ఏపీలో పాడైన బియ్యం పంపిణీ చేశారంటూ ఆరోపణలు - ప్రెస్‌రివ్యూ

ముక్కిన బియ్యం

ఫొటో సోర్స్, facebook/UGC

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లో తెల్లరేషన్ కార్డులపై పంపిణీ చేస్తున్న మంచి బియ్యంలో నాణ్యత లోపించిందని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

శ్రీకాకుళం జిల్లాలో 'నాణ్యమైన బియ్యం' పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం ప్రారంభించారు.

అయితే, నాణ్యమైన బియ్యం అందుకొన్నవారిలో 20మందిదాకా, ఆ బియ్యం బాగాలేవని ఫిర్యాదు చేశారని జిల్లా

కలెక్టరే స్వయంగా ప్రకటించినట్లు ఆంధ్రజ్యోతి తెలిపింది.

కొంతమందికి పంపిణీ చేసిన బియ్యం ముక్కిపోయాయని, ముట్టుకొంటేనే తడి చేతులకు అంటుతోందని, బియ్యం పురుగుపట్టి, వండటానికే కాదు, చూపులకే పాడయిపోయి కనిపిస్తున్నాయని వివరించింది.

20 శాతం బియ్యంలో సమస్యలు ఉన్నట్టు అధికారులు అంగీకరిస్తున్నట్లు పేర్కొంది.

మరోవైపు 'నాణ్యమైన బియ్యం పంపిణీ' పథకానికి మంచి స్పందన వస్తోందని మంత్రి కొడాలి నాని చెప్పినట్లు సాక్షి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. దాని ప్రకారం..

రెండు రోజుల్లోనే 70 శాతానికి పైగా లబ్దిదారులకు గ్రామ వలంటీర్లు 9,48,105 సంచుల బియ్యం సంచులను పంపిణీ చేశారని నాని తెలిపారు.

నాలుగైదు రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నప్పటికి.. ఇబ్బందులను అధిగమించి బియ్యం రవాణా చేస్తున్నామన్నారు.

వర్షాల కారణంగా 25 బియ్యం సంచులు తడిసిపోయాయని వాటి స్థానంలో కొత్తవాటిని తిరిగి పంపిణీ చేశామని నాని వివరించారు.

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

అక్షరాస్యతలో వెనుకబడిన తెలంగాణ

సంపూర్ణ అక్షరాస్యతలో తెలంగాణ వెనుకబడిందని ఈనాడు పత్రిక ఓ కథనం ప్రచురించింది.

జాతీయ సగటు అక్షరాస్యత (77.99 శాతం) కు తెలంగాణ (66.54 శాతం) చాలా దూరంలో ఉండిపోయింది. ఈ రెండింటి మధ్య ఆరున్నర శాతం తేడా ఉంది.

2011 లెక్కల ప్రకారం రాష్ట్రం 32వ స్థానంలో నిలిచింది. చివరినుంచి జార్ఖండ్, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, బిహార్‌ తర్వాతి స్థానం తెలంగాణదే.

అక్షరాస్యత పెంచేందుకు ఆలోచనలు చాలా చేసినా అడుగులు వడివడిగా ముందుకు పడడం లేదు.

''కేంద్రం నిధులిస్తే ఖర్చు చేస్తున్నారు తప్పా... సొంత నిధులను రాష్ట్రం ఎన్నడూ వినియోగించలేదు. కేంద్రం ఇస్తుంది కాబట్టి ఖర్చు చేస్తూపోయారు. కేంద్రం ఆపేసరికి ఇప్పుడు అక్షరాస్యత కార్యక్రమం కొద్ది సంవత్సరాలుగా అటకెక్కింది' అని ఎంవీఎఫ్‌ ఫౌండేషన్‌ జాతీయ కన్వీనర్‌ వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు.

కేసీఆర్

''కేసీఆర్.. నీ బొమ్మలు నీ ఇంట్ల పెట్టుకో''

"కేసీఆర్‌.. నీ బొమ్మలు, నీ పథకాల బొమ్మలు ఇంట్లో పెట్టుకో. లేదంటే మ్యూజియం కట్టించుకుని దాంట్లొ దాచుకో.

అంతేకానీ.. పవిత్రక్షేతంలో ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే ఊరుకునేది లేదు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా, నిజాంను తలపించేలా వ్యవహరిస్తున్నావ్'' అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మండిపడినట్లు వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. దాని ప్రకారం..

సుమారు వెయ్యి మంది కార్యకర్తలతో కలిసి యాదాద్రికి శనివారం లక్ష్మణ్ ర్యాలీగా వెళ్లారు. ఆలయాన్ని పరిశీలించిన అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్‌ తన పద్ధతి మార్చుకోకుంటే తగిన బుద్ధి చెబుతామని లక్ష్మణ్‌ హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టినా ఇంకా బుద్ధి మారలేదని ఎద్దేవా చేశారు.

ఆధ్యాత్మిక క్షేత్రం వద్ద రాజకీయాలకు అతీతంగా నిర్మాణాలు జరిగితేనే బాగుంటుందని హితవుపలికారు.

చీఫ్ జస్టిస్ రమణి

ఫొటో సోర్స్, facebook/ugc

మద్రాస్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రమణి రాజీనామా

తనను మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేసిన నేపథ్యంలో మద్రాస్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ విజయ కే తహిల్‌ రమణి తన పదవికి రాజీనామా చేసినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

రాజీనామా లేఖను రాష్ట్రపతి కోవింద్‌, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌లకు రమణి పంపారు.

గత ఏడాది ఆగస్టు 8వ తేదీన జస్టిస్‌ రమణిని మద్రాస్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా సుప్రీంకోర్టు కొలీజియం నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

అనంతరం గత నెల 28న ఆమెను మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేస్తూ చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకొన్నది.

తన బదిలీ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కొద్దిరోజుల క్రితం జస్టిస్‌ రమణి చేసుకొన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు కొలీజియం తిరస్కరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)