ఇరాన్ దాడి అనుమానాలతో ఫుడ్ ట్రక్కులో ఎక్కి రహస్యంగా విమానం మారిన డోనల్డ్ ట్రంప్-అమెరికా మీడియాలో వార్తలు

    • రచయిత, Jessica Rawnsley జెస్సీకా రాన్‌స్లే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఇరాన్ నుంచి దాడి జరగవచ్చనే అనుమానంతో డోనల్డ్ ట్రంప్ రహస్యంగా తన విమానం నుంచి ఫుడ్ ట్రక్కుల్లోకి మారి, వాటిలో ప్రయాణించి తర్వాత మరో విమానం ఎక్కారని అమెరికా మీడియా రిపోర్ట్ చేసింది.

ఈ ఘటన గత నెలలో తుర్కియేలో జరిగిన నేటో శిఖరాగ్ర సమావేశం ముగిసి, ఆయన తిరిగొచ్చే క్రమంలో జరిగిందని అమెరికన్ మీడియా వెల్లడించింది.

ఈ విషయం విమానంలోనే ఉన్న విలేఖరులకుగానీ, వైట్‌హౌస్ సిబ్బందికిగానీ తెలియదని కూడా ఈ మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి.

ట్రంప్ ప్రయాణించబోయే విమానం మీద ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని సీక్రెట్ సర్వీస్‌కు నిర్దిష్టమైన సమాచారం అందిందని అమెరికాలో బీబీసీ భాగస్వామి సీబీఎస్‌ న్యూస్‌కు కొందరు అమెరికా అధికారులు చెప్పారు.

అయితే, అధ్యక్షుడు ట్రంప్ ఒక విమానం నుంచి మరొక విమానానికి రహస్యంగా మారడాన్ని వైట్‌హౌస్ ధృవీకరించలేదు.

అధ్యక్షుడు విమానం మారినట్లు అందులో ఎక్కిన విలేఖరులకుగానీ, ఆఖరికి వైట్‌‌హౌస్ సిబ్బందికి‌గానీ తెలియనివ్వలేదనీ, టెలివిజన్ కెమెరాల కళ్లెదుటే అధ్యక్షుడు ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కారని, ఆ తర్వాత భద్రతా సిబ్బంది ఆయన్ను విమానం పక్కనే ఉన్న ఒక ఎత్తైన ఎయిర్‌పోర్ట్ క్యాటరింగ్ ట్రక్కులోకి రహస్యంగా ఎక్కించి, అక్కడి నుంచి ఒక సైనిక విమానంలోకి తరలించారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.

అంకారాలో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి ముందు కూడా ‘ఇరాన్‌కు తాను మొదటి టార్గెట్’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

యుద్ధాన్ని ముగించేందుకు వాషింగ్టన్, తెహ్రాన్‌ల మధ్య చర్చలు విఫలమై, ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులను పునరుద్ధరించిన ఒకరోజు తర్వాత ఈ రహస్య ఘటన జరిగింది.

Skip ఎక్కువమంది చదివినవి and continue reading
ఎక్కువమంది చదివినవి

End of ఎక్కువమంది చదివినవి

నేటో సదస్సుకు హాజరయ్యేందుకు ఖతార్ బహుకరించిన కొత్త బోయింగ్ 747-8 విమానంలో తుర్కియే చేరుకున్నారు ట్రంప్. కానీ, తిరిగి వెళ్లేటప్పుడు తాను పాత ఎయిర్‌ఫోర్స్ విమానంలోనే వెళ్తానని ప్రకటించారు.

జూలై 8వ తేదీన అంకారా ఎయిర్‌పోర్టులో ట్రంప్ అధ్యక్ష విమానం ఎక్కుతున్న దృశ్యాలు ప్రసారమయ్యాయి. కానీ, ఆయన ఎక్కే విమానం పక్కనే, విమానం ఎత్తులో నిలబెట్టిన ఒక క్యాటరింగ్ ట్రక్కు ఉందని, అధికారులు ఆయన్ను ఆ ట్రక్కులోకి తరలించారని వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది.

ఆ ట్రక్కును మార్పులు చేసిన బోయింగ్ 757 విమానం C-32A అనే మిలిటరీ ప్లేన్ దగ్గరకు చేర్చారు. ఈ విమానాన్ని తరచుగా ఉపాధ్యక్షుడు ఉపయోగిస్తుంటారు. అక్కడికి చేర్చిన తర్వాత అధ్యక్షుడిని ట్రక్కు నుంచి ఆ విమానంలోకి సీక్రెట్‌గా చేర్చారని వాషింగ్టన్ పోస్ట్ చెప్పింది.

ఆ పత్రిక కథనం ప్రకారం, ఈ విమానం గురించి ఎలాంటి అనుమానాలు రాకుండా, అంతా మామూలుగానే ఉందన్నట్లు కనిపించేలా.. అంతకు ముందే రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అందులోకి ఎక్కారు.

ఇక ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కిన జర్నలిస్టులు, కొంతమంది వైట్‌హౌస్ సిబ్బందికి అధ్యక్షుడు విమానం మారిన విషయం తెలియదు. అంతకు ముందు వారికి కిటికీ తెరలను మూసేయాలంటూ అధికారుల నుంచి సూచనలు అందినట్లు సమాచారం.

తుర్కియే నుంచి అమెరికా ప్రయాణంలో భాగంగా ట్రంప్ బ్రిటన్ వెళ్లారు. ఆర్ఏఎఫ్ మిల్డ్‌హాల్ ఎయిర్ పోర్ట్ దగ్గర మళ్లీ తన పాత ఎయిర్ ఫోర్స్ వన్‌ విమానం దిగుతూ కనిపించారు ట్రంప్. ఆయన మిలిటరీ విమానం (C-32A) నుంచి అందులోకి ఎలా మారారనే విషయంపై స్పష్టత లేదు.

అక్కడ మళ్లీ ఖతార్ విరాళంగా ఇచ్చిన కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కి వాషింగ్టన్‌కు వచ్చారు ట్రంప్.

ఆ విమానంలో ట్రంప్ విలేఖరులతో మాట్లాడారు. ఇరాన్ వల్ల ఎదురయ్యే ముప్పులను ప్రస్తావించారుగానీ, అంతకు ముందు జరిగిన తన విమాన మార్పిడి గురించి మాత్రం ప్రస్తావించలేదు.

తుర్కియే నుంచి వస్తున్న విమానంలో కిటికీ తెరలను మూసేయాలని విలేఖరులకు ఎందుకు సూచించారని అడగ్గా, ‘‘ మనం ఎదుర్కోంటున్న ఆ దుర్మార్గుల నుంచి మీ విమానానికి ప్రమాదం పొంచి ఉండటం వల్ల కావచ్చు’’ అని ట్రంప్ అన్నారు.

ఇరాన్ వల్ల తన ప్రాణానికి నిత్యం ప్రమాదం ఉందని, ఇరాన్ టార్గెట్ చేసిన వారి జాబితాలో తాను మొదటి స్థానంలో ఉన్నానని ఆయన అన్నారు.

అయితే, ఈ ట్రంప్ విమానం మారడం గురించి వచ్చిన వార్తలను వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్ ధృవీకరించలేదు, అలాగని ఖండించనూ లేదు.

సీబీఎస్ న్యూస్‌ గతంలో ప్రచురించిన దానిప్రకారం, ట్రంప్ లేదా ఆయన విమానంపై దాడి జరిగే స్పష్టమైన ఒక ముప్పు ఉందని యూఎస్ ఇంటెలిజెన్స్ గతంలోనే హెచ్చరించింది.

ఖతార్ బహుమతిగా ఇచ్చిన విమానానికి సంబంధించిన భద్రతాపరమైన ఆందోళనలపై న్యూయార్క్ టైమ్స్ గతంలో రిపోర్ట్ చేసింది. నేటో సదస్సు నుంచి తిరిగి వచ్చేటప్పుడు విమానం మారాల్సిందిగా సీక్రెట్ సర్వీస్ ట్రంప్‌ను కోరినట్లు కూడా అందులో పేర్కొంది.

అయితే, ఈ రహస్యాలను ప్రచురించినందుకు న్యూయార్క్ టైమ్స్ పత్రికకు చెందిన పలువురు జర్నలిస్టులను పిలిపించి ఈ సమాచారం మీకు ఎక్కడిదో చెప్పాల్సిందిగా ప్రభుత్వం కోరింది. ఈ రహస్య సమాచారం లీక్‌పై విచారణ జరుపుతున్నామని కూడా ప్రభుత్వం పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)