You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కెమెరా రాకముందు భారతదేశం ఎలా ఉండేది? - 11 ఫోటోలలో...
- రచయిత, సుధా జి.తిలక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
సామ్రాజ్యవాద శక్తికి ఫోటోగ్రఫీ దృశ్య భాషగా మారకముందే, ఓ ఆంగ్ల మహిళ భారతదేశంలో తాను కలిసిన ప్రజలను వారి చిత్రాలను అసాధారణమైన ఆసక్తి, కచ్చితత్వంతో చిత్రించారు.
ఆమే ఎమిలీ ఈడెన్.
ఎమిలీ చాలా ప్రతిభ గల చిత్రకారిణి, రచయిత్రి. బ్రిటన్‌లోనే అత్యంత ప్రభావశీలమైన రాజకీయ కుటుంబానికి చెందిన మహిళ ఆమె.
1830లలో ఆమె తన సోదరుడు జార్జ్ ఈడెన్ (ఫస్ట్ ఎర్ల్ ఆఫ్ ఆక్లాండ్), అప్పటి భారత గవర్నర్ జనరల్‌తో కలిసి ఉత్తర భారతదేశాన్ని పర్యటించారు.
ఈ ప్రయాణంలో ఆమె యువరాజులు, సైన్యాధికారులు, ఆస్థాన ప్రముఖుల చిత్రాలతో పాటు సేవకులు, ప్రయాణికులు, ఫకీర్లు, అఫ్గాన్, సిక్కు నాయకులు, అకాలి యోధులు, కొండ ప్రాంత గిరిజనులు, రాజ బృందంతో ప్రయాణించిన జంతువుల చిత్రాలను గీశారు.
ఆమె సమకాలీనుల్లో చాలామందితో పోలిస్తే ఎమిలీని ప్రత్యేకంగా నిలబెట్టింది ఈ విస్తృత దృష్టికోణమే.
ఆమె చిత్రించిన రెండు డజన్లకు పైగా చిత్రాలు 1844లో 'పోర్ట్రెయిట్స్ ఆఫ్ ది ప్రిన్సెస్ అండ్ పీపుల్ ఆఫ్ ఇండియా' పేరుతో ప్రచురితమయ్యాయి.
ఇప్పుడు ఆ చిత్రాలే దిల్లీలోని డీఏజీ (దిల్లీ ఆర్ట్ గ్యాలరీ) నిర్వహిస్తున్న 'ప్రిన్సెస్ అండ్ పీపుల్' ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
చరిత్రకారిణి మేరీ ఆన్ ప్రయర్ క్యూరేట్ చేసిన ఈ ప్రదర్శనలో, ఈడెన్ వేసిన చిత్రాల ఆధారంగా రూపొందించిన లిథోగ్రాఫ్‌ల (చేతితో రంగులు అద్దినవి) పూర్తి శ్రేణిని ఒకేచోట ప్రదర్శిస్తున్నారు.
ఎమిలీ ఈడెన్ 1836 మార్చిలో కలకత్తా వచ్చారు. అక్కడ ఆమెకు ఒక కొత్త ప్రపంచం తారసపడింది.
స్వదేశంపట్ల బెంగ, కొత్త వాతావరణానికి అలవాటు పడాల్సిన ఒత్తిడి కారణంగా ఆమె మూడు వారాల పాటు ఒక్క చిత్రమూ గీయలేదు. రెండు నెలల పాటు ఒక్క పెయింటింగ్ కూడా పూర్తి చేయలేదు.
అయితే, ఆమెతో కలిసి ఉన్న వ్యక్తులే ఉత్సాహాన్ని నింపారు.
వారిలో ఎమిలీ మేనల్లుడు విలియమ్, సోదరి ఫ్యానీ, పనిమనుషులు, చిన్నారిని చూసుకునే నానీ, వంటమనిషి, సేవకులు, వైద్యులు, పెంపుడు జంతువులు ఉన్నారు.
చిత్రకారిణిగానే కాక రచయిత్రిగానూ ఆమె చేయితిరిగిన వ్యక్తి.
భారతదేశానికి చేరుకునేలోపే కొత్త మనుషులు, సంస్కృతులు, జీవన విధానాలతో పరిచయం ఉండడం వల్ల ఆమె దృక్పథం విస్తరించడం ప్రారంభమైందని చరిత్రకారిణి, రచయిత్రి మేరీ ఆన్ ప్రయర్ పేర్కొంటారు.
"వివిధ రకాల ప్రజలు, ప్రాంతాలు ఎమిలీ కళకు ప్రేరణనిచ్చి దాన్ని మరింత మెరుగుపరిచాయి. అలాగే ఆమె సహజసిద్ధమైన జిజ్ఞాస ఎప్పుడూ భిన్నమైన, అసాధారణమైన అంశాలనే వెతికేది. తన పరిశీలనలను ఆమె స్కెచ్‌లు, చిత్రాల్లో అత్యంత శ్రద్ధతో నమోదు చేశారు" అన్నారు మేరీ.
కోటలు, చర్చ్‌లు, ఇంగ్లండ్ ప్రకృతి దృశ్యాల స్థానంలో ఈడెన్ తన దృష్టిని అపరిచిత వ్యక్తులు, విభిన్న వస్త్రధారణలు, నిర్మాణ శైలి, కొత్త ప్రకృతి దృశ్యాలపై కేంద్రీకరించారు.
1836 నుంచి 1842 మధ్యలో, పెద్ద పెద్ద రాజకీయ మార్పులకు చేరువలో ఉన్న ప్రాంతాలను ఆమె ఆసక్తిగా పర్యటించారు. ఆమె చిత్రాలు మహారాజా రంజిత్ సింగ్ ఆస్థానం గురించి తెలుసుకునే అరుదైన అవకాశం కల్పిస్తాయి.
అప్పటి పంజాబ్ మహారాజు రాజ్యం భారత ఉపఖండంలోని అత్యంత శక్తివంతమైన రాజ్యాల్లో ఒకటి. ఈ చిత్రాలు, ఆయన పాలన చివరి దశను, విక్టోరియన్ యుగం ప్రారంభాన్ని ప్రతిబింబిస్తాయి.
ఆమె డైరీలు హాస్యం, పరిశీలనలతో నిండి ఉంటాయి. వ్యక్తులు, ప్రాంతాల పేర్లను అవి వినిపించినట్లుగానే ఆమె తరచూ రాసేవారు.
బెనారస్ (ప్రస్తుత వారణాసి) చేరుకున్న తర్వాత, ఈడెన్ బృందం గంగా నదిలో ప్రయాణించి సమీపంలోని రామ్‌నగర్‌కు వెళ్లింది. అక్కడ రాజుకు ఒక నివాసం ఉండేది.
అక్కడి దృశ్యం ఎమిలీని అంతగా ఆకట్టుకోలేకపోడంతో "మా స్టీమర్‌ను ఇక్కడే వదిలేసి బయటకు వెళ్లి చిత్రాలు గీయబోతున్నాం" అని రాశారు.
అయితే, ఎమిలీకు ఉత్సాహం వెంటనే కలగలేదు. ప్రారంభంలో ఇంగ్లండ్, భారతదేశాల మధ్య ఉన్న సాంస్కృతిక భేదాలు ఆమెను స్వదేశానికి తిరిగి వెళ్లాలనే తపనకు గురిచేశాయి.
మహిళలు 'బానెట్' అనే ప్రత్యేక టోపీ లేకుండా చర్చిలోకి వెళ్లలేకపోవడం, దోమల బెడద, భరించలేని వేడి, కుక్కలు, కాకులు, నక్కలు, గద్దల శబ్దాలు, రోజులో ఎక్కువసేపు ఇంట్లోనే ఉండాల్సి రావడం ఎమిలీకు అసౌకర్యంగా అనిపించాయి.
అయితే నెలలు గడిచేకొద్దీ ఆమె అనేక చిత్రాలను రూపొందించారు. ఆమె చిత్రాలు మెల్లగా ప్రజాదరణ పొందాయి. సిమ్లాలో నిర్వహించిన ధార్మిక సేవా ప్రదర్శనల్లో అవి వేగంగా అమ్ముడుపోయాయి.
భారతదేశంలోని బ్రిటిష్ ప్రజలు కూడా ఈ చిత్రాలను ప్రశంసించారు. భారతీయ చిత్రకారులు వాటిని అనుకరించడం కూడా ప్రారంభించారు.
ప్రయర్ ప్రకారం, రెజెన్సీ, విక్టోరియన్ కాలాల్లో బ్రిటిష్ మహిళా కళాకారిణులు రూపొందించిన భారతీయ చిత్రాల్లో ఎమిలీ ఈడెన్ చిత్రాలు అత్యుత్తమమైనవిగా నిలిచాయి.
మొక్కల చిత్రాలకు ప్రసిద్ధి చెందిన షార్లెట్ క్యానింగ్, ఆ తర్వాత మేరియన్ నార్త్ మాత్రమే ఆమె స్థాయికి పోటీగా నిలిచారు.
1842లో ఈడెన్ కుటుంబం తిరిగి ఇంగ్లండ్ వెళ్లింది. ఆ తర్వాత కూడా ఎమిలీ చిత్రలేఖనం కొనసాగించారు.
1838లో సిక్కు ఆస్థానాన్ని సందర్శించిన తర్వాత, మహారాజా రంజిత్ సింగ్ పెద్ద కుమారుడు ఖడక్ సింగ్ పరిచారకుల స్కెచ్‌లను ఈడెన్ గీశారు.
వారి సొగసైన వస్త్రాలు, తలపాగాలు, ఎంబ్రాయిడరీతో అలంకరించిన బూట్లు ఆమెను ఆ వస్త్రధారణ పట్ల ఎంతగా ఆకర్షించాయో తెలియజేస్తాయి.
అదే ఏడాది రాసిన లేఖల్లో ఆమె సిక్కులను పదేపదే ‘చూడ ముచ్చటైనవారు’గా అభివర్ణిస్తూ వారి చక్కటి శరీరాకృతిని ప్రశంసించారు.
పైన చిత్రాల్లో ఎడమవైపు ఉన్న వ్యక్తి ధుల్లో, కుడివైపు ఉన్న వ్యక్తి దేదార్ ఖాన్. వీరిద్దరూ కలకత్తాలోని గవర్నమెంట్ హౌస్‌లో ప్రధాన సేవకులు. వారి శీతాకాల యూనిఫామ్‌లలో ఈడెన్ వారి చిత్రాలను గీశారు.
లార్డ్ ఆక్లాండ్ ప్రధాన సేవకులుగా వారి నడుముకు కత్తి ధరించేవారు. అయితే ఇంట్లో మాత్రం చెప్పులు లేకుండానే ఉండేవారు.
అఫ్గానిస్తాన్‌కు చెందిన సంప్రదాయ తెల్లని సల్వార్ కమీజ్, తలపాగా ధరించిన ఈ పష్తూన్ పురుషుల చిత్రాలను గీసింది కూడా ఈడెనే.
వారు ఓ బ్రిటిష్ అధికారి వెంట కాబూల్ నుంచి సిమ్లాకు వచ్చారు. ఈ భేటీని ఆమె "ఇద్దరు అరబ్బులతో సమావేశం"గా వర్ణించారు.
భారతదేశానికి సముద్ర ప్రయాణం చేసిన హెచ్‌ఎంఎస్ జూపిటర్ నౌకలో ప్రయాణిస్తున్న సమయంలో, ఆ క్లిష్టమైన ప్రయాణాన్ని సులభతరం చేసిన నావికుల చిత్రాలతో ఈడెన్ ఒక స్కెచ్‌బుక్‌నే నింపారు.
ఈడెన్ గీసిన అకాలి నిహంగ్ యోధుల చిత్రం, ఎత్తైన తలపాగాలు, నీలి వస్త్రాలు, ఉక్కుతో చేసిన విసురుడు ఆయుధాలకు ప్రసిద్ధి చెందిన సిక్కు సైన్యంలోని ఈ ప్రత్యేక యోధుల ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది.
కలకత్తాలోని ఓ సంపన్న ముస్లిం విద్యార్థి చిత్రాన్ని కూడా ఈడెన్ గీశారు. అందులో ముత్యాలు, పచ్చలతో కూడిన తన గాజులు, నగలు తన తండ్రివి కావని, తనవేనని ఆ విద్యార్థి స్పష్టంగా చెప్పిన విషయాన్ని ఆమె నమోదు చేశారు.
కుడివైపు ఉన్నది ఓ ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె. ఆమె అప్పట్లో అరుదుగా కనిపించే సల్వార్ కమీజ్ ధరించి, నగలు, ఎంబ్రాయిడరీ చేసిన టోపీ ధరించి, చేతిలో బొమ్మ గిలక పట్టుకుని ఉంది.
ఎమిలీ ఈడెన్ హాస్యచతురత కలిగిన రచయిత్రి కూడా.
అయితే, భారతదేశంలోని ప్రకృతి దృశ్యాలు, ప్రజలను చిత్రించాలనే ఆమెకు మొదట్లో కలిగిన బలమైన ప్రేరణ క్రమంగా తగ్గిపోయింది. ఆ తర్వాత ఆమె వేసిన చిత్రాలు చాలా తక్కువే. వాటిలో ఎక్కువగా ఇంగ్లండ్‌లోని సుపరిచిత దృశ్యాలే కనిపిస్తాయి.
ఎమిలీ ఈడెన్ 1869లో మరణించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)