You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నేటి నుంచే ఫుట్‌బాల్ వరల్డ్ కప్ : ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి, ఏయే జట్లపై అంచనాలున్నాయి ? 6 ప్రశ్నలు - జవాబులు
- రచయిత, క్వాసి జామ్ఫీ అసైద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ఫిఫా వరల్డ్ కప్ చుట్టూ ఉండే ఉత్సాహాన్ని, బజ్‌ను మిస్సవ్వడం చాలా కష్టం.
ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆట ఫుట్‌బాల్ (ఉత్తర అమెరికాలో సాకర్ అని పిలుస్తారు). ఈ ఆటలో వరల్డ్ కప్ అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది.
దాదాపు వందేళ్ల టోర్నమెంట్ చరిత్రలో తొలిసారి ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌కు మూడు దేశాలు మెక్సికో, కెనడా, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.
గురువారం (11.06.2026) మెక్సికో సిటీలో ప్రారంభమ్యాచ్ జరుగుతుంది.
జూలై 19న అమెరికాలోని న్యూజెర్సీలో ఫైనల్స్ జరుగుతుంది.
1. ప్రపంచకప్ ఎలా సాగుతుంది?
ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ప్రతి నాలుగేళ్లకోసారి జరుగుతుంది. ఈ ఏడాది జరుగుతున్న టోర్నమెంట్ అతి పెద్దది. మొత్తం 48 దేశాలు పోటీపడుతున్నాయి. ప్రపంచ ర్యాంకింగ్‌ల ఆధారంగా ఈ దేశాలన్నింటినీ కలిపి 12 గ్రూపులుగా చేశారు.
ప్రతి గ్రూప్‌లో తొలి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లు తర్వాతి దశకు వెళ్తాయి. దీన్ని రౌండ్ ఆఫ్ 32 అంటారు.
మ్యాచ్ గెలిచిన జట్టుకు 3 పాయింట్లు లభిస్తాయి. మ్యాచ్ డ్రా లేదా టై అయితే రెండు టీమ్‌లకు చెరో పాయింట్ లభిస్తుంది. ఓడిపోయిన జట్టుకు పాయింట్లేమీ రావన్నది ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు.
గ్రూప్ దశలో మూడో స్థానంలో నిలిచిన జట్లు రౌండ్ ఆఫ్ 32కు చేరవు. అంటే ఈ దశలో 16 జట్లు ఎలిమినేట్ అవుతాయి.
మ్యాచ్‌లు 90 నిమిషాల పాటు సాగుతాయి. ఈ 90 నిమిషాల మ్యాచ్ 45 నిమిషాల చొప్పున రెండు అర్థభాగాలుగా సాగుతుంది. మధ్యలో ఆటగాళ్లకు 15 నిమిషాల విరామం ఉంటుంది.
ఆట జరుగుతున్నంతసేపూ గేమ్ క్లాక్ పనిచేస్తూనే ఉంటుంది. ఆటగాళ్ల గాయాలకు చికిత్స, వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఫిఫా తప్పనిసరి చేసిన నీటి విరామాల వల్ల కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి ప్రతి అర్థభాగం చివరన అదనపు సమయాన్ని కలుపుతారు.
గ్రూప్ దశలో విజేతను తేల్చడానికి పెనాల్టీ షూటౌట్స్ ఉండవు.
గ్రూప్ దశ తర్వాత మ్యాచ్ టై అయితే మరో 30నిమిషాల పాటు ఆడిస్తారు. అప్పటికీ విజేత ఎవరో తేలకపోతే పెనాల్టీ కిక్స్ ద్వారా విజేతలను నిర్ణయిస్తారు.
2. ఏయే నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి?
మెక్సికో: గ్వాదలాహారా, మాంటెర్రే, మెక్సికోసిటీ
కెనడా: టొరంటో, వాన్‌కోవర్
అమెరికా: అట్లాంటా, బోస్టన్, డల్లాస్, హూస్టన్, కన్సాస్ సిటీ, లాస్ ఏంజెల్స్, మియామీ, న్యూయార్క్/న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, సియాటిల్.
3. ఫేవరెట్స్ ఎవరు?
రెండుసార్లు వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఫ్రాన్స్, 2010 చాంపియన్ స్పెయిన్ ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్లుగా బరిలో దిగుతున్నాయి.
ఫ్రాన్స్ జట్టు అద్భుతమైన ఆటగాళ్లతో నిండి ఉంది. యూరప్ టాప్ పోటీల్లో విజయాలు తెచ్చిపెట్టిన కీన్ ఎంబాపె, ఔస్మాని డెంబెలె సహా అనేకమంది ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు.
స్పెయిన్ జట్టులోనూ ప్రతిభ కలిగిన యువకులు ఎక్కువగా ఉన్నారు. 18ఏళ్ల లామిన్ యమల్ రెండేళ్లలో దేశానికి మరో ప్రధాన ట్రోఫీ అందిస్తాడని భావిస్తున్నారు.
రెండు యూరోపియన్ చాంపియన్‌షిప్స్‌లో వరుస ఓటముల తర్వాత ఇంగ్లండ్ కూడా ఈ టోర్నమెంట్‌పై భారీ ఆశలు పెట్టుకుంది.
వరల్డ్‌కప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన బ్రెజిల్ కూడా సహజసిద్దంగా ఫేవరెట్ల జాబితాలో నిలిచింది.
ఆరో టైటిల్ గెలవాలని బ్రెజిల్ భావిస్తోంది.
ఒక వేళ బ్రెజిల్ చాంపియన్‌గా నిలిస్తే 2002 తర్వాత తొలిసారి టైటిల్ గెలిచినట్టవుతుంది.
4. ఏ ఆటగాళ్లపై అంచనాలున్నాయి?
ఎంబాపే, యమల్‌తో పాటు మరికొందరి ఆటను చూడడానికి ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు.
ఫ్రాన్స్ తరఫున మూడోసారి వరల్డ్‌కప్ బరిలోకి దిగిన ఎంబాపే వరుసగా రెండుసార్లు లెస్ బ్లూస్‌ను ఫైనల్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. 2018లో ఫ్రాన్స్ ప్రపంచకప్‌ను ముద్దాడింది. 2022లో ఓడిపోయింది.
స్పెయిన్ జట్టుకు ఆడుతున్న యమల్ కొత్త తరం ప్రతిభకు ప్రతినిధిలా ఉన్నాడు. అతను ఫుట్‌బాల్ భావితారగా ఎదిగే అవకాశముంది.
గత రెండు దశాబ్దాలుగా ఫుట్‌బాల్‌ను శాసిస్తున్న అర్జెంటీనా ఆటగాడు లియోనాల్ మెస్సీ, పోర్చుగల్‌కు చెందిన క్రిస్టియానో రొనాల్డోపై అందరిదృష్టీ సహజంగానే ఉంటుంది.
జూన్ చివరి నాటికి మెస్సీకి 39ఏళ్లు వస్తాయి. రొనాల్డో 41ఏళ్లొస్తాయి. రిటైర్మెంట్‌కు ముందు వారిద్దరికీ ఇది చివరి భారీ టోర్నమెంట్ అయ్యే అవకాశముంది.
బ్రెజిల్ ఆటగాడు నేమార్, వినిసియస్ జూనియర్, ఇంగ్లండ్‌కు చెందిన జ్యూడ్ బెల్లింగ్‌హామ్, అమెరికాకు చెందిన క్రిస్టియన్ పులిసిక్, కెనడా క్రీడాకారుడు అల్ఫాన్సో డేవియస్, దక్షిణకొరియాకు చెందిన హీంగ్-మిన్, ఘనా ఆటగాడు ఆంటోయిన్ సెమెన్యో, నార్వేకు చెందిన ఎర్లింగ్ హాలాండ్ ఎలా ఆడతారనేదానిపై అందరి దృష్టి ఉంది. చివరి నాలుగు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ సీజన్లలో మూడింటిలో ఎర్లింగ్ అత్యధిక గోల్స్ నమోదు చేశాడు.
5. తొలిసారి ఆడుతున్న జట్లేవి?
వరల్డ్‌కప్ విస్తృతిని పెంచడంతో ఈ సారి ఇంకొన్నిదేశాలు పాల్గొనే అవకాశం ఏర్పడింది. ఇంతకుముందెప్పుడూ వరల్డ్ కప్ ఆడని జట్లు ఈ టోర్నమెంట్‌లో తొలిసారి తలపడనున్నాయి.
కేవలం లక్షా 56 వేల మంది జనాభా ఉన్న క్యురాకో ఈ వరల్డ్‌కప్‌లో చారిత్రక అరంగేట్రం చేస్తోంది. ఇంత చిన్న దేశం వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవ్వడం ద్వారా 2018లో ఐస్‌లాండ్ నెలకొల్పిన రికార్డును అధిగమిస్తోంది.
ఐదు లక్షల జనాభా ఉన్న మరో చిన్న ఐలాండ్ కేప్ వెర్డె కూడా తొలిసారి వరల్డ్‌కప్ ఆడుతోంది. వరల్డ్‌కప్ ఆడే దేశాల్లో మూడో చిన్న దేశం ఇది.
ఫుట్‌బాల్‌లో ఇటీవల గణనీయ విజయాలు సాధించిన జోర్డాన్ తొలిసారి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది.
మొరాకోకు చెందిన జమాల్ సెల్లామీ జోర్డాన్ ఫుట్‌బాల్ టీం హెడ్ కోచ్‌గా ఉన్నారు. జట్టును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినందుకు గుర్తింపుగా జమాల్ సెల్లామీకి జోర్డాన్ కింగ్ అబ్దుల్లాII ఆ దేశ పౌరసత్వం ఇచ్చారు.
తొలిసారి వరల్డ్‌కప్ ఆడుతున్న జట్లలో ఉజ్బెకిస్తాన్ కూడా ఒకటి. ఈ జట్టు హెడ్ కోచ్ ఫాబియో కాన్నావరోకు ఎంతో అనుభవం ఉంది. క్రీడాకారుడిగా ఫాబియో కాన్నావరో నాలుగు వరల్డ్‌కప్పుల్లో ఆడాడు. 2006 టోర్నమెంట్‌లో అతని నేతృత్వంలోనే ఇటలీ విజేతగా నిలిచింది.
6. ఏ మ్యాచ్‌లపై ప్రేక్షకులకు ఆసక్తి ?
ఫుట్‌బాల్ కేవలం ఒక ఆట కాదు. రాజకీయాలు, చరిత్ర కూడా కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌ల్లో కీలకపాత్ర పోషిస్తాయి.
జూన్ 16న జరిగే ఫ్రాన్స్, సెనెగల్ మ్యాచ్‌పై రెండు దేశాల మధ్య సంబంధాలను నిర్వచించే వలసపాలన చరిత్ర ప్రభావం ఉంటుంది. సెనెగల్ 2002 వరల్డ్ కప్‌లో ప్రపంచ చాంపియన్‌గా బరిలో నిలిచిన ఫ్రాన్స్‌ను ఓడించింది.
అలాగే వలస పాలనతో సంబంధమున్న ఘనా, ఇంగ్లండ్ కూడా ఫిలడెల్ఫియాలో ఈ నెల 23న తలపడతాయి.
ఇరాన్, ఈజిప్టులు సియాటిల్‌లో ఒక మ్యాచ్ ఆడతాయి. నగరంలోని ఎల్జీబీటీ కమ్యూనిటీకి గౌరవ సూచకంగా స్థానికులు ఆ మ్యాచ్‌కు ప్రైడ్ మ్యాచ్ అని పేరు పెట్టారు. దీనిపై రెండు దేశాల ఫుట్‌బాల్ సమాఖ్యలు అభ్యంతరం వ్యక్తంచేసి, ఫిఫాకు అధికారికంగా ఫిర్యాదుచేశాయి.
స్వలింగ సంబంధాలను రెండు దేశాలూ క్రిమినల్ నేరాలుగా ప్రకటించడంతో ఈ మ్యాచ్‌పై వాటి దృక్పథం ఎలా ఉంటుందనే దానిపై అందరి దృష్టి నెలకొంది. అమెరికాతో యుద్ధం సాగుతుండగానే అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టోర్నమెంట్‌లో ఇరాన్ ఆడబోతోంది.
గ్రూప్ స్టేజ్‌లో ఇరాన్ ఆడే మ్యాచ్‌లన్నీ అమెరికాలో జరగనున్నాయి. అయితే ఇరాన్ జట్టు మెక్సికోలో బస చేసి అక్కడి నుంచి మ్యాచ్‌లు ఆడేందుకు అమెరికా వెళుతుంది.
1974 తర్వాత హైతీ వరల్డ్ కప్ తిరిగి ఆడనుంది. స్కాట్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. స్కాట్లాండ్ కూడా 28ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్ ఆడనుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)