ఎయిరిండియా విమాన ప్రమాదం: ‘‘మా అబ్బాయి ఇక లేడు, కానీ అతని ప్రతిష్ఠను కాపాడుతూనే ఉంటా’’

కెప్టెన్ సుమీత్ సభర్వాల్

ఫొటో సోర్స్, Capt Sumeet Sabharwal's family

ఫొటో క్యాప్షన్, నిరుడు జూన్‌లో టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే కూలిపోయిన ఎయిరిండియా విమానం 171 సీనియర్ పైలెట్‌గా కెప్టెన్ సుమీత్ సబర్వాల్ ఉన్నారు.
    • రచయిత, అర్చన శుక్లా, నిఖిత యాదవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

గత ఏడాది జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన పైలట్లల్లో ఒకరైన కెప్టెన్ సుమీత్ సబర్వాల్ పురువును కాపాడుతూనే ఉంటానని ఆయన తండ్రి చెప్పారు.

ఈ ప్రమాదంపై దర్యాప్తుకు సంబంధించిన తాజా వివరాలను వెల్లడించడానికి కొన్ని రోజుల ముందు ఈ వ్యాఖ్యలు చేశారు.

దర్యాప్తు అధికారుల దృష్టి తన కుమారుడు, కాక్‌పిట్‌లో సీనియర్ పైలట్‌గా ఉన్న కెప్టెన్ సుమీత్ సబర్వాల్‌ వైపు మళ్లుతోందంటూ వచ్చిన కొన్ని మీడియా కథనాలను ఆయన కొద్దినెలల కిందట తోసిపుచ్చారు.

ఈ నేపథ్యంలో ఆయన బీబీసీతో మాట్లాడుతూ ‘‘మా అబ్బాయి ఇక లేడు. కానీ అతని ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది’’ అని చెప్పారు.

జూన్ 12, 2025న లండన్‌కు బయల్దేరిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది సహా.. మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ విమాన దుర్ఘటనకు గల కారణం ఇప్పటికీ తెలియలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రాథమిక నివేదికలో ఏముంది?

విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ (ఏఏఐబీ) గత ఏడాది జులైలో విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో.. టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే విమానంలోని ఇంధన స్విచ్‌లు 'రన్' మోడ్ నుంచి 'కటాఫ్' స్థితిలోకి వెళ్లిపోయాయని, దీంతో రెండు ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయిందని తెలిపింది.

కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో ఒక పైలట్ మరొకరిని ''ఎందుకు కటాఫ్ చేశారు'' అని అడిగినట్లు, అందుకు మరో పైలట్ తాను చేయలేదని సమాధానం ఇచ్చినట్టు ఉంది.

అయితే ఈ మాటలు ఏ పైలట్ అన్నారో దర్యాప్తు అధికారులు గుర్తించలేదు.

టేకాఫ్ సమయంలో, కెప్టెన్ సబర్వాల్ పర్యవేక్షిస్తుండగా.. కోపైలట్ క్లైవ్ కుందర్ విమానం నడుపుతున్నారు. అయితే నివేదికలో పేర్కొన్న సంభాషణను దర్యాప్తు అధికారులు ఏ పైలట్‌తోనూ ముడిపెట్టలేదు. అలాగే విమానంలో జరిగిన ఏ చర్య అయినా ఉద్దేశపూర్వకమని అధికారులు చెప్పలేదు.

నిరుడు ప్రాథమిక దర్యాప్తు నివేదిక విడుదలైన కొన్ని రోజుల తరువాత ప్రమాదంపై దర్యాప్తులోని తాజా వివరాలు కాక్‌పిట్‌లోని సీనియర్ పైలట్‌గా ఉన్న కెప్టెన్ సమీత్ సబర్వాల్‌వైపు దృష్టిని మళ్ళిస్తున్నాయని ది వాల్ స్ట్రీట్ జర్నల్ , రాయిటర్స్ కథనాలు పేర్కొన్నాయి.

తండ్రితో సుమీత్ సభర్వాల్

ఫొటో సోర్స్, Capt Sumeet Sabharwal's family

ఫొటో క్యాప్షన్, ముంబయిలోని తండ్రితో కలిసి సుమీత్ సబర్వాల్ ఉండేవారు.

నిరుడు కూలిపోయిన ఎయిరిండియా విమానంలో ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి కాక్‌పిట్ రికార్డింగ్, "విమానం ఇంజిన్లకు కెప్టెనే ఇంధన సరఫరాను నిలిపివేశాడనే" అభిప్రాయానికి బలం చేకూర్చుతోందని పేరు చెప్పడానికి ఇష్టపడని వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.

ఈ కథనాలపై పై భారత్‌లోని పైలట్ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వారు ఆ కథనాలను విమర్శించడమే కాకుండా, సీనియర్ పైలటే ప్రమాదానికి కారణమయ్యారన్న వాదనలను కూడా కొట్టివేశారు.

దీనిపై విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ (ఏఏఐబీ) కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అవి అంతర్జాతీయ మీడియాలోని కొన్ని వర్గాల ‘ఎంపిక చేసిన,నిరాధార కథనాల’ని పేర్కొంది. దర్యాప్తు పూర్తికాకముందే నిర్థరణకు రావడానికి చేసే ప్రయత్నాలు ''బాధ్యతారాహిత్యమే'' అని గత ఏడాది విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

తరువాత కెప్టెన్ సబర్వాల్ తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విమాన ప్రమాదానికి గల అన్ని కారణాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. దీనిపై స్పందించిన కోర్టు ఆ సీనియర్ పైలట్‌ను "ఎవరూ నిందించలేరని", "ప్రాథమిక నివేదికలో ఆయన తప్పు ఉన్నట్లు ఎటువంటి సూచనలు లేవని" పేర్కొంది.

అయితే, ఈ ప్రమాదం చుట్టూ వస్తున్న మీడియా కథనాలు, ఊహాగానాలను ఆ కుటుంబం తట్టుకోవడం చాలా కష్టం.

''యాక్సిడెంట్ జరిగిన ప్రతీసారి పైలట్‌ను నిందించడం మీరు చూస్తారు. కానీ, ఎందుకు? ఆ చాప్టర్‌ను అంతటితో ముగించేందుకు అదే సులభమైన పని. ఆయన లేరు, తనకు తాను సమర్థించుకోలేరు'' అని 90 ఏళ్ల పుష్కర్ రాజ్ బీబీసీతో అన్నారు.

కెప్టెన్ సబర్వాల్ ఎయిర్ ఇండియాలో మూడు దశాబ్దాల విమానయాన అనుభవం ఉన్న ఒక అనుభవజ్ఞుడైన పైలట్.

15,600 గంటలకు పైగా విమానం నడిపారు. దానిలో సుమారు 8,600 గంటలు బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌లోనే గడిపారు.

ఎయిరిండియా ప్రమాదం, సుమీత్ సభర్వాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రాథమిక నివేదికపై వాషింగ్టన్ పోస్ట్, రాయిటర్స్‌లో కథనాలొచ్చాయి.

‘నా బిడ్డది మంచి మనసు’

గత వారం ముంబయిలో ఉంటున్న సుమీత్ సబర్వాల్ తండ్రి నివాసాన్ని బీబీసీ సందర్శించినప్పుడు, చనిపోయిన తన భార్య, యూనిఫామ్‌ ధరించి ఉన్న కెప్టెన్ సబర్వాల్‌ ఫోటోలు ఉన్న గోడ కింద కూర్చుని ఉన్నారు.

పుష్కర్ రాజ్ పదవీ విరమణ పొందిన ఒక విమానయాన భద్రతా అధికారి. తనని చూసుకోవడానికి, మరింత సమయం ఇంట్లో గడిపేందుకు త్వరలోనే తన కుమారుడు రిటైర్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నారని పుష్కర్ రాజ్ చెప్పారు.

''ఆరోజు అహ్మదాబాద్ నుంచి విమాన ప్రయాణానికి సిద్ధమయ్యాడు. 'విమానం ఎక్కుతున్నాను, గాత్విక్ చేరుకున్నాక నీకు ఫోన్ చేస్తాను' అని నాతో చెప్పాడు'' అని పుష్కర్ రాజ్ గుర్తు చేసుకున్నారు.

‘‘ఆ తర్వాత కొద్దిసేపటికే అంతా జరిగిపోయింది’’ అని తన ఆవేదనను వ్యక్తం చేశారు.

తన కుమారుడిది మంచి మనసని, మృదుస్వభావం గల వ్యక్తని, కుటుంబం పట్ల ఎంతో అంకితభావం ఉన్న వ్యక్తి అని పుష్కర్ రాజ్ అభివర్ణించారు.

తల్లిదండ్రుల పట్ల అపారమైన భక్తి, సేవాభావానికి ప్రసిద్ధి చెందిన పౌరాణిక హిందూ పాత్ర శ్రవణ కుమారుడిని ప్రస్తావిస్తూ... "అతని తల్లి అతడిని తన శ్రవణుడిగా పిలిచేది'' అని గుర్తు చేసుకున్నారు.

''ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. కానీ, అతని ముఖంలో ఎల్లప్పుడూ చిరునవ్వు కనిపించేది'' అన్నారు.

వీడియో క్యాప్షన్, ఎయిరిండియా: తను ప్రత్యక్షంగా చూసిన విమాన ప్రమాదాన్ని తెలుగులో వివరించిన మహిళ
ఎయిరిండియా ప్రమాదం, సుమీత్ సభర్వాల్

ఫొటో సోర్స్, Capt Sumeet Sabharwal's family

‘రోజుకు 4, 5 సార్లు ఫోన్ చేసేవాడు’

ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా . కెప్టెన్ సబర్వాల్ తనతో మాట్లాడేవారని పుష్కర్ రాజ్ గుర్తు చేసుకున్నారు.

''గమ్యస్థానం చేరుకున్నాక నాకు చెప్పేవాడు. ఒకవేళ హోటల్‌లో ఉంటే, చాలా తరచుగా.... అంటే రోజుకు నాలుగు లేదా ఐదు సార్లు ఫోన్ చేసేవాడు" అని తెలిపారు.

"ఇది చాలా పెద్ద నష్టం, భరించలేని నష్టమని మాత్రమే చెప్పగలను" అన్నారు.

"కానీ, నేను దీన్ని భరించక తప్పదు. అదృష్టవశాత్తూ, నా మిగిలిన కుటుంబమంతా నాతోనే ఉంది. నేను ఒంటరిని కాదు" అని చెప్పారు.

ఆయన కుమార్తె, మనవడు దిల్లీ నుంచి ముంబయి వచ్చి ఆయనతో పాటే ఉంటున్నారు.

తన కుమారుడి మరణం మిగిల్చిన తీవ్ర దు:ఖం, బాధ నుంచి తాను కోలుకునేలా చేయడంలో తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారు చుట్టూ ఉండి తనకెంతో సహాయం చేశారని ఆయన చెప్పారు.

ఇటీవల రోజువారీ పనుల్లోనే ఓదార్పును వెతుక్కుంటున్నారు పుష్కర్‌రాజ్.

ఎప్పుడైనా ఆయన ఉదయం నడక కోసం బయటకు వెళతారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే అరుదైన సందర్భాల్లో ఇదొకటి. కానీ ప్రస్తుతం ఆయన కాలుబయట పెట్టాలంటే సాయం అవసరమవుతోంది.

తన కుమారుడు ముంబయిలోనే ఉంటే ఉదయం నడకకు తనతోపాటు వచ్చేవాడని పుష్కర్ రాజ్‌ గుర్తు చేసుకున్నారు.

ప్రమాదం జరిగి సుమారు ఏడాది అవుతుండటంతో.. దర్యాప్తు అధికారుల నుంచి తదుపరి నివేదిక ఎప్పుడు విడుదలవుతుందోనని చనిపోయిన వారి కుటుంబాలు, విమానయాన రంగ నిపుణులు, పైలట్ల బంధువులు వేచిచూస్తున్నారు.

ఒకవేళ భవిష్యత్‌లో వచ్చే దర్యాప్తు నివేదికలోని అంశాలు సబర్వాల్‌కు అనుకూలంగా రాకపోతే ఎలా అని ప్రశ్నించినప్పుడు.. ఆయన కాస్త సమయం తీసుకుని సమాధానమిచ్చారు.

''నేను ప్రశాంతంగా బతికి ఉండాలంటే, నేను తప్పనిసరిగా మర్చిపోవాలి. మర్చిపోయేందుకు ప్రయత్నించాలి. కానీ, అది సాధ్యం కాదు''

''అదే నా పరిస్థితి'' అని వివరించారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

పోస్ట్ of YouTube ముగిసింది

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)