మానవ్ సుతార్: ఆడిన తొలి టెస్ట్‌, మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్.. ‘రాజస్థాన్ జడేజా’ అని ఎందుకంటున్నారు?

అఫ్గానిస్తాన్, భారత్ క్రికెట్ మ్యాచ్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, రాజస్థాన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

న్యూ చండీగఢ్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ భారీ విజయం సాధించింది. ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో భారత జట్టు గెలిచింది.

కాగా మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండో రోజున భారత్ ఆటగాడు మానవ్ సుతార్ అందరి దృష్టిని ఆకర్షించాడు.

23 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్‌కు ఇదే తొలి మ్యాచ్. ఆయన తన తొలి మ్యాచ్‌ తొలి ఓవర్‌లోనే వికెట్ తీసి చరిత్ర సృష్టించాడు.

గత 25 ఏళ్లలో ఒక భారత ఆటగాడు తన తొలి టెస్ట్ మ్యాచ్‌లో తాను వేసిన మొదటి ఓవర్‌లోనే వికెట్ తీయడం ఇదే తొలిసారి.

మానవ్ సుతార్ తాను వేసిన తొలి ఓవర్‌ నాలుగో బంతికి అఫ్గానిస్తాన్ ఓపెనర్ అబ్దుల్ మాలిక్‌ను ఔట్ చేశాడు.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 22 ఓవర్లు బౌలింగ్ చేసి 33 పరుగులకు 6వికెట్లు తీసి అఫ్గానిస్తాన్ 152 పరుగులకే ఆలౌట్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. మానవ్ బ్యాటింగ్‌లో 28 పరుగులు చేశాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అఫ్గానిస్తాన్, భారత్ క్రికెట్ మ్యాచ్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, రాజస్థాన్

ఫొటో సోర్స్, Manav Suthar/IG

ఫొటో క్యాప్షన్, టెస్ట్ క్రికెట్ టోపీతో మానవ్ సుతార్

ప్రముఖుల ప్రశంసలు

రాజస్థాన్‌కు చెందిన 23 ఏళ్ల మానవ్ సుతార్ తొలి మ్యాచ్‌లోనే మంచి ప్రదర్శనతో ప్రశంసలు అందుకున్నాడు.

లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ కావడం, బ్యాటింగ్ కూడా బాగా చేస్తూ ఉండటంతో అభిమానులు సోషల్ మీడియాలో అతన్ని 'రాజస్థాన్ జడేజా' అని పిలుస్తుంటారు.

"మానవ్ సుతార్ బౌలింగ్ చూడటం చాలా ఆనందంగా ఉంటుంది. అతను అద్భుతంగా రాణించాడు. కొన్నేళ్లుగా అతనితో కలిసి బౌలింగ్ చేస్తున్న వారికి, అతనేం చేస్తున్నాడో, అతని నైపుణ్యాలు ఎలా ఉన్నాయో బాగా తెలుసు. అతనికి అభినందనలు" అని సహచర ఆటగాడు వాషింగ్టన్ సుందర్ చెప్పాడు.

"అతను రెడ్ బాల్ ఫార్మాట్‌లో చాలా బాగా ఆడాడు. బౌలింగ్ చేసేటప్పుడు తన శరీరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాడు. బంతిని బలంగా సంధిస్తాడు. మేమిద్దరం కలిసి చాలా మ్యాచ్‌లు ఆడాం. కుల్దీప్, మానవ్ ఎలా బౌలింగ్ చేస్తారో నాకు తెలుసు. మేం ఒకరి నుంచి మరొకరం నేర్చుకుంటాం" అని వాషింగ్టన్ సుందర్ అన్నాడు.

"మానవ్ సుతార్ టెస్ట్ క్రికెట్ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. బౌలింగ్‌ బ్యాటింగ్‌.. ఏదైనా ఆత్మవిశ్వాసంతో ఆడాడు. క్రీజ్‌లో చక్కని ఫుట్‌వర్క్‌తో సౌకర్యవంతంగా పరుగులు సాధించాడు" అని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అన్నారు.

"అతని బౌలింగ్‌లో కచ్చితత్వం ఉంది. పిచ్ అనుకూలంగా ఉండటంతో అతను దాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. అయితే ఫ్లాట్ పిచ్‌ల మీద అతనికి పరీక్ష ఎదురు కావచ్చు" అని గావస్కర్ చెప్పారు.

అతని ఆట తీరు చూస్తే, భవిష్యత్తులో టెస్ట్ క్రికెట్‌కు బలమైన పోటీదారుడని ఆయన అభిప్రాయపడ్డారు.

చాలా మంది మానవ్ సుతార్‌ను రవీంద్ర జడేజాతో పోలుస్తున్నారు.

"మానవ్ సుతార్ తన తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీశాడు. ఇప్పుడతను రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేస్తాడా?" అని క్రికెట్ అభిమాని అచ్యుత్ మిశ్రా తన సోషల్ మీడియా అకౌంట్‌లో రాశారు.

"తొలి మ్యాచ్, తొలి ఓవర్, వికెట్. ఎంత అద్భుతమైన ఆరంభం... అతను రవీంద్ర జడేజాకు సరైన ప్రత్యామ్నాయం కాగలడు" అని సిల్లీ మిడ్ ఆన్ పేరుతో అకౌంట్ ఉన్న మరో క్రికెట్ అభిమాని ఎక్స్‌లో రాశారు.

మానవ్ సుతార్ కోచ్ ధీరజ్ గతంలో ఒకసారి "ప్రజలు అతన్ని 'రాజస్థాన్ జడేజా' అని పిలుస్తారు. అతనికి అద్భుతమైన సామర్థ్యం ఉంది. అతను రెడ్ బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నాడు" అని చెప్పారు.

అఫ్గానిస్తాన్, భారత్ క్రికెట్ మ్యాచ్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, రాజస్థాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తొలి టెస్ట్, తొలి ఇన్నింగ్స్, తొలి ఓవర్‌లోనే వికెట్ తీసి మానవ్ సుతార్ రికార్డులకెక్కాడు.

'టెస్ట్ క్రికెట్ ఆడటం నా అతిపెద్ద కల'

టెస్ట్ క్రికెట్‌ ఆడే అవకాశం లభించడంతో మానవ్ సుతార్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో టెస్ట్‌క్యాప్‌తో ఉన్న ఫోటోలను పంచుకుని దాని కింద "నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పుడు, భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడాలన్నదే నా అతిపెద్ద కల. అది ఈరోజు నిజమైంది" అని మెసేజ్ పోస్ట్ చేశాడు.

ఇంకా అందులో "టెస్ట్ క్యాప్ అందుకున్న తర్వాత నాకు కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేను. ఈ క్షణం కేవలం నాది మాత్రమే కాదు, మొదటి రోజు నుంచి నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబం, నన్ను నమ్మిన నా కోచ్‌ది కూడా. ఈ ప్రయాణంలో అందరూ నాతో పాటే ఉన్నారు. ఈరోజు నా కుటుంబ కల కూడా నిజమైంది" అని రాశాడు.

మానవ్ సుతార్ 2023 జూలై లో లిస్ట్-ఎ క్రికెట్‌లో, ఫిబ్రవరి 2022లో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అడుగు పెట్టాడు.

ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో ప్రకారం ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 29 మ్యాచ్‌లలో 129 వికెట్లు పడగొట్టాడు. అందులో ఆరుసార్లు ఐదు వికెట్లు, మూడుసార్లు 10 వికెట్లు తీసుకున్నాడు.

25 లిస్ట్ ఎ మ్యాచ్‌లలో 34 వికెట్లు తీసి, 350 పరుగులు చేశాడు. 29 టీ20 మ్యాచ్‌లలో 28 వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఆడాడు.

అఫ్గానిస్తాన్, భారత్ క్రికెట్ మ్యాచ్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, రాజస్థాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్తాన్ బ్యాట్స్‌మెన్ రహమత్‌షా తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులు చేశాడు.

భారత్ ఘన విజయం

అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు నష్టపోయి 564 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

అఫ్గానిస్తాన్ జట్టు మ్యాచ్ మూడో రోజు ఉదయానికి 152 పరుగులకు ఆలౌట్ అయి ఫాలో ఆన్‌లో పడింది. రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన సుతార్ రెండో ఇన్నింగ్స్‌లో 29 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

అఫ్గానిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ జూన్ 13న జరగనుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)