ఎమ్మెల్యే ఇళయరాజా: ‘స్పీకర్‌కు వ్యతిరేకంగా ఓటేస్తే రూ. 35 కోట్లు ఇస్తామన్నారు’

తమిళనాడు, రాజకీయాలు, సీఎం విజయ్, టీవీకే, డీఎంకే

ఫొటో సోర్స్, Ilayaraja

ఫొటో క్యాప్షన్, ముఖ్యమంత్రి విజయ్‌తో ఎమ్మెల్యే ఇళయరాజా
    • రచయిత, విజయానంద్ ఆరుముగం
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

జోసెఫ్ విజయ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నించారనే ఆరోపణలతో తమిళనాడు పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.

ఉత్తన్‌గరై అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్.ఇళయరాజా (టీవీకే ) ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టారు.

అసెంబ్లీ స్పీకర్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసేందుకు తనకు 35 కోట్ల రూపాయలు ఇస్తామన్నారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు.

పోలీసులు పత్రికా ప్రకటన ద్వారా ఈ కేసు వివరాలు వెల్లడించారు.

అరెస్టైన నిందితులకు డీఎంకే సీనియర్ నేత సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్‌తో సంబంధాలు ఉన్నాయని టీవీకే ఆరోపిస్తోంది. అయితే, ఈ ఆరోపణలు నిరాధారమని డీఎంకే ఖండించింది.

ఈ కేసులో అరెస్టైన ముగ్గురిని కోర్టులో హాజరుపరచగా, వారికి జూలై 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.

ఎమ్మెల్యే ఇళయరాజా జూన్ 29న చెన్నై మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'కుటుంబానికి కూడా బెదిరింపులు'

ఎమ్మెల్యే ఫిర్యాదులో "కొద్దిరోజుల కిందట తిరునావుక్కరసు అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి, తాను 'ఇండియన్ పొలిటికల్ డెమొక్రటిక్ స్ట్రాటజీస్ (ఐపీడీఎస్)' అనే సంస్థను నడుపుతున్నానని, ఒక ప్రధాన పార్టీకి చెందిన కొందరి తరఫున నన్ను కలవాలనుకుంటున్నట్టు చెప్పారు" అని పేర్కొన్నారు.

ఆ ఫోన్ కాల్ కట్ చేసినప్పటికీ, వారు మళ్లీ తనను సంప్రదించారని, స్పీకర్‌‌పై ప్రవేశపెట్టిన తీర్మానానికి సంబంధించి తమకు అనుకూలంగా ఓటు వేయాలని కోరారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అందుకోసం రూ.35 కోట్లు ఇవ్వజూపారని ఎమ్మెల్యే ఇళయరాజా ఆరోపించారు. "ఇకపై నాతో మాట్లాడాల్సిన అవసరం లేదని వారికి తేల్చిచెప్పాను" అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే, ఈ విషయం బయటపెడితే తాను, తన కుటుంబం తీవ్రపరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారని ఇళయరాజా తెలిపారు.

"ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రతినిధికి లంచం ఇవ్వజూపినందుకు, తమకు అనుకూలంగా ఓటు వేయాలంటూ ఒత్తిడి చేసినందుకు, నా కుటుంబాన్ని బెదిరించినందుకు సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని ఎమ్మెల్యే ఇళయరాజా తన ఫిర్యాదులో కోరారు.

ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు, ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న చెన్నైకి చెందిన తిరునావుక్కరసును పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, తిరుచ్చికి చెందిన నరేశ్, చెన్నైకి చెందిన త్యాగరాజన్‌లను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. డీఎంకే మాజీ మంత్రి, ప్రస్తుత కోయంబత్తూర్ సౌత్ శాసన సభ్యుడు అయిన సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్ కుమార్‌ను నరేశ్ చెన్నైలో కలిసినట్లు దర్యాప్తులో తేలింది.

సెంథిల్ బాలాజీ, అశోక్ కుమార్ సూచనలతోనే తిరునావుక్కరసు ఎమ్మెల్యే ఇళయరాజాను సంప్రదించినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

తమిళనాడు, రాజకీయాలు, సీఎం విజయ్, టీవీకే, డీఎంకే, పోలీసులు

ఫొటో సోర్స్, GCP

'10 మంది ఎమ్మెల్యేలతో బేరసారాలు'

లంచం ఇవ్వజూపారని ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఇళయరాజాతో బీబీసీ మాట్లాడింది.

"ఫిర్యాదులోనే నేను అన్ని వివరాలూ వెల్లడించాను. వారు నాకు కాల్ చేశారు. వారు మాట్లాడిన విషయాలేవీ నాకు సబబుగా అనిపించలేదు" అని ఎమ్మెల్యే అన్నారు.

"నాతో మాట్లాడిన వ్యక్తి ఏ పార్టీ పేరూ ప్రస్తావించలేదు. ఒక ప్రధాన పార్టీ తరఫున మాట్లాడుతున్నానని మాత్రమే చెప్పారు. ఎవరి పేరూ చెప్పలేదు. ఆయన మాటల ద్వారా నాకు అర్థమైంది ఇదే."

"ఇదే విషయానికి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు, ఒక మంత్రితో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన నాతో చెప్పారు. ఇది చాలా కీలక విషయం కాబట్టి, నేను వెంటనే పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాను. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను" అని ఆయన వివరించారు.

తమిళనాడు, రాజకీయాలు, సీఎం విజయ్, టీవీకే, డీఎంకే

ఫొటో సోర్స్, X/CTR Nirmalkumar

ఫొటో క్యాప్షన్, తమిళనాడు ఇంధన శాఖ మంత్రి నిర్మల్ కుమార్

మంత్రి నిర్మల్ కుమార్ ఏమన్నారు?

తమిళనాడు ఇంధన శాఖ మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎమ్మెల్యేకు డబ్బులు ఆశ చూపారన్న ఆరోపణల కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు.

"ఈ కేసులో అరెస్టైన నరేశ్‌కు సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్‌తో నేరుగా సంబంధాలు ఉన్నాయి" అని ఆయన అన్నారు. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారనీ, సమగ్ర దర్యాప్తు జరుగుతోందనీ వెల్లడించారు.

మరోవైపు, రాజీనామా చేయాలంటూ ఇద్దరు ఎమ్మెల్యేలను ఒత్తిడి చేసిన కుట్రలో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో ప్రమేయముందని ఆరోపిస్తూ డీఎంకే సంస్థాగత కార్యదర్శి ఆర్.ఎస్. భారతి తమిళనాడు గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్‌కు లేఖ రాశారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.

‘‘వాళ్ల దగ్గర ఏవైనా సాక్ష్యాధారాలు ఉంటే, వాటిని సమర్పించాలి. అసెంబ్లీలో మా బలం 120" అని నిర్మల్ కుమార్ అన్నారు.

తమిళనాడు, రాజకీయాలు, సీఎం విజయ్, టీవీకే, డీఎంకే

ఫొటో సోర్స్, X/RS Bharathi

ఫొటో క్యాప్షన్, డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్‌.ఎస్. భారతి

డీఎంకే ఏమందంటే..

మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ చేసిన ఆరోపణలపై డీఎంకే సంస్థాగత కార్యదర్శి ఆర్‌.ఎస్. భారతితో బీబీసీ మాట్లాడింది.

"దానితో డీఎంకు ఎలాంటి సంబంధం లేదు. అసత్య, నిరాధారమైన ఆరోపణలపై స్పందించలేం" అని అన్నారు.

"డీఎంకే గుర్తుపై పోటీ చేసి, గెలిచిన ఎండీఎంకే ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని కోరినట్లు వైగో ప్రకటన చేశారు. ఈ కేసులో వారిని అరెస్టు చేస్తే, ఆ విషయంలో వారిని కూడా అరెస్టు చేయాలి" అని భారతి అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.