You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విశాఖపట్నం: లాభాలు ఏం చేసుకోవాలో అర్థంకాక కంపెనీ మూసేశారు - ప్రెస్ రివ్యూ
మీరు మునగండి, ఆపై అందర్నీ ముంచండి అన్న రీతిలో చేరిన వాళ్లకు 5 శాతం, చేర్పించిన వాళ్లకు 10శాతం రిటర్న్స్ ఇస్తామంటూ ఆశ చూపి వేలమందిని సభ్యులుగా చేర్చుకున్న ఓ ముఠా రూ.7 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఓ కథనం ఇచ్చింది.
ఈ కథనం ప్రకారం విశాఖపట్నానికి చెందిన ఇంజినీరింగ్ డిప్లొమా చదివిన ఓ కుర్రాడు, మరో ముగ్గురు యువకులు కలిసి ఓ బోగస్ కంపెనీ సృష్టించారు. భారతీయ కంపెనీ అంటే ఎవరూ నమ్మరని బ్రిటన్ కంపెనీ పేరుతో మల్టినేషనల్ కంపెనీగా రిజిస్టర్ చేశారు.
వాట్సప్ నెంబర్లు కూడా బ్రిటన్ నంబర్లు ఇచ్చి, డాలర్ల రూపంలో డబ్బులు వసూలు చేశారు. ఇందులో చేరిన వాళ్లకు ప్రతినెలా మంచి కమీషన్ ఇస్తామని ఇంటర్నెట్‌లో ప్రకటనలు ఇచ్చారు. ఆశపడిన కస్టమర్లు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. ఇందులో చాలామంది విద్యావంతులే.
ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బులు పోగవడంతో నలుగురు యువకులకు ఈ డబ్బును రొటేషన్ చేయడం కష్టమేమోన్న భయం పట్టుకుంది. దీంతో కంపెనీని మూసేయాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ నెల నుంచి వెబ్‌సైట్ మాయమైంది.
ఇందులో పెట్టుబడి పెట్టిన హైదరాబాద్‌కు చెందిన ఏఈ ఒకరు అనుమానం వచ్చి వాట్సప్ నంబర్‌కు కాల్ చేయగా అది పని చేయలేదు. దీంతో హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెక్నాలజీని ఉపయోగించి నిందితులు విశాఖపట్నానికి చెందినవారిగా గుర్తించి అరెస్టు చేశారు.
ఏపీ అసెంబ్లీలో నివర్ తుపాను
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అధికార ప్రతిపక్షాల విమర్శలు, ప్రతి విమర్శల నడుము తొలిరోజు వాడివాడిగా సాగాయని సాక్షి దినపత్రిక పేర్కొంది. ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ముందుగా ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే నివర్ తుపాను సృష్టించిన నష్టం, పరిహారం అంశంపై సమావేశాల తొలిరోజున అధికార పక్షాల మధ్య వాగ్యుద్ధం నడిచింది. చంద్రబాబు మాట్లాడేందుకు అనుమతించడంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం, దీనిపై ఆగ్రహించిన చంద్రబాబు స్పీకర్ పోడియం ముందు బైఠాయించడంతో సభలో గందరగోళం నెలకొంది.
సభా వ్యవహారాలకు అడ్డు తగులుతున్నారన్న కారణంతో చంద్రబాబు నాయుడు సహా 12 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. రైతుల తరఫున చెల్లించాల్సిన బీమా ప్రీమియం ప్రభుత్వం చెల్లించలేదనని తెలుగుదేశం వాదించగా, దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా తుపాను బాధితులకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్లు సాక్షి పత్రిక పేర్కొంది.
లాక్‌డౌన్ గురించి చర్చిస్తారా ? ఈ నెల 4 ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశం
కరోనా పరిస్థితిపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారని నమస్తే తెలంగాణ పత్రిక వెల్లడించింది.
ఈ నెల 4న ఉదయం 10.30 గం.లకు ఆన్‌లైన్‌లో జరగబోయే ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభల్లోని అన్ని రాజకీయ పక్షాల ఫ్లోర్ లీడర్లకు ఆహ్వానాలు పంపినట్లు ఈ కథనం పేర్కొంది.
మరోవైపు టీకా సామర్ధ్యానికి సంబంధించిన సమచారాన్ని ప్రజలందరికీ అర్ధమయ్యే భాషలో అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫార్మా కంపెనీలకు సూచించారు. వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న జెనోవా ఫార్మ (పుణె), బయోలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ (హైదరాబాద్) కంపెనీల ప్రతినిధులతో ప్రధానమంత్రి మాట్లాడారు.
పడిపోయిన రోజువారీ కేసులు
దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య గత వారం రోజుల్లో రెండుసార్లు 40వేల దిగువకు పడిపోయిందని ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది. గత 24 గంటల్లో దిల్లీ, కేరళ, మహారాష్ట్ర సహా ఏ రాష్ట్రంలోనూ కొత్త కేసుల సంఖ్య 6 వేలకు మించలేదని ఈ కథనం వెల్లడించింది.
ముఖ్యంగా దేశ రాజధానిలో కేసుల సంఖ్య వరసగా రెండోసారి 5 వేలకు లోపు నమోదైనట్లు తేలిందని ఈ కథనం పేర్కొంది. రోజువారీ మరణాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోందని ఈనాడు తెలిపింది.
కేరళలో కేసుల సంఖ్య తగ్గినా మరణాల సంఖ్య పెరిగింది. తాజాగా కేరళ అత్యధిక కేసుల నమోదులో వరసగా రెండోరోజు మొదటిస్థానంలో నిలిచింది.
మొత్తం మీద దేశవ్యాప్తంగా 24 గంటల్లో 443 మంది మరణించారని, కొత్త కేసులు 38వేలకు పైగా నమోదు కాగా, కోలుకున్న వారి సంఖ్య 45వేలకు పైగా ఉన్నట్లు ఈ కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 19 ఏళ్ల కిందట సర్జరీతో విడిపోయిన ఈ అవిభక్త కవలలు... ఇప్పుడు ఎలా ఉన్నారంటే...
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
- BBC SPECIAL: ఆత్మహత్యకు పాల్పడిన రైతుల పిల్లలకు తల్లి ఒడి లాంటి బడి 'శాంతివన్'
- రైతు దినోత్సవం: కౌలు రైతుల కడగండ్లు తీరేదెన్నడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)