వ్యక్తి మూత్రాశయంలో నిప్పుకోడి గుడ్డు సైజులో రాయి

ఫొటో సోర్స్, Trincomalee General Hospital
- రచయిత, బీబీసీ సింహళా, కోహ్ ఈవె
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఒక వ్యక్తి మూత్రాశయం (బ్లాడర్) నుంచి వైద్యులు 3.1 కిలోగ్రాముల రాయిని (బ్లాడర్ స్టోన్) బయటకు తీశారు. ఈ ఘటన శ్రీలంకలో జరిగింది. ఇంతటి భారీ పరిమాణంలో బ్లాడర్ స్టోన్ బయటపడటం ఇదే మొదటిసారని డాక్టర్లు భావిస్తున్నారు.
శ్రీలంకలోని ట్రింకోమలీ ఆసుపత్రిలో గతవారం ఈ శస్త్రచికిత్స జరిగింది.
పక్షవాతం రావడంతో ఒక 55 ఏళ్ల రోగి ఆసుపత్రిలో చేరారు. ఆయనకు మూత్ర విసర్జనలో సమస్య ఉన్నట్లు చికిత్స సమయంలో వైద్యులు గుర్తించారు.
ఈ మేరకు పరీక్షలు చేయగా ఆ వ్యక్తి బ్లాడర్‌లో రాయి ఉన్నట్లు తేలింది.
వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆ రాయిని తొలగించారు. బ్లాడర్‌లో నుంచి తీసిన ఆ రాయి బరువు అప్పుడే పుట్టిన శిశువు బరువుతో సమానంగా, ఆకారంలో అది సరిగ్గా నిప్పుకోడి గుడ్డులా ఉంది.

మూత్రాశయంలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి?
''అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం, బ్లాడర్ నుంచి శస్త్రచికిత్స చేసి తొలగించిన అతిపెద్ద స్టోన్ ఇదే'' అని ఈ శస్త్రచికిత్సకు నేతృత్వం వహించిన డాక్టర్ బాలాకృష్ణన్ చెప్పారు.
సదరు రోగి ఆరోగ్యం ప్రస్తుతం బాగుందని డాక్టర్ బాలాకృష్ణన్ తెలిపారు.
రోగి ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారని, చికిత్స కొనసాగుతోందని వైద్యులు వెల్లడించారు.
దాదాపు అయిదు నుంచి పదేళ్లపాటు రోగి మూత్రాశయంలో ఈ రాయి పెరిగి ఉంటుందని డాక్టర్ బాలాకృష్ణన్ అంచనా వేశారు.
మూత్రంలోని ఖనిజాలు స్పటికాలుగా మారి గడ్డకట్టినప్పుడు బ్లాడర్ స్టోన్స్ ఏర్పడతాయి.
బ్లాడర్ పూర్తిగా ఖాళీ కానప్పుడు, మిగిలిన చిక్కటి మూత్రం స్పటికాలుగా మారడం వల్ల సాధారణంగా ఈ సమస్య వస్తుంది.
ఇసుక రేణువుల పరిమాణంలో ఉండే చిన్న రాళ్లు వాటంతట అవే బయటకు వెళ్లిపోతాయి.

ఫొటో సోర్స్, Trincomalee General Hospital
బ్లాడర్‌లో ఏర్పడే ‘పెద్ద రాయి’ పరిమాణం ఎంత ఉంటుంది?
అయితే ఒక సెంటీమీటర్ కంటే పెద్దగా మారిన రాళ్ళు, మూత్ర ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. వాటిని తొలగించడానికి వైద్య చికిత్స అవసరం అవుతుంది.
రాయి పరిమాణం నాలుగు సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే దాన్ని 'పెద్ద రాయి'గా పరిగణిస్తారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, 2003లో బ్రెజిల్‌లోని ఒక రోగి బ్లాడర్ నుంచి అతిపెద్ద స్టోన్‌ను తొలగించారు. దాని బరువు 1.9 కిలోగ్రాములు (4.2 పౌండ్లు), పొడవు 17.9 సెంటీమీటర్లు (7 అంగుళాలు).
శ్రీలంక వ్యక్తి బ్లాడర్ నుంచి తొలగించిన రాయి దాదాపు 17 సెంటీమీటర్ల పొడవు ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































