కారులో మృతదేహం.. ఏంటని అడిగితే ‘రెండు రోజుల కిందట నాన్ వెజ్ ఉంచానని చెప్పిన నిందితుడు’.. మృతురాలి తండ్రి ప్రోద్బలంతోనే హత్య జరిగిందంటున్న పోలీసులు

ఫొటో సోర్స్, UGC
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
(ఈ కథనంలో కలచివేసే అంశాలు ఉండొచ్చు)
కారు డిక్కీలో మూటకట్టి ఉంచిన మహిళ మృతదేహం దొరికిన కేసులో మృతురాలి ప్రియుడిని అరెస్ట్ చేసినట్లు వరంగల్ కమిషనరేట్ పోలీసులు తెలిపారు.
‘ఈ హత్యను పరోక్షంగా ప్రోత్సహించిన మృతురాలి తండ్రి’ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
'మృతురాలి వేధింపుల నుంచి తప్పించుకోవడానికి ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని నిందితులిద్దరూ నిర్ణయం తీసుకున్నారు' అని కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి ‘బీబీసీ’తో చెప్పారు.
ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు.. ఆ మృతదేహాన్ని మాయం చేసే ప్రయత్నాల్లో ఉండగానే విచారణలో దొరికారని ఏసీపీ పేర్కొన్నారు.

వరంగల్ పోలీసులు, స్థానికులు కొందరు బీబీసీకి వెల్లడించిన వివరాల ప్రకారం..
ఆగస్టు 21న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి బస్టాండ్ సమీపంలో పార్క్ చేసిన కారులో నుంచి కుళ్లిన వాసన రావడంతో స్థానికులు పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందించారు.
'పంచాయతీ వార్డు మెంబర్ ఒకరు ఇచ్చిన సమాచారంతో కారు దగ్గరికి వెళ్లి చూశాం. దుర్వాసన వస్తుండటం గమనించాం. చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాను' అని ఎల్కతుర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి వజ్జేపల్లి శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
నాలుగు రోజులు కారులోనే
కార్యదర్శి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆ కారు యజమాని దామెర గ్రామానికి చెందిన సురేందర్‌గా గుర్తించారు.
అయితే కొంతకాలం క్రితం రూ. 2 లక్షల అప్పుకోసం ఎల్కతుర్తికి చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి సమ్మిరెడ్డి కుటుంబానికి సురేందర్ తన కారును తాకట్టు పెట్టినట్టు, ప్రస్తుతం ఆ కారును ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన రెండో కొడుకు యడెల్లి వినోద్ కుమార్ వాడుతున్నట్టు దర్యాప్తులో తేలింది.
'నిందితుడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కారు యజమాని నుంచి మరో తాళం తీసుకుని తెరిచి చూస్తే బెడ్ షీట్‌లలో చుట్టిఉన్న మహిళ మృతదేహం కనిపించింది. కారు ఫ్రంట్ సీట్‌లో దొరికిన ఆధార్ కార్డ్ ఆధారంగా మృతురాలు పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీకి చెందిన అంకతి మానస(35) గా గుర్తించాం. ఆతర్వాత విచారణలో నిందితుడు నేరంఅంగీకరించాడు' అని ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
ఇది బయటి వ్యక్తుల పని అయుంటుందని, ఎక్కడో హత్య చేసి శవాన్ని ఇక్కడ వదిలేసివెళ్లి ఉంటారని మొదట భావించామని ఎల్కతుర్తి సర్పంచ్ మునిగడప లావణ్య బీబీసీతో అన్నారు.
'నిందితుడు తన ఇంటికి కేవలం పది మీటర్ల దూరంలో కారులో శవాన్ని దాచే ధైర్యం చేస్తాడని ఊహించలేదు. కారులో నుంచి వస్తున్న దుర్వాసనపై ప్రశ్నిస్తే.. డిక్కీలో రెండు రోజుల కింద నాన్ వెజ్ ఐటమ్ పెట్టానని, అది కుళ్లిపోయి ఉంటుందని సమాధానం ఇచ్చారు' అని సర్పంచ్ లావణ్య తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 18న కరీంనగర్‌లో ఈ హత్య జరిగింది.

ఫొటో సోర్స్, UGC
ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు
నిందితుడికి, మృతురాలికి చిన్నప్పటి నుంచే పరిచయమని, ఇద్దరూ క్లాస్‌మేట్స్ అని ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
'ఇద్దరి తండ్రులూ సింగరేణి ఉద్యోగులే. గోదావరిఖని ప్రాంతంలోని బొగ్గుగనుల్లో పనిచేస్తూ, సమీపంలోని సెంటినరీ కాలనీలో నివసించే వారు. నిందితుడు వినోద్ తండ్రి సమ్మిరెడ్డి తన రిటైర్మెంట్ తర్వాత స్వగ్రామం ఎల్కతుర్తిలో సెటిల్ అయ్యారు' అని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
'మానసకు రెండు వివాహాలు జరిగాయి. ప్రస్తుతం రెండో భర్తతో విడాకుల కేసు కోర్టులో ఉంది. ఆమె తల్లిదండ్రుల వద్దే సెంటినరీ కాలనీలో ఉంటున్నారు.
మరోవైపు వినోద్ ఇంజనీరింగ్ చదువును మధ్యలో ఆపేసి, ప్రస్తుతం కరీంనగర్‌లో ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.
ఇటీవల కాలంలో మానస, వినోద్‌ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తరచూ సెంటినరీ కాలనీ నుంచి కరీంనగర్‌లోని వినోద్ రూమ్‌కు వచ్చివెళ్లేది. మానస వైవాహిక జీవితం, వ్యక్తిగత ప్రవర్తనతో (చెప్పినట్టు వినకపోవడం, తల్లిదండ్రులపై భౌతిక దాడి చేయడం) ఆమె తల్లిదండ్రులు ఇబ్బందిపడ్డారని మా విచారణలో తెలిసింది.
మరోవైపు పెళ్లి కోసం మానస తనపై చేస్తున్న ఒత్తిడిని ఆమె తండ్రి రాజేశంతో పంచుకునేవాడు వినోద్.
ఈ క్రమంలో వారిద్దరూ మానసను అడ్డు తొలగించుకోకపోతే సమస్యలు తప్పవని అనుకున్నారు.
మానస తండ్రి నుంచి కూడా మద్దతు దొరకడంతో ఆగస్టు 18న అర్ధరాత్రి కరీంనగర్‌లోని తన రూమ్‌లో మానసను హత్య చేశాడు వినోద్.
తర్వాత తాను వాడుతున్న కారు డిక్కీలో శవాన్ని తీసుకుని సుమారు 70 కిలోమీటర్లు ప్రయాణించి తన స్వగ్రామం ఎల్కతుర్తిలో తన ఇంటికి సమీపంలో పార్క్ చేశాడు' అని ఏసీపీ ప్రశాంత్ రెడ్డి వివరించారు.
'హత్య చేశాక శవాన్ని ఏం చేయాలో తెలియక వినోద్ అయోమయంలో పడ్డాడు. చివరకు తమ ఇంటి పొలంలో పాతిపెట్టాలని అనుకూలమైన సమయం కోసం చూశాడు. ఈ క్రమంలో ఆగస్టు 18 నుంచి 21 వరకు సుమారు నాలుగు రోజు కారు డిక్కీలోనే మానస శవం ఉండిపోయింది. చివరకు విచారణలో పట్టుబడ్డాడు' అని పోలీసులు తెలిపారు.
ఈ కేసు అంశంపై వినోద్ కుటుంబ సభ్యులు ఒకరు బీబీసీతో మాట్లాడుతూ... 'ఇలాంటిది మా కుటుంబంలో జరుగుతుందని ఊహించలేదు. ఇంకేం మాట్లాడలేం' అని అన్నారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఒకసారి విచారణకు వచ్చిన మానస తండ్రి రాజేశం ఆ తర్వాత తన పేరు బయటకు వస్తుందన్న అనుమానంతో ప్రస్తుతం పరారీలో ఉన్నారని, హత్య కరీంనగర్‌లో జరిగినందున తదుపరి కేసు విచారణ కరీంనగర్ వన్ టౌన్‌కు బదిలీ చేశామని ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
ఈ కేసు విషయంలో మానస సంబంధీకులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించగా.. వారెవరూ అందుబాటులోకి రాలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































