హైదరాబాద్‌లో మరో రేప్ - ప్రెస్‌రివ్యూ

మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఆమె స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ 'ఈనాడు' వార్తాకథనం తెలిపింది.

''సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి తన సోదరితో కలిసి నిజాంపేటలోని ఈశ్వర్ విలాస్ రోడ్డులోని ఓ అపార్టుమెంటులో అద్దెకు ఉంటున్నారు. ఆమెకు ఒక 27 ఏళ్ళ స్నేహితుడు ఉన్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి వద్దకు వచ్చిన స్నేహితుడు ఆమెపై అత్యాచారం చేసి పరారయ్యాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన యువతి సోదరి చూడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే బాధితురాలు అపస్మారక స్థితికి చేరుకుంది. బాధితురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

శ్యామల కుందర్

ఫొటో సోర్స్, http://shyamalaskundar.com

ఫొటో క్యాప్షన్, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు శ్యామల కుందర్

తెలంగాణ పోలీసులు, ప్రభుత్వంపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం

తెలంగాణ పోలీసులపై జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) ఆగ్రహం వ్యక్తం చేసిందని 'సాక్షి' కథనం తెలిపింది.

''శంషాబాద్‌ ఘటనలో మృతి చెందిన ప్రియాంకరెడ్డి తల్లిదండ్రులు కుమార్తె అదృశ్యంపై ఫిర్యాదు చేసేందుకు ఆర్జీఐఏ పోలీస్‌ స్టేషన్‌కు వస్తే పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని జాతీయ మహిళా కమిషన్ విమర్శించింది. తమ పరిధి కాదని నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కనీసం మానవీయ కోణంలో కూడా స్పందించకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించింది. ప్రియాంకరెడ్డి హత్య ను సెక్షన్‌ 10 కింద సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్‌... విచారణ నిమిత్తం ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలు శ్యామల కుందర్ శనివారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రియాంకారెడ్డి తల్లిదండ్రులను పరామర్శించి వారిని ఓదార్చారు.

ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసులు పరిధి ప్రకారం విధులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ గైడ్‌ చేయడంలో కూడా కీలక భూమిక పోషించాల్సి ఉందన్నారు. ప్రియాంకారెడ్డి తల్లిదండ్రుల ఫిర్యాదుపై సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులతో సమన్వయపరిస్తే సమస్య మరింత ముందుగా వెలుగులోకి వచ్చేదన్నారు. బాధితురాలి హత్య ఉదంతంపై పలు అనుమానాలున్నాయని, తమ విచారణలోనూ పోలీసులు చెప్పలేదన్నారు. పలు అంశాలకు సంబంధించి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. ప్రధాన రహదారి, నగరానికి అత్యంత సమీపం లో ఉన్న ప్రాంతంలో పెట్రోలింగ్‌ సరిగ్గా జరగలేదని, రెండ్రోజులుగా లారీ నిలిపి ఉన్నా కనీసం గుర్తించకపోవడం దారుణమన్నారు. ఇందులో పోలీసుల వైఫల్యం కనిపిస్తుందని పేర్కొన్నారు. నిరంతర పర్యవేక్షణ కోసమే సీసీటీవీలను ఏర్పాటు చేస్తారని, ఘటన జరిగిన తర్వాత ఆధారాల కోసం కాదన్నారు. సీసీటీవీ ఫుటేజీ సరిగ్గా నమోదు కాలేదని, వాటిని నిర్మించిన కాంట్రాక్టు సంస్థను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని, కేసు నమోదు చేయాలన్నారు. ఆర్జీఐఏ పీఎస్‌ అధికారులు, పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులపై పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వెంటనే మహిళా కమిషన్‌ ఏర్పాటు చేయాలన్నారు.

ప్రియాంకరెడ్డి హత్య కేసులో పోలీసులు విలువైన సమయాన్ని వృథా చేశారని, ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు సత్వరం స్పందించి ఉంటే ప్రియాంకారెడ్డి ప్రాణాలతో ఉండేదని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ అన్నారు. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం పూర్తిగా ఉందని వ్యాఖ్యానించారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పుడు పోలీసులు చేసిన వ్యాఖ్యలపై కూడా ఆమె విరుచుకుపడ్డారు. సున్నితమైన ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ బాధ్యతగా వ్యాఖ్యలు చేయాల్సిందన్నార''ని ఆ కథనంలో తెలిపారు.

కిషన్ రెడ్డి

ఫొటో సోర్స్, KISHANREDDY/FB

రాజధాని ఎక్కడికీ పోదు: కిషన్ రెడ్డి

'ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని ఎక్కడికీ పోదు' అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి రాజధాని ప్రాంత రైతులకు హామీ ఇచ్చారని ఆంధ్రజ్యోతి కథనం తెలిపింది. సీఆర్‌డీఏ పరిధిలో రాజధానికి భూములు ఇచ్చిన వివిధ గ్రామాల రైతులు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం కిషన్ రెడ్డి కలిశారు.

''రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారయింది. రైతులకు విశ్వాసం కల్పించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతుల సమస్యలపై నేను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాను. రైతులకు పూర్తి స్థాయిలో సాయం చేస్తాను'' అని మంత్రి మీడియా సమావేశంలో చెప్పారని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఈ-ఆటో

ఫొటో సోర్స్, NAmastetelangana

ఈవీ హబ్‌గా తెలంగాణ

విద్యుత్ వాహన (ఈవీ) వినియోగాన్ని పెంచి తెలంగాణను ఈవీ హబ్‌గా మార్చేందుకు కృషిచేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ చెప్పారంటూ 'నమస్తే తెలంగాణ' కథనం ప్రచురించింది.

'శనివారం ఆయన ఐఐటీ హైద్రాబాద్ (ఐఐటీహెచ్), జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) సంయుక్తంగా రూపొందించిన ఎలక్ట్రిక్ ఆటోలను ఆవిష్కరించారు. అంతకుముందు ఐఐటీహెచ్‌లో డాన్ ఆఫ్ న్యూ ఎరా ఫర్ ఇండియా ఇన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ పేరిట నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌లో జయేశ్‌రంజన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్టీసీలో ఇప్పటికే 40 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నామని, వాటి ద్వారా మంచి లాభాలు వస్తున్నాయని తెలిపారు. సంప్రదాయ వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీన్ని నివారించేందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఐఐటీహెచ్, జైకా (జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ) సంయుక్తంగా ఎలక్ట్రిక్ ఆటోలను తీసుకురావడం సంతోషకరమన్నారు. వీటిని ఎక్కువ సంఖ్యలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఓలా, ఉబర్ లాంటి సంస్థలతో సంప్రదింపులు జరుపుతామని జయేశ్‌రంజన్ తెలిపార''ని ఆ కథనంలో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)