విక్రమ్ -1 : ప్రయోగానికి సిద్ధమైన భారత ‘తొలి ప్రైవేటు ఆర్బిటాల్ రాకెట్’.. దీని ప్రత్యేకతలేమిటి?

భారత తొలి ప్రైవేటు ఆర్బిటాల్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన శ్రీహరికోట లాంచ్ పాడ్ నుంచి జులై 18 ఉదయం 11.30కు ఈ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసినట్లు స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ ప్రకటించింది.

హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ ఈ రాకెట్ (లాంచ్ వెహికల్)ను తయారు చేసింది.

దాదాపు నాలుగేళ్ల కిందట ఇదే కంపెనీ విక్రమ్-ఎస్ పేరుతో సబ్ ఆర్బిటాల్ రాకెట్‌ను విజయవంతంగా పరీక్షించింది.

ఇప్పుడు విక్రమ్–1 పేరుతో ఆర్బిటాల్ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది.

"గతంలో 'విక్రమ్-ఎస్'కు 'మిషన్ ప్రారంభ్' అని పేరు పెట్టాం. ఇప్పుడు 'విక్రమ్-1' ప్రయోగానికి 'మిషన్ ఆగమన్' అని పేరు పెట్టాం" అని స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ కో-ఫౌండర్ పవన్ కుమార్ చందన బీబీసీతో చెప్పారు.

విక్రమ్–1 ప్రత్యేకతలేంటి?

విక్రమ్–1 లాంచ్ వెహికల్‌ను 2025 నవంబరులో స్కైరూట్ ఏరోస్పేస్ ఆవిష్కరించింది. ఇది భారత తొలి వాణిజ్య లాంచ్ వెహికల్ అని ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ బీబీసీతో చెప్పారు.

"భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాబాయ్ పేరుపైన ఈ రాకెట్‌కు విక్రమ్-1 అని నామకరణం చేశాం" అన్నారు.

స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ బీబీసీకి అందించిన వివరాల ప్రకారం, విక్రమ్–1 ను 'లోఎర్త్ ఆర్బిట్' (తక్కువ ఎత్తు భూ కక్ష్య)కు ఉపగ్రహాలను తీసుకెళ్లేలా రూపొందించారు. పేలోడ్ సామర్థ్యం కూడా తక్కువే. అంటే దీనికి చిన్న పరిమాణం గల ఉపగ్రహాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది.

ప్రస్తుతానికి 350 కిలోల పేలోడ్‌తో...

"విక్రమ్–1 పేలోడ్ సామర్థ్యం 500 కిలోలు. కానీ, ప్రస్తుతం 350 కిలోల పేలోడ్‌తోనే ఈ ప్రయోగాన్ని చేస్తున్నాం" అని పవన్ కుమార్ బీబీసీతో చెప్పారు.

350 కిలోల బరువున్న ఉపగ్రహాలను 'లో ఎర్త్ ఆర్బిట్' వరకు, 260 కిలోల బరువున్న ఉపగ్రహాలను 'సన్ సింక్రోనస్ ఆర్బిట్' వరకు ఇది మోసుకెళ్లగలదని ఆయన వివరించారు.

భూ ఉపరితలం నుంచి 500 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఇది అంతరిక్షంలోకి ఉపగ్రహాలను తీసుకెళ్లగలదని చెప్పారు.

''ఈ రాకెట్ 40 టన్నుల బరువు, 20 మీటర్ల ఎత్తు (సుమారు ఏడు అంతస్తుల భవనం అంత) ఉంటుంది. దీనికి సెకనుకు 8 కిలోమీటర్ల వెలాసిటీతో ఉపగ్రహాన్ని మోసుకెళ్లే సామర్థ్యం ఉంది'' అని పవన్ కుమార్ తెలిపారు.

ఈ లాంచ్ వెహికల్ 1.7 మీటర్ల వ్యాసంతో, 1200 కిలోన్యూటన్ల (కేఎన్) థ్రస్ట్ సామర్థ్యంతో తయారైందని స్కైరూట్ తెలిపింది. దీని త్రీడీ ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్ కారణంగా సాధారణ ఇంజిన్‌తో పోలిస్తే 50 శాతం తక్కువ బరువుంటుంది. సాలిడ్ ఫ్యూయెల్ బూస్టర్స్, కార్బన్ కంపోజిట్ స్ట్రక్చర్‌ (కార్బన్ ఫైబర్‌తో తయారైనవి) కలిగి ఉందని కంపెనీ చెబుతోంది.

నింగిలోకి 6 రకాల పేలోడ్స్

విక్రమ్-1 ద్వారా ఆరు రకాలైన పేలోడ్స్‌ను నింగిలోకి పంపిస్తున్నట్లు పవన్ కుమార్ బీబీసీతో చెప్పారు.

''భారత్‌లో తయారు చేసిన ఐదు పేలోడ్స్‌తోపాటు జర్మన్ కంపెనీ డీక్యూబడ్ జీఎంబీహెచ్ తయారు చేసిన ఒక పేలోడ్‌ను నింగిలోకి పంపిస్తున్నాం'' అన్నారు.

ఈ స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీని 2018లో ఇస్రో మాజీ ఇంజినీర్లు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా కలసి ఏర్పాటు చేశారు.

2025 నవంబరులో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో 'ఇన్ఫినిటీ క్యాంపస్' పేరుతో ఒక అత్యాధునిక వర్క్‌స్పేస్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకు వచ్చింది.

భారత్‌లో స్పేస్ టెక్నాలజీ రంగంలో యూనికార్న్ హోదా సాధించిన తొలి ప్రైవేట్ కంపెనీగా స్కైరూట్ ఈ ఏడాది మేలో గుర్తింపు సాధించింది.

2022లో 'టెస్ట్ రాకెట్' ప్రయోగం

స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ విక్రమ్–ఎస్ అనే సబ్ ఆర్బిటాల్ రాకెట్‌ను 2022 నవంబర్ 18న ప్రయోగించింది. ఇది భారత్‌లో ఒక ప్రైవేటు కంపెనీ ప్రయోగించిన మొట్టమొదటి రాకెట్‌గా గుర్తింపు పొందింది.

ఇది భూమి ఉపరితలం నుంచి 301.4 సెకన్లపాటు ప్రయాణించి, 88.8 కిలోమీటర్ల ఎత్తులోని భూ ఉపకక్ష్యను చేరుకుంది.

''విక్రమ్-ఎస్ ఒక విధంగా టెస్ట్ రాకెట్. అది విజయవంతం కావడంతో విక్రమ్-1ను తక్కువ వ్యవధిలో అంటే, మూడేళ్లలోనే తయారు చేశాం'' అని పవన్ కుమార్ బీబీసీతో చెప్పారు.

విక్రమ్-ఎస్ మొత్తం మూడు పేలోడ్స్.. బీఏజడ్ఓఓఎంక్యూ ఆర్మేనియా, స్పేస్ కిడ్జ్ ఇండియా, ఎన్-స్పేస్ టెక్ ఇండియాలను తీసుకెళ్లింది.

పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీతో పోల్చితే తేడాలేమిటి?

ప్రస్తుతం ఇస్రో మూడు రకాల లాంచ్ వెహికల్స్ లేదా రాకెట్స్ ద్వారా శాటిలైట్లను నింగిలోకి పంపిస్తోంది. అవి..

  • పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)
  • జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్ఎల్వీ)
  • జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎంకే-3 (ఎల్వీఎం3)

ఇందులో పీఎస్ఎల్వీ 600 కిలోమీటర్ల ఎత్తులో సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్ వరకు 1750 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు.

జీఎస్ఎల్వీ కొంత భారీ ఉపగ్రహాలు మోసుకెళ్లే లాంచ్ వెహికల్. ఇన్‌శాట్ శ్రేణికి చెందిన కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ను ప్రయోగించడానికి ఇస్రో సాధారణంగా ఈ లాంచ్ వెహికల్‌ను ఉపయోగిస్తుంటుంది .

సుమారు 2,250 కిలోల పేలోడ్‌ను జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్స్ (జీటీవో) వరకు ఇది మోసుకెళ్లగలదని ఇస్రో చెబుతోంది. అలాగే లోఎర్త్ ఆర్బిట్ వరకు సుమారు 6వేల కేజీల వరకు మోసుకెళ్లగలదని చెబుతోంది.

ఇక భారీ ఉపగ్రహాలు మోసుకెళ్లేందుకు ఎల్వీఎం3ను ఇస్రో ఉపయోగిస్తుంది. నాలుగు టన్నుల బరువున్న శాటిలైట్లను జీటీవో వరకు ఇది మోసుకెళ్లగలదు. అలాగే లోఎర్త్ ఆర్బిట్ వరకు 8వేల కేజీల బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లగలదని ఇస్రో చెబుతోంది.

ఈ మూడు లాంచ్ వెహికల్స్‌తో పోల్చితే, విక్రమ్–1 చాలా తక్కువ పేలోడ్ సామర్థ్యం కలిగిన చిన్న ఉపగ్రహాలను మాత్రమే మోసుకెళ్లనుంది.

2027లో విక్రమ్-2 ఆవిష్కరణ

విక్రమ్-1 ప్రయోగం తర్వాత విక్రమ్-2ను తీసుకురానున్నామని స్కైరూట్ ప్రకటించింది. దీన్ని 2027లో ఆవిష్కరిస్తామని చెబుతోంది.

దీని పేలోడ్ సామర్థ్యం లోఎర్త్ ఆర్బిట్ వరకు 900 కిలోలు కాగా, సన్ సింక్రోనస్ ఆర్బిట్ వరకు 600 కిలోలుగా స్కైరూట్ కంపెనీ ప్రకటించింది.

దీనిలో కూడా విక్రమ్-1 తరహాలోనే కార్బన్ కాంపొజిట్ నిర్మాణం, అడ్వాన్స్‌డ్ క్రయోజెనిక్ ఇంజిన్ ఉపయోగిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.

స్పేస్ రంగంలో స్టార్టప్పుల పెరుగుదల

కేంద్ర ప్రభుత్వం 2023లో ఇండియన్ స్పేస్ పాలసీ తీసుకొచ్చింది. 2015 నుంచి 2024 మధ్య 393 విదేశీ, మూడు స్వదేశీ కమర్షియల్ శాటిలైట్స్‌ను ఇస్రో ప్రయోగించింది. దీని ద్వారా 439 మిలియన్ యూఎస్ డాలర్ల ఆదాయం సమకూరింది.

భారత స్పేస్ రంగంలో 2024 నుంచి వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ ) అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

గత దశాబ్దకాలంలో స్పేస్ రంగంలో 300కు పైగా స్టార్టప్‌లు ఏర్పాటు అయినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ డేటా ప్రకారం 2025 సెప్టెంబర్ 30 నాటికి 376 స్టార్టప్‌లు కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి. 2022లో ఒకే ఒక్క స్టార్టప్ ఉండగా, 2024 నాటికి ఆ సంఖ్య 200 కంపెనీలకు చేరిందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రకటించింది.

గ్లోబల్ స్పేస్ ఇండస్ట్రీలో భారత్ వాటా 2021లో 2 శాతం (8.4 యూఎస్ బిలియన్ డాలర్లు)గా ఉంది.

ఇది 2033 నాటికి 44 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, ఎగుమతులు 11 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని భారత ప్రభుత్వం అంచనా వేస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)