విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఎందుకు జరిగింది, అక్కడ దశాబ్దాలపాటు పని చేసినవారు ఏం చెబుతున్నారు?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
గమనిక: ఈ కథనంలోని అంశాలు మిమ్మల్ని కలచివేయవచ్చు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో భారీ ప్రమాదం సంభవించింది.
ప్లాంట్‌లోని ఎస్ఎంఎస్-2 యూనిట్‌లో ద్రవ ఉక్కు కార్మికులపై పడిన ఈ ఘటనలో 8 మంది మృతి చెందినట్టు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రకటించారు. మరికొందరు తీవ్రంగా గాయపడగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు.
భారీగా మంటలు చేలరేగడంతో అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఎస్ఎంఎస్-2 విభాగం చీఫ్ సహా అయిదుగురు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు.
చికిత్స పొందుతున్న ఆరుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని...వారికి మెరుగైన వైద్యసేవ అందించాలని ఆదేశించినట్టు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత 'బీబీసీ'తో చెప్పారు.

150 టన్నుల ద్రవ ఉక్కు...
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల యూనియన్ లీడర్ వి. శ్రీనివాసరావు బీబీసీకి ప్రమాదం జరిగినప్పటి పరిస్థితిని వివరించారు. "విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్‌లో కరిగిన 150 టన్నుల ద్రవ ఉక్కు... 'ల్యాడిల్' (Ladle) అనే భారీ బకెట్‌లో నుంచి జారి...అక్కడున్న కార్మికులపై పడిందని వారిని స్టీల్ ప్లాంట్ జనరల్ ఆస్పత్రికి తీసుకుని వస్తున్నామని సాయంత్రం 4.15 గంటల సమయంలో సమాచారం వచ్చింది.
ఎస్ఎంఎస్ ప్లాంట్‌లో నిత్యం సుమారు 1600°C సెల్సియస్ వేడి ఉన్న ద్రవ ఉక్కు ఉంటుంది. అది మీద పడితే కార్మికులు సజీవ దహనం అవుతారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోతాయని ఆలోచించుకుంటూ ఆసుపత్రికి వెళ్లేసరికి...నాలుగు మృతదేహాలు వచ్చాయి. అవి పూర్తిగా కాలిపోయి...గుర్తుపట్టలేకపోయాం"
''మరో ఆరుగురికి తీవ్రగాయాలు కావడంతో వారిని విశాఖలోని రెండు ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లినట్టు అధికారులు చెప్పారు. ఈ స్థాయి ప్రమాదం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల కాలంలో జరగలేదు. క్రమంగా మృతుల సంఖ్య కూడా పెరిగింది. మొత్తం 8 మంది చనిపోయినట్టు అధికారికంగా సమాచారం రావడంతో కార్మిక సంఘాలన్నీ ఆసుప్రతికి చేరుకున్నాయి. చనిపోయిన వారిని ఒక్కొక్కరిని ఒక్కో ఆధారంతో గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాం" అని శ్రీనివాసరావు బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
మార్చురీ దగ్గర
మార్చురీ సమీప ప్రాంగణమంతా మృతుల కుటుంబసభ్యుల రోదనలతో నిండిపోయింది. తమ కుటుంబానికి ఆధారమైన దిక్కుని కోల్పోయామంటూ పదుల సంఖ్యలో మహిళలు ఏడుస్తూ కనిపించారు.
ప్రమాదంలో చనిపోయిన తమవారిని గుర్తుపట్టలేకపోతున్నామంటూ అందరూ పెద్దగా అరుస్తూ గుండెలు బాదుకునే దృశ్యాలే కనిపించాయి. ఒకరిద్దరైతే మార్చురీ వద్దే సృహా కోల్పోయారు.
ప్రమాదంలో మరణించిన వారిలో కొందరి మృతదేహాలు తీవ్రంగా కాలిపోవడంతో గుర్తింపు ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యాయని అధికారులు తెలిపారు. దీంతో మార్చురీ వద్ద ఉద్రిక్త, విషాదకర వాతావరణం నెలకొంది.

ప్రమాదానికి కారణాలేంటి...?
విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్-2 (స్టీల్ మెల్టింగ్ షాప్-2) యూనిట్‌లో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి ప్రాథమికంగా పలు సాంకేతిక, నిర్వహణపరమైన కారణాలుంటాయని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు బీబీసీతో చెప్పారు.
ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ఎస్ఎంఎస్-2 ప్లాంట్ లో 40 ఏళ్లు జనరల్ ఫ్లోర్ మ్యాన్‌గా పని చేసి గత నెలలో పదవీ విరమణ పొందిన బి. అప్పారావు బీబీసీతో మాట్లాడారు.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం...
''ఇంత భయంకరమైన ప్రమాదం జరిగిన ఎస్ఎంఎస్ 2 వద్ద తీవ్రమైన వేడి ఉంటుంది. అక్కడ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని పని చేయాల్సి ఉంటుంది. అయితే ఒకేసారి 1500°C వేడున్న లిక్విడ్ స్టీల్ పడితే ఎవరూ తట్టుకోలేరు. బతకరు'' అని అప్పారావు అన్నారు.
"1500°C-1600°C ఉష్ణోగ్రతతో కరిగి మరుగుతున్న ద్రవ ఉక్కును ఒకచోటు నుంచి మరో చోటుకు రవాణా చేయడానికి వాడే భారీ బకెట్‌ను "ల్యాడిల్" (Ladle) లేదా హాట్ మెటల్ బకెట్ అంటారు. ఇది బ్లాస్ట్ ఫర్నేస్‌లో కరిగిన 150 టన్నుల ముడి ఇనుమును ఎస్ఎంఎస్-2 (Steel Melting Shop 2) లేదా కాస్టింగ్ ప్లాంట్‌కు తరలించడానికి వాడతారు.
దీనిని క్రేన్ ద్వారా లిఫ్ట్ చేస్తుంటారు. కానీ... ప్రమాద సమయంలో ఆయిల్ లీకేజీ లేదా క్రేన్ మెకానిజంలో లోపం ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నాం. దాని వల్ల ల్యాడిల్‌లోని ద్రవ ఉక్కు కిందపడే అవకాశం ఉంది. ఆ ల్యాడిల్‌లో ఉండే 1500°C కంటే ఎక్కువ వేడి ఉన్న ద్రవ ఉక్కు ఒక్కసారిగా కుప్పకూలి కిందపడి అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడి ఉంటుంది" అని ప్రమాదం జరిగిన స్థలంలో నాలుగు దశాబ్ధాలపాటు పని చేసిన అనుభవం ఆధారంగా అప్పారావు ఊహించి చెప్పారు.
1500°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ద్రవ ఉక్కు శరీరంపై పడితే ప్రాణాలతో బయటపడే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని అప్పారావు చెప్పారు.

ఘటనాస్థలిని పరిశీలించిన కుమారస్వామి
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదంపై కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనాస్థలిని మరో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
ఈ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను అధికారులు పరిశీలిస్తున్నారని.. బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందిస్తున్నారని తెలిపారు. కార్మికుల భద్రత, శ్రేయస్సే తమకు అత్యంత ప్రాధాన్యమని చెప్పారు.

ఫొటో సోర్స్, DPRO, Vizag
ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం...
ప్రమాదంలో మరణించిన వారికి కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారాన్ని కేంద్ర ఉక్కుశాఖామంత్రి హెచ్ డీ కుమారస్వామి ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు. శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం కల్పిస్తామని, అలాగే చనిపోయినవారు జీవించే ఉంటే ఎంత రిటైర్మెంట్ సమయం వరకు వారి కుటుంబంలో క్వార్టర్స్‌లో నివాసం, మృతుల కుటుంబంలోని పిల్లల చదువుకు అవసరమైన ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వమే చేస్తుందని కుమారస్వామి ప్రకటించారు.
అలాగే ప్రధాని మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతులకు రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం అందిస్తున్నట్టు చెప్పారు.
ప్రమాదంపై కమిటీ ఏర్పాటు: కేంద్ర ఉక్కుశాఖామంత్రి
ఈ ఘటన వెనుక సరైన నిర్వహణ (మెయింటెనెన్స్)లోపాలు, అనుభవజ్ఞులైన సిబ్బంది కొరత, పాతబడిన యంత్ర పరికరాల వినియోగం వంటి అంశాలు కూడా ఉండవచ్చని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈ సంఘటనకు కారణాలను తెలుసుకునేందుకు ఉక్కు శాఖ విచారణ చేపడుతుందని వెల్లడించారు.
బొకారో స్టీల్ ప్లాంట్ సీనియర్ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇతర స్టీల్ ప్లాంట్స్ నుంచి ముగ్గురు సభ్యుల బృందంతో ఇవాళ (మంగళవారం) ఒక టీమ్ వచ్చి విచారణ చేపడుతుందని, ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని కేంద్ర ఉక్కుశాఖామంత్రి కుమారస్వామి తెలిపారు.

15 రోజుల్లో నివేదిక...
సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో కేంద్ర భారీపరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, విశాఖ ఎంపీ భరత్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాద స్థలాన్ని పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
''ఇది పూర్తిగా ప్రమాదమేనని ప్రాథమికంగా తెలుస్తోంది. 15 రోజుల్లో ప్రమాదంపై నివేదిక అందుతుంది. ఎక్స్ గ్రేసియా పెంచాలన్న కార్మిక సంఘాల డిమాండ్ పరిశీలిస్తాం" అని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు తెలుసుకోవడానికి, ఇతర సమాచారం పొందడానికి అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 08912590100, 08912590102 నంబర్లను కంట్రోల్ రూంలో అందుబాటులోకి తెచ్చారు. ఈ నంబర్లకు ఫోన్ చేసి బాధితులకు సంబంధించిన వారు సమాచారం తెలుసుకోవచ్చు.

ఫొటో సోర్స్, UGC
ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్'లో పోస్టు పెట్టారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. 8మంది కార్మికులు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, అన్ని శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.




























