భార్యను చంపాలనుకుని నానీని హత్య చేసిన లార్డ్ లూకాన్ ‘బ్రిటన్ చరిత్రలో అంతుచిక్కని రహస్యం’గా ఎలా మిగిలిపోయారు?

    • రచయిత, ఫియోనా మెక్‌డోనల్డ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

శాండ్రా రివెట్ అనే మహిళ హత్య కేసులో లార్డ్ లూకాన్‌ను 1975 జూన్ 19న దోషిగా తేల్చారు. అయితే అప్పటికే ఆయన కనిపించకుండా పోయారు.

1980లో లూకాన్ భార్యను బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. ఈ కేసు అసాధారణమైనదే కాకుండా భయంకరమైనది. వరుసగా చూసినప్పుడు ఈ ఘటనల క్రమంలో కొన్ని సందేహాలు రావడం సహజం.

అది 1974 నవంబర్ 7 రాత్రి. బ్రిటన్‌లో ఉన్నత వర్గానికి చెందిన లార్డ్ లూకాన్ లండన్‌లోని బెల్‌గ్రేవియాలో ఉన్న తన ఇంటి నేలమాళిగలోని వంటగదిలో చీకట్లో దాక్కున్నారు.

తన నుంచి విడిపోయిన భార్యను హత్య చేయాలని ఆయన ప్లాన్ చేశారు. వచ్చింది తన భార్యే అనుకుని 29 ఏళ్ల ఆయా శాండ్రా రివెట్‌ అనే మహిళను కర్రతో కొట్టి చంపారు. ఆ తర్వాత తన భార్యపైనా దాడి చేశారు.

అయితే, లూకాన్ భార్య ఆ దాడి నుంచి ఎలాగోలా తప్పించుకున్నారు. ఆమె కేకలు పెట్టడంతో లార్డ్ లూకాన్ పారిపోయారు. ఆయన న్యూహెవెన్ దగ్గరున్న సముద్రంలో దూకి చనిపోయారని చాలామంది భావించారు. అయితే ఆయన ఎక్కడా కనిపించలేదు. అయితే అంటార్కిటికా తప్ప ప్రతీ ఖండంలోనూ ఆయన కనిపించినట్లు కథనాలు మాత్రం వచ్చాయి.

ఈ కేసులో అన్నీ ప్రశ్నలే

ఆధారాలు, లూకాన్ తప్పించుకున్న దాన్ని బట్టి చూస్తే ఈ కేసు తీవ్రమైనదిగా కనిపిస్తోంది.

1975, జూన్ 19న రివెట్ మరణంపై కోర్టులో విచారణ జరిగినప్పుడు లార్డు లూకాన్‌ను దోషిగా నిర్ధరించడానికి కరోనర్ కోర్టుకు కేవలం 31నిముషాలు మాత్రమే పట్టింది.

అయితే ఈ కేసును నిశితంగా పరిశీలిస్తే, సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలే కనిపిస్తాయి.

రక్తాన్ని చూస్తే అసహ్యించుకునే వ్యక్తి ఇంత క్రూరమైన, హింసాత్మకమైన పద్దతిని ఎందుకు ఎంచుకున్నారు? అంతసేపు వంటగదిలో ఉన్న వ్యక్తి రివెట్‌ను చూసి తన భార్యగా ఎలా పొరబడ్డారు?

లూకాన్ రివెట్‌ను హత్య చేసిన తర్వాత లేడీ లూకాన్ దగ్గరలోని పబ్ దగ్గరకు పరుగెత్తి "అతను నానీని చంపేశాడు. నన్ను కాపాడండి" అని అరిచి చెప్పడానికి అంత సమయం ఎందుకు పట్టింది? ఇవన్నీ బ్రిటన్ చరిత్రలోని పరిష్కారంకాని అతి పెద్ద నేరంలో సమాధానం దొరకని ప్రశ్నలు.

ఆ రాత్రి ఏం జరిగిందనే దానిపై లూకాన్ దంపతులు చెప్పిన కథనాలు "ప్రశ్నార్ధకమైనవి" అని 'ది లూకాన్ అబ్సెషన్' పాడ్‌కాస్ట్‌లో అతిథిగా పాల్గొన్న చరిత్రకారుడు అరెస్ట్ వాన్ టంజెల్‌మాన్ అన్నారు.

" ప్రజలు ఎవరికి తోచింది వారు చెప్పారు. ఇప్పటి వరకు పరిష్కారం కాని రహస్యాలలో ఇదొకటి. బహుశా ఎప్పటికీ పరిష్కారం కాకపోవచ్చు" అని ఆయన అన్నారు.

ఈ కేసు బ్రిటన్‌లో సంపన్న వర్గాల పట్ల బ్రిటిష్ ప్రజల వైఖరి గురించి కూడా చాలా విషయాలు వెల్లడిస్తుంది.

ఏడో ఎర్ల్ ఆఫ్ లూకాన్ అయిన రిచర్డ్ జాన్ బింగ్‌హామ్ 1963లో తన దగ్గర సెక్రటరీగా పని చేస్తున్న, మోడల్ వెరోనికాను పెళ్లి చేసుకున్నారు.

ఆయన ఈటన్‌లో చదువుకున్నారు. ప్రొఫెషనల్ గ్యాంబ్లర్. ఆయనకు "లక్కీ" అనే ముద్దుపేరు ఉంది. రివెట్‌ను హత్య చేయడానికి ముందు ఆయన అప్పుల కారణంగా దివాలా తీసే దశకు చేరుకున్నారు.

లూకాన్ అదృశ్యమైన తర్వాత బర్కిలీ స్వేర్‌లో సంపన్నులు తరచుగా వెళ్లే క్యాసినో "క్లెర్మాంట్ సెట్" పేరు మీద ధనిక స్నేహితుల నుంచి లార్డ్ లూకాన్‌కు సాయం అందినట్లు ఆధారాలు ఉన్నాయి.

లార్డ్ లూకాన్ ఏమయ్యారనే దాని గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకటి, ఆయన తుపాకీతో కాల్చుకుని చనిపోయారని, తన స్నేహితుడు జాన్ అస్పినాల్‌కు చెందిన జూలో సింహాలకు తన శరీరాన్ని ఆహారంగా ఇవ్వాలని కోరారని ప్రచారంలో ఉంది.

పెళ్లి విఫలం కావడం వల్లనే ఇలా జరిగిందా?

ఈ కేసులో ఉన్న అసందిగ్ధ పరిస్థితులే దీనిపై ప్రజలకు ఆసక్తిని పెంచాయి.

"ఒక కథనాన్ని నిర్మించడానికి వాస్తవాలు సరిపోతాయి. అదే సమయంలో ఆ వాస్తవాలు ఆసక్తికరమైన ప్రశ్నలకు కూడా ఆస్కారం కల్పిస్తాయి" అని చరిత్రకారిణి రోజ్‌మేరీ హిల్ అన్నారు.

విఫలమైన వివాహాన్ని స్పష్టమైన వివరాలతో బహిర్గతం చేయడం వల్లే ఈ కేసు ప్రజల దృష్టిని ఆకర్షించింది.

"అది చాలా అస్తవ్యస్తమైన సంబంధం. అంతా గందరగోళంగా ఉండేది" అని వాన్ టంజెల్‌మాన్ అన్నారు.

లూకాన్ దంపతులు 1973 జనవరిలో విడిపోయారు. లార్డ్ లూకాన్ కుటుంబాన్ని వదిలేసి తన ఇంటి దగ్గర ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించేవారు.

తన ముగ్గురు పిల్లల సంరక్షణ హక్కుల కోసం చేసిన పోరాటం విఫలమైంది. ఈ ఓటమి, అప్పుల కారణంగా దివాలా తీసే దశకు చేరడం హత్యకు కారణంగా భావిస్తున్నారు.

అయితే ఈ కథకు మరో కోణం కూడా ఉంది.

వెరోనికా (లేడీ లూకాన్) చాలాకాలం పాటు మానసిక అనారోగ్యంతో బాధపడ్డారు. భర్త అదృశ్యమైన కొన్నేళ్ల తర్వాత ఆమె తన పిల్లల సంరక్షణ హక్కును కోల్పోయారు.

"నా భర్త ఇంకా బతికే ఉన్నారు. మృతదేహం దొరకలేదు కాబట్టి ఆయన చనిపోయారని అనుకోలేం" అని లేడీ లూకాన్ 1980లో బీబీసీ న్యూస్‌నైట్ కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

"రివెట్ హత్య నేను మరిచిపోయిన ఒక చిన్న సంఘటన మాత్రమే. నేను ఇప్పుడు కోలుకున్నాను. అది కేవలం వైవాహిక విషయం మాత్రమే" అని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

2017లో ఆమె చనిపోయే వరకు పిల్లలకు దూరంగా ఉన్నారు.

"లేడీ లూకాన్ తన భర్త తనపై చేసిన హత్యాయత్నం నుంచి తాను ఎలా తప్పించుకున్నారో నాకు వివరంగా చెప్పారు. ఏళ్లు గడిచినా ఆమె చెప్పిన కథ మారలేదు. అందులో ఒక విషయం ఎంత అసాధారణంగా ఉందంటే అది కల్పితం అయ్యే అవకాశం లేదు. అతను ఆమెపైకి దూకి మెడ పట్టుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఆమె బొంగురు గొంతుతో 'నా ముత్యాలను తాకే ధైర్యం చేయకు" అని అన్నట్లు జర్నలిస్ట్, రచయిత, జేమ్స్ ఫాక్స్ లండన్ రివ్యూ ఆఫ్ బుక్స్‌కు రాసిన ఓ లేఖలో పేర్కొన్నారు.

రివెట్ హత్య జరిగిన రాత్రి సంఘటనల గురించిన ఊహాగానాలు ఆ తర్వాతి రోజుల్లో లూకాన్‌కు ఏమి జరిగిందనే థియరీలకు సమానంగా సాగాయి.

హత్య జరిగిన తర్వాతి రోజు తెల్లవారు జామున ఆయన ససెక్స్‌లోని స్నేహితుల ఇంట్లో తాను నిర్దోషినని నొక్కిచెబుతూ కొన్ని వాక్యాలు రాశారు.

ఆ రాత్రిని "నమ్మశక్యంకాని యాదృచ్ఛిక సంఘటనలతో కూడిన బాధాకరమైనది రాత్రి" అని పేర్కొన్నారు.

అనుకోకుండా తన పాత ఇంటి పక్కగా వెళుతుండగా ఒక చొరబాటుదారుడిని చూశానని, అందుకే తన భార్యకు సాయం చేయడానికి లోపలికి పరుగెత్తానని ఆయన తన స్నేహితులకు వివరించారు.

ఆ దాడికి తన భార్య తననే నిందిస్తుందని వాదిస్తూ తాను "కొంతకాలం పాటు అజ్ఞాతంలో ఉండాల"ని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

ఆయన అద్దెకు తీసుకున్న ఫోర్డ్ కార్సెయిర్ కారు మూడు రోజుల తర్వాత ఇంగ్లండ్ దక్షిణ తీరంలోని న్యూహెవెన్‌లో గుర్తించారు. కారు సీట్లపై ఉన్న రక్తపు మరకల్ని రివెట్, లేడీ లూకాన్‌ రక్తంతో పోల్చి చూసినప్పుడు అది సరిపోయింది. కారు డిక్కీలో హత్యాయుధంగా భావిస్తున్న ఒక సీసపు గొట్టాన్ని గుర్తించారు.

సంపన్న స్నేహితులే రక్షించారా?

లూకాన్‌ను రక్షించడానికి ఆయన ధనవంతులైన స్నేహితుల బృందం ఏకమైందని కొందరు నమ్మారు.

"ఎవరో ఒకరు కారును ఇక్కడికి తెచ్చి వదిలి వెళ్లారని అనిపించింది. అది దర్యాప్తు దృష్టి మరల్చేందుకు చేసిన పని" అని ససెక్స్ పోలీస్ డిటెక్టివ్ డెరెక్ విల్కిన్సన్ బీబీసీతో చెప్పారు.

లార్డ్ లూకాన్‌ను క్లెర్మాంట్ సెట్ అని పిలిచే సంపన్నులు చాలా పకడ్బంధీగా, ఎవరికీ అనుమానం రాని రీతిలో రక్షించి ఉండవచ్చని డైలీ ఎక్స్‌ప్రెస్ వర్ణించినట్లుగా పత్రికలు చిత్రీకరించాయి.

ఆస్పినాల్ అనేక ఇంటర్వ్యూలలో ఆ అభిప్రాయాన్ని బలపరిచారు

"అతను అడిగినది నేను చేసి ఉండాల్సింది. లూకాన్ ఆశ్రయం కోరి ఉండి ఉంటే అది అతనికి లభించేది" అని1994లో ఆయన బీబీసీతో చెప్పారు

1979 -1981 మధ్య కాలంలో లూకాన్ ఇద్దరు పెద్ద పిల్లలకు తెలియకుండా లూకాన్ వాళ్లను చూసేలా తాను వారికోసం ఆఫ్రికాకు విమాన టిక్కెట్లు బుక్ చేసినట్లు 2012లో ఆస్పినాల్ వ్యక్తిగత సహాయకురాలిగా చెప్పుకుంటున్న ఒక మహిళ బీబీసీ న్యూస్‌తో చెప్పారు.

"లూకాన్ తన కుమారుల్ని చూశారు. వారు ఎదగడాన్ని గమనిస్తూ, దూరం నుంచి వారి గురించి ఆలోచించారు. ఆయన వాళ్లను కలవలేదు. వారితో మాట్లాడలేదు. తన ఉనికిని వాళ్లకు తెలియజేయలేదు" అని ఆమె చెప్పారు.

'ది టైమ్స్' పత్రిక దేశవ్యాప్త 'క్లూ' ఆటగా అభివర్ణించిన ఈ నేరం చుట్టూ అల్లుకున్న కట్టుకథలలో ఎవరూ పెద్దగా పట్టించుకోని శాంట్రా రివెట్ ఇందులో అసలు బాధితురాలు.

"ఈ కేసులో శాండ్రా రివెట్‌కు తన వాదన వినిపించే అవకాశం లేదు’’ అని వాన్ టంజెల్‌మాన్ అన్నారు.

బాధితురాలి గురించి పట్టించుకోకుండా, అంతా లూకాన్ వైవాహిక జీవితంపైనే దృష్టి పెట్టారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)