You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కల్యాణదుర్గం: 83 మంది కుటుంబం, రోజుకు 50 కేజీల బియ్యంతో అన్నం.. మిక్సీ, గ్రైండర్, గ్యాస్ స్టవ్ ఏమీ వాడరు.. కట్టెల పొయ్యిపై ఒకే పాత్రలో వంట, రోటి పచ్చళ్లు.. కలసిమెలసి జీవనం
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఆరు తరాల ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం ఉంది. ఈ ఇంట్లో ఒక రోజు వంటకు 50 కిలోల బియ్యం బస్తా అవసరమవుతుంది. ఆదివారం నాన్‌వెజ్ తినాలంటే ఒక పొట్టేలు కోయాల్సిందే. ఎప్పుడైనా సాయంత్రం బజ్జీలు తిందామనుకుంటే 15 కిలోల పిండి సిద్ధం చేయాల్సిందే. ఎందుకంటే ఆ కుటుంబంలో పదీఇరవై మంది కాదు, ఏకంగా 83 మంది ఉంటారు.
ఈ ఉమ్మడి కుటుంబంతో ఒక రోజంతా గడపడానికి 'బీబీసీ' బృందం కుర్లపల్లి చేరుకుంది. అక్కడ అంతమంది సభ్యులు ఉమ్మడిగా కలిసి ఎలా ఉంటున్నారు, ఏం పనులు చేస్తారో తెలుసుకుంది.
కల్యాణదుర్గం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో కుర్లపల్లి ఉంటుంది.
ఈ గ్రామంలో 400 ఇళ్లు, 2,000 మంది జనాభా ఉంటారు. గ్రామంలోకి వెళ్లిన వెంటనే కుడివైపు తిరగ్గానే రోడ్డుకు అటూఇటూ ఎదురెదురుగా ఉన్న రెండు పెద్ద ఇళ్లు కనిపిస్తాయి. ఈ రెండు ఇళ్లలో నివసించేది ఒకే ఉమ్మడి కుటుంబం.
రోడ్డుకు ఒక వైపు ఉండే రెండంతస్తుల ఇంట్లోకి ప్రవేశించగానే ముందుగా వంట గది ఎదురవుతుంది. దాని వెనుక రెండంతస్తుల బండ్ల మిద్దె ఉంటుంది. ఆ ఇంటికి ఎదురుగా మరో మూడంతస్తుల ఇళ్లు, అదే రోడ్డులో చివరకు వెళితే అక్కడ మరో ఇల్లు పెద్ద ఖాళీ స్థలం ఉంటుంది. అక్కడ ట్రాక్టర్లు బస్సులు ఆగి ఉంటాయి. ఇప్పుడు ఈ మూడు ఇళ్లు సరిపోక నాలుగో ఇల్లు కూడా నిర్మించుకుంటోంది ఈ కుటుంబం.
ఇంత పెద్ద కుటుంబం ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడుతోంది. ఇంట్లో అందరూ కలిసి పంటల సాగు చేయడంతోపాటూ పాడి పశువులు, గొర్రెల పెంపకం లాంటివి చేస్తున్నారు.
ఇద్దరు పెద్దలదే నిర్ణయం
83 మంది సభ్యులు ఉండే ఈ ఉమ్మడి కుటుంబ పెద్దలు హనుమంత రాయుడు, ముత్యాలప్పలు.
పాలు పితికే పని నుంచి వ్యవసాయం, వ్యాపారం వరకు అన్నీ నిర్ణయించేది వారే.
ఇంత పెద్ద కుటుంబంలో ప్రతి మనిషికీ ఏదో ఒక జీవనాధారం చూపించే బాధ్యత తనపై ఉంటుందని కుటుంబ పెద్ద హనుమంత రాయుడు తెలిపారు. తన బావమరిది ముత్యాలప్ప సహా ఇంట్లో ఎవరూ ఎదురు మాట్లాడకుండా తనకు గౌరవం ఇస్తున్నారని చెప్పారు.
''మా నాయన, మా తాత చనిపోయినప్పటి నుంచి కుటుంబ భారం నాపైన పడింది. అప్పటినుంచి ఇంత కుటుంబాన్ని నేనే చూస్తున్నాను. పిల్లలను చదివిస్తూ, మిగతా వాళ్ళకి వ్యవసాయ పనులు అప్పగిస్తున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆధారం చూపిస్తూ జీవిస్తున్నాం. ఇంతవరకు మాకు ఎటువంటి కలతలు, భేదాభిప్రాయాలు లేవు. అందరం కలిసి మెలిసి కష్టపడి చేసుకుంటూ వచ్చాం. నేను ఏం చెబితే అది చేస్తారు. నా బావమరిది కూడా నా మాట వింటుంటారు. నా కొడుకులు, నా బావమరిది కొడుకులు ఇంత మంది ఉన్నా ఎవరు ఏమీ మాట్లాడరు'' అన్నారు.
అందరిదీ ఒకే మాట, ఒకే బాట
తమ తాతల కాలం నుంచీ ఇలా ఉమ్మడిగా కలిసి ఉన్నామని, ఇక ముందూ ఇలాగే కొనసాగాలని ప్రయత్నిస్తున్నామని ముత్యాలప్ప చెప్పారు.
''మా బావలు నలుగురు, మేం ఇద్దరం అన్నదమ్ములం. మా తాతల కాలం నుంచి ఇలాగే ఉమ్మడిగా కలిసి ఉన్నాం. ముందుముందు కూడా ఇలాగే కొనసాగాలని ప్రయత్నం చేస్తున్నాం. మేమందరం కలిసి ఉదయాన్నే ఎవరి పనులు వాళ్లకు అప్పగించి చేయిస్తాం. ఇంట్లో వాళ్లకు తిండి, మంచిచెడ్డ, బట్టలు.. అంతా చూసుకుంటాం. బయటి వాళ్లను కూడా కొంతమందిని పనికి తెచ్చాం. మా ఇంట్లో మా బావమరిది పిల్లలను మేం చేసుకుంటాం, మా ఇంట్లో వాళ్లను వాళ్లకి ఇస్తాం.. ఇలా జరుగుతుంది'' అన్నారాయన.
ఒకప్పుడు పేదరికం అనుభవించిన తాము ఇలా ఉమ్మడిగా ఉండటం వల్లే ఇప్పుడు ఇంత బాగా బతకగలుగుతున్నామని ముత్యాలప్ప అన్నారు.
''మొదట చాలా పేదరికం అనుభవించాం. కప్పుకోవడానికి దుప్పటి ఉండేది కాదు, ఒక పూటే తినేవాళ్లం. ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగాం. అందరం కలిసి ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. అదే వేరుగా ఉంటే ఈ స్థాయికి ఎప్పటికీ వచ్చేవాళ్లం కాదు. ఇప్పుడు మేం ఉన్న ఈ ఇల్లు కట్టడానికి రూ.కోటి 20 లక్షలు అయింది. ఒక్కరే ఉంటే కట్టడం సాధ్యమయ్యేదా? మా నాన్నకు 60 ఎకరాలు ఉండేది, ఆయన చనిపోయిన తర్వాత మేమంతా కలిసి 75 ఎకరాలు కొన్నాం. అందుకే 'విడిపోకండి, ఇలా కలిసి ఉంటే అంతా మేలే జరుగుతుంది' అని అందరికీ చెబుతాం'' అన్నారు.
ఉదయం టీ తాగుతున్నప్పుడే కుటుంబంలో ఎవరు ఏ పని చేయాలో కుటుంబ పెద్దలు ఇద్దరూ నిర్ణయిస్తారని కుటుంబం నిర్వహణ బాధ్యతలు చూసుకునే మహేశ్ చెప్పారు.
''మా నాన్న హనుమంతరాయుడు. పెద్ద వాళ్ళు అందరూ పొద్దున టీ తాగుతూ ఒక అరగంట కలిసి మాట్లాడుకుంటాం, ఎవరెవరికి ఏం పని అప్పగించాలనేది నిర్ణయిస్తాం. నాది వాహనాల నిర్వహణ, ఇంట్లోకి ఏం సరకులు కావాలన్నా తీసుకురావాలి. మా ఇంకో అన్న మినీ ట్రక్కులో టమోటా లాంటివి మేం పండించిన పంటలను మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయించడం లాంటివి చూసుకుంటారు. అలా వ్యవసాయం, గొర్రెలు కాయడం, ఆవులు చూసుకోవడం లాంటివి ఎవరి పనులు వారు చేసుకుంటుంటాం. ఇప్పటివరకు ఎలాంటి సమస్యా లేకుండా జీవిస్తున్నాం'' అన్నారు.
కుటుంబ పెద్ద హనుమంతరాయుడు తాత చిమ్మల నాగప్ప ఈ ఇంటికి మెదటి తరం పెద్ద. ఆయనకు ఇద్దరు భార్యలు మెదటి భార్య కూతురిని ఎల్లప్పకి ఇచ్చి వివాహం చేశారు.
అప్పటినుంచీ ఆయన ఇల్లరికం అల్లుడుగా వచ్చారు.
తర్వాత రెండవ భార్యకు ఇద్దరు కుమారులు, మరో ఇద్దరు కూతుర్లు. ఎల్లప్పకు నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుల్లు కలిసి బతికారు.
ఎల్లప్ప, నాగప్ప చనిపోయిన తర్వాత వారి వారసులు ఇప్పుడు హనుమంత రాయుడు, ముత్యాలప్పలు ఇంట్లో పెద్దలుగా ఉంటూ నిర్ణయం తీసుకుంటారు.
ముత్యాలప్ప పోస్టుమన్‌గా పనిచేయడం మినహా ఇంకెవరికీ ఉద్యోగం లేదు.
ఉదయం రోజువారీ కార్యకలాపాలు ముగియగానే, కుటుంబంలో కొందరు పొలాల దగ్గరకు బయల్దేరుతారు. మరికొందరు పశువుల దగ్గరకు వెళ్తారు. ఇంకొందరు పాలు పితికే పనులు, మిగతా వారు గొర్రెలు మేపుకొని రావడం, పేడ ఎత్తడం, పశువుల కొట్టం శుభ్రం చేయడం లాంటివి చేస్తుంటారు. ఇంట్లో ఆడవాళ్లకు వంటలు చేసే పని అప్పగిస్తారు. ఇక పిల్లలందరూ ఉదయం బయల్దేరి స్కూలుకు వెళ్తుంటారు.
ఎవరికీ ఎలాంటి విభేదాలూ రాకుండా ఇంట్లో పెళ్లిళ్లు కూడా ఒకేసారి కలిసి చేస్తున్నామని హనుమంత రాయుడు చెప్పారు.
''నా కొడుకులకి, నా బావమరిది కొడుకులకి ఒకేసారి ఒకే రోజు ధర్మస్థలలో 9 పెళ్లళ్లు చేశాను. నా కొడుకు మహేశ్‌కు అక్కడ పెళ్లి చేస్తానని మొక్కుకున్నా. నా కొడుక్కి ఒక్కడికే చేస్తే మిగతా అందరినీ వదిలి తన కొడుక్కి మాత్రమే చేసుకున్నాడు అని విభేదాలు వస్తాయని, ఇంట్లో యువకులు మొత్తం 9 మందికి ఒకటే ముహూర్తంలో ధర్మస్థల తీసుకుపోయి ఒకే సమయానికి పెళ్లిళ్లు చేశాం'' అని హనుమంతరాయుడు చెప్పారు.
రాగి సంగటితో రోజు ప్రారంభం
83 మందికి చేసే వంటలన్నీ ఒకే వంటింటిలో జరుగుతాయి. అది కూడా కట్టెల పొయ్యిపైనే చేయడం ఈ ఉమ్మడి కుటుంబం ప్రత్యేకత. ఆరు తరాల నుంచీ ఈ ఇంట్లో పాతకాలం పద్ధతులనే ఉపయోగిస్తున్నారు.
తమ కుటుంబంలో ఒకే వంట, ఒకే పంట ఉంటుదంటారు మహేశ్. ఒకే చోట మూడు ఇళ్లు ఉన్నా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పడుకుంటామని చెప్పారు. కానీ, వంట మాత్రం 83 మందికి ఒకే కుండలోనే చేస్తారని అన్నారు.
'' 83 మందికి ఒకటే కుండ. ఇప్పటికీ కట్టెల పొయ్యి వాడుతున్నాం. కారం, పచ్చడి ఏది చేసుకోవాలన్నా రుబ్బే రోలుతోనే చేసుకుంటాం. అంతా సహజంగానే చేసుకుంటాం. మేం ఇప్పటివరకూ గ్యాస్, గ్రైండర్లు లాంటివి ఏవీ వాడలేదు. పాతకాలం ఎలాంటి పద్ధతులు ఉండేవో ఇప్పటికీ అవే కొనసాగిస్తున్నాం. మేం ఆరు తరాల నుంచి కలిసి వస్తున్నాం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బందీ అనిపించడం లేదు. అందరికీ ఒకటే భోజనం అలాగే కొనసాగుతుంది. ఇప్పటికీ ఏం చేసినా అందరికీ ఒకటే చేసుకొని తింటాం'' అని మహేశ్ అన్నారు.
ఈ ఇంట్లో ఉదయం అల్పాహారంగా రాగి సంగటి ముద్దలు తయారీతో మొదలవుతుంది. పొలం పనులకు వెళ్లేవారు ఆ ముద్దలనే టిఫిన్ బాక్సుల్లో పెట్టుకుని వెళ్లిపోతారు. ముద్దలోకి పచ్చడి తయారు చేయడానికి బండపై పెద్ద గుండుతో ఇద్దరు మహిళలు కలిసి పచ్చడి రుబ్బుతారని ఇంటి పెద్ద అనూరాధ చెప్పారు.
''అందరికీ ఒకటే వంట చేస్తాం. ఒకే కూర, అన్నం, ఒకే ముద్దలు చేస్తాం. ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉంటారు వాళ్లకి చపాతి, కొర్ర అన్నం, ముద్ద, రొట్టెలు ఇట్లాటివి చేసుకొని తింటాం. వారానికి ఒకసారి అందరికీ బజ్జీలు, వడలు, స్వీట్లు చేయాలంటే అందరికీ చేస్తాం. కొద్దికొద్దిగా చేయం. మాకు ఇంటిల్లపాదికీ రోజుకు 50 కేజీల బియ్యం అవుతుంది. మళ్లీ తోటలోకి వచ్చిన కూలీలకు కూడా పెడతాం. పచ్చళ్లన్నీ గుండుతోనే రుబ్బేస్తారు. ఇంత మందికి చేయడానికి ఇద్దరు ఆడవాళ్లు రుబ్బుతారు. వంట అంతా ఒకే దగ్గర చేస్తాం. వేరువేరుగా చేసేది లేదు'' అని అనురాధ చెప్పారు.
ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబంలో వంటల వ్యవహారాలన్నీ రాజేశ్వరి చూస్తుంటారు. మరో ఇద్దరితో కలిసి పొలం పనులకు వెళ్లే వారికి క్యారేజీలు పంపించడంతో పాటూ మూడు పూటల వంటలు, అందరి పిల్లల బాధ్యత అంతా ఆమే చూసుకుంటున్నారు.
"ఒక రోజుకు ఒక నూనె ప్యాకెట్ అయిపోతుంది మాకు. ఇంట్లో వాళ్లకి 80 మందితో పాటు వేరే వాళ్లు ఒక 20, 30 మంది ఉంటారు. మాతో పాటు వాళ్లకు చేయాలి. మూడు కేజీలు పప్పు వేయాలి, శనిగి విత్తనాలు రెండు మూడు శేర్లు వేసి పచ్చడి చేయాలి. ఆ పచ్చడిని ఇలా గుండుతో రుబ్బుతాం. వంట కట్టెల పొయ్యి మీద చేస్తాం. ఉదయం ముద్ద, మధ్యాహ్నం అన్నం చేస్తాం. ఏమైనా టిఫిన్లు చేసుకోవాలి అంటే రాత్రి పూట చేసుకుంటాం. చపాతి, బజ్జీలు చేసుకోవాలి అంటే 15 కేజీలు పిండి పడుతుంది '' అని రాజేశ్వరి చెప్పారు.
'ఆదివారం ఒక పొట్టేలు, 10 కేజీల చికెన్'
''ప్రధానంగా అయితే ఉదయం రాగి ముద్ద కచ్చితంగా చేసుకుంటాం. మధ్యాహ్నం అన్నం, ఒకకూర చేసుకుంటాం. ఏవైనా స్పెషల్ కావాలంటే రాత్రి పూట చేసుకుంటాం. ఉదయం ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోతాం. రాత్రి అందరూ ఒక చోటుకు చేరుతాం కాబట్టి స్పెషల్ ఏం చేసుకున్నా, నాన్ వెజ్ చేసుకున్నా లేక టిఫిన్స్ చేసుకున్నా రాత్రి పూటే చేసుకుంటాం. ఏం తిన్నా అందరికీ ఒకటే వండుకుని తింటాం'' అని మహేశ్ అన్నారు.
ఇక పండుగలు, జాతరలు లాంటివి వచ్చాయంటే రెండు పొట్టేళ్లు, 20 కేజీల చికెన్ తీసుకురావాల్సిందేనని రాజేశ్వరి చెప్పారు.
''పండగ వచ్చిందంటే రెండు పొట్టేళ్లు 20 కేజీల చికెన్ వండాలి. ఒక ఆదివారం చేసుకోవాలంటే ఒక పొట్టేలు 10 కేజీల చికెన్ వండుతాం. ఇంకా కొంతమంది హాస్టల్లో ఉన్నారు కాబట్టి ఇది తక్కువే. చేసిన వాటిని దగ్గర్లో ఉన్న పిల్లలకు పంపిస్తాం. దూరం ఉండే వాళ్ళకి పంపించలేం'' అన్నారు.
ప్రభుత్వ బడుల్లో పిల్లల చదువులు..
ఈ ఉమ్మడి కటుంబంలో అందరూ ఇంట్లో కన్నడ మాట్లాడుకుంటారు. ఇంత పెద్ద కుటుంబంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసే వాళ్లు ఎవరూ లేరు.
వీరికి ఉమ్మడి ఆస్తిగా నాలుగు ట్రావెల్స్ బస్సులు కూడా ఉన్నాయి. కల్యాణ దుర్గం నుంచి కర్ణాటకకు తిరుగుతుంటాయి. తాము ఇంటర్, డిగ్రీలు చేసినా పెద్ద వాళ్లకు ఇంత పెద్ద కుటుంబం చూసుకోవడం ఇబ్బంది కాబట్టి చదువులు ఆపేసి ఇంటి పనులు చూసుకుంటున్నామని మహేశ్ చెప్పారు.
''మా కుటుంబంలో ఉద్యోగాలు చేసేవారు ఇప్పటివరకూ ఎవరూ లేరు. మేం పైచదువులకు పోలేదు. ఇంటర్మీడియట్, డిగ్రీలు వరకు చదివి చదువు చాలించేశాం. ఉన్న వ్యవసాయం చేసుకొని జీవిస్తాం అని చెప్పి మేమంతా చదువు మానేసుకొని వ్యవసాయం, ఇంట్లో పనులు చూసుకుంటున్నాం. మా పెద్ద వాళ్లకు కూడా వయసు అయిపోతుంది కాబట్టి, వాళ్లకు చూసుకోవడం ఇబ్బంది అవుతోంది కాబట్టి మా చదవులు వదిలేసి ఇక్కడ చూసుకుంటున్నాం'' అన్నారాయన.
తమ కుటుంబంలో ఉన్న పిల్లలందర్నీ చదివిస్తున్నామని, వారిలో ఎవరినీ ఎక్కువ తక్కువగా చూడకుండా అందరినీ ప్రభుత్వ కాలేజీలు, పాఠశాలల్లోనే చదివిస్తున్నామని ఆయన చెప్పారు.
''మా పిల్లలని బాగా చదివిస్తున్నాం. మేం చూసుకోవడానికి ఉన్నాం కాబట్టి పిల్లలు ముందుకు పోవాలని అనుకుంటున్నాం. 32 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వారిలో ఆరుగురు ఇంటర్మీడియట్. డిగ్రీ చేసే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కూడా అందర్నీ ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్లలోనే చదివిస్తున్నాం. అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు అలా కాకుండా అందరినీ ఒకే రకంగా చూసుకుంటూ వస్తున్నాం. అంగన్వాడికి వెళ్లే చిన్న పిల్లలు ఎనిమిది మంది ఉన్నారు. మిగిలిన వాళ్లంతా ఒకటో క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదువుతున్నారు'' అని మహేశ్ అన్నారు.
'మాకు కావల్సినవి మేమే పండించుకుంటాం'
ఈ కుటుంబానికి కావల్సిన ధాన్యం, కూరగాయలు వీరే పండించుకుంటున్నారు. తమకు అవసరమైన వరకూ ఉంచుకుని మిగతావి మార్కెట్‌కు పంపిస్తుంటామని మహేశ్ చెప్పారు.
''మాకు మొత్తం 120 ఎకరాలు పొలం ఉంది. మేం ప్రధానంగా మిర్చి, వంకాయ, టమోటా, కర్బూజా, బొప్పాయి, వేరు శనగ పండిస్తాం. వాటిని మార్కెటింగ్ కూడా మేమే చేస్తుంటాం. కర్బూజా, బొప్పాయి దిల్లీకి, టమోటా కోలార్‌కు, వంకాయి చెన్నైకి పంపిస్తాం. మేం దళారుల చేతికి ఇవ్వం. మా వాహనాల్లో మేమే లోడ్ చేసి నేరుగా మార్కెట్లకు తీసుకెళ్లి అమ్ముతుంటాం. వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నాం. మేం ఇంటి కోసం 5 ఎకరాల్లో వరి పండిస్తాం. అందులో వచ్చే ధాన్యాన్ని మిల్లులో ఆడించుకుని అవసరమైనంత ఇంట్లో నిల్వ చేసుకుంటాం. మిగతాది మార్కెట్‌కు పంపిస్తాం'' అని మహేశ్ చెప్పారు.
'అత్తాకోడళ్ల గొడవలు లేవు'
ఈ ఉమ్మడి కుటుంబంలో ఆరుగురు అత్తలు, 14 మంది కోడళ్లు కూడా ఉంటారు. కానీ, తమ ఇంట్లో ఆడవాళ్లు ఎప్పుడూ గొడవపడింది చూడలేదంటున్నారు మహేశ్.
''మేం ఆరు మంది అత్తలం, 14 మంది కోడళ్ళు అందరం బాగా ఒద్దికగా చేసుకొని పోతున్నాం. ఎవరి పనులు వాళ్ళు తోట పని చేసే వాళ్ళు తోట పని, ఇంట్లో చేసేవాళ్లు ఇంట్లో చేసుకుంటూ పోతున్నారు. ఎవరు ఏం సమస్యలు పుట్టించుకోరు. ఒకవేళ ఏమైనా వచ్చినా, అప్పటికప్పుడే మేమే సర్దుకొని పోతుంటాం. ఎవరు అతిగా మాట్లాడేది కానీ ఇంకొకటి గాని ఏమీ చేయరు. కోపతాపాలు ఏమైనా ఉన్నా ఒకరికొకరు వాదులాడుకున్నా, మళ్లీ మామూలుగానే కలిసిపోతుంటారు. ఎప్పుడూ ఎడమొహం పెడమొహంగా ఉండరు. వాళ్ళు బాగా సంతోషంగానే నవ్వుకుంటూ వాళ్ళ పనులు చేసుకుంటారు'' అని కుటుంబ మహిళల్లో పెద్దవారు అయిన అనూరాధ చెప్పారు.
మేం కొంతసేపు గొడవపడినా సాయంత్రానికి కలిసిపోయి సరదాగా గడుతాపమని రాజేశ్వరి చెప్పారు. ఈ ఇంటి నుంచి వేరే ఊళ్లకు కోడలుగా వెళ్లిన వాళ్లు, తమ కుటుంబం గురించి అత్తింట గొప్పగా చెప్పుకుంటుంటే గర్వంగా అనిపిస్తుందని ఆమె చెబుతున్నారు.
''ఈ ఇంట్లో నాది అయిదోతరం. నేను ఈ ఇంటికి పెద్దమనవరాలిని నన్ను చిన్నప్పటి నుంచి మా తాతగారు ఇక్కడే చదివించారు. మేనమామ కొడుక్కే ఇచ్చారు. వాళ్ళు అక్కడ ఉమ్మడి కుటుంబంలో ఉన్నందుకు మా అత్త మామ కూడా చాలా సంతోషిస్తారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న పిల్లని మేం చేసుకున్నాం అని మా ఊర్లో కూడా అందరూ గౌరవిస్తారు. ఈ కాలంలో ఒకరు ఇద్దరు అన్నదమ్ములు ఉంటేనే, ఆస్తుల కోసం బయటికి వెళ్లిపోతున్నారు. కానీ ఇప్పటికీ 83 మంది ఎలా కలిసి ఉన్నారు అని మా ఊళ్లో గొప్పగా చెప్పుకుంటారు'' అని రాజేశ్వరి అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)