ఒంగోలు పాలిటిక్స్‌లో బాలినేని వర్సెస్ దామచర్ల: ఎన్డీఏ కూటమి సోషల్ మీడియాలో ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది?

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయ చర్చకు తెరలేపాయి.

ఏపీలో అధికార ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలకు చెందిన ఇద్దరు సీనియర్‌ నేతలు బహిరంగంగానే తీవ్రస్థాయిలో ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో.. తాజాగా ఎన్డీఏ సోషల్‌ మీడియా కో-ఆర్డినేషన్‌ కమిటీ నుంచి ఆగస్ట్ 11న ఒక ప్రకటన వచ్చింది.

"ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టి, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో తమలో తామే విభేదాలు సృష్టించుకోవడం మిత్ర ధర్మానికి విరుద్ధం" అని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

అయితే ‘‘బాలినేని వ్యవహారం వీటన్నింటికీ అతీతమైందని, ఆయన విషయాన్ని కచ్చితంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తాన’’ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బీబీసీతో అన్నారు.

మరోవైపు బాలినేని కూడా ‘‘ఈ విషయాన్ని నేను ఇప్పటికే తమ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకువెళ్లా, ఆయన పరిశీలిస్తానని నాతో చెప్పార’’ని బీబీసీతో అన్నారు.

వివాదానికి కారణమేంటి?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండున్నరేళ్ల పాటు మంత్రిగా వ్యవహరించిన నాటి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ మీద వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తర్వాత కొద్ది కాలానికే.. అంటే 2024 సెప్టెంబర్‌లో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు.

"బాలినేని జనసేనలో చేరినప్పుడు దామచర్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కూటమి పార్టీల సఖ్యత నేపథ్యంలో తర్వాత కాలంలో వీరిద్దరి మధ్య విభేదాలు పూర్తిగా సమసిపోకపోయినా... మళ్లీ రాజుకునేంత పరిస్థితి ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ ఎన్నికలకు ముందు నుంచే బాలినేని, దామచర్ల మధ్య ఉన్న రాజకీయ వైరం ఆ తర్వాత ఓ విధంగా వ్యక్తిగత వైరంగా మారినట్టు కనిపిస్తోంది" అని బీబీసీతో ఒంగోలుకు చెందిన వామపక్ష నేత గోపి వ్యాఖ్యానించారు.

‘‘దీనిని సాకుగా తీసుకుని అధికారులు.. ముఖ్యంగా పోలీసులు ఒంగోలు నగరంలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నార’’ని ఆయన ఆరోపించారు.

సీఐ వ్యవహార శైలిపై ఆరోపణలతో తాజా వివాదం

ఒంగోలు నగరంలోని తాలూకా పోలీస్‌ స్టేషన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ కృష్ణ కేంద్రంగా బాలినేని, దామచర్ల మధ్య ఆరోపణలకు, ప్రత్యారోపణలు సాగాయి.

ఈనెల 9న బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ, సీఐ విజయ్‌కృష్ణ ఉద్దేశపూర్వకంగా తన వర్గీయులను ఇబ్బందిపెడుతున్నారన్నారు. తన సన్నిహితుడొకరికి ముందస్తు బెయిల్‌ వచ్చినా సీఐ ఆయన్ను అక్రమంగా నిర్బంధించి వేధించారని, స్టేషన్లలోనే పంచాయితీలు చేస్తున్నారని బాలినేని ఆరోపించారు.

‘‘ఈ సీఐని వివిధ ఆరోపణలపై పోలీసు ఉన్నతాధికారులు నెలకింద వీఆర్‌ (వేకెన్సీ రిజర్వ్‌)కి పంపిస్తే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మళ్లీ ఇదే పోలీస్‌ స్టేషన్‌కి ఆయన్ను సీఐగా తెచ్చి అక్రమ వసూళ్లు చేయిస్తున్నారు’’ అని బాలినేని ఆరోపించారు.

‘‘ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన సీనియర్‌ నేతనైన నేను ఫోన్‌ చేసినా సీఐ లెక్కలేకుండా మాట్లాడుతున్నారు. జనసేన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారు’’ అని ఆయన విమర్శించారు.

రౌడీయిజం కుదరదు: దామచర్ల

బాలినేని ఆరోపణలపై అదే రోజు సాయంత్రం దామచర్ల జనార్దన్‌ ఒంగోలులోనే మీడియా సమావేశం నిర్వహించారు.

"వైఎస్సార్‌సీపీ హయాంలో బాలినేని అవినీతి గురించి చెప్పాలంటే పుస్తకాలు కూడా సరిపోవు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసినట్టు బాలినేని ఇప్పుడు కూడా రౌడీయిజం చేస్తామంటే కుదరదు. నాపై చేసిన ఆరోపణలపై, అక్రమాలపై కాణిపాకంలో ప్రమాణం చేయగలరా?

బాలినేని కూటమిలో ఉన్నారనే మేము ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాం. కానీ ఆయన అమావాస్యకోసారి ఒంగోలు వచ్చి విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మాపై 79 కేసులు పెట్టారు. బాలినేని పార్టీ మారకుండా ఉండుంటే ఈపాటికి తండ్రీకొడుకులిద్దరినీ లోపల వేసేవారు" అని దామచర్ల వ్యాఖ్యానించారు.

జనసేన లేకపోతే మీరు గెలిచేవారా?: బాలినేని

ఎమ్మెల్యే దామచర్ల ఆరోపణలపై 11వ తేదీన బాలినేని మరోసారి మీడియా సమావేశం పెట్టారు.

తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలనీ, తనపై వాడిన పరుషమైన భాషను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని బాలినేని వ్యాఖ్యానించారు.

‘‘జనార్దన్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఒంగోలులో స్వతంత్రంగా పోటీ చేయాలి. నేను కూడా స్వతంత్రంగా పోటీ చేస్తా. అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది. నేను 30వేల మెజార్టీతో గెలుస్తా. ఒకవేళ నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అని బాలినేని అన్నారు.

అసలు జనసేన లేకపోతే మీరు ఎమ్మెల్యేగా గెలిచేవారా అని బాలినేని ప్రశ్నించారు.

తనపైనా, జనార్దన్‌పైనా విచారణ జరిపించాలని, కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధమని, జనార్దన్‌ కూడా చేస్తారా అని ప్రశ్నించారు.

‘‘నేను జనసేనలో పార్టీలో చేరి ఉండకపోతే లోపల వేసేవారని ఎమ్మెల్యే జనార్దన్‌ అన్నారు. నేను అవినీతికి పాల్పడ్డానంటే సీఎం చంద్రబాబుకు చెప్పి విచారణ జరిపించాలని దామచర్లకు సవాల్‌ చేస్తున్నా. నేను కూడా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు చెప్పి దామచర్లపై విచారణ చేయిస్తా. ఒంగోలులో జరిగే అవినీతి చూడలేకే హైదరాబాద్ వెళ్లి కూర్చుంటున్నా’’ అని బాలినేని అన్నారు.

‘ఇక ఎవరూ మాట్లాడొద్దు’

కాగా, ఈనెల 11న బాలినేని మరోసారి ప్రెస్‌మీట్‌ పెట్టిన తర్వాత విషయం మరీ రచ్చకెక్కకుండా ఇరు పార్టీల అధిష్ఠానాలు స్పందించాయని, ఇక దీనిపై ఇద్దరూ మాట్లాడవద్దంటూ ఆదేశాలు వచ్చాయన్న ప్రచారం జరిగింది.

దీనిపై ప్రకాశం జిల్లాకే చెందిన జనసేన నేత, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ బీబీసీతో మాట్లాడారు.

"ఈ విషయంపై బాలినేనిని ఇక మాట్లాడొద్దని పార్టీ అధిష్ఠానం స్పష్టం చేసింది. ఆయన మాలాంటి నాయకులు, కార్యకర్తల కోసమే గట్టిగా నిలబడ్డారు. అయితే కూటమి సఖ్యత దృష్ట్యా సానుకూలంగా సమస్యను పరిష్కరించాలని తమ పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది" అని అరుణ చెప్పారు.

ఇదే అంశంపై ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి బీబీసీతో మాట్లాడారు. ఈ వివాదం విషయంలో కూటమి పార్టీల నేతలపై బహిరంగ విమర్శలు చేయొద్దని తమ పార్టీ నాయకత్వం స్పష్టం చేసిందని, ఏదైనా సమస్యలుంటే అధిష్ఠానంతో సంప్రదించాలని సూచించిందని చెప్పారు.

బాలినేనిపై సీఎంకి ఫిర్యాదు చేస్తా : దామచర్ల

అయితే ఈ వివాదంపై తమ పార్టీ నుంచి తనతో ఎవరూ మాట్లాడలేదని దామచర్ల జనార్దన్‌ బీబీసీతో అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా కలిసి బాలినేని వ్యవహారశైలిపై తానే ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

"జరిగిన విషయం బాస్‌కి తెలియాలి కదా" అని ఆయన వ్యాఖ్యానించారు.

"అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే సీఎంను కలుస్తా. జనసేనతో గాని, ఆ పార్టీ క్యాడర్‌తో గాని నాకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. మేమంతా కలిసే ఉన్నాం. కానీ బాలినేని జనసేన పేరుతో కూటమి పార్టీల మధ్య రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. ఇది అందరికీ తెలుసు" అని వ్యాఖ్యానించారు.

"బాలినేని మనసులో వేరే ఉద్దేశాలతో రాజకీయాలు చేస్తున్నారు. జనసేనలో ఉన్నారు కానీ ఫెయిర్‌గా లేరు. సీఐ విషయాన్ని అనవసరంగా ఇష్యూ చేస్తున్నారు. సీఐని టార్గెట్‌ చేసి అనవసర ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ అబద్ధాలే" అని ఎమ్మెల్యే బీబీసీతో అన్నారు.

బాలినేనివన్నీ అవాస్తవాలే : సీఐ

బాలినేని చేసిన ఆరోపణలపై స్పందన కోసం తాలూకా పోలీస్‌ స్టేషన్‌ సీఐ విజయ్‌ కృష్ణని బీబీసీ సంప్రదించింది. అవన్నీ రాజకీయ ఆరోపణలని ఆయన వ్యాఖ్యానించారు.

"బాలినేనితో నేనెప్పుడూ పరుషంగా మాట్లాడలేదు. ఆ రికార్డు ఉంటే చూపించండి, వినిపించండి. నేను తప్పు చేస్తే చూడటానికి మా అధికారులు ఉంటారు కదా. మధ్యలో ఈ ఆరోపణలు ఎందుకు? మా పని మేం పక్కాగా చేసుకుంటున్నాం" అని సీఐ విజయ్‌ కృష్ణ బీబీసీతో అన్నారు.

దీనిపై ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ను బీబీసీ సంప్రదించగా.. ‘‘రాజకీయపరమైన వివాదాలు జరుగుతున్నాయి, వాటిలో జోక్యం చేసుకోం, ఈ వివాదంపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేను’’ అన్నారు.

పవన్‌ దృష్టికి తీసుకెళ్లా: బాలినేని

బాలినేని బీబీసీతో మాట్లాడుతూ.. నేను ఒంగోలులో జరిగిన విషయాలను జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లానని, ఆయన పరిశీలిస్తానని చెప్పారని అన్నారు.

"నేను కూటమి ధర్మం పాటిస్తూనే ఉన్నా. ఇందులో అనుమానం లేదు. జిల్లాలో జనసేనను బలోపేతం చేయాలన్నదే నా లక్ష్యం. ఆ మేరకే ఇష్యూ తప్పించి నాకు టీడీపీలో ఎవరితోనూ ఎటువంటి వివాదం లేదు. ఈ ఇష్యూతో కూటమి పొత్తుకు ఇబ్బందులొస్తాయనే వాదనలు చాలా తప్పు" అని ఆయన వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)