వెంకటేష్, మీనాతోనే దృశ్యం సీక్వెల్, మార్చి 5 నుంచి షూటింగ్: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, FB/Drishyam - Telugu
తెలుగులో దృశ్యం సినిమాలో నటించిన వెంకటేష్, మీనా దాని సీక్వెల్‌లోనూ నటించనున్నారని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.
విజయవంతమైన జోడీగా పేరు తెచ్చుకున్నారు వెంకటేష్ - మీనా. 'చంటి' మొదలుకొని అనేక చిత్రాల్లో కలిసి నటించి, విజయాల్ని సొంతం చేసుకున్నారు.
చివరిగా ఈ జోడీ 'దృశ్యం'తో సందడి చేసింది. దానికి సీక్వెల్‌గా రానున్న 'దృశ్యం 2'తో మరోసారి ఈ జోడీ తెరపై కనిపించనుంది.
మలయాళంలో ఇటీవలే విడుదలై విజయవంతమైన 'దృశ్యం 2'ని, తెలుగులో రీమేక్ చేయనున్నారు.
మాతృకని తెరకెక్కించిన జీతూజోసెఫ్ దర్శకత్వంలోనే సినిమా రూపొందనుంది.
మార్చి 1న ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టబోతున్నట్టు తెలిసిందని, మార్చి 5 నుంచి చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఈనాడు వివరించింది.

ఫొటో సోర్స్, kamdhenu.gov.in
ఆవు పేడతో రేడియేషన్ నుంచి రక్షణ
కేంద్ర పశు సంవర్థక శాఖ పరిధిలో పనిచేసే వెబ్‌సైట్‌లోని పలు విషయాలపై విమర్శలు వస్తున్నాయని ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది.
ప్రమాదకరమైన రేడియేషన్ నుంచి రక్షణ కల్పించే శక్తి ఆవుపేడకు ఉందా? భారత్, రష్యాల్లోని అణుకేంద్రాల్లో.. రేడియేషన్ నియంత్రణకు ఆవుపేడను వాడుతున్నారా?
ఈ ప్రశ్నలకు కేంద్ర పశుసంర్థక శాఖ పరిధిలో పనిచేస్తున్న రాష్ట్రీయ కామధేను ఆయోగ్ అవుననే అంటోంది.
గో విజ్ఞానం (కౌ సైన్స్) పేరుతో దేశవ్యాప్తంగా ఈ నెల 25న నిర్వహించనున్న పరీక్షల్లో భాగంగా.. ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన స్టడీ మెటీరియల్ అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలో ఆవు పేడ కారణంగా చాలా ప్రాణాలు నిలిచాయని పేర్కొంది. భారతీయ ఆవులపై ఉండే మూపురాలకు ప్రత్యేక శక్తి ఉందని వెల్లడించినట్లు ఆంధ్రజ్యోతి రాసింది.
ఆవుల మూపురాల్లోని శక్తి సూర్యకిరణాలను బంగారంగా మారుస్తుందని, అందుకే ఆవుపాలు పసుపువర్ణంలో ఉంటాయని స్పష్టం చేసింది.
గో విజ్ఞాన పరీక్షకు జనవరి 15 నుంచి ఈ నెల 20 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు జరగ్గా.. మొత్తం 5.10 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ వెల్లడించింది.
ఆదివారం నిర్వహించిన మాక్ టెస్ట్‌కు భారీగా స్పందన వచ్చిందని వివరించింది. కాగా.. ఈ పరీక్షను ప్రోత్సహిస్తూ దేశంలోని 900 విశ్వవిద్యాలయాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) లేఖ రాయడాన్ని కొందరు ప్రొఫెసర్లు తప్పుపట్టారని పత్రిక రాసింది.
ఈ చర్య మూఢనమ్మకాలను ప్రోత్సహించేదిగా ఉందని విమర్శించారు. కేరళకు చెందిన ప్రగతిశీల సంస్థ.. 'సాహిత్య పరిషత్' ఈ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేసిందని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ భయం
భారత్‌లో కరోనా కేసులు పెరగడంతో సెకండ్ వేవ్ మొదలైందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నట్లు సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోందనే భయాందోళనలు మొదలయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,264 కేసులు నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది.
వారం రోజుల్లో 86,711 కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 50 వేలకి చేరువలో ఉంది. మొత్తం కేసుల్లో ఇవి 1.32 శాతం.
మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది.
మహారాష్ట్రలో కొత్త స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరంగా మారిందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారని సాక్షి రాసింది.
శరీరంలో యాంటీబాడీలు ఉన్నప్పటికీ ఈ కొత్త స్ట్రెయిన్ వల్ల ఇన్‌ఫెక్షన్ సోకడం ఆందోళన పుట్టిస్తోందని అన్నారు. ఇటీవల కాలంలో కరోనా కొత్త కేసులు అంతగా నమోదు కాకపోవడంతో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించామేమోనన్న అంచనాలకు చాలా మంది వచ్చారు.
కానీ భారత్‌లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమయ్యే పని కాదని డాక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. జనాభాలో 80 శాతం మందికి యాంటీబాడీలు ఉంటేనే అందరూ క్షేమంగా ఉంటారని అన్నారు.
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఆంక్షలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. అత్యధికంగా కరోనా ప్రభావం ఉన్న యావత్మాల్ జిల్లాలో సోమవారం రాత్రి 8 గంటల నుంచి వారంపాటు లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు మంత్రి యశోమతి ఠాకూర్ ప్రకటించారని సాక్షి చెప్పింది.
అకోలా జిల్లాలోని అకోలా, మూర్తిజాపూర్, అకోట్ తదితర పట్టణాల్లో 23 నుంచి లాక్‌డౌన్ అమలవుతుందని అధికారులు చెప్పారు.
నాగపూర్, అమరావతి, బుల్దానా, వాశీం, పుణే, నాసిక్ జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు.
రాష్ట్రంలో వారం రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. 15న 3,365 కేసులు, 21న 6,071 కేసులు బయటపడ్డాయని సాక్షి వివరించింది.

ఫొటో సోర్స్, FB/TRS Party
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కుమార్తె
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ ప్రకటించిందని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ఆయన కుటుంబానికి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అరుదైన గౌరవం ఇచ్చారు.
పీవీ కూతురు.. విద్యావేత్త, చిత్రకారిణిగా గుర్తింపుపొందిన సురభి వాణీదేవిని హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు.
సోమవారం హైదరాబాద్‌లో ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయంతో టీఆర్‌ఎస్ విజయావకాశాలు మరింత పెరిగాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా పీవీకి జనాదరణ ఉన్న నేపథ్యాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు.
తెలంగాణ ముద్దుబిడ్డ పీవీకి గతంలో జరిగిన అవమానాలు, అన్యాయాన్ని దిద్దుకునేందుకు ఇదొక మంచి అవకాశమని కొందరు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారని పత్రిక రాసింది.
వాణీదేవి స్వస్థలం కరీంనగర్ జిల్లా వంగర గ్రామం. ఆమె విద్యాభ్యాసం, వృత్తిజీవితం మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే సాగింది. 1986లో జేఎన్టీయూ నుంచి డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశారు.
విద్యావేత్తగా, చిత్రకారిణిగా, సంఘ సేవకురాలిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. 35 ఏళ్లుగా వందల పెయింటింగ్స్ వేసిన వాణీదేవి.. తన పెయింటింగ్స్‌తో ఇప్పటివరకు 15 ఎగ్జిబిషన్లు నిర్వహించారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్-డీసీలో ఉన్న గాంధీ మెమోరియల్ సెంటర్‌లో 'సారే జహాసె అచ్ఛా' పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహించి రికార్డు సృష్టించారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:
- #MeToo: భారత మీడియాలో వెలుగు చూస్తున్న లైంగిక వేధింపులు
- #BollywoodSexism: బాలీవుడ్, టాలీవుడ్‌లలో లైంగిక వేధింపులపై కథనాలు
- సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు... ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- ప్రపంచంలో ఈ భాష ముగ్గురే మాట్లాడతారు!
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























