You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మొదటిసారి, ఎర్రకోటలో 'జనగణమన' కంటే ముందు 'వందేమాతరం' ఆలాపన.. దీనిపై వస్తున్న అభ్యంతరాలేంటి?
భారత దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటోంది. దిల్లీ ఎర్రకోటలో జరిగిన అధికారిక వేడుకల్లో, 80 ఏళ్ల సంప్రదాయంలో తొలిసారి ఓ మార్పు చోటు చేసుకుంది.
ఈసారి స్వాతంత్య్ర వేడుకల్లో నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జాతీయ గీతం 'జనగణమన'కు ముందు జాతీయ గేయం 'వందేమాతరం' ఆలపించారు.
జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ "స్వాతంత్య్రం తర్వాత ఎర్రకోటలో 'వందేమాతరం' గేయం ఆలపించడం ఇదే మొదటిసారి" అని అన్నారు.
'వందేమాతరం' పూర్తి వెర్షన్‌కు ఇటీవల జాతీయ గీతానికి ఉండే చట్టపరమైన రక్షణ కల్పించారు.
80వ స్వాతంత్య్ర దినోత్సవానికి ముందురోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ప్రారంభం, ఆఖర్లో కూడా 'వందేమాతరం' ఆలపించారు.
ఇది ముఖ్యమైన అంశం. ఎందుకంటే, జాతీయ గీతానికి రాజ్యాంగ హోదా ఉంది. అధికారిక నియమావళి ప్రకారం, జాతీయ గీతాన్ని గణతంత్ర రాజ్యానికి అత్యున్నత సంగీత చిహ్నంగా పరిగణిస్తారు.
బీజేపీ సంఘ్ పరివార్ అనుబంధ సంస్థలు చాలా కాలంగా హిందూ మతపరమైన ప్రస్తావనలు ఉన్న "వందేమాతరం"ను సమర్థిస్తున్నాయి.
'జనగణమన'తో 'వందేమాతరం'కు సమాన హోదా కల్పిస్తూ ఇటీవల నరేంద్ర మోదీ ప్రభుత్వం చట్టాన్ని సవరించింది.
గతంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో జాతీయ గీతాన్ని ఆలపించేవారు. జాతీయ గేయం ప్రధానంగా సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితమై ఉండేది.
స్వాతంత్య్ర దినోత్సవాల బాధ్యతను పర్యవేక్షించే రక్షణ శాఖ 'వందేమాతరం' 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తొలిసారి దానికి ప్రత్యేక గౌరవం ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రకటించింది.
కొత్త ప్రోటోకాల్ ప్రకారం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకోగానే జాతీయ గేయాన్ని ఆలపించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
వందేమాతరంను విమర్శిస్తున్న అనేక మంది ఇది సంఘ్ పరివార్ విస్తృత హిందూత్వ అజెండాలో భాగమని అంటున్నారు.
దీని వల్ల భారతదేశ వైవిధ్యం, బహుళత్వాన్ని చాటిచెప్పే జాతీయ గీతానికి బదులుగా 'వందేమాతరం'లోని ఆరు చరణాలకూ ప్రాధాన్యం కల్పించే ప్రయత్నం జరుగుతోందని వాదిస్తున్నారు.
'వందేమాతరం'లో దుర్గ, సరస్వతి, లక్ష్మి వంటి హిందూ దేవతల ప్రస్తావనలు ఉన్నాయి. భారత దేశాన్ని పూజనీయమైన మాతృదేవతగా ఇది ప్రస్తావిస్తుంది.
చట్ట సవరణ
తాజాగా ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో, 'ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971' సవరణను పార్లమెంట్ ఆమోదించింది. దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.
ఈ చట్టం ప్రకారం, జాతీయ గీతం మాదిరిగానే జాతీయ గేయాన్ని అవమానించినా కూడా గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎంపీ శశి థరూర్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
"రాష్ట్రపతి వందేమాతరం సవరణను ఆమోదించారు. ఇది పార్లమెంటులో చర్చ లేకుండానే ఆమోదం పొందింది. దీని ప్రకారం, ప్రతి అధికారిక కార్యక్రమం ప్రారంభంలో, ముగింపులో జాతీయ గీతంతో పాటు జాతీయ గేయం 'వందేమాతరం'ను పూర్తిగా పాడడం తప్పనిసరి అవుతుంది" అని శశి థరూర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
"జనగణమన, వందేమాతరం పట్ల నాకు గౌరవం ఉంది. 'వందేమాతరం'లోని మొదటి రెండు చరణాలను పాడగలను. కానీ, మిగిలిన నాలుగు చరణాలను పాడలేను. ఎందుకంటే, అవి ఇప్పటివరకు తప్పనిసరి కాదు. మితిమీరిన ఉత్సాహం వల్ల మనం వదిలేసిన ఒక ప్రాక్టికల్ అంశాన్ని మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. అదేంటంటే, మానవ స్వభావం" అని థరూర్ తన పోస్ట్ లో రాశారు.
"జనగణమన పాడే సమయంలో ప్రజలు గౌరవంగా నిల్చుని సుమారు 52 సెకన్ల పాటు ఏకాగ్రతతో ఉండాలి. వందేమాతరం పూర్తి వెర్షన్ మూడు నిమిషాల పది సెకన్ల నిడివి ఉంటుంది. తమిళనాడు ఈ రెండు పాటలకు ముందు సుమారు రెండు నిమిషాల నిడివి గల రాష్ట్ర గీతం 'తమిళ్ తాయ్ వాళ్తు'ను పాడాలని నిర్ణయించింది" అని తన పోస్టులో రాశారు.
"ప్రతి కార్యక్రమం ప్రారంభంలోనూ, ముగింపులోనూ సుమారు ఆరు నిమిషాల పాటు ప్రజలు నిశ్చలంగా నిలబడి ఈ పాటలను గౌరవంగా వింటారని మనం ఆశించవచ్చా? అంటే ఒక్కో కార్యక్రమానికి మొత్తం 12 నిమిషాలు అదనంగానా? చట్టం ద్వారా గౌరవాన్ని, సహనాన్ని అమలు చేయగలమా? జాతీయ గేయం పట్ల మరింత గౌరవాన్ని పెంపొందించాలన్న ఈ బిల్లు ఉద్దేశం నెరవేరదేమోనని భయంగా ఉంది. నిజానికి ఇది దానికి వ్యతిరేక ఫలితాన్ని ఇవ్వవచ్చు" అని శశి థరూర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ముస్లిం నాయకుల వ్యతిరేకత
అల్లా మినహా ఇతరులను ఆరాధించాడన్ని ఇస్లాం మౌలిక సూత్రాలు అంగీకరించవని వాదిస్తూ, ముస్లిం సంస్థలు ఈ నిబంధనను వ్యతిరేకించాయి.
"మీరు 'జనగణమన' అని పాడినప్పుడు అందులో మీకు ఏమి కనిపిస్తుంది? మీకు ఈ దేశం, దాని ప్రజలు కనిపిస్తారు. మీరు 'వందేమాతరం' అని పాడినప్పుడు, అది దేవుళ్లను, దేవతలను పూజించడంతో ముడిపడి ఉంటుంది" అని హైదరాబాద్ లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
"దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్య్ర సమరయోధుల గురించి ఇప్పుడు మీరేమంటారు? 'జనగణమన' ప్రజల కోసం రాశారు. 1950లో రాజేంద్ర ప్రసాద్ ఒక పెద్ద తప్పు చేశారని భావిస్తున్నా. ఒక తీర్మానం ఆమోదించాల్సిన సమయంలో ఆయన అధికారిక తీర్మానం లేకుండానే దానిని 'జాతీయ గేయం'గా ప్రకటించారు. 'జాతీయ గేయం' అనే పదానికి ఎక్కడా నిర్వచనం లేదు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 25, 26, 29 అధికరణలను ఉల్లంఘిస్తోంది" అని ఒవైసీ అన్నారు.
పార్లమెంటులో కేవలం 15 నిమిషాల చర్చ అనంతరం, మోదీ ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించినప్పుడు ప్రతిపక్ష ఎంపీలు వ్యతిరేకించారు.
జాతీయవాదం ముసుగులో బీజేపీ హిందూత్వ అజెండాను అనుసరిస్తోందని డీఎంకే ఎంపీ కనిమొళి ఆరోపించారు. ఈ చట్టం "సమాఖ్యవాదానికి వ్యతిరేకం" అని, చట్టం ద్వారా ప్రజలపై జాతీయవాదాన్ని రుద్దలేమని ఆమె అన్నారు.
1937లో అప్పటి జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్, వందేమాతరంను జాతీయ గీతంగా స్వీకరించే విషయంపై రవీంద్రనాథ్ ఠాగూర్‌ను సంప్రదించినప్పుడు.. దుర్గాదేవిని కీర్తించే చివరి చరణాలను ముస్లింలు, బ్రహ్మ సమాజ్ సిద్ధాంతాలను (అంటే, దేవుడు ఒక్కడే అని విశ్వసించేవారు) అనుసరించే వారు వ్యతిరేకించవచ్చని ఠాగూర్ అన్నారు.
మాతృభూమి సౌందర్యాన్ని వర్ణించినందున మొదటి రెండు చరణాలను మాత్రమే జాతీయ గేయంగా ఉంచాలని ఆయన నెహ్రూకు సలహా ఇచ్చారు.
బంకించంద్ర చట్టోపాధ్యాయ 1875లో 'వందేమాతరం' రచించారు. దానిలోని ఇతర చరణాలు తరువాత 1882లో ఆయన రచించిన 'ఆనందమఠ్' నవలలో చేర్చారు.
బీజేపీయేతర ప్రభుత్వాలున్న తమిళనాడు, కేరళ కేంద్రం ఆదేశాలను పాటించబోమని ఇప్పటికే స్పష్టం చేశాయి. తమిళనాడులోని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక వేడుకలలో రాష్ట్ర అధికారిక గీతం 'తమిళ్ తాయ్ వాళ్తు'ను మొదటగా ఆలపిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ప్రకటించారు.
'వందేమాతరం'లోని ఆరు చరణాలనూ పాడేది లేదని కేరళ కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏళ్లుగా వస్తున్న గత సంప్రదాయాన్ని అనుసరించి, స్వాతంత్య్ర వేడుకలతో సహా రాష్ట్రంలోని అన్ని కార్యక్రమాలలోనూ మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపిస్తామని స్పష్టం చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)