చేతుల్లో పటుత్వం పోవడం, వెన్నెముక వంగిపోవడం.. మీ స్క్రీన్ టైమ్ మీ శరీరాన్ని ఎన్ని రకాలుగా మార్చేస్తోందో తెలుసా?

    • రచయిత, థామస్ జర్మైన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

మీ పరికరాలు మీ శరీరాన్ని ఎన్ని రకాలుగా మారుస్తున్నాయో మీకు తెలియడం లేదు. అయితే, ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఇంకా అంత ఆలస్యం కాలేదు.

మన స్క్రీన్ టైమ్ మనపై చూపించే ప్రభావం గురించి ఆందోళన చెందేటప్పుడు ముందుగా మెదడుపై దృష్టిపెడతాం. అయితే, ఇటీవల నేను ఓ విషయం గమనించా.

నా చిటికిన వేలు దగ్గర ఉబ్బినట్టుగా, గట్టిగా అనిపించింది. నేను ఫోన్ పట్టుకునే చోటే అది ఏర్పడింది. ఇది నన్ను ఆలోచనలో పడేసింది. నా మిగిలిన శరీరాన్ని నా ఫోన్ ఏం చేస్తోందని?

దీని గురించి తెలుసుకోవడానికి నేను నిపుణులను సంప్రదించాను. వారి సమాధానం ఆందోళన కలిగించేలానే ఉంది.

సాంకేతికత మనకు ఉపయోగపడాలి కానీ...

ఫోన్, ఇతర డిజిటల్ పరికరాలు మన మెడ ఆకృతిని మార్చేస్తున్నాయని, మన చూపుపై ప్రభావం చూపుతున్నాయని, శరీర కదలికలను నియంత్రిస్తున్నాయని, కండరాల పటుత్వాన్ని తగ్గిస్తున్నాయని తాజా పరిశోధనల్లో తేలింది.

టెక్నాలజీ ఆధారిత జీవన శైలి వల్ల చర్మంపై ముడతలు వస్తున్నాయని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఈ శారీరక సమస్యల్లో కొన్ని క్రమంగా.. జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం తగ్గడానికి, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చు.

మీ సంగతి నాకు తెలియదు కానీ, నేను మాత్రం ఇలా రోజంతా కూర్చునే అలవాటును కొనసాగించడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే, ఇలా కూర్చోవడమే సమస్యలకు ఓ కారణం. మన శరీరాన్ని సాంకేతికత నాశనం చేయకూడదనుకుంటే మనం చేయాల్సిన పనులు మూడుంటాయి.

వెన్నెముక ఆకారంలో మార్పులు

మనం ఫోన్‌లో దీన్ని చదువుతున్నట్లయితే.. దాన్ని చూడడానికి మన తలను బాగా కిందకు వంచుతుంటాం.

ఈ ''తలను ముందుకు వంచే భంగిమ'' వల్ల మెడమీద 27 కేజీల భారం పడుతుంది. కాలక్రమేణా ఇది మన వెన్నెముకలోని డిస్క్‌లను దెబ్బతీయొచ్చు. కీళ్లు, కండరాలను బలహీనపరచవచ్చు. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కూడా తగ్గించవచ్చు. దీనికి ''టెక్ నెక్'' అనే నిక్ నేమ్ కూడా ఉంది.

మన శరీరం కనిపించే తీరును కూడా అది శాశ్వతంగా మార్చేయొచ్చు.

ఈ సమస్యను తొలగించుకోడానికి ప్రత్యేక వ్యాయామాలు సాయపడతాయి. అయితే, డాక్టర్ సాయంతోనే వాటిని చేయాలి. ఫోన్ విషయంలో మనం ఇప్పుడే కొన్ని మార్పులు చేసుకోవచ్చు. మన ఫోన్‌ను ఎప్పుడూ పట్టుకునే దానికంటే కొంచెం పైకి పట్టుకోవాలి.

కంటికి ఎదురుగా, ముఖం నుంచి చెయ్యి దూరంలో స్క్రీన్‌ను ఉంచడం వల్ల ఫలితం కనిపిస్తుంది. కంప్యూటర్ మానిటర్లకు కూడా ఇది పనిచేస్తుంది. మధ్యమధ్యలో విరామం ఇవ్వడం ప్రయోజనకరంగా ఉంటుందని కొందరు నిపుణులు అంటుంటారు.

చర్మం ఇరిటేషన్(మంట, ఎర్రబడడం వంటివి), మెడపై ముడతలు?

ఇటీవల జనానికి కొత్త ఆందోళన మొదలైంది. టెక్ నెక్ వల్ల మెడపై ముడతలు వస్తున్నాయా? అని.

''ఇలా జరగడానికి అవకాశముంది. ఒత్తిడి ఎక్కువగా పడడం వల్ల ముడతలు వస్తాయి. శరీరాన్ని ముందుకు వంచి మెడను ముడిచినట్టుగా ఎప్పడూ ఉంచడం వల్ల సమస్య తలెత్తవచ్చు'' అని చర్మవ్యాధి నిపుణురాలు, యూకేలోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ ఫెలో జస్టిన్ హెక్స్టాల్ చెప్పారు.

అయితే, ఈ రెండింటికీ సంబంధం ఉన్నట్టు నిరూపితమయ్యే అధ్యయనాలు లేవని ఆమె అన్నారు. ఆన్‌లైన్‌లో టెక్ నెక్ పేరుతో కనిపించే ప్రత్యేక చర్మ ఉత్పత్తులను కొనొద్దని ఆమె సలహా ఇస్తున్నారు.

డిజిటల్ పరికరాల వల్ల ఇతర చర్మ సమస్యలు కూడా ఉన్నాయి. ఎప్పుడూ స్మార్ట్ వాచ్ తీయని వారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

''మనం వాచ్ పెట్టుకునేచోట గాలి ఆడదు. ఆ ప్రాంతానికి సూర్యరశ్మి తగలదు. ఇది ఈస్ట్ అనే సూక్మజీవులు పెరగడానికి వీలుగా ఉంటుంది. చర్మం దురద, ఎర్రబడడం వంటివాటితో పాటు ఎగ్జిమా కూడా సోకే ప్రమాదముంది. ఇది చర్మం రక్షణ పొరను దెబ్బతీస్తుంది. నికెల్, రబ్బర్, లాటెక్స్, అక్రిలేట్స్ అనే రసాయనాల వల్ల అలర్జీ లేదా సున్నితత్వం వంటివి కలిగే అవకాశముంది'' అని ఆమె చెప్పారు.

దీనికి పరిష్కారం చాలా తేలిక. రోజులో ఎక్కువసార్లు స్మార్ట్ వాచ్ తీసి కాసేపు పక్కనపెట్టి, చర్మాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. రోజు మొత్తం వాచ్ పెట్టుకోవాల్సి వస్తే చర్మాన్ని సంరక్షించే క్రీమ్ రాసుకోవాలని కూడా ఆమె సూచించారు.

కంటిచూపు తగ్గిపోవడం

మయోపియా కేసులు దశాబ్దాలుగా వాయువేగంతో పెరుగుతున్నాయి. టెక్నాలజీ వల్లే ఇలా జరుగుతుందని మనం నిందించవచ్చు.

''అది నిజం కూడా కావొచ్చు. కానీ, మనం దాని గురించి అనుకున్న విధానంలో కాదు'' అని అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్శిటీలో ఆప్టొమెట్రీ ప్రొఫెసర్ డోనాల్డ్ ముట్టి చెప్పారు.

''పిల్లల కంటి చూపు పెంపొందే తీరును 20 ఏళ్లకుపైగా మేం పరిశీలించాం. మయోపియా(దూరంగా ఉన్న వస్తువులు సరిగ్గా కరిపించకపోవడం) ఎందుకు వస్తుంది, ఎందుకు పెరుగుతుంది అనే కారణాలను అధ్యయనం చేశాం. ఫోన్‌లాంటి వాటిని దగ్గరగా చూడడానికి, మయోపియాకు సంబంధం ఉందా అనే కోణంలో పరిశీలించాం. కానీ, స్పష్టమైన సంబంధం ఉన్నట్టు కనిపించలేదు'' అని చెప్పారు.

''అయితే, అధ్యయనంలో మరో విషయం బయటపడింది. బయట ఎక్కువ సమయం గడపడం వల్ల కళ్లకు ఎక్కువ రక్షణ లభిస్తుందని తేలింది. బయట ఉండే ప్రకాశవంతమైన వెలుతురు కంటి రెటీనా నుంచి డోపమైన్ విడుదలకు సాయపడుతుంది. ఇది కంటిచూపును ప్రభావితం చేసే అవకాశం ఉంది'' అని ముట్టి చెప్పారు.

''టెక్నాలజీ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువ సమయం ఇళ్లల్లోనే గడుపుతున్నారు. డిజిటల్ పరికరాలు పరోక్షంగా మన కంటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి'' అని ముట్టి భావిస్తున్నారు.

''దీనికి పరిష్కారం చాలా సులువు. బయట మరింత ఎక్కువ సమయం గడపాల్సిఉంటుంది. ఇది కళ్లకు మేలు చేయడం మాత్రమే కాదు. మనం మరింత మెరుగ్గా నిద్రపోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎండ వల్ల కలిగే హానికర ప్రభావాల నుంచి రక్షణ పొందడానికి సన్‌స్క్రీన్, సన్‌గ్లాసెస్ వంటి జాగ్రత్తలు పాటించాలి'' అని ముట్టి తెలిపారు.

చేతుల్లో పటుత్వం పోవడం..

చేతితో గట్టిగా పట్టుకునే బలం మన ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ముఖ్యమైన సూచికగా ఇప్పుడు చెబుతున్నారు.

రక్తపోటు కంటే కూడా చేత్తో గట్టిగా పట్టుకునే బలం ముందస్తు మరణం ప్రమాదాన్ని మెరుగ్గా అంచనా వేయగలదని ఒక అధ్యయనంలో తేలింది.

''చాలా దేశాల్లో యువతలో చేతి పటుత్వం క్రమంగా తగ్గుతోంది. ఒక తరం నుంచి మరో తరానికి చేతి పటుత్వం తగ్గడమనేది చేతుల బలహీనతకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. భవిష్యత్తులో యువత ఆరోగ్యానికి ఇది ముందస్తు హెచ్చరిక కావొచ్చు'' అని జర్మనీలోని లాసిట్జ్ మెడికల్ యూనివర్సిటీలో మెడికల్ సోషియాలజీ ప్రొఫెసర్ జొహన్నెస్ బెల్లర్ చెప్పారు.

''కంప్యూటర్‌పై చేసే పనులు, ఎక్కువసేపు కూర్చునే జీవనశైలి వల్ల శారీరక దృఢత్వం తగ్గుతోంది. దాని ప్రభావం చేతి పటుత్వంలోనూ కనిపిస్తోంది'' అని బెల్లెర్ తెలిపారు.

టెన్నిస్ బంతిని సాధ్యమైనంత గట్టిగా నొక్కుతూ 15 నుంచి 30సెకండ్ల పాటు పట్టుకోగలగాలి. ఇది చేతి పటుత్వం గురించే కాదు. మొత్తంగా మన ఫిట్‌నెస్ పెంచుకోడానికి ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు చేయాలి.

చెయ్యి - కన్ను సమన్వయం

టెక్నాలజీ వల్ల మోటార్ స్కిల్స్ (మెదడు, శరీరం కలిసి కచ్చితమైన కదలికలు చేయడం)పైనా ప్రభావం పడుతున్నట్టు కనిపిస్తోంది.

''క్లిక్ చేయడం, స్వైపింగ్ వంటి వాటిలో టెక్నాలజీ మీ నైపుణ్యాన్ని పెంచవచ్చు'' అని జర్మనీలోని రీగన్స్‌బర్గ్ యూనివర్సిటీలో డెవలప్‌మెంటల్ సైకాలజీ, ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ సెబాస్టియన్ సుగ్గేట్ చెప్పారు. కానీ, మొత్తంగా మోటార్ స్కిల్ అభివృద్ధిని విస్తృత ప్రాతిపదికలో గమనిస్తే ప్రతికూల ప్రభావమే చూపుతుందని అన్నారు.

పెద్దలకంటే పిల్లలపై పడే ప్రభావాల గురించి మనకు చాలా సమాచారం ఉంది. ఎక్కువ స్క్రీన్ టైమ్, మోటార్ స్కిల్స్ సరిగ్గా లేకపోవడానికి సంబంధముందని సుగ్గేట్ పరిశోధనలో తేలింది.

ఇది మరింత ఆందోళన కలిగించే విషయం. పిల్లల్లో, కౌమార దశలో ఉన్నవారిలో మోటార్ స్కిల్స్, ఆలోచనా సామర్థ్యం, చదువుల్లో ప్రతిభకు సంబంధముంది.

భయపడాల్సిన పనిలేదని, స్క్రీన్ చూడడాన్ని పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం లేదని, అయితే, నిత్యజీవితంలో చేతులతో చేసే పనులను పెంచాలని సుగ్గేట్ సూచిస్తున్నారు.

వంట, కళలు, చేతివృత్తులు వంటివి ప్రయోజనం కలిగిస్తాయి. సుగ్గేట్ చెక్క పనులు చేస్తారు. ఓ సంగీత వాయిద్యం నేర్చుకోవచ్చు. చేతితో రాయొచ్చు.

''ఇది ప్రపంచం అంతమైపోయేంత పెద్ద సమస్య కాదు. ఇవి చిన్న చిన్న ప్రభావాలు మాత్రమే. అయితే, ఒక్కో వ్యక్తి కోణంలో ఇవి చిన్నవిగానే కనిపించినా మొత్తం సమాజం కోణంలో గమనిస్తే తరాలపాటు ఇవి ప్రజల మేథస్సును తగ్గించవచ్చు. వాస్తవ పరిస్థితుల గురించి ఆలోచించే సామర్థ్యాన్ని తగ్గించవచ్చు. ఎందుకంటే, ప్రపంచంతో మనం నేరుగా అనుసంధానమయ్యే కీలక సాధనం మన చేతులే'' అని సుగ్గేట్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)