సిద్దిపేట: ‘‘మోపెడ్‌పై బరువైన బ్యాగ్, ప్లాస్టిక్ క్యాన్‌లో పెట్రోల్..ఈ ఆధారాలే ఆ తల్లీ కొడుకులు హత్యకు పాల్పడ్డారని తేల్చాయి’’

ఫొటో సోర్స్, UGC
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
(హెచ్చరిక: ఈ కథనంలో కలవరపరిచే అంశాలున్నాయి)
మైనార్టీ తీరని తన కుమారుడిని 'బాడీబిల్డర్'గా తయారుచేసి, అతని సాయంతో వరుస హత్యలకు పాల్పడుతున్న తల్లీ కొడుకులను అరెస్ట్ చేశామని సిద్దిపేట కమిషనరేట్ పోలీసులు తెలిపారు.
'ఒక మారుమూల ప్రాంతంలో పక్కా ప్రణాళికతో జరిగిన ఈ హత్యల తీరు ఊహకు అందని విషయం' అని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అన్నారు.
"నేరాలకు పాల్పడే విధానం, పోలీసుల నుంచి తప్పించుకునే మార్గాలపై తల్లీకొడుకులు ఆన్‌లైన్‌లో వెతికారని" సీపీ వెల్లడించారు.
సులభంగా డబ్బు సంపాదించడానికి ఇప్పటికే ఇద్దరు మహిళలను హత్య చేసిన వీరి తదుపరి జాబితాలో మరో నలుగురు ఉన్నారని, ఆలోపే వీరిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.


ఫొటో సోర్స్, Siddipet police
సగం కాలిన మృతదేహం వెలుగుచూడటంతో..
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట శివారులో రోడ్డుపక్కన ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున సగం కాలిన మహిళ మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విచారణలో భాగంగా మృతురాలిని భూంపల్లి గ్రామం డబుల్ బెడ్‌రూమ్ కాలనీకి చెందిన అతికం విజయ (44)గా గుర్తించారు.
మృతదేహం లభ్యమైన ప్రాంతం భూంపల్లి నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో, క్రైమ్ బృందాలు ఆ మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను పరిశీలించాయి.
సీసీటీవీ ఫుటేజీలో నిందితులైన తెల్లాకుల రజిత (38), ఆమె కుమారుడు (16) అనుమానాస్పద కదలికలను పోలీసులు గుర్తించారు.
"బరువైన బ్యాగును ఇద్దరూ కలిసి మోపెడ్‌పై తీసుకెళ్లడం, పెట్రోల్ బంకులో ప్లాస్టిక్ క్యాన్‌లో పెట్రోల్ నింపుకుంటున్న సీసీటీవి దృశ్యాలు వారిపై అనుమానాలను పెంచాయి'' అని కమిషనర్ రష్మీ పెరుమాళ్ అన్నారు.

ఫొటో సోర్స్, UGC
సమస్యల్లో ఉన్న మహిళలే టార్గెట్
సిద్దిపేట పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భూంపల్లి డబుల్ బెడ్రూం కాలనీలో నివాసముంటున్న రజిత మొదట కుట్టు మిషన్ పని చేసేవారు. ప్రస్తుతం కిరాణా దుకాణం, టీ స్టాల్ నిర్వహిస్తున్నారు.
ఆమె భర్త కొంతకాలం సైకిల్ రిపేర్ షాపు, టెంట్ హౌస్ నడిపారు. కొన్నేళ్లుగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. దీంతో, సులభంగా డబ్బు సంపాదించడం కోసం అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకునేలా రజిత పథకం వేశారు.
తమ కిరాణా షాపుకు వచ్చే వ్యక్తిగత, కుటుంబ సమస్యల్లో ఉన్న మహిళలను తల్లీకొడుకులు లక్ష్యంగా చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
వారికి గ్రామస్తులతో ఉన్న గొడవలు, వ్యక్తిగత, కుటుంబ వివాదాల వివరాలను ముందుగానే సేకరించి, పథకం ప్రకారం హత్యలు చేసేవారని తెలిపారు.
అనంతరం, పోలీసు విచారణ సందర్భంగా ఆ వివరాలను ఉపయోగించి ఇతరులపై అనుమానం వచ్చేలా చేసి, తప్పించుకునేవారని పోలీసులు వెల్లడించారు.

ఫొటో సోర్స్, UGC
హత్యకు గురైన అతికం విజయకు కూడా కొన్ని కుటుంబ వివాదాలు ఉన్నాయి. దీంతో ఆమె తన సొంతింటిని వదిలి కొంతకాలంగా డబుల్ బెడ్రూమ్ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
"ఆగస్టు 8న తన కిరాణా షాపు వద్దకు వచ్చిన విజయను, రజిత, ఆమె కుమారుడు ఇంటి లోపలికి పిలిచి దాడి చేసి హత్య చేశారు. ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని గోల్డ్ షాప్‌లో అమ్మేశారు. ఆ తర్వాత రాత్రి 10 గంటల సమయంలో ద్విచక్రవాహనం పైన మృతదేహాన్ని తీసుకెళ్లి రామక్కపేట శివారులో పెట్రోల్ పోసి తగలబెట్టారు. అయితే, ఆ రాత్రి వర్షం కురవడంతో మృతదేహం పూర్తిగా దహనం కాలేదు" అని సీపీ తెలిపారు.
ఈ కేసు విచారణ సమయంలో, మృతురాలికి తన కుటుంబంతో ఉన్న వివాదాలకు సంబంధించిన లీకులిస్తూ రజిత కొన్నిరోజులు పోలీసులను తప్పుదోవ పట్టించారని కమిషనర్ చెప్పారు.
ఆ తర్వాత సీసీ ఫుటేజీల ఆధారంగా అసలు నిందితులు తల్లీ కొడుకులేనని నిర్ధరణకు వచ్చామని, వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.
విచారణలో భాగంగా గతంలో వీరు చేసిన మరో హత్య బయటపడిందని సీపీ చెప్పారు.
"ఈ ఏడాది మేలో మిస్సింగ్ కేసుగా నమోదైన భూంపల్లికే చెందిన కుంట రేఖ (26)ను కూడా ఇదే తరహాలో తమ ఇంట్లో హత్య చేసి బంగారాన్ని తీసుకుని, అచ్చమాయపల్లి అటవీప్రాంతంలో పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగులబెట్టారు. అయితే, ఆమె వేరేవారితో వెళ్లిపోయి ఉంటుందని చెబుతూ రజిత అప్పట్లో విచారణను తప్పుదోవ పట్టించారు. వీరి జాబితాలో మరో నలుగురు కూడా ఉన్నారు" అని పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Siddipet police
దోపిడీతో మొదలుపెట్టి వరుస హత్యల వరకు..
దాదాపు ఏడాది కిందట మార్నింగ్ వాక్‌కు వెళ్లిన భూంపల్లి సర్పంచ్ భార్య అన్నపూర్ణపై దాడిచేసి, ఆమె మెడలోని బంగారాన్ని దోచుకున్నది కూడా ఈ తల్లీకొడుకులేనని తమ విచారణలో తేలినట్టు సీపీ వివరించారు.
ఏడాది కిందట జరిగిన దోపిడీ గురించి భూంపల్లి సర్పంచ్ రంగయ్యగారి జన్నారెడ్డి బీబీసీకి వివరించారు.
"గ్రామంలో మార్నింగ్ వాక్‌కు వెళ్లే అలవాటు మొదట మాతోనే మొదలైంది. ఆ తర్వాత కొందరు మహిళలు రావడం ప్రారంభించారు. అలా నా భార్య వారితో, నేను పురుషులతో కలిసి వేర్వేరు ప్రాంతాలకు వాకింగ్‌కు వెళ్లడం మొదలుపెట్టాం. గతేడాది జూన్ 20న రోజూ తనతో కలిసి వచ్చేవారు రాకపోవడంతో నా భార్య ఒంటరిగానే వాకింగ్‌కు వెళ్లారు. అదే సమయంలో ఆమెపై ఇద్దరు వ్యక్తులు బండరాయితో దాడి చేసి, మెడలో ఉన్న 5 తులాల బంగారాన్ని దోచుకున్నారు. ఏడాదికి పైగా విచారణ చేసినా నేరస్థులను పోలీసులు పట్టుకోలేకపోయారు" అని వివరించారు. ఇప్పుడు పోలీసుల విచారణలో ఆ దోపిడీ చేసింది వీరేనని తెలిసి ఆశ్చర్యపోతున్నాం అని తెలిపారు.
తమ దోపిడీ బయటపడకపోవడంతో తల్లీకొడుకుల్లో ధైర్యం పెరిగి, దోపిడీల నుంచి హత్యలు చేసే స్థాయికి వెళ్లారని సర్పంచ్ జన్నారెడ్డి అన్నారు.

ఫొటో సోర్స్, UGC
కొడుకును బాడీ బిల్డర్‌గా మార్చి..
ఈ వరుస హత్యల కేసులో ప్రధాన నిందితురాలు రజిత తన కొడుకును ఒక ఆయుధంలా మార్చుకుందని సిద్దిపేట పోలీసులు అన్నారు.
"కొడుకుకు బ్రెయిన్ వాష్ చేసి, బాడీ బిల్డింగ్ చేయించారు. ఇంట్లోనే ఒక చిన్న జిమ్‌ను ఏర్పాటు చేసింది. చిన్న వయసు అని కూడా చూడకుండా హత్యల కోసం కొడుకును ఆయుధంలా వాడుకుంది. ఆన్‌లైన్‌లో క్రైమ్ సిరీస్‌లు చూడటం, హత్యలు చేసి ఎలా తప్పించుకోవాలనే అంశాలను సెర్చ్ చేశారు. అమాయకులను ఎంపిక చేసుకోవడం, ఆ తర్వాత హత్య చేయడం, మృతదేహాలు దొరక్కుండా చేయడం, తమపై అనుమానం కలగకుండా పోలీసులను తప్పుదారి పట్టించడం.. ఇలా వారి నేరాలు సాగాయి. అయితే, పక్కా సాంకేతిక, క్షేత్రస్థాయి ఆధారాలతో నిందితులను పట్టుకున్నాం" అని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు.
హత్య చేశాక మృతదేహాన్ని దాచి, తరలించేందుకు ఆన్‌లైన్ నుంచి ప్రత్యేకమైన సామగ్రిని ఆర్డర్ చేసి తెప్పించారు. ఈ కేసులో నిందితుల నుంచి రూ. 10 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, బైక్, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. మైనర్ అయిన నిందితుడిని (16) జువైనల్ హోమ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో రజిత భర్తతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు.
రజిత సమీప బంధువైన ఒక మహిళ బీబీసీతో మాట్లాడుతూ.. "డిగ్రీ వరకు చదివిన రజిత ఇలా చేస్తుందని ఊహించలేదు. గత 20 ఏళ్లుగా ఆమెతో సత్సంబంధాలు లేవు. రజిత తన భర్తపై గతంలో దాడి చేసింది. ఆ సమయంలో ఎందుకలా చేశావని నిలదీశాం. ఉమ్మడి కుటుంబ ఆస్తి పంపకం సమయంలో కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఈ హత్యలతో గ్రామంలో మాకు తలవంపులు వచ్చాయి" అన్నారు.
ఈ కేసు దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహించాయని, గ్రామస్థులు సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సీపీ రష్మీ పెరుమాళ్ కోరారు.
"మా ముందు సామాన్య గృహిణిగా తిరిగిన మహిళ ఇలా చేస్తుందని ఊహించలేకపోయాం. గ్రామంలో అవసరమైన చోట మరిన్ని సీసీ కెమెరాలు పెట్టాలని ప్రజలు అడుగుతున్నారు. ఈ అంశంపై చర్చిస్తున్నాం" అని భూంపల్లి సర్పంచ్ జన్నారెడ్డి అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































