భార్యకు పట్నాల సురేష్ చివరి ఫోన్ కాల్ : ‘‘చుట్టూ దాడులు జరుగుతున్నాయి, నాకేం కాదు, సేఫ్‌గా వస్తా, మన పెళ్లి రోజు జరుపుకుందాం’’

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

'నేను సేఫ్‌గా ఇంటికొస్తాను. మన పెళ్లిరోజు బాగా జరుపుకుందాం..’ ఇవీ మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్ తన భార్యకు చెప్పిన చివరి మాటలు.

ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో సురేష్ మరణించినట్టు అధికారులు ధృవీకరించారు.

"ప్రతిరోజూ గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపేవారు. వీడియో కాల్ చేసే అవకాశంలేకపోయినా మెసేజ్ మాత్రం వచ్చేది. కానీ రెండు రోజులుగా ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఇప్పుడు ఆయన మరణించారనే వార్త వినాల్సి వచ్చింది" అంటూ పట్నాల సురేష్ భార్య భార్గవి బీబీసీతో చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన 44 ఏళ్ల సురేష్ పట్నాల, ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌక ఎంటీ సెట్టెబెల్లోపై జరిగిన దాడిలో మరణించిన ముగ్గురు భారతీయ సిబ్బందిలో ఒకరని కేంద్ర ఓడరేవులు,నౌకాయాన,జలమార్గాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి ముకేశ్ మంగళ్ వెల్లడించారు.

విశాఖలోని శ్రీహరిపురంలో ఉన్న ఆయన నివాసానికి బంధువులు, స్నేహితులు, రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు చేరుకున్నారు.

ఇంట్లోని గోడలపై సురేష్, భార్గవి కుటుంబ ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇంట్లో షెల్ఫుల నిండా ఉన్న ఆటబొమ్మలు సురేష్, భార్గవి దంపతులు పిల్లలపై చూపిస్తున్న ప్రేమకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

"ఇంటికి వస్తానన్నారు...కానీ"

"జూన్ 9న చివరిసారి మాట్లాడాం. త్వరలో ఇంటికి వస్తానని చెప్పారు. కానీ ఇలా శవమై వస్తారని ఊహించలేదు" అని భార్గవి తన ఇద్దరు పిల్లలను పట్టుకుని ఏడుస్తూ చెప్పారు.

"బుధవారం రాత్రి షిప్ నుంచి ఓ సైలర్ గ్రూపులో పెట్టిన మేసేజ్ ద్వారా నౌకపై దాడి జరిగి అగ్ని ప్రమాదం సంభవించిందని, తన భర్తతో పాటు మరో ఇద్దరు కనిపించడం లేదని తెలిసింది" అని భార్గవి తెలిపారు.

సురేష్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్గవి అక్క దంపతులు మరణించడంతో వారి ఇద్దరు కుమార్తెల బాధ్యతను కూడా సురేష్ కుటుంబమే తీసుకుంది. ప్రస్తుతం నలుగురు పిల్లల భవిష్యత్తుపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"కుటుంబం మొత్తం ఆయన సంపాదనపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు పిల్లలను ఎలా చదివించాలి, ఎలా పెంచాలన్నదే అర్థం కావడం లేదు" అని భార్గవి ఆవేదనతో ఉన్నారు.

"ఇప్పుడు నాకు ఉద్యోగం దొరకడం కష్టం"

39 ఏళ్ల భార్గవి ప్రస్తుతం కుటుంబ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"వివాహానికి ముందు ప్రైవేట్ సంస్థలో ఆరేళ్లు పనిచేశాను. కానీ ఇప్పుడు నలుగురు పిల్లల బాధ్యత నాపై ఉంది. ఈ వయసులో ఉద్యోగం దొరకడం సులభం కాదు" అని ఆమె అన్నారు.

"పిల్లలకు మంచి చదువు చెప్పించాలంటే చాలా ఖర్చులు ఉంటాయి. ఆ భారం ఎలా మోయాలో అర్థం కావడంలేదు" అని చెప్పారు.

దాడికి ముందు ఏం జరిగింది?

సుమారు 15 ఏళ్లుగా మెరైన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సురేష్, విధుల్లో భాగంగా అనేక దేశాలకు వెళ్లేవారని ఆయన భార్య తెలిపారు.

"రెండు,మూడు రోజులకు ఒకసారి వీడియో కాల్ చేసేవారు. నౌకలోని ఇతర సిబ్బందిని మాతో మాట్లాడించేవారు. కానీ జూన్ 5 నుంచి వీడియో కాల్స్ సరిగా రాలేదు. జూన్ 9 నాటికి పూర్తిగా ఆగిపోయాయి. సముద్రంలో ఉండటం వల్ల నెట్‌వర్క్ సమస్య అనుకున్నా" అని ఆమె గుర్తుచేసుకున్నారు.

జూన్ 10 తర్వాత ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు.

సురేష్ నౌకలోని జనరేటర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో దాడి జరగడంతో బయటపడే అవకాశం లేకపోయిందని నౌక యాజమాన్యం తమకు తెలిపిందని భార్గవి వివరించారు.

"వాస్తవానికి ఆయన మరో చీఫ్ ఇంజినీర్‌కు సహాయంగా తాత్కాలిక విధుల కోసం వెళ్లారు. కానీ అక్కడి పరిస్థితుల కారణంగా డ్యూటీ పొడిగించారు" అని ఆమె చెప్పారు.

‘‘చుట్టూ దాడులు జరుగుతున్నాయి’’

చివరి సారి మాట్లాడినప్పుడు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని సురేష్ చెప్పారని భార్గవి తెలిపారు.

"నేను ఉన్న ప్రదేశంలో చుట్టూ దాడులు జరుగుతున్నాయి. కొందరు మరణించారు కూడా. కానీ నాకేం కాదు. నేను సురక్షితంగా తిరిగొస్తాను. మన పెళ్లి రోజు బాగా జరుపుకుందాం" అని తన భర్త చెప్పారని భార్గవి గుర్తుచేసుకున్నారు.

జూన్ 24న తమ వివాహానికి 15 సంవత్సరాలు పూర్తయ్యేవని ఆమె తెలిపారు.

"ఏడాదిలో ఎక్కువ భాగం సముద్రంపైనే గడిపేవారు. ఇక్కడే ఉద్యోగం చూసుకోమని చెప్పేదాన్ని. కానీ పిల్లల భవిష్యత్తు కోసం ఇదే మంచిదని చెప్పేవారు" అని ఆమె అన్నారు.

‘మృతదేహం దొరకలేదంటే బతికే ఉన్నారనుకున్నాం’

సురేష్ మరణించినట్లు అధికారులు సమాచారం ఇచ్చినప్పటికీ, మృతదేహం ఇంకా లభించకపోవడంతో ఆయన బతికే ఉంటారని ఆశపడ్డామని భార్గవి మామయ్య రామకృష్ణ తెలిపారు.

"తర్వాత ముగ్గురు భారతీయుల మృతదేహాలు గుర్తించారని తెలిసిన వెంటనే భార్గవి బాధ వర్ణనాతీతం" అని ఆయన అన్నారు.

"షిప్‌కు ఇన్ ఛార్జ్ హోదాలో అంటే మెరైన్ చీఫ్ ఇంజనీర్‌‌గా సురేష్ పని చేస్తున్నాడు. అతనికి ఆరు నెలలు సెలవు దొరుకుతుంది. కానీ వృత్తి పట్ల గౌవరంతో ఎక్కువగా సముద్రంపై గడిపేందుకే ఇష్టపడేవాడు. రెండు, మూడు నెలలే సెలవులు తీసుకునేవాడు" అని సురేష్ తండ్రి రామకృష్ణ బీబీసీతో చెప్పారు.

కుటుంబం ఏం కోరుతోంది?

సురేష్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

"మా కుటుంబానికి ఆయన సంపాదనే ఆధారం. ప్రభుత్వం మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించడంతోపాటు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి" అని సురేష్ తండ్రి రామకృష్ణ అన్నారు.

మృతదేహాన్ని ఎప్పుడు స్వదేశానికి తీసుకొస్తారనే విషయంపై తమకు ఇంకా స్పష్టమైన సమాచారం అందలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది?

సురేష్ పట్నాల సహా మరణించిన ముగ్గురు భారతీయుల మృతికి కేంద్ర ప్రభుత్వం సంతాపం ప్రకటించింది.

కేంద్ర పోర్టులు, జలరవాణా, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ 'ఎక్స్‌' వేదికగా స్పందిస్తూ.. ఎంటీ సెట్టెబెల్లోపై నౌకపై జరిగిన ఘటనను "అత్యంత విషాదకరమైంది"గా అభివర్ణించారు.

మొదట గల్లంతైనట్లు భావించిన ముగ్గురు భారతీయుల మృతదేహాలు తరువాత లభించాయని, వారి కుటుంబాలకు సమాచారం అందించినట్లు తెలిపారు.

మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడం, అలాగే రక్షించిన సిబ్బందిని భారతదేశానికి తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)