ప్రెస్ రివ్యూ: ‘గాంధీ ఆస్పత్రిలో మందుపార్టీ.. ఒకరి మృతి’

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

హైదరాబాద్‌లో గాంధీ ఆస్పత్రిలోని డాక్టర్లు కరోనా రోగులకు ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తుంటే, కొంతమంది కాంట్రాక్టు సిబ్బంది మద్యం మత్తులో మునిగితేలుతున్నారని సాక్షి కథనం ప్రచురించింది.

ఆస్పత్రి సెల్లార్‌లోని ఓ గదిలో అర్ధరాత్రి వరకు తాగి తర్వాత వేకువజామున ఇంటికి వెళ్లిన వీరిలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి మృతి చెందడం కలకలం రేపిందని సాక్షి రాసింది.

కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో సోదరులైన శ్రీనివాస్, నరేష్, నగేష్‌ కాంట్రాక్టు పద్ధతిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు.

ఆదివారం రాత్రి ఆస్పత్రి సెల్లార్‌లోని సీఎస్‌డీ విభాగానికి చెందిన గదిలో వీరు ముగ్గురితో పాటు మరో ఇద్దరు కలిసి మద్యం, మాంసంతో విందు చేసుకున్నారు. అనంతరం అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగితో మరో ఫుల్‌బాటిల్‌ తెప్పించుకుని అర్ధరాత్రి వరకు తాగి, వేకువజామున ఇళ్లకు వెళ్లారని పత్రికలో రాశారు.

ఇంటికి వెళ్లాక ముగ్గురు సోదరుల్లో ఒకరైన శ్రీనివాస్‌ (38) హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబసభ్యులు భావించారు.

మృతుడు శ్రీనివాస్‌ ఆస్పత్రి స్టెరిలైజేషన్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం శ్రీనివాస్‌ మృతితోపాటు ఆస్పత్రి ప్రాంగణంలో మందు పార్టీ చేసుకున్నట్టు ఆస్పత్రి అధికారులకు తెలిసింది.

దీనిపై విచారణకు ఆదేశించారు. కాగా, శ్రీనివాస్‌ మృతిపై ఫిర్యాదు అందలేదని ఆస్పత్రి అధికారులు చెప్పారని సాక్షి వివరించింది.

అతి తీవ్ర తుఫాన్‌గా మారిన 'ఆంఫన్'

ఆగ్నేయ బంగాళా ఖాతంలో కేంద్రీకృతమైన ‘ఆంఫన్‌’ తుఫాన్‌ ఆదివారం సాయంత్రానికి అతి తీవ్రతుఫాన్‌గా మారిందని ఆంధ్రజ్యోతి వార్త ప్రచురించింది.

పారాదీ్‌పకు దక్షిణంగా 925 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని డిఘాకు దక్షిణ నైరుతిగా 1,108 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉందని తెలిపింది.

రానున్న 24గంటల్లో మరింత బలపడి పెనుతుఫాన్‌గా (ఎక్స్‌ట్రీమ్లీ సీవియర్‌ సైక్లోన్‌) మారనున్నది. ఈ క్రమంలో తొలుత నెమ్మదిగా 12 గంటలపాటు ఉత్తరదిశగా పయనించి ఆ తరువాత దిశమార్చుకుని ఉత్తర ఈశాన్యంగా పయనిస్తుంది.

తరువాత వేగం పెంచుకుంటూ వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్‌ విజయభాస్కర్‌ తెలిపారు.

వాయవ్య బంగాళాఖాతం మీదుగా 20న మధ్యాహ్నం లేదా సాయంత్రం పశ్చిమ బెంగాల్‌లో సాగర్‌ దీవులు, బంగ్లాదేశ్‌లో హతియా దీవుల మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

తుఫాన్‌ ప్రభావంతో కోస్తాంధ్రలో ఆదివారం 30-40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి.

సోమ, మంగళవారాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా, ఉత్తరకోస్తాలో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

రాయలసీమలో 41-43డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారని ఆంధ్రజ్యోతిలో రాశారు.

ఒకే రోజు భారత్‌లో అత్యధిక కేసులు నమోదు

గత 24 గంటల వ్యవధిలో భారత్‌లో దాదాపుగా 5 వేల కేసుల వెలుగు చూశాయని, దేశంలో బాదితుల సంఖ్య 90 వేలు దాటి లక్ష దిశగా వడివిడిగా పరుగులు పెడుతోందని ఈనాడు రాసింది.

కొత్తగా కోవిడ్ వల్ల 120 మరణాలు నమోదు కావడంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 2,872కు పెరిగింది. తాజా మరణాల్లో 67 ఒక్క మహారాష్ట్రలోనే చోటుచేసుకోవడం ఆ రాష్ట్రంలో కోవిడ్ ఉద్ధృతికి అద్దం పడుతోంది.

దేశవ్యాప్తంగా శనివారం నుంచి ఆదివారం మధ్య ఏకంగా 4,987 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. ఇప్పటివరకూ 24 గంటల వ్యవధిలో వెలుగుచూసిన అత్యధిక కేసులు ఇవే.

మొత్తంగా మన దేశంలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 90,927కు చేరుకుంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడుల్లో 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

మరణాలలో ఇప్పటివరకూ మహారాష్ట్రలో అత్యధికంగా 1,135 మంది మహమ్మారి తీవ్రతకు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత స్థానాల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, దిల్లీ ఉన్నాయి.

దేశంలో కోవిడ్ ఉద్ధృతి ఎక్కువవుతున్నప్పటికీ దాన్నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరగడం కాస్త ఉపశమనం కలిగించే విషయం. తాజాగా 24 గంటల వ్యవధిలో 3,955 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 34,108కి పెరిగిందని ఈనాడు వివరించింది..

"ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు పది నిమిషాలు కేటాయిద్దాం"-కేటీఆర్

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తెలంగాణను కాపాడుకొనేందుకు రాష్ట్ర ప్రజలు ‘ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ కేటాయించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారని కథనం ప్రచురించింది.

తెలంగాణలో ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా పరిసరాల పరిశుభ్రతను పాటిద్దామని, దీనిని ఓ సామాజిక కార్యక్రమంగా భావించేలా ప్రజలను భాగస్వామ్యం చేయాలని ప్రజాప్రతినిధులకు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.

సీజనల్‌ వ్యాధులను అరికట్టడంలో ప్రజాప్రతినిధుల సహకారం కోరుతున్నామని, వారి ఇండ్లనుంచే ఈ కార్యక్రమం ప్రారంభంకావాలని ఆయన కోరారని పత్రికలో రాశారు.

కరోనా నేపథ్యంలో అలవాటైన వ్యక్తిగత పరిశుభ్రతను ఇక ముందు కూడా కొనసాగించి వ్యాధులను దరిచేరకుండా చూద్దామన్నారు.

సీజనల్‌ వ్యాధుల నివారణలో పురపాలకశాఖ ఇప్పటికే ఒక ప్రత్యేక క్యాలెండర్‌ రూపొందించి, వాటిని అరికట్టేందుకు ప్రణాళికలు సిద్ధంచేసిందని ఆదివారం మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ప్రజాప్రతినిధులకు లేఖ రాశారు.

‘ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ అనే కార్యక్రమంలో స్వయంగా భాగస్వాములవుతూ, ప్రజలందరినీ చైతన్యం చేస్తూ రానున్న వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌ గున్యా వంటి వ్యాధులు రాకుండా చూద్దామని ఆలేఖలో మంత్రి పేర్కొన్నారని నమస్తే తెలంగాణలో చెప్పారు.

ఇందుకు కావాల్సిందల్లా వారానికోసారి కనీసం పది నిమిషాలపాటైన మన కోసం, మన పరిసరాల శుభ్రత కోసం సమయం కేటాయించుకోవడమేనని తెలిపారు.

ప్రజలను, పట్టణాలను కాపాడుకొనే కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు గత వారం ‘ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమాన్ని ప్రారంభించామని, రానున్న పది వారాలపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

ఇందులో భాగంగా ప్రతిఒక్కరూ తమ ఇండ్లు, పరిసరాల్లో దోమలు నిలిచేందుకు ఆస్కారమున్న వాటిని శుభ్రం చేసుకోవడం, యాంటి లార్వా కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా లేఖలో కోరారు.

ఎమ్మెల్యేలు ముందుగా ఈ కార్యక్రమాన్ని తమ ఇండ్లనుంచే ప్రారంభించాలని కేటీఆర్ సూచించారు. తర్వాత తమ పరిధిలోని పట్టణాల్లో విస్తృతంగా తిరుగుతూ ప్రజారోగ్యంపై చైతన్యం తీసుకొచ్చేలా పరిసరాల పరిశుభ్రత ఓ సామాజిక కార్యక్రమంగా ప్రజలు భావించేలా ప్రచారం చేయాలని కోరినట్లు నమస్తే తెలంగాణ వివరించింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)