నడక ప్రాథమిక హక్కు: వాహనాలకు ఉన్న విలువ మనిషి నడకకు లేదా?

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, ఇండియా కరస్పాండెంట్
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
నా జీవితంలో ఎక్కువ భాగం భారత్‌లోని నగర వీధుల్లో నడవడం ఒక హక్కుగా కాకుండా.. అడ్డంకులతో నిండిన మార్గంలో ప్రయాణించడంగానే అనిపించింది.
నేను కోల్‌కతాలో పెరిగాను. రోడ్డుసైడు వ్యాపారులతో నిండిపోవడం వల్ల అక్కడి వెడల్పైన ఫుట్‌పాత్‌లు కనిపించకుండాపోయేవి. ఆ తర్వాత దిల్లీకిమారాను. అక్కడ రోడ్లన్నీ కేవలం కార్ల కోసమే రూపొందించారా అన్నట్టు ఉండేవి. ప్రస్తుతం నేను గురుగ్రామ్‌లో ఉంటున్నా. ఇక్కడి ఫుట్‌పాత్‌లు చెత్తకుప్పలు, రాళ్లురప్పలు, అడ్డంగా నిలిపిన వాహనాలతో, లేదా నిర్మాణ సామగ్రితోనూ నడవడానికి వీల్లేకుండా ఉంటాయి. లేదంటే ఫుట్‌పాత్‌లు రోడ్డుకంటే ఎత్తుగా, అసౌకర్యంగా ఉంటాయి.
అందుకే సురక్షితమైన నడకకు నిర్దేశించిన ఫుట్‌పాత్‌లపై నడక ప్రాథమిక హక్కు అని భారత సుప్రీం కోర్టు కిందటి జూన్‌లో ప్రకటించినప్పుడు, అది న్యాయవ్యవస్థ క్రియాశీలకంగా వ్యవహరించినట్టుగా కాకుండా దశాబ్దాల ఆలస్యం తరువాత గుర్తించిన ఓ సహజమైన విషయంలా అనిపించింది.
రవాణా వ్యవస్థలో నడక అత్యంత ప్రజాస్వామ్యబద్ధమైన రూపం. అయినా భారతీయ నగరాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేసిన అంశం కూడా ఇదే. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం.
భారత్ ప్రధానంగా కాలినడకన వెళ్లేవారి దేశం. జనాభా లెక్కల అంచనాల ప్రకారం, ప్రతిరోజూ దాదాపు 4.5 కోట్ల మంది కాలినడకనే తమ పనులకు వెళుతుంటారు. అదే సొంత కార్లు, జీపులు లేదా వ్యాన్లలో ప్రయాణించే వారి సంఖ్య కేవలం 54 లక్షలు మాత్రమే.


ఫొటో సోర్స్, AFP via Getty Images
63 శాతం ప్రయాణాలు కాలినడకనే
పట్టణాల్లో పనిచేసే వారిలో దాదాపు మూడో వంతు మంది నడిచే ఆఫీసులకు వెళ్తుంటారు. అలాగే ప్రతి బస్సు లేదా మెట్రో ప్రయాణం నడకతోనే మొదలై, నడకతోనే పూర్తవుతుంది. ఇక పిల్లలను బడికి తీసుకెళ్లడం, షాపింగ్ పనులు, ఇతర రోజువారీ ప్రయాణాలను కూడా కలిపితే.. నగర రవాణాలో నడకదే అగ్రస్థానం. ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో 2019లో జరిపిన ఒక సర్వే ప్రకారం.. మొత్తం ప్రయాణాల్లో 63% ప్రయాణాలు కాలినడకనే సాగాయి. అంటే రహదారులను ఉపయోగించే వారిలో పాదచారులదే అతిపెద్ద సమూహం.
వీరిలో చాలామంది పరిశోధకులు చెప్పే "పరిస్థితులకు బందీలైన పాదచారులు" అంటే ఇతర రవాణా మార్గాన్ని భరించే స్థోమత లేక ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో కాలినడకనే నమ్ముకున్నవారు. ముఖ్యంగా మహిళలు నడకపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. కానీ, ట్రాఫిక్ దిగ్బంధానికి, కాలుష్యానికి అత్యల్పంగా కారణమయ్యే ఈ ప్రజలే.. రోడ్లపై అత్యధిక ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు.
ఆధారాలు చాలా భయంకరమైన నిజాన్ని చూపుతున్నాయి. ఫుట్‌పాత్‌లు ఉన్న చోట్ల కూడా అవి తరచుగా పాడైపోయి, ఇరుకుగా ఉండటం లేదా వృద్ధులు, పిల్లలు, వికలాంగులు ఉపయోగించలేని స్థితిలో ఉండటం కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
పాదచారులకు అనుకూలంగా లేని రహదారులు
ఫుట్‌పాత్‌లపై మోటార్‌సైకిళ్లు నిలపడం, కార్లు పార్క్ చేయడం, ఆక్రమణలకు గురవడం, లేదా విద్యుత్, నీటి వంటి సౌకర్యాల పనుల కోసం తవ్వేయడం వల్ల ఫుట్‌పాత్‌లు పనికిరాకుండా పోతున్నాయి. రోడ్డుపై ఉన్న జీబ్రా క్రాసింగ్‌ల రంగులు మసకబారిపోవడంతో, వాటిని ఎవరూ గౌరవించని సాధారణ రోడ్డు గీతల్లా చూస్తున్నారు. ఫ్లైఓవర్లు వాహనాలు వేగంగా వెళ్లేందుకు ఉపయోగపడుతున్నా, పాదచారులు మాత్రం వాటి కింద ప్రమాదకరమైన మార్గాల్లో తిరిగి వెళ్లాల్సి వస్తోంది.
భారత్‌లోని ఆరు నగరాలపై 2011లో నిర్వహించిన ఒక కీలక అధ్యయనం"నాసిరకం, సురక్షితం కాని" మౌలిక సదుపాయాల కారణంగా పాదచారులకు అనుకూలంగా రహదారులు లేవని తేలింది.
ఆసియా నగరాల కోసం పనిచేసే క్లీన్ ఎయిర్ ఇనిషియేటివ్ (CAI-Asia) విడుదల చేసిన 'వాక్‌బిలిటీ ఇన్ ఇండియన్ సిటీస్' నివేదికలో, సర్వే చేసిన నగరాలకు 100 మార్కుల వాక్‌బిలిటీ స్కోరుకు గాను కేవలం 47 మాత్రమే వచ్చింది. ముఖ్యంగా ప్రజా రవాణా కేంద్రాల వద్ద పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని నివేదిక పేర్కొంది. చాలా మంది ప్రయాణాలు నడకతోనే ప్రారంభమై, నడకతోనే ముగిసే ప్రాంతాలు అవే.
ఐఐటీ దిల్లీకి చెందిన రవాణా నిపుణురాలు గీతమ్ తివారి చెప్పినట్లుగా పాదచారులను "రహదారి వ్యవస్థల అంచులకు నెట్టేశారు''. దీంతో వారు వాహనాలతో స్థలం కోసం పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీనికి మూల్యం మాత్రం ప్రాణాలతో చెల్లించాల్సి వస్తోంది.

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
పట్టణ ప్రణాళిక తీరును ప్రశ్నించిన సుప్రీం తీర్పు
రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో సుమారు ఐదో వంతు మంది పాదచారులేని అధికారిక గణంకాలు చెబుతున్నాయి. అయితే తివారి ప్రస్తావించిన స్వతంత్ర అధ్యయనాలు మాత్రం ఈ వాటా వాస్తవానికి 30 నుంచి 40 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి.
రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారుల తర్వాత అత్యధికంగా ప్రాణాలు కోల్పోతున్న వారు పాదచారులే.దిల్లీ, ముంబై నగరాల్లో అయితే మొత్తం రోడ్డు ప్రమాద మరణాల్లో సగానికి పైగా పాదచారులే ఉన్నారు. ప్రపంచ బ్యాంకు అధ్యయనం ప్రకారం, రోడ్డు ప్రమాదాల వల్ల ఉత్పాదకత తగ్గడం, వైద్య ఖర్చులు పెరగడం, శాశ్వత వికలాంగత్వం వంటి కారణాలతో భారత్‌కు ఏటా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సుమారు 3 నుంచి 5 శాతం వరకు నష్టం వాటిల్లుతోంది.
సుప్రీంకోర్టు విచారించిన కేసు కూడా అలాంటి ఒక విషాద ఘటన నుంచే వచ్చింది. తన తండ్రితో కలిసి పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్న ఐదేళ్ల బాలుడిని ఓ లారీ ఢీకొనడంతో మరణించాడు.
ఈ ఘటనపై న్యాయమూర్తి పి.ఎస్. నరసింహ మాట్లాడుతూ, "నడక అత్యంత సాధారణ మానవ చర్య. అది మనిషి జీవితంతో విడదీయరాని బంధం కలిగి ఉంది" అని పేర్కొన్నారు. అందువల్ల ప్రజలు సురక్షితంగా నడిచేలా ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. "గుర్తించిన ఫుట్‌పాత్‌లపై నడిచే పౌరుల ప్రాథమిక హక్కు, మోటారు వాహనాల సౌకర్యం కంటే ఎప్పుడూ పైచేయి కలిగి ఉంటుంది" అని ఆయన తీర్పులో పేర్కొన్నారు.
ఈ తీర్పు, దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత పట్టణ ప్రణాళిక విధానాన్నే ప్రశ్నిస్తోంది. ఇంతకాలం అభివృద్ధిని ఎక్స్‌ప్రెస్‌వేలు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల పొడవుతో కొలిచారు. వాహనాలు వీలైనంత వేగంగా వెళ్లేలా రహదారులను రూపొందించారు. కానీ ప్రతి పౌరుడు ఎప్పుడో ఒకప్పుడు పాదచారిగా మారతారనే విషయం గురించి ఈ ప్రణాళికల్లో పెద్దగా ఆలోచించలేదు.

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
పాలనా వ్యవస్థలోని లోపాలే కారణం
ముంబైలో ఈ పరిస్థితిని మార్చేందుకు పదేళ్లకు పైగా కృషి చేస్తున్న రిషి అగర్వాల్ మాట్లాడుతూ, "కొత్త కార్ల గురించి అందరికీ తెలుసు. కానీ నడక అనే అంశం ప్రజల దృష్టి నుంచి కనుమరుగైపోయింది" అన్నారు.
తన సంస్థ 'వాకింగ్ ప్రాజెక్ట్' ద్వారా నగరాల్లో నడక కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, ప్రజలు గమనించడం మానేసిన విషయాలను మళ్లీ గుర్తించేలా చేస్తున్నారు. "ప్రజలు నిర్లక్ష్యంగా మారితే, వీధుల్లో ఏమి జరుగుతుందో గమనించడమే మానేస్తారు" అని ఆయన అంటున్నారు.
రోజూ సుమారు 1.5 కోట్ల మంది నడిచి ప్రయాణాలు చేసే ముంబై వంటి నగరంలో, కనిపించకుండా పోయింది కేవలం ఫుట్‌పాత్‌లు మాత్రమే కాదని, వాటిపై ఆధారపడే లక్షలాది మంది ప్రజలే అని రిషి అగర్వాల్ అంటున్నారు.
ఈ సమస్యకు ప్రధాన కారణం పాలనా వ్యవస్థలోని లోపాలే అంటున్నారు దిల్లీ ఐఐటీకి చెందిన రవాణా పరిశోధకుడు రాహుల్ గోయెల్.
"ఫుట్‌పాత్‌లను సక్రమంగా నిర్వహిస్తున్నారా? వాటిని శుభ్రంగా ఉంచుతున్నారా? వాటిపై ఆక్రమణలు జరగకుండా నగర పాలక సంస్థలు చూస్తున్నాయా?" అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
"దిల్లీలో చాలా రోడ్లకు ఫుట్‌పాత్‌లు ఉన్నాయి. కానీ సరైన నిర్వహణ లేకపోవడంతో అవి చాలా సందర్భాల్లో ఉపయోగించలేని స్థితిలో ఉంటాయి" అని ఆయన చెప్పారు.
సరైన ప్రణాళిక లేకుండా రూపొందించిన నిర్మాణాలు పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. రోడ్డు అంచున కార్లను పార్క్ చేయడం వల్ల ఫుట్‌పాత్‌లు కనిపించకుండా పోవడం లేదా పూర్తిగా మూసుకుపోవడం జరుగుతోంది. అలాగే, నేరుగా ఫుట్‌పాత్‌లపైనే వాహనాలను పార్క్ చేయడం కూడా సాధారణంగా కనిపించే దృశ్యమే.
చాలా చోట్ల ఫుట్‌పాత్‌లు పాదచారుల సంఖ్యకు సరిపోని విధంగా ఇరుకుగా ఉంటాయి. మరికొన్ని చోట్ల అవి రోడ్డుతో పోలిస్తే చాలా ఎత్తుగా ఉండటంతో వృద్ధులు, వీల్‌చైర్ ఉపయోగించే వారు, అలాగే కదలికల్లో ఇబ్బందులు ఉన్నవారు వాటిని ఉపయోగించడం కష్టమవుతోంది. ఇంకొన్ని చోట్ల ఫుట్‌పాత్‌లు మధ్యలోనే అకస్మాత్తుగా ముగిసిపోవడంతో, పాదచారులు మళ్లీ రోడ్డుపైనే నడవాల్సి వస్తోంది.
"ఫుట్‌పాత్‌లు ఎక్కువ దూరం లేకపోతే , రోడ్డుపై నడవడమే ప్రజలకు మరింత సౌకర్యంగా అనిపిస్తుంది" అని గోయెల్ అంటున్నారు.
"మన పట్టణ రవాణా వ్యవస్థ ఇప్పటికీ వాహనాల రాకపోకలకే ప్రాధాన్యం ఇస్తోంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, మోటారు వాహనాలకు ఎక్కువ రోడ్డు స్థలం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఉంది. పాదచారుల అవసరాలు మాత్రం రెండో స్థానంలోనే ఉంటున్నాయి" అని ఆయన చెప్పారు.
కోర్టు ఆదేశం ఒక్కటే సరిపోదు
ఫుట్‌పాత్‌లను వెడల్పు చేయడానికి కూడా పౌర సంస్థలు తరచూ వెనుకంజ వేస్తుంటాయి. ఎందుకంటే రోడ్డు మీద వాహనాలు వెళ్లే భాగాన్ని తగ్గించడం వీటికి ఇష్టం ఉండదు. ప్రజల నుంచి వచ్చే ఒత్తిడి కూడా ఈ ఆలోచనను మరింత బలపరుస్తోందని గోయెల్ అభిప్రాయపడుతున్నారు.
ట్రాఫిక్ జామ్‌లే వార్తల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ఎక్కువగా కనిపిస్తుండటంతో, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడడంపైనే అధికారులు ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. దిల్లీలో అనేక ప్రాంతాల్లో రోడ్డు మధ్యలోని పాదచారుల క్రాసింగ్‌లను తొలగించి, వాటి స్థానంలో యూ-టర్న్‌లు ఏర్పాటు చేశారు. దీంతో పాదచారులు తప్పనిసరిగా ఫుట్ ఓవర్‌బ్రిడ్జిలనే ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
"ప్రజలు రోడ్డుపై నడవడమే కాదు, దాన్ని సురక్షితంగా దాటగలిగే అవకాశం కూడా ఉండాలి" అని రాహుల్ గోయెల్ అంటున్నారు.
దీని ఫలితంగా నగరాల్లో స్పష్టమైన అసమానత కనిపిస్తోంది.
గురుగ్రామ్‌లో వేగంగా వెళ్లే వాహనాల కోసం నిర్మించిన ప్రధాన రహదారి, రద్దీగా ఉండే నివాస ప్రాంతాల మధ్యుగా వెళ్తోంది. అయితే అక్కడ సురక్షితంగా రోడ్డు దాటేందుకు తగిన ఏర్పాట్లు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో గృహ సహాయకులు, కూలీలు, ఇతర పాదచారులు వేగంగా దూసుకొచ్చే వాహనాల మధ్య ప్రాణాలను పణంగా పెట్టి రోడ్డు దాటాల్సి వస్తోంది. ఇలా రోడ్డు దాటే ప్రయత్నంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరణాల సంఖ్య పెరిగిన తర్వాతే అధికారులు అక్కడ ఫుట్ ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణాన్ని ప్రారంభించారు.
భారతదేశంలోని అనేక నగరాల్లో కారు లేదా మోటార్‌సైకిల్ కొనుగోలు చేసే స్థోమత లేని ప్రజలు సరైన సౌకర్యాలు కూడా లేని రోడ్లపై ప్రాణాలను పణంగా పెట్టి నడవాల్సి వస్తోంది.
వాహనాలు నడిపే అవకాశం ఉన్నవారు మాత్రం ప్రజా స్థలంలో మరింత ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తున్నారు. మరోవైపు నడక గేటెడ్ కమ్యూనిటీలు, పార్కులు లేదా జిమ్‌లలోని ట్రెడ్‌మిల్లులకే పరిమితమైన వినోద కార్యకలాపంగా మారుతోంది. ఊబకాయం, జీవనశైలి సంబంధిత వ్యాధులు పెరుగుతున్న దేశంలో, ఆరోగ్యానికి అత్యంత అవసరమైన వ్యాయామమైన నడకను నగరాలు అసౌకర్యంగా మాత్రమే కాకుండా, చాలా సందర్భాల్లో ప్రమాదకరంగానూ మార్చేశాయి.
స్పష్టంగా చెప్పాలంటే, ప్రజలు సురక్షితంగా నడిచే పరిస్థితులను కల్పించాలంటే కోర్టు ఆదేశం ఒక్కటే సరిపోదు.
"నడకను ప్రాథమిక హక్కుగా గుర్తించడం వల్ల కేవలం పాదచారులకు అనుకూలమైన రోడ్లు మాత్రమే కాదు, పాదచారులకు అనుకూలమైన నగరాలు కూడా ఏర్పడాలి" అని గీతమ్ తివారి అన్నారు.

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
పుట్‌పాత్‌లు ఓ సమగ్ర వ్యవస్థలా ఉండాలి
నగరాల రూపకల్పన విధానాన్ని పూర్తిగా పునరాలోచించాల్సిన అవసరం ఉంది. పాదచారుల భద్రత కోసం కొన్ని దేశాలు అది ఎలాంటి రోడ్డు అనే దాంతో సంబంధం లేకుండా నగరాల్లో గంటకు 30 కిలోమీటర్లు (20 మైళ్లు) వేగ పరిమితిని సాధారణ నిబంధనగా అమలు చేస్తున్నాయి. అలాంటి లక్ష్యాన్ని సాధించాలంటే, రోడ్లను పునర్నిర్మించాల్సి ఉంటుందని గీతమ్ తివారి చెబుతున్నారు. అందులో ట్రాఫిక్ లేన్ల వెడల్పు తగ్గించడం, రోడ్ల ఉపరితలాన్ని మార్చడం, వాహనాల వేగాన్ని నియంత్రించే ఇతర ఉంటాయి.
న్యాయమూర్తులు నడకను కేవలం ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లే మార్గంగా మాత్రమే కాకుండా, అంతకంటే గొప్పదిగా అభివర్ణించారు. "కొంతమందికి అది జీవనావసరం, మరికొందరికి ధ్యానం, ఇంకొందరికి నిరసన వ్యక్తం చేసే మార్గం, మరికొందరికి కొత్త విషయాలను తెలుసుకునే పయనం" అని వారు పేర్కొన్నారు. అలాగే, భారత స్వా తంత్య్ర ఉద్యమాన్ని రూపుదిద్దడంలో కూడా నడక కీలక పాత్ర పోషించిందని వారు గుర్తు చేశారు.
రచయిత్రి సుమనా రాయ్ పేర్కొన్నట్లుగా, భారత రాజకీయ చరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలు నడకతోనే ముడిపడి ఉన్నాయి. మహాత్మా గాంధీ దండి ఉప్పు సత్యాగ్రహ యాత్ర నుంచి, సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన "చలో దిల్లీ" పిలుపు వరకు, ఆ తర్వాత జరిగిన అనేక నిరసన ప్రదర్శనల వరకు నడక ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది.
నడకపై ఉన్న ఈ విస్తృతమైన అవగాహనే నగరాల నిర్మాణంలో కూడా ప్రతిబింబించాలి. "నడక కేవలం ఒక ప్రయాణ మార్గం మాత్రమే కాదు" అని గీతమ్ తివారి చెబుతున్నారు.
" సురక్షితంగా నడవడానికి రూపొందించేమౌలిక సదుపాయాలు అంటే కేవలం ఫుట్‌పాత్‌లు రోడ్డు సురక్షితంగా ప్రదేశాలు ఏర్పాటు చేయడమే కాదు. వీధి వ్యాపారులకు స్థలం, కాస్త నీడనిచ్చే చెట్లు, వృద్ధులు విశ్రాంతి తీసుకునే వెసులుబాటు, కొన్నిచోట్ల పిల్లలు ఆడుకునేలా కూడా కాలిబాటలకు సమగ్రమైన రూపం ఇవ్వాలి'' అంటారు తివారీ.
దశాబ్దాలుగా భారత నగరాలు "మరిన్ని వాహనాలను ఎలా నడిపించాలి?" అనే ప్రశ్నకే సమాధానం వెతుకుతున్నాయి. అయితే దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పుడు "ప్రజలు సురక్షితంగా నడవడం ఎలా?"అనే సరళమైన ప్రశ్నను భారతీయ నగరాలకు గుర్తు చేసింది
నా కోరిక చాలా సాధారణమైనది. ఒక వీధి మొదటి నుంచి చివరి వరకు ఎలాంటి ఆటంకం లేకుండా నన్ను సురక్షితంగా తీసుకెళ్లే ఫుట్‌పాత్ ఉంటే చాలు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























