You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలుగు రాష్ట్రాల్లో ఒంటరి పురుషుల కంటే ఎక్కువగా ఒంటరి మహిళలు.. తెలంగాణ పల్లెల్లో ఓ 'రివర్స్ ట్రెండ్'..
- రచయిత, శారద మియాపురం
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
తెలుగు రాష్ట్రాల్లో విడాకులు, భాగస్వామిని కోల్పోవడం లేదా భాగస్వామి లేకుండా ఒంటరిగా జీవిస్తున్న వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నట్లుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 'శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్)' స్టాటిస్టికల్ రిపోర్ట్-2024 ప్రకారం, దేశవ్యాప్తంగా ఒంటరిగా జీవిస్తున్న పురుషులతో పోలిస్తే ఒంటరిగా జీవిస్తున్న మహిళలు దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువగా ఉన్నారు.
ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒంటరి మహిళల సంఖ్య, పురుషులతో పోలిస్తే దాదాపు 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంది. అలాగే యువశక్తి, వేగవంతమైన జనాభా వృద్ధి గల దేశంగా పేరున్న భారత్.. నిశ్శబ్ధంగా వృద్ధాప్యం వైపు అడుగులు వేస్తోందని ఈ రిపోర్ట్ చూపుతోంది.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలూ 70 శాతానికి పైగా శ్రామిక జనాభాతో ముందంజలో ఉన్నాయని, జననాల రేటు తగ్గుదల, వృద్ధాప్య మరణాలు పెరుగుదల, పురుషులతో పోలిస్తే ఒంటరిగా మిగిలిపోతున్న మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం వంటి భారీ మార్పులను కళ్లకు కట్టింది.
ఈ అధికారిక నివేదికను లోతుగా విశ్లేషిస్తే, ఉత్తర భారత రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణ భారతంలో మరీ ముఖ్యంగా... ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో సామాజిక, జనాభాపరంగా కొన్ని సానుకూల అంశాలతో పాటు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపబోయే ఆందోళనకర అంశాలు కూడా ఉన్నాయని స్పష్టమవుతోంది.
జనాభా నియంత్రణ, సురక్షిత ప్రసవాలు..
జనాభా పెరుగుదలను అదుపు చేయడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉత్తమ ఫలితాలను సాధించాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. జాతీయ సగటు 1.9 కంటే రెండు రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్) తక్కువగా నమోదైనట్లు ఈ రిపోర్టు చూపుతోంది. దీనికి తోడు, ప్రసవాలకు సంబంధించి వైద్య రంగంలో తెలుగు రాష్ట్రాలు ప్రగతి సాధించినట్లుగా తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల సగటు 95.4 శాతంగా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో 99.7 శాతం, తెలంగాణలో 99.8 శాతం ప్రసవాలు సురక్షితంగా ఆసుపత్రుల్లోనే జరుగుతున్నట్లుగా డేటా చెబుతోంది. ఇది తల్లీపిల్లల ఆరోగ్య భద్రతకు అత్యంత సానుకూల పరిణామం.
పడిపోతున్న సంతానోత్పత్తి రేటు..
ఒక సమాజంలో జనాభా పెరగకుండా, తరాలు సమతుల్యంగా సాగాలంటే సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్) 2.1గా ఉండాలి. దీన్నే స్థిరత్వ రేటు (Replacement level) అంటారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఈ రేటు చాలా కిందకు పడిపోయినట్లు ఈ రిపోర్టు చూపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ సంతానోత్పత్తి రేటు 1.4 కు చేరగా, తెలంగాణ టీఎఫ్‌ఆర్ 1.5గా ఉంది. అంటే జాతీయ సగటు 1.9 కంటే తెలుగు రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది. కేరళలో 1.3, తమిళనాడు 1.3, కర్ణాటక 1.5 టీఎఫ్‌ఆర్ ఉండగా బిహార్ (2.9), ఉత్తరప్రదేశ్ (2.6) వంటి ఉత్తర భారత రాష్ట్రాలు ఇంకా అధిక సంతానోత్పత్తి రేటుతో సవాలు ఎదుర్కొంటున్నాయి.
తగ్గుతున్న పిల్లల సంఖ్య, పెరుగుతున్న వృద్ధులు
జనాభా అదుపులోకి రావడం ఒక సానుకూల అంశమే అయినా, దాని వెనుక ఒక ప్రతికూలత దాగి ఉందని ఈ రిపోర్ట్ చూపుతోంది.
పిల్లల సంఖ్యలో తగ్గుదల (0-14 ఏళ్లు): జననాలు విపరీతంగా తగ్గడం వల్ల మొత్తం జనాభాలో పిల్లల వాటా క్షీణిస్తోన్నట్లుగా రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. భారత్‌లో 0–14 ఏళ్ల పిల్లల సగటు వాటా 24.0% ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో అది కేవలం 19.0 శాతానికి, తెలంగాణలో 20.4 శాతానికి పడిపోయింది. తమిళనాడు (18.0%), కేరళ (19.6%) లలో కూడా ఇదే ధోరణి ఉంది. దీనివల్ల రాబోయే రోజుల్లో బడికి వెళ్లే పిల్లల సంఖ్య, ఆ తర్వాత ఉపాధిలోకి వచ్చే యువత సంఖ్య వేగంగా తగ్గిపోనుంది.
పెరిగిపోతున్న వృద్ధాప్యం (60+ ఏళ్లు): దేశవ్యాప్తంగా వృద్ధుల సగటు వాటా 9.7% ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధుల శాతం 10.6% కి చేరింది. తెలంగాణలో వృద్ధుల వాటా 9.1 శాతంగా ఉంది.
తెలంగాణ పల్లెల్లో 'రివర్స్ ట్రెండ్', అత్యుత్తమ శ్రామిక శక్తి
ఈ రిపోర్టు ప్రకారం దేశంలోని పట్టణ ప్రాంతాల్లో (20.9 శాతం) కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే (25.6 శాతం) పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ, తెలంగాణలో మాత్రం పరిస్థితి విచిత్రంగా తలకిందులైంది. తెలంగాణ పల్లెల్లో 0-14 ఏళ్ల పిల్లల వాటా 19.8 శాతమే కాగా, నగరాల్లో 21.2 శాతంగా ఉంది. తెలంగాణ, దిల్లీ మినహాయించి దేశం మొత్తంలోనూ పట్టణాల కంటే పల్లెల్లోనే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆంధ్రలో గ్రామీణ ప్రాంతాలు, అర్బన్ ఏరియాల్లో సమానంగా పిల్లల వాటా 19 శాతంగా ఉంది.
బలమైన శ్రామిక శక్తి (15-59 ఏళ్లు): ప్రస్తుతం దేశంలో అత్యధికంగా వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉన్న రాష్ట్రాల్లో దిల్లీ (71.1 శాతం), తెలంగాణ 70.5%, ఆంధ్రప్రదేశ్ 70.4% శాతంతో వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ విషయంలో జాతీయ సగటు 66.4% కంటే చాలా ఎక్కువ మానవ వనరుల సామర్థ్యంతో ఉన్నాయి.
పెరుగుతున్న ఒంటరి మహిళల సంఖ్య..
ఈ నివేదికలోని మ్యారిటల్ స్టేటస్ అనే విభాగాన్ని పరిశీలిస్తే.. పెళ్లి బంధం ముగిసి వితంతువులుగా, విడాకులు తీసుకోవడం లేదా భాగస్వామికి దూరంగా ఒంటరిగా జీవిస్తున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నట్లు అర్థం అవుతోంది.
దేశవ్యాప్తంగా ఇలా ఒంటరిగా జీవిస్తున్న వారి సంఖ్య 3.5 శాతంగా ఉంది. ఇందులో పురుషులు 1.6 శాతంగా, మహిళలు 5.4 శాతంగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పురుషుల జనాభాలో వితంతు/విడాకులు/విడిపోయిన వారు 2.1% కాగా, మహిళల్లో ఈ సంఖ్య ఏకంగా 8.0% గా ఉంది. అంటే పురుషులకంటే ఒంటరి మహిళల శాతం ఇక్కడ దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ.
ఇక తెలంగాణలో ఇక్కడి మొత్తం పురుషులలో వితంతు/విడాకులు/విడిపోయిన వారు 1.6% ఉండగా, మహిళల్లో ఈ సంఖ్య 7.6 శాతంగా ఉంది. ఇక్కడ పురుషుల కంటే ఒంటరి మహిళల సంఖ్య దాదాపు ఐదు రెట్లు ఎక్కువ.
దేశవ్యాప్తంగా మొత్తం మహిళా జనాభాలో ఒంటరి మహిళల సగటు వాటా 5.4% మాత్రమే. కానీ దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రధాన రాష్ట్రాలూ ఈ జాతీయ సగటును దాటి చాలా ఎక్కువ శాతాన్ని నమోదు చేశాయి. దేశంలోనే అత్యధికంగా తమిళనాడులో 11.6%, కేరళలో 10.4%, కర్ణాటకలో 8.6% మంది మహిళలు ఒంటరిగా జీవిస్తున్నారు.
దేశవ్యాప్తంగా మొత్తం పురుషుల జనాభాలో ఒంటరి పురుషుల సగటు వాటా 1.6 శాతం కాగా... తమిళనాడులో అత్యధికంగా 2.9 శాతం మంది పురుషులు ఒంటరిగా జీవిస్తున్నారు.
( మూలం: "Sample Registration System (SRS) Statistical Report 2024").
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)