సీజేపీ నిరసనకారులకు తగిలినవి పెల్లెట్ గన్ గాయాలే : బీబీసీతో నిపుణులు

ఫొటో సోర్స్, Congress Party
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
(గమనిక: ఈ కథనంలో కొందరిని కలవరపరిచే చిత్రాలు ఉన్నాయి).
దిల్లీలో గత వారం జరిగిన నిరసనల్లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మద్దతుదారులకు తగిలిన గాయాలు పెల్లెట్ తుపాకుల వల్లే అయినవని స్వతంత్ర బాలిస్టిక్ నిపుణులు బీబీసీకి చెప్పారు.
జులై 20న విద్యా సంస్కరణలు, విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ వేలాది మంది నిరసనకారులు పార్లమెంట్ వైపు ప్రదర్శనగా వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు జరిగిన హింసకు సెంట్రల్ దిల్లీ సాక్ష్యంగా నిలిచింది.
పోలీసులు, పారామిలటరీ సిబ్బంది జనంపై కర్రలు, లాఠీలు, టియర్ గ్యాస్‌తో దారుణంగా దాడి చేయడం కనిపించింది. నిరసనకారులలో 60 మంది, తమ సిబ్బందిలో 118 మంది గాయపడ్డారని దిల్లీ పోలీసులు తెలిపారు. గాయపడిన నిరసనకారుల సంఖ్య అధికారిక లెక్కల కంటే చాలా ఎక్కువని సీజేపీ పేర్కొంది.
ఈ అణచివేత తర్వాత రోజుల్లో, నిరసనకారులపై పెల్లెట్ గన్లు ఉపయోగించినట్టు వస్తున్న మీడియా కథనాలను ప్రభుత్వం ధ్రువీకరించలేదు. అయితే గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందిన నిరసనకారులకు సంబంధించిన కనీసం నాలుగు ఘటనలను బీబీసి నిర్థరించగలిగింది. ఆ గాయాలు పెల్లెట్‌గన్‌ల వల్లే అయ్యాయని నిపుణులు చెబుతున్నారు.

పెల్లెట్ గన్‌లు పక్షుల కోసం వేట కోసం రూపొందించిన షాట్‌గన్‌లు. వీటిలో బర్డ్ షాట్ అని పిలిచే ప్రత్యేక తూటాలను ఉపయోగిస్తారు. ఒక్కో తూటాలో 200 నుంచి 400వరకు చిన్న లోహపు గుళ్లు ఉంటాయి. వీటిని గుంపులపై ప్రయోగించినప్పుడు అవి చెల్లాచెదురుగా వ్యాపించి, ఎదురుగా ఉన్నవారిని విచక్షణా రహితంగా తాకుతాయి. అందుకే ఇలాంటి తుపాకుల వినియోగాన్ని పలు దేశాలు నిషేధించాయి.
భద్రతా దళాలు కాల్చిన పెల్లెట్ గన్ల వల్లే తాము గాయపడ్డామని నమ్ముతున్న ఇద్దరు వ్యక్తులతో మేం మాట్లాడాం. ఆ ఇద్దరితో పాటు మూడో వ్యక్తికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇద్దరు స్వతంత్ర ఆయుధ, ఫోరెన్సిక్ నిపుణులకు చూపించాం.
పెల్లెట్ గాయాలకు చికిత్స పొందిన నాలుగో వ్యక్తి వివరాలను ఓ ఆస్పత్రి సీనియర్ అధికారి నిర్ధరించారు.

ఫొటో సోర్స్, Shaikh Irshad Mansoori
అవి కచ్చితంగా పెల్లెట్ గన్ గాయాలే: నిపుణులు
బాధితుల శరీరాలపై ఉన్న డజన్ల కొద్దీ చిన్న గుండ్రని రంధ్రాలు పక్షుల వేటకు వాడే బర్డ్‌షాట్స్ వల్ల జరిగిన గాయాలకు స్పష్టమైన సంకేతాలని నిపుణులు చెబుతున్నారు.
"ఈ చిత్రాల్లో కనిపిస్తున్న గాయాలు కచ్చితంగా పెల్లెట్ గన్ వల్లే అయ్యాయి. ఇందుకు ఉపయోగించిన ఆయుధం 12-గేజ్ పంప్-యాక్షన్ షాట్‌గన్" అని యూకేకు చెందిన బాలిస్టిక్స్ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త ఫిలిప్ బాయిస్ బీబీసీతో అన్నారు.
"ఈ పెల్లెట్ గాయాలు నిజానికి చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి, ముఖ్యంగా దగ్గరి నుంచి కాల్చినప్పుడు ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. నేను చూస్తున్న గాయాలు (దిల్లీలోనివి) దగ్గరి నుంచి జరిగినవి కావు, కనీసం 50 అడుగుల దూరం నుంచి జరిగినవి. అయితే, 100 అడుగుల దూరం నుంచి కూడా ఇవి తీవ్రమైన నష్టాన్ని, ప్రాణాపాయాన్ని కలిగించగలవు" అని ఆయన చెప్పారు.
"గుంపులను నియంత్రించడానికి పోలీసులు షాట్‌గన్లను ఉపయోగించినట్టు నిరసనలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు చూపుతున్నాయి. గాయాల ఫోటోలు కూడా బర్డ్‌షాట్ వాడకాన్ని బలంగా ధ్రువీకరిస్తున్నాయి" అని యూకేలోని ఆర్నమెంట్ రీసర్చ్ సర్వీసెస్ డైరెక్టర్ ఎన్‌ఆర్ జెంజెన్-జోన్స్ బీబీసీతో తెలిపారు.
"అనేక దేశాల భద్రతా బలగాలు తక్కువ ప్రాణహాని కలిగించే ఆయుధాల్లో భాగంగా షాట్‌గన్‌లను ఉపయోగిస్తుంటాయి. అయితే భారత భద్రతా బలగాలు గుంపులను చెదరగొట్టే సందర్భాలలో ‘బర్డ్‌షాట్’గా పిలిచే చిన్న చిన్న సీసపు గుళ్లు నింపిన షాట్‌గన్ తూటాలను చాలాకాలంగా వినియోగిస్తున్నాయి. ఇలాంటి బర్డ్ షాట్ తూటాలు నింపిన షాట్‌గన్‌లనే కొన్ని సందర్భాలలో ‘పెల్లెట్‌గన్’ అని పిలుస్తారు’’ అని చెప్పారు.
"కానీ, ఈ గుళికలు సురక్షితమైనవి కావు. ఇవి జీవితాన్ని మార్చేసే లేదా కొన్నిసార్లు ప్రాణాంతకమైన గాయాలకు కారణం కావచ్చు. ఇవి శరీరంలోకి విషపూరితమైన సీసాన్ని నింపుతాయి, దీనిని సురక్షితంగా తొలగించడం కొన్నిసార్లు కష్టంగా మారుతుంది" అని జోన్స్ చెప్పారు.
అందుకే చాలా దేశాలు వీటిని నిషేధించాయి లేదా వీటి వాడకాన్ని పరిమితం చేశాయి. యూకేలో, పక్షులను వేటాడే గద్దలు వంటివాటిని కాల్చడానికి పెల్లెట్ గన్లను విస్తృతంగా ఉపయోగిస్తారని, ఇవి చాలా సులభంగా లభిస్తాయని బాయిస్ చెప్పారు. కానీ, అక్కడ జనసమూహాలను నియంత్రించడానికి వీటిని ఉపయోగించిన దాఖలాలు తనకు తెలియవన్నారు.

ఫొటో సోర్స్, User generated
కశ్మీర్ చేదు అనుభవాలు.. దిల్లీలో తొలిసారి?
కశ్మీర్‌లో 2010 నుంచి పెల్లెట్ గన్లను ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడి అధికారిక గణాంకాలను హ్యూమన్ రైట్స్ వాచ్ క్రోడీకరించింది. దీని ప్రకారం ఈ తుపాకుల వల్ల కొన్ని వేలమందిగాయపడ్డారు, కనీసం 17 మంది మరణించారు, డజన్ల కొద్దీ ప్రజలు చూపు కోల్పోయారని తెలుస్తోంది.
దిల్లీలో భద్రతా దళాలు పెల్లెట్ గన్లను ఉపయోగించినట్లు నిర్ధరణ అయితే, భారత్ తన రాజధాని నగరంలో పౌరులపై వీటిని ఉపయోగించడం ఇదే మొదటిసారి అవుతుంది.
మేం మాట్లాడిన ఇద్దరు యువకులు, జులై 20న సాయంత్రం 4 గంటల తర్వాత పార్లమెంట్ సమీపంలోని కన్నాట్ ప్లేస్ వద్ద తాము గాయపడినట్టు చెప్పారు.
భద్రతా సిబ్బంది ఒకరు తన వైపు తుపాకీ గురిపెట్టడం చూసినప్పుడు, తాను వెనక్కి తిరిగి పరిగెత్తడం ప్రారంభించానని మోహిత్ (పేరు మార్చాం) చెప్పారు
"రెండు-మూడు సెకన్ల తర్వాత, నా కుడి చేయి, వీపుపై మంట పుట్టినట్లు అనిపించింది" అని 28 ఏళ్ల జర్నలిస్ట్ బీబీసీతో అన్నారు.
శరీరమంతా తీవ్రమైన నొప్పి వ్యాపిస్తున్నప్పటికీ తాను ఒక కేఫ్ చేరుకునే వరకు పరిగెడుతూనే ఉన్నానని, అక్కడ ఒక వాటర్ బాటిల్ కొని గాయాలను కడుక్కున్నానని మోహిత్ చెప్పారు.
"ఆ సమయంలోనే నా చేయి, పై వీపుపై చిన్న గుండ్రని రంధ్రాలను చూశాను. నాకు భయమేసింది" అన్నారు.
గాయాలకు చికిత్స పొందిన సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో తీసిన ఎక్స్‌రే, ఆయన చేతితోపాటు పై భాగంలో చిన్న వస్తువులు పేరుకుపోయి ఉన్నట్లు చూపుతోంది.
మోహిత్ బీబీసీతో పంచుకున్న వైద్య రికార్డుల ప్రకారం, ఆయన కుడి మోచేతిపై 26 పెల్లెట్ గాయాలు, కుడి వీపు పైభాగంలో నాలుగు గాయాలు ఉన్నాయి. ఆ వస్తువులు శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూపే ఒక రేఖాచిత్రం కూడా ఆ రికార్డులలో ఉంది.
సర్జరీ చేయడం వల్ల పరిస్థితి మరింత క్షీణించవచ్చని వైద్యులు చెప్పారని, కానీ "అవి నా శరీరంలోనే ఉండిపోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి నష్టం కలిగిస్తాయో లేదా ఈ వికారమైన మచ్చలు ఎప్పటికైనా పోతాయో లేదో" అని మోహిత్ ఆందోళన చెందుతున్నారు.
"కానీ, ముఖంపై గాయాలైన ఇతర బాధితుల ఫోటోలను చూసిన తర్వాత, నేను కనీసం తప్పించుకున్నానని భావిస్తున్నాను" అన్నారు.
శరీరంపై 40 గుళికలు
గురుగ్రామ్‌కు చెందిన ఒక సంస్థలో పనిచేసే షేక్ ఇర్షాద్ మన్సూరి అంత అదృష్టవంతుడు కాడు.
కన్నాట్ ప్లేస్ నుంచి ప్రధాన సీజేపీ నిరసన వేదిక అయిన జంతర్ మంతర్ వైపు ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, అక్కడ "పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ జనాన్ని కర్రలతో కొట్టడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రారంభించారు".
"నేను నిరసనకారుల బృందంతో కలిసి నినాదాలు చేస్తున్నప్పుడు ఒక ఆర్ఏఎఫ్ సిబ్బంది మా వైపు తుపాకీ గురిపెట్టారు. ఆయన కాలుస్తాడని మేం అనుకోలేదు, కానీ అకస్మాత్తుగా నాకు సమీపంలో ఒక పేలుడు శబ్దం వినిపించింది, పెల్లెట్లు నా ఎడమ కనుబొమ్మ, గడ్డంపై బలంగా తాకాయి" అన్నారు.
ఇర్షాద్ రక్తస్రావాన్ని బట్టలతో ఆపడానికి కొందరు నిరసనకారులు ప్రయత్నించారు. వెళ్తున్న ఒక వాహనాన్ని ఆపి లేడీ హార్డింజ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
తన శరీరంలో 40 కంటే ఎక్కువ పెల్లెట్లు ఉన్నట్లు స్కాన్లలో తేలిందని ఇర్షాద్ చెప్పారు, ఇందులో ఆయన మెడ, ఎడమ కంటి కండరం, ముక్కు కింద లోతుగా పేరుకుపోయిన మూడు పెల్లెట్లు ఉన్నాయి. వీటిని కచ్చితంగా తొలగించాల్సి ఉంటుందని వైద్యులు ఆయనకు చెప్పారు.
"మరుసటి రోజు ఉదయం సర్జన్లు ఏడు పెల్లెట్లను తొలగించారు, కానీ మెడలో ఉన్న పెల్లెట్‌ను తొలగించడం చాలా ప్రమాదకరమైనందున అలాగే వదిలేయాల్సి వచ్చింది. అది ఇప్పుడు మీ శరీరంలో ఒక భాగమని నాకు చెప్పారు. భవిష్యత్తులో దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని వారు నాకు హామీ ఇచ్చారు" అన్నారు.
10 రోజులకు పైగా గడిచినప్పటికీ, తనకు "ఇంకా కాస్త నొప్పిగా ఉంది" అని ఇర్షాద్ చెప్పారు.
ఇర్షాద్‌కు తగిలిన గాయాలు "పెల్లెట్ తరహా చిన్న కణాల" వల్లే జరిగాయని ఒక సీనియర్ ఆసుపత్రి అధికారి బీబీసీతో చెప్పారు. అయితే అవి తుపాకీ నుంచి కాల్చారా లేదా అనే విషయాన్ని చెప్పడానికి నిరాకరించారు. "ఫోరెన్సిక్ విభాగం ఆ పెల్లెట్లను పరీక్షించిన తర్వాతే ఆ విషయం చెప్పగలదు" అని తెలిపారు.

ఫొటో సోర్స్, PTI
పార్లమెంట్‌కు చేరిన పెల్లెట్ వివాదం
గత వారం పెల్లెట్ గన్ల వాడకానికి సంబంధించిన మొదటి ఆరోపణలు వచ్చినప్పుడు, ఇది "పూర్తిగా అబద్ధం, తప్పుదోవ పట్టించేది" అని దిల్లీ పోలీసులు అన్నారు. తమ వద్ద అసలు పెల్లెట్ గన్లు కూడా లేవని చెప్పారు.
ఆ తర్వాత, పారామిలటరీ బలగమైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పరిధిలోకి వచ్చే ఆర్ఏఎఫ్ ఈ కాల్పులు జరిపినట్లు మీడియా రిపోర్ట్ చేసింది. బీబీసీ దీనిపై సీఆర్ఫీఎఫ్ చీఫ్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్‌ను సంప్రదించింది, ఈమెయిల్ ద్వారా కూడా ప్రశ్నలను పంపింది. ఆయన నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు.
ఎటువంటి "బుల్లెట్లు" కాల్చలేదని, కేవలం టియర్ గ్యాస్ మాత్రమే ఉపయోగించామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్‌లో బుధవారం చెప్పారు. కానీ, పెల్లెట్ గన్ల వాడకంపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. దిల్లీ పోలీస్, సీఆర్పీఎఫ్ రెండు కూడా హోం మంత్రి అమిత్ షా పరిధిలోకి వస్తాయి కాబట్టి అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
గత శనివారం, రాహుల్ గాంధీ ఒక పత్రికా సమావేశంలో మాట్లాడారు. పెల్లెట్ గాయాల వల్ల ఒక కంటి చూపును కోల్పోయే ప్రమాదంలో ఉన్న 19 ఏళ్ల దిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సాహిల్ లోచాబ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సాహిల్ ముఖంపై , ఆయన కుడి చేయి వెనుక భాగంలో చిన్న చిన్న రంధ్రాలు పడ్డాయి. సాహిల్ టీ-షర్టును రాహుల్ పైకి ఎత్తి, ఆయన శరీరంపై ఉన్న డజన్ల కొద్దీ ఇతర గాయాలను చూపించారు.
రాహుల్ గాంధీతో జరిగిన ఒక వీడియో చాట్‌లో, మీడియా ఇంటర్వ్యూలలో సాహిల్ మాట్లాడుతూ, కీలక పరీక్షల పేపర్ లీకేజీలు పదేపదే జరుగుతున్న అంశంపై సీజేపీ నిరసనకు తాను మద్దతు ఇచ్చానని చెప్పారు. ఎందుకంటే, గత ఏడాది పోలీస్ బలగాల్లో చేరడానికి తాను రాసిన పరీక్ష కూడా ఇదే సమస్య వల్ల రద్దయిందన్నారు.
సాహిల్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి నిరసనకు వెళ్లారు, కానీ పోలీసులు లాఠీలతో జనంపై దాడి చేసినప్పుడు జరిగిన గందరగోళంలో వారి నుంచి విడిపోయారు. ఇతర నిరసనకారులతో కలిసి భద్రతా దళాల వైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఆయనపై కాల్పులు జరిగాయి.
"పెల్లెట్ గన్ ఎవరు కాల్చారో నేను చూడలేకపోయాను, కానీ అది బలగాలు ఉన్న వైపు నుంచే వచ్చింది" అని సాహిల్ చెప్పారు.
"నాకు కుడి కన్ను వాచిపోయింది, నేను నా కుడి చేతిని పైకి లేపలేకపోయాను. నాకు విపరీతంగా రక్తస్రావం అవుతుంటే కొందరు నిరసనకారులు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు" అన్నారు.
నిరసనకు వెళ్లవద్దని కుటుంబ సభ్యులు తనను వారించడానికి ప్రయత్నించారని, కానీ "నన్ను నేను ఆపుకోలేకపోయాను" అని ఆయన రాహుల్ గాంధీతో చెప్పారు.
"నాకు న్యాయం కావాలి. నాకు ఈ పరిస్థితి తెచ్చిన వారు ఎవరైనా సరే అధికారంలో ఉండటానికి అర్హులు కారు" అని సాహిల్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























