అమెరికా యుద్ధ నౌకలో ఉండలేక సైనికులు సముద్రంలోకి దూకడానికి ప్రయత్నించారా? పెంటగాన్ ఏం చెప్పింది?

    • రచయిత, ఎనా ఫెగీ, మ్యాక్స్ మాత్జా
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

సముద్రంలోనే తొమ్మిది నెలలుగా విధుల్లో ఉంటూ ఆహార కొరత, కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేల మంది నావికులతో కూడిన 'యూఎస్ఎస్ అబ్రహాం లింకన్' యుద్ధ నౌక స్థానంలో మరొక నౌకను పంపేందుకు అమెరికా సిద్ధమైంది.

యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ నౌక స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో విమానవాహక యుద్ధ నౌక, మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) వైపు బయలుదేరింది.

గురువారం నాటికి మలేసియా సమీపంలో ఉన్న 'యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్' యుద్ధ నౌక మరో తొమ్మిది రోజుల్లోగా మిడిల్ ఈస్ట్‌కు చేరుకునే అవకాశముందని బీబీసీ విశ్లేషణలో తేలింది.

అబ్రహాం లింకన్ నౌకలోని గడ్డు పరిస్థితుల కారణంగా తమ వారి మానసిక ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తోందని, కొందరు నావికులు సముద్రంలోకి దూకేందుకు కూడా ప్రయత్నించారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

దాదాపు 5,000 మంది సిబ్బంది ఉన్న ఈ నౌకలో నిత్యావసరాల సరఫరాలో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన అమెరికా నావికాదళం... మానసిక ఆరోగ్య సంక్షోభం తలెత్తిందన్న వార్తలను మాత్రం తోసిపుచ్చింది.

మరోవైపు నావికుల సంక్షేమంపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన ఉందన్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. విధులను మరీ ఎక్కువ కాలం పొడిగించారన్న వాదనను కూడా ఆయన కొట్టిపారేశారు.

"ఇది ఏమంత ఎక్కువ కాలం కాదు" అని శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు.

అయితే అబ్రహాం లింకన్ స్థానంలో మరో యుద్ధ నౌకను పంపుతున్న విషయాన్ని ట్రంప్ ధ్రువీకరించినప్పటికీ, ఆ నౌక పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు.

పసిఫిక్ ప్రాంతంలో గస్తీ నిర్వహించేందుకు జపాన్‌లోని యోకోసుకా నేవల్ బేస్ నుంచి మే నెలలో బయలుదేరిన 'యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్'... ఇప్పుడు అబ్రహాం లింకన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు బయలుదేరినట్లు ఓ యూఎస్ అధికారిని ఉటంకిస్తూ బీబీసీ భాగస్వామ్య సంస్థ 'సీబీఎస్ న్యూస్' తెలిపింది.

అబ్రహాం లింకన్ యుద్ధనౌక గురించి వార్తలు..

అమెరికా యుద్ధ నౌక 'యూఎస్ఎస్ అబ్రహాం లింకన్' లో ఉన్న వేల మంది సైనికులు తీవ్ర ఆహార కొరత, పాడైపోయిన ప్లంబింగ్ వ్యవస్థ, విపరీతమైన అలసట వంటి తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సిబ్బంది దాదాపు 250 రోజులుగా (8 నెలలుగా) సముద్రంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ వ్యవహారంపై రక్షణ మంత్రిత్వ శాఖను (పెంటగాన్) అమెరికా చట్టసభ ప్రతినిధులు వివరణ కోరారు. ఇరాన్ యుద్ధం గురించి కూడా ట్రంప్ ప్రభుత్వంపై వారు ఒత్తిడి తెస్తున్నారు.

ఈ నౌకలోని కొందరు నావికులు, నౌక పైనుంచి సముద్రంలోకి దూకేందుకు కూడా ప్రయత్నించినట్లు కొన్ని వార్తా కథనాల్లో పేర్కొన్నారు.

ఈ నౌకలో విధులు నిర్వర్తిస్తున్న సైనికుల మానసిక ఆరోగ్యం క్షీణిస్తుండటంపై వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ వార్తలన్నీ 'పూర్తిగా అవాస్తవం' అంటూ గురువారం అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కొట్టిపారేశారు.

ఈ యుద్ధ నౌక నవంబరులో కాలిఫోర్నియా నుంచి బయలుదేరి దక్షిణ చైనా సముద్రం వైపు వెళ్లింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఇరాన్‌పై దాడులు జరగడానికి ముందు దీనిని మధ్య ప్రాచ్యానికి (మిడిల్ ఈస్ట్) తరలించారు.

నిజానికి ఈ నౌకలోని సిబ్బంది విధుల కాలపరిమితి మే నెలలోనే ముగియాల్సి ఉంది. కానీ, ఈ గడువును పదేపదే పొడిగిస్తూ వచ్చారు. వీరు తిరిగి ఎప్పుడు స్వదేశానికి చేరుకుంటారనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.

అయితే, సాధారణ రొటేషన్ ప్రణాళికలో భాగంగా 'యూఎస్ఎస్ అబ్రహాం లింకన్' స్థానంలో 'యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్' యుద్ధ నౌకను పంపేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు గురువారం పలు వార్తా సంస్థలు వెల్లడించాయి.

మానసిక ఒత్తిడిలో సైనికులు

యుద్ధనౌకలో సైనికులు సమస్యలు ఎదుర్కొంటున్నారంటూ కాలిఫోర్నియా డెమోక్రటిక్ ఎంపీ మైక్ లెవిన్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

బూజు పట్టిన స్నానపు గదులు, పాడైపోయిన టాయిలెట్లు, వారాల తరబడి మూతపడిన లాండ్రీలు, చాలా రోజులుగా వేడినీళ్లు రాకపోవడం, ఆహారం పరిమితంగా లభించడం వంటి సమస్యలను ఆయన ఆ ట్వీట్‌లో ఎత్తిచూపారు.

అలాగే సబ్బులు, డియోడరెంట్లు, టూత్‌పేస్ట్ వంటి నిత్యావసరాల కొరత కూడా ఉందని పేర్కొన్నారు.

నౌకలో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన తీవ్రమైన సమస్యలేవీ వెలుగు చూడలేదని బీబీసీతో అమెరికా నౌకాదళ అధికారి ఒకరు చెప్పారు. అయితే యుద్ధ చర్యల కారణంగా సాధారణ సరుకుల రవాణా వ్యవస్థ కాస్త ప్రభావితమైందని తెలిపారు.

ప్రస్తుతం నౌకలో ఉన్నవారికి 'అత్యవసరమైన పనులకు కావాల్సిన వస్తువులను' అందించడానికే నేవీ మొదటి ప్రాధాన్యం ఇస్తోందని ఆయన చెప్పారు.

"మొదట ఆహారం, ఆ తర్వాత పరిశుభ్రతకు సంబంధించిన వస్తువులు, ఆపై ఉత్తరాల బట్వాడాకు ప్రాధాన్యం ఇస్తున్నాం" అని బుధవారం ఆ అధికారి తెలిపారు.

నౌక నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. అక్కడ స్వచ్ఛమైన తాగునీరు, ఏసీలు, పౌష్టికాహారం నిరంతరాయంగా అందుబాటులోనే ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రతి నౌకకు, అందులోని సిబ్బందికి, కెప్టెన్‌కు అవసరమైన అన్ని సదుపాయాలను ఎప్పటికప్పుడు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పనామాలో విలేకరులతో మాట్లాడుతూ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు.

''కొన్నిసార్లు విధులను సాధారణ సమయం కంటే ఎక్కువ కాలం పొడిగించాల్సి వస్తుంది. నడి సముద్రంలో ఉంటూ, అత్యంత కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఆ నావికుల సేవలను నేను ఎంతో గౌరవిస్తున్నాను. వారి పట్ల కృతజ్ఞతతో ఉంటాను'' అని హెగ్సెత్ అన్నారు.

నౌకలోని పరిస్థితులపై ట్రంప్ అధికార ప్రతినిధి ఒలివియా వెల్స్ మాట్లాడారు.

"అమెరికాకు ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టేందుకు సైన్యానికి కావాల్సిన అన్ని వనరులను అందించేందుకు హెగ్సెత్, ట్రంప్ ఇద్దరూ నిరంతరం కృషి చేస్తున్నారు" అని తెలిపారు.

నెలల తరబడి సముద్రంలోనే ఉండే సైనికులకు మానసికోల్లాసం కోసం నౌకాదళం గతంలోనూ బింగో ఆటలు, చిత్రలేఖనం, పాటల పోటీలు వంటివి నిర్వహించేది.

కాగా, 2025 జనవరిలో 956 మంది నావికులపై జరిపిన ఒక అధ్యయనంలో... అమెరికా సైన్యంలోని ఇతర విభాగాలతో పోలిస్తే, నేవీలో పనిచేసే సైనికులే "తీవ్ర మానసిక ఒత్తిడికి" గురవుతున్నారని తేలింది.

నౌకలోని సౌకర్యాలు లేని పరిస్థితుల్లో జీవనం, విపరీతమైన శబ్దం, తీరికలేని పని వల్ల సైనికులకు తగినంత నిద్ర, విశ్రాంతి సరిగ్గా దొరకడం లేదని ఈ అధ్యయనం పేర్కొంది.

మరోవైపు, అమెరికా నావికాదళం, మెరైన్ కార్ప్స్‌లో సైనికుల మరణాలకు ఆత్మహత్యలే ఒక ప్రధాన కారణంగా ఉన్నాయని 'యూఎస్ఎన్ఐ న్యూస్' నివేదిక వెల్లడించింది.

సైన్యంలో పనిచేయని సాధారణ అమెరికా పౌరులతో పోలిస్తే, మాజీ సైనికుల్లో ఆత్మహత్యల రేటు చాలా ఎక్కువగా ఉందని వెటరన్స్ అడ్మినిస్ట్రేషన్ లెక్కలు చెబుతున్నాయి.

(గమనిక: ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.

సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000)

నిత్యావసరాల కొరత, కలుషితమైన నీరు

దాదాపు 5,000 మంది సిబ్బంది ఉన్న ఈ నౌకలోని సమస్యలను ప్రస్తావిస్తూ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌కు కనెక్టికట్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంతల్ లేఖ రాశారు.

నౌకలో నిత్యావసరాల కొరత, కలుషితమైన నీరు, ప్లంబింగ్ లోపాలు, సైనికుల మానసిక ఆరోగ్యం క్షీణించడం, డెక్ భద్రత, పోస్టల్ సేవల్లో అంతరాయం వంటి సమస్యలను ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు.

కుటుంబ సభ్యులు పంపిన పలు కేర్ ప్యాకేజీలు కూడా నెలల తరబడి సైనికులకు చేరలేదని లేఖలో ఆయన పేర్కొన్నారు.

ఈ నివేదికలపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నౌకను పరిశీలించేందుకు ఎంపీల బృందాన్ని అనుమతించాలని మరో డెమోక్రటిక్ సెనేటర్ రూబెన్ గల్లెగో డిమాండ్ చేశారు.

నౌకలో నెలకొన్న 'తీవ్ర పరిస్థితులపై స్వతంత్ర పర్యవేక్షణ' అవసరమని ఆయన భావిస్తున్నారు.

''ఈ నెల మొదట్లో ఒక నావికుడు నౌక పైనుంచి కింద పడిపోయారు. వెంటనే హెలికాప్టర్ ద్వారా అతన్ని రక్షించి, నౌకలోని మెడికల్ వార్డులో ప్రథమ చికిత్స చేసి తర్వాత మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి తరలించారు. అయితే అతను ప్రమాదవశాత్తు పడ్డారా లేదా ఉద్దేశపూర్వకంగా దూకాడా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది'' అని సీబీఎస్ న్యూస్ ఓ కథనంలో పేర్కొంది.

కుటుంబ సభ్యుల ఆవేదన

సుదీర్ఘ కాలం పాటు నౌకలోనే గడపడం వల్ల సైనికుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లు మిలిటరీ టైమ్స్, స్టార్స్ అండ్ స్ట్రైప్స్ పత్రికలు పేర్కొన్నాయి.

వారాల తరబడి దుస్తులు ఉతుక్కునే వీలు లేకపోవడం, తాజా ఆహారం లభించకపోవడం, పోర్టులలో నౌక ఆగినా సైనికులను కిందకు దిగేందుకు అనుమతించకపోవడం వంటి అంశాలు వారిని మరింత కుంగదీస్తున్నాయని తమ కథనంలో రాశాయి.

నౌకలో ఉన్న ఒక నావికుడి బంధువు బీబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ... విధుల్లో చేరినప్పటి నుంచి ఆ నావికుడి బరువు బాగా తగ్గిపోయిందని చెప్పారు.

నౌకలోని కొందరు నావికులు తీవ్రమైన మానసిక వేదనను అనుభవిస్తున్న మాట నిజమేనని, ఈ విషయాన్ని నౌకలోని తమ బంధువు చెప్పారని ఆయన తెలిపారు.

తాను తీవ్రంగా అలసిపోయానని, బాగా అలసటగా ఉందని ఇటీవల వాట్సాప్‌ ద్వారా ఆయన తమకు తెలియజేశారని సదరు బంధువు చెప్పారు.

"ఆయనకు మిషన్ లక్ష్యం తెలుసు, అక్కడి పరిస్థితులు సాధారణంగా ఉండవని కూడా తెలుసు. ఇది విహారయాత్ర కాదనే సంగతి ఆయనకు తెలుసు. కానీ నేల మీద అడుగుపెట్టకుండా నెలల తరబడి సముద్రంలోనే గడపడం చాలా కష్టం. కనీసం విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి... నిద్రపోయేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు కూడా నౌక నిరంతరం కంపిస్తూనే ఉంటుంది. దీనివల్ల మెదడుకు అసలు విశ్రాంతే దొరకదు" అని ఆ బంధువు ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే , "ప్రతి నౌకకు, నౌకలోని ప్రతి ఒక్కరికీ, ప్రతి కెప్టెన్‌కు ప్రతి క్షణం అందించగలిగిన ప్రతిదీ అందేలా అమెరికా ప్రభుత్వం చూసుకుంటోంది" అని హెగ్సెత్ గురువారం మీడియాకు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)