుంటాం'' అని వైభవ్ ఐపీఎల్ మ్యాచ్‌లకు సన్నద్ధమైన తీరును వివరించాడు.

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసినందుకు వైభవ్ ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు.

"ఐపీఎల్‌లో ఎవరైనా ఆరెంజ్ క్యాప్ పెట్టుకోవడం చూసినప్పుడల్లా, నేను కూడా దాన్ని పొందాలని కోరుకునేవాడిని" అని వైభవ్ చెప్పాడు.

''నేను ఇప్పడు ఆరెంజ్ క్యాప్ అందుకున్నాను. అయితే బాగా ఆడాలని నేను దేవుణ్ని ఎప్పుడూ కోరుకోను. ఆయన ఆశీర్వాదం ఎప్పుడూ నాపై ఉండాలని మాత్రమే అడుగుతాను. నాకు శక్తినిచ్చి, నన్ను బలంగా ఉంచమని కోరుకుంటాను.

ఒక నిర్దిష్ట బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తూ నేను నా గదిలో ఒంటరిగా సమయం గడుపుతాను. మీరు ముందుగానే సిద్ధమైతే మ్యాచ్ సమయంలో మానసికంగా మరింత బలంగా ఉంటారు. మీరు ఫైనల్‌లో ఆడుతుంటే మానసికంగా మరింత బలంగా ఉండాల్సిందే'' అని వైభవ్ అన్నాడు.

టీ20, వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్, రాజస్థాన్ రాయల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సునీల్ గావస్కర్

‘రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడడం సంతోషం’

తనకు అభిమానుల నుంచి చాలా మద్దతు లభిస్తోందని వైభవ్ సూర్యవంశీ సంతోషం వ్యక్తంచేశాడు.

"మ్యాచ్‌లో నేను ఔటైనప్పుడు నా అభిమానులు నిరాశ చెందడం తర్వాత సోషల్ మీడియాలో చూశాను. నేను బాగా ఆడినప్పుడు సంబరాలు చేసుకోవడం గమనించాను. నాకు లభించిన మద్దతు, ప్రేమ, ఆశీర్వాదాలే నన్ను బాగా ఆడేలా చేశాయి.

''రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్‌కు చేరకపోవడం, నేను ఫైనల్‌లో ఆడలేకపోవడం నాకు బాధ కలిగించింది. కానీ త్వరలోనే అది జరుగుతుందని ఆశిస్తున్నా. మేం నాలుగు లేదా ఐదు ట్రోఫీలు గెలవాలని కోరుకుంటున్నాను. గెలుస్తామనుకుంటున్నాను.

నేను ఇంత బాగా ఆడుతున్నా రెండు జట్లు మాత్రమే నా కోసం ఎందుకు బిడ్ వేశాయా అని ఆశ్చర్యపోయేవాణ్ని. కానీ ఈ రోజు రాజస్థాన్ రాయల్స్‌తో ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి వాతావరణం ఒక కుటుంబంలా ఉంటుంది. నా సీనియర్ ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయ సిబ్బంది అందరూ చాలా సహాయంగా ఉంటారు.

నేను సంతోషంగా ఉన్నాను. అయితే ఫైనల్ చూస్తున్నప్పుడు మా జట్టు ఫైనల్ ఆడి ఉంటే బాగుండేదని అనిపించింది. నేను ఊరికే కూర్చొని చూడడం కాకుండా, ఆడే అవకాశం వచ్చి ఉంటే బహుశా రాజస్థాన్ రాయల్స్ ట్రోఫీ గెలిచి ఉండేదేమో'' అని వైభవ్ సూర్యవంశీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

టీ20, వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్, రాజస్థాన్ రాయల్స్

ఫొటో సోర్స్, Getty Images

కోహ్లీతో మాట్లాడటం కలలా అనిపించింది

''రాబోయే 20 ఏళ్ల పాటు నేను ఆడినప్పుడల్లా 'ఇతను ఒంటరిగా మ్యాచ్‌లను ముగించగల ఆటగాడు' అని ప్రజలు అనుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆ స్థాయి ఆధిపత్యం నా ఆటలో స్పష్టంగా కనిపించాలి.

కేవలం ఆడటమే కాకుండా పది, ఇరవై ఏళ్ల పాటు ఆధిపత్యం చెలాయించే విధంగా ఆడాలి.

నేను బాగా ఆడాలి. నేను ఆనందం కోసమే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. కాబట్టి నేను ఆడినంత కాలం బాగా ఆడుతూ దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా.

నేను విరాట్ కోహ్లీకి చాలా పెద్ద అభిమానిని. నా క్యాప్‌పై ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. ఆరెంజ్ క్యాప్ పెట్టుకోనప్పుడు ఆ క్యాప్ పెట్టుకుంటా. కోహ్లీ నా భుజంపై చేయి వేసి నాతో మాట్లాడుతున్నప్పుడు అది ఒక కలలా అనిపించింది.

నేను నిజంగానే విరాట్ కోహ్లీతో మాట్లాడుతున్నా అని నమ్మలేకపోయా. ఒక అన్నలా నేను ఏది బాగా చేస్తున్నానో, ఇంకా ఏది మెరుగ్గా చేయగలనో లేదా ఇంకా ఏం చేయాలో, దేనిపై దృష్టి పెట్టాలో, ఏకాగ్రత ఎలా ఉండాలో, భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలో వివరించాడు.

జై షా కూడా నన్ను కలిసినప్పుడు చాలా విషయాలు చెబుతుంటారు. నేను ఏకాగ్రతతో ఉండాలి. నేను చాలా దూరం ప్రయాణించాలి. నేను ఆటపై దృష్టి పెట్టాలి. నేను ఒదిగి ఉంటూ నా పనిపై దృష్టి పెట్టాలి అని సూచిస్తుంటారు'' అని ఇంటర్వ్యూలో వైభవ్ సూర్యవంశీ చెప్పాడు.

టీ20, వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్, రాజస్థాన్ రాయల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అభిమానుల నుంచి తనకు ఎంతో మద్దతు లభిస్తోందని వైభవ్ సూర్యవంశీ అన్నాడు.

‘ఇదివరకులా బయటకు వెళ్లలేకపోతున్నా’

బిహార్ ప్రజల మద్దతు గురించి అడిగినప్పుడు అక్కడి ప్రజలు ఏమీ ఆలోచించకుండా తనను ప్రోత్సహిస్తారని వైభవ్ చెప్పాడు.

"బిహార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా చూస్తే వాళ్లు నాకు ఇచ్చే మద్దతు అద్భుతంగా అనిపిస్తుంది. నేను సరిగ్గా ఆడకపోయినా, పరుగులు చేయకపోయినా, వారు నా విషయంలో ఎంతో సానుకూలంగా ఉంటారు. వాళ్ల గురించి ఎంత చెప్పినా, వాళ్లు నాకు ఇచ్చే మద్దతుతో పోలిస్తే తక్కువే అవుతుంది. నేను పట్నా విమానాశ్రయం నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడి వాతావరణం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇంటికి వచ్చినట్టు, సురక్షితంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎలాంటి సమస్యా ఉండదు. ఇప్పుడు బయటకు వెళ్లడం కొంచెం కష్టంగా మారింది. అయినా నేను పగలు, సాయంత్రం, రాత్రి వేళల్లో నడిచి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తాను. ఆ ప్రజలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంటుంది. తెలియని వ్యక్తులతో మాట్లాడినా వాళ్లు చాలా కాలంగా పరిచయం ఉన్నవారిలా అనిపిస్తుంది. ఏదైనా అడిగితే చాలా ఆప్యాయంగా మాట్లాడతారు.

నా పని నేను చేసుకుంటాను. ఏకాగ్రతతో ఉంటాను. మిగతావన్నీ వాటంతట అవే వస్తాయి'' అని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)