‘ఒళ్లంతా పుట్టుమచ్చలే.. నాలాంటి చర్మం ఎవరికీ ఉండదు.. అందుకే దాన్ని ప్రేమించడం నేర్చుకున్నా’

ఫొటో సోర్స్, Laura Kelly
- రచయిత, మైక్ మెక్‌బ్రైడ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
పుట్టుకతో వచ్చిన అరుదైన జన్యుపరమైన చర్మ సమస్య కారణంగా ఈ 28 ఏళ్ల మహిళ శరీరంలో 98 శాతం భాగం పుట్టుమచ్చలే ఉన్నాయి.
ఎన్నో ఏళ్లుగా తన రూపాన్ని దాచుకునేందుకు ప్రయత్నించిన తర్వాత ఇప్పుడు దాన్ని అంగీకరించడం నేర్చుకుంటున్నానని చెప్పారు.
లారా కెల్లీ 1998లో పుట్టుకతో వచ్చే మెలనోసైటిక్ నేవస్ అనే చర్మ సమస్యతో జన్మించారు. చిన్నతనంలో ఆమెకు 14 శస్త్రచికిత్సలు జరిగాయి. ఆమె ఎనిమిదేళ్లకు మించి బతకకపోవచ్చని అప్పట్లో వైద్యులు చెప్పారు.
ఈ చర్మ సమస్య కారణంగా ఎదుటివారు తనను ఎలా చూస్తారోనన్న ఆందోళనతో తాను చాలా ఆత్మన్యూనతకు గురయ్యానని లారా చెప్పారు. టీనేజ్‌లో ఉన్నప్పుడు తన చర్మం కనిపించకుండా ఉండేందుకు ఎక్కువ మేకప్ వేసుకోవడంతో పాటు, దుస్తులను కూడా జాగ్రత్తగా ఎంచుకునేవారని తెలిపారు.
తన రూపాన్ని అంగీకరించడం, ఈ చర్మ సమస్యపై అవగాహన కల్పించడం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని లారా చెప్పారు. తన కథను పంచుకోవడం ద్వారా తమ శరీరంలో కనిపించే భిన్నత్వంతో జీవిస్తున్న ఇతరులకు కూడా సహాయం చేయగలనని ఆమె ఆశిస్తున్నారు.


ఫొటో సోర్స్, Laura Kelly
కాంజెనిటల్ మెలనోసైటిక్ నేవస్ అంటే ఏంటి?
కాంజెనిటల్ మెలనోసైటిక్ నేవస్ లేదా సీఎంఎన్ అనేది సాధారణంగా ఒక రకమైన పుట్టుమచ్చ. చర్మంలో పిగ్మెంట్‌ను ఉత్పత్తి చేసే కణాల సంఖ్య పెరగడం వల్ల ఇది ఏర్పడుతుంది. అయితే కొన్ని సీఎంఎన్‌లు పుట్టిన తర్వాత మొదటి ఏడాది లేదా రెండేళ్లలో కూడా కనిపించచ్చు.
గర్భంలో శిశువు అభివృద్ధి చెందుతున్న సమయంలో ఒక కణంలో సంభవించే జన్యుపరమైన మార్పు వల్ల సీఎంఎన్ ఏర్పడుతుంది. ఇది తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించదు. ఇది ఎవరికైనా సంభవించవచ్చు.
చిన్న పరిమాణంలో ఉండే సీఎంఎన్‌లు సాధారణమే. ప్రతి 100 మంది నవజాత శిశువుల్లో ఒకరిలో ఇవి కనిపిస్తాయి. అయితే పెద్దవిగా లేదా శరీరమంతటా విస్తరించి ఉండే సీఎంఎన్ లు చాలా అరుదు. ప్రతి 10,000 నుంచి 20,000 జననాల్లో ఒకరిలో మాత్రమే ఇవి కనిపిస్తాయి. బ్రిటన్‌లో ఏటా సుమారు 7,000 మంది శిశువులు ఏదో ఒక రకమైన సీఎంఎన్‌తో జన్మిస్తున్నట్లు అంచనా.
పెద్ద పరిమాణంలో లేదా ఒకటి కంటే ఎక్కువ సీఎంఎన్‌లు ఉన్నవారిలో పుట్టిన తర్వాత మరిన్ని పుట్టుమచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా జీవితంలోని తొలినాళ్లలో ఇవి ఎక్కువగా కనిపించవచ్చు. ఎన్ని పుట్టుమచ్చలు ఏర్పడతాయనేది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. అవి ఏర్పడే విధానాన్ని పరిశీలించడం ద్వారా ఈ పరిస్థితి భవిష్యత్తులో ఎలా కొనసాగవచ్చో వైద్యులు అంచనా వేయగలరు.

ఫొటో సోర్స్, Laura Kelly
'పుట్టుమచ్చలున్న అమ్మాయిగానే అందరికీ తెలుసు'
డెర్రీ నౌ ప్రచురించిన కథనం ప్రకారం, లారా 1998లో ఈ పరిస్థితితో జన్మించినప్పుడు వైద్యులు ఆశ్చర్యపోయారు.
"నా తల్లిదండ్రులకు అది ఎంత భయానకంగా ఉండేదోనని నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. అప్పట్లో సీఎంఎన్ గురించి పెద్దగా అవగాహన లేదనే చెప్పాలి" అని లారా బీబీసీతో చెప్పారు.
కౌంటీ లండన్ డెర్రీలోని ఒక చిన్న కమ్యూనిటీ డ్రేపర్‌స్టౌన్‌లో పెరిగిన లారా, తన తోటి పిల్లలు, ఉపాధ్యాయులు తనను ఇతర పిల్లల మాదిరిగానే చూసినందుకు తాను చాలా అదృష్టవంతురాలినని చెప్పారు.
"నేను, పుట్టుమచ్చలున్న చిన్న అమ్మాయిగానే అందరికీ తెలుసు" అని లారా చెప్పారు.
"నేను ప్లేస్కూల్‌కు వెళ్లినప్పటి నుంచి అప్పర్ సిక్స్త్ వరకు నాతో కలిసి చదువుకున్న పిల్లల్లో ఒక్కరు కూడా నా ముఖం లేదా శరీరంపై పుట్టుమచ్చలు ఉన్నాయని వచ్చి చెప్పలేదు."
అయితే టీనేజ్‌లోకి అడుగుపెట్టిన తర్వాతే తన రూపం పట్ల తన వైఖరి మారడం ప్రారంభమైందని లారా చెప్పారు.
"అందరితో పోలిస్తే నేను భిన్నంగా ఉన్నానని ఆలోచించకుండా పెరిగాను. కానీ టీనేజ్ వయసుకు వచ్చేసరికి అదే నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది."
తన పుట్టుమచ్చల గురించి మరింతగా ఆందోళన చెందడం ప్రారంభించానని, వాటిని దాచేందుకు మేకప్ ఉపయోగించడం మొదలుపెట్టానని లారా చెప్పారు. చివరికి తల నుంచి పాదాల వరకు మేకప్‌తో కప్పుకునే పరిస్థితికి వచ్చానని తెలిపారు.
"మేకప్ లేకుండా నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళేదాన్ని కాదు" అని ఆమె చెప్పారు.
తన శరీరంలో వీలైనంత తక్కువ భాగం కనిపించేలా దుస్తులను కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకునేదానినని లారా చెప్పారు.
"నేను ఎవరినైనా కలిసిన ప్రతిసారీ... నా గురించి వారికి చెప్పాల్సిందే అనిపిస్తుంది. నేను మొదటగా చెప్పే విషయం అదే 'నేను పుట్టుకతోనే పుట్టుమచ్చలతో జన్మించాను' అని. అలా చెప్పాల్సిన అవసరం లేదని నాకు తెలుసు. కానీ చెప్పాల్సిందే అనిపిస్తుంది."

ఫొటో సోర్స్, Laura Kelly
'బయట షార్ట్స్ వేసుకోవడం గర్వంగా అనిపించిన క్షణం'
ఇతరులకు తాను ఆత్మవిశ్వాసంతో కనిపించినప్పటికీ, ఇంటికి వెళ్ళగానే తలుపులు మూసుకున్న తర్వాత తనకు మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేదని లారా చెప్పారు. కొన్నిసార్లు బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లేందుకు కూడా తనను తాను ప్రోత్సహించుకోవాల్సి వచ్చేదని తెలిపారు.
అయితే క్యారింగ్ మ్యాటర్స్ నౌ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా సీఎంఎన్ ఉన్న ఇతరులను కలవడం తనలో మార్పు తీసుకొచ్చిందని చెప్పారు.
"నాలా కనిపించే వ్యక్తిని నేను మొన్నటి వరకు కూడా ఎప్పుడూ కలవలేదు. అందుకే ఇన్నేళ్లుగా ఇలా కనిపించే వ్యక్తిని ప్రపంచంలో నేను ఒక్కదాన్నే అనుకునేదాన్ని" అని లారా చెప్పారు.
గత కొన్ని నెలల్లో తన ఆత్మవిశ్వాసంలో వచ్చిన భారీ మార్పును తన కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా గమనించారని లారా తెలిపారు.
ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో తన పుట్టుమచ్చలు మరింత కనిపించేలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఇటీవల వేడి వాతావరణం కొనసాగిన సమయంలో మొదటిసారి బయటకు షార్ట్స్ వేసుకుని వెళ్లినట్లు తెలిపారు.
గతంలో తన రూపాన్ని దాచేందుకు ఎంతో శ్రమించిన తనకు, షార్ట్స్ వేసుకోవడం వంటి సాధారణ విషయం కూడా ఎంతో పెద్ద మైలురాయిగా అనిపించిందని లారా చెప్పారు. ఇప్పుడు క్రమంగా తన రూపాన్ని అంగీకరించడం నేర్చుకుంటున్నానని తెలిపారు.
"ఇప్పుడు నా శరీరాన్ని కొంచెం ఎక్కువగా బయటకు చూపించుకోవడం, నన్ను నేను అంగీకరించడం ప్రారంభించాను.
"భిన్నంగా ఉండటం ప్రత్యేకత. ప్రత్యేకంగా ఉండటం పరిపూర్ణంగా ఉండటం కంటే మెరుగైందని అంటాను."
ప్రస్తుతం ఒక్కో రోజును ఒక్కో విధంగా ఆస్వాదిస్తున్నానని లారా చెప్పారు. ఏదో ఒక రోజు ఎలాంటి మేకప్ లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లాలనేది తన లక్ష్యమని తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా తన చర్మాన్ని దాచుకున్న తర్వాత, తాను ఇంత దూరం వచ్చినందుకు గర్వంగా ఉందని లారా చెప్పారు. తమ శరీరంలో కనిపించే భిన్నత్వంతో జీవిస్తున్న ఇతరులు కూడా తమ రూపాన్ని అంగీకరించడం నేర్చుకోవాలని ఆమె ఆశిస్తున్నారు.
"ఆత్మవిశ్వాసం ఒక్క రాత్రిలో రాదు. అస్సలు రాదు. దానికి సమయం పడుతుంది. ఆత్మన్యూనతకు గురికావడం కూడా సహజమే, భిన్నంగా అనిపించడం కూడా సహజమే. "
"నాకు దాదాపు 13 ఏళ్ల వయసు నుంచి ఒక జత షార్ట్స్ వేసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళే రోజొస్తుందని కలలో కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడు అది నిజమవుతోంది. దాని గురించి నేను గర్వపడుతున్నానే అని చెప్పాలి."
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































