ఆయుధాలు, డబ్బు, నౌకలు : అమెరికా- ఇరాన్ ఒప్పందం గతంలో వాటి కంటే మెరుగైనదా?

అమెరికా ఇరాన్ ఒప్పందం, ఒబామా ప్రభుత్వం, ఆయుధాలు, డబ్బులు, నౌకలు
    • రచయిత, బెన్ చు
    • హోదా, బీబీసీ వెరిఫై
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులతో మొదలు పెట్టిన యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఒక ఒప్పందంపై లాంఛనంగా సంతకం చేశారు.

అమెరికా- ఇరాన్‌ మధ్య 14-అంశాల అవగాహన ఒప్పందంలో చేర్చిన అంశాలు, మినహాయించిన అంశాలపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంపై చర్చలు జరపాలని చెబుతున్న ఈ ఒప్పందం, ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు, హార్ముజ్ జలసంధి గుండా నౌకల రవాణాపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ప్రశ్నలు తలెత్తాయి.

ఈ ఒప్పందం కుదిరిన తర్వాత 2015లో ఒబామా ప్రభుత్వం కుదుర్చుకున్నసంయుక్త సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు తాజా ఒప్పందానికి మధ్య పోలిక తప్పనిసరిగా మారింది. ఒబామా హయాంలో కుదిరిన ఒప్పందాన్ని ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక రద్దు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రస్తుత ఒప్పందాన్ని అర్థం చేసుకోవడానికి బీబీసీ వెరిఫై ఒప్పందాల్లోని ముఖ్య వివరాలను పరిశీలించి వాటిని మూడు విభిన్న కాలాలనాటి పరిస్థితులతో పోల్చింది.

1. 2016-2018 మధ్య సంయుక్త సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమల్లో ఉన్నప్పుడు

2. 2026 ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభం కావడానికి ముందు

3. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం.

అమెరికా ఇరాన్ ఒప్పందం, ఒబామా ప్రభుత్వం, ఆయుధాలు, డబ్బులు, నౌకలు

ఫొటో సోర్స్, Reuters

ఆయుధాలు

సంయుక్త సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జేసీపీఓఏ)లో బ్రిటన్, ఫ్రాన్స్, ఈయూ, చైనా రష్యా సభ్యులుగా ఉన్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై నిర్దిష్ట పరిమితులను విధించడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం.

ఈ ఒప్పందం ఇరాన్ అణు పదార్ధాల నిల్వలను 300 కేజీలకు పరిమితం చేసింది.

రాబోయే 15 ఏళ్ల పాటు యురేనియాన్ని 3.67 శాతం కంటే ఎక్కువగా శుద్ధి చేయకూడదని పేర్కొంది. ఈ స్థాయి శుద్ధి కారణంగా అది అణ్వాయుధ తయారీకి ఉపయోగించడం వీలుకాదు. అయితే విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు దీన్ని రియాక్టర్లలో ఉపయోగించవచ్చు.

ఇరాన్ ఒప్పందానికి కట్టుబడి ఉందో లేదో నిర్ధరించడానికి తెహ్రాన్ అణు కార్యక్రమాన్ని పరిశీలించడానికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు అనుమతి లభించింది.

అమెరికా 2018లో జేసీపీఓ నుంచి వైదొలగే వరకు ఇరాన్ నిబంధనలు పాటిస్తూ వచ్చిందని, తరువాత ఆ ఒప్పందం క్షీణించిందని ఐఏఈఏ తెలిపింది.

అమెరికా ఒప్పందం నుంచి వైదొలగిన తర్వాత ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది.

2026 ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పుడు ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన 440 కేజీల యురేనియం ఉందని అమెరికన్ అధికారులు చెప్పారు. దీన్ని ఆయుధ తయారీకి ఉపయోగించడానికి వీలుగా చాలా వేగంగా శుద్ధి చేయవచ్చు.

అమెరికా – ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని వైట్ హౌస్ అధికారులు బీబీసీ, ఇతర మీడియా సంస్థల సమక్షంలో చిదివి వినిపించారు. అందులో ఇరాన్ "అణ్వాయుధాలు సమకూర్చుకోదని, అభివృద్ధి చేయదని పునరుద్ఘాటిస్తోంది" అని పేర్కొన్నప్పటికీ, ఆ పత్రంలో దీనికి సంబంధించి పెద్దగా వివరాల్లేవు.

సంయుక్త సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఒప్పందంలో కూడా ఇలాంటి భాషే ఉంది. అందులోనూ "ఎట్టి పరిస్థితుల్లనూ ఇరాన్ అణ్వాయుధాలు సేకరించదు. అభివృద్ధి చేయదు, సమకూర్చుకోదని పునరుద్ఘాటిస్తున్నాం" అని పేర్కొన్నారు.

"యురేనియాన్ని శుద్ధి చేయడం గురించి, పరస్పరం అంగీకరించిన యంత్రాంగం ద్వారా శుద్ధి చేసి నిల్వ ఉంచిన యురేనియాన్ని పారవేయడానికి" ఇరు వర్గాలు అంగీకరించాయని కొత్త అవగాహనా ఒప్పందం చెబుతోంది.

అయినా అవసరాన్ని బట్టి ఈ అంశాన్ని రెండు దేశాల మధ్య జరగనున్న చర్చల్లో చేర్చేందుకు అవకాశం ఉంది.

అమెరికా ఇరాన్ ఒప్పందం, ఒబామా ప్రభుత్వం, ఆయుధాలు, డబ్బులు, నౌకలు

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, తమ అణు కార్యక్రమం పౌర అవసరాలకు ఉద్దేశించిందని ఇరాన్ తరచుగా చెబుతోంది.

ఇరాన్ అణు కార్యక్రమం

ఇరాన్‌లో మిగిలిన అణు పదార్థాలను ఆ దేశం నుంచి తొలగిస్తామని ఇటీవల ట్రంప్ చెప్పారు.

అవగాహన ఒప్పందం "శుద్ధి చేసిన యురేనియం నిల్వల్ని నాశనం చేసేందుకు కనీస ప్రమాణాల్ని నిర్దేశిస్తుంది" అని అమెరికన్ అధికారులు చెబుతున్నారు.

అయితే ఈ అవగాహనా ఒప్పందంలో ఎక్కడా ఇలా జరుగుతుందని ప్రస్తావించలేదు.

జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది రెండేళ్లపాటు చర్చలు జరిపాక కుదుర్చుకున్న తుది, సవివరమైన ఒప్పందం. తాజా అవగాహన ఒప్పందం అణు కార్యక్రమంపై 60 రోజుల్లోపు చర్చల నిర్వహణకు చేసుకున్న ఏర్పాటు అని గుర్తుంచుకోవాలి. అందువల్ల ఈ రెంటినీ నేరుగా పోల్చలేం.

ఈ ఏడాది మార్చ్ 2న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఎదుర్కోవడంతో పాటు అమెరికా "ఇరాన్ క్షిపణులు, కొత్త వాటిని ఉత్పత్తి చేసే వారి సామర్థ్యాలను ధ్వంసం చేస్తోందని" చెప్పారు.

అయితే అవగాహనా ఒప్పంద పత్రంలో ఇరాన్ ఖండాంతర క్షిపణుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.

మధ్య ప్రాచ్యంలోని ఇతర దేశాల వద్ద క్షిపణులు ఉన్నాయి కాబట్టి ఇరాన్ వద్ద అవి లేకపోవడం "అన్యాయం" అవుతుందని జూన్ 17న ట్రంప్ అన్నారు.

ఒబామా ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ 2018లో డోనల్డ్ ట్రంప్ "ఈ ఒప్పందం ఇరాన్ అణు ఆశయాలను అడ్డుకోవడంలో విఫలమవడమే కాకుండా, అణ్వాయుధాలు మోసుకెళ్లగల బాలిస్టిక్ క్షిపణలను ఆ దేశం అభివృద్ధి చేయకుండా ఆపడంలో విఫలమైంది" అని చెప్పారు.

అమెరికా ఇరాన్ ఒప్పందం, ఒబామా ప్రభుత్వం, ఆయుధాలు, డబ్బులు, నౌకలు

ఫొటో సోర్స్, Reuters

నిధులు

2015లో ఒబామా ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఇరాన్‌కు అమెరికా డబ్బేమీ చెల్లించలేదు. అయితే ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించడంతో పాటు విదేశీ బ్యాంకులు స్తంభింపజేసిన లేదా స్వాధీనం చేసుకున్న ఇరాన్ కేంద్ర బ్యాంకు ఆస్తులతో పాటు ఇతర నిధులను తీసుకునేందుకు ఇరాన్‌కు అనుమతి ఇచ్చింది.

2015లో అంచనా ప్రకారం స్తంభింపజేసిన ఇరాన్ కేంద్ర బ్యాంకు ఆస్తుల విలువ 9.43 లక్షల కోట్ల రూపాయల నుంచి 11.79 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అమెరికన్ ట్రెజరీ అధికారి ఒకరు చెప్పారు.

అయితే ఆంక్షల సడలింపు ఫలితంగా తెహ్రాన్‌కు అందుబాటులోకి వచ్చే మొత్తం ఆస్తులు కేవలం సుమారు 4.71 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఉండవచ్చని ఆయన అన్నారు.

ఒబామా కాలంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత డోనల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మళ్లీ ఆంక్షలు విధించారు. తర్వాతి కాలంలో వాటిని మరింత తీవ్రం చేశారు.

ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభానికి ముందు అమెరికా, ఇతర దేశాలు విధించిన ఆంక్షల వల్ల ఇరాన్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది.

ఇరాన్‌లో ప్రజలు ఆందోళనలకు దిగడానికి ఆర్థిక పరిస్థితులు కూడా ఒక కారణంగా పరిగణిస్తున్నారు.

ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లపైనా అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో తెహ్రాన్‌కు తన వద్ద ఉన్న ముడి చమురు అమ్ముకోవడం కష్టంగా మారింది. 'షాడో ఫ్లీట్' (ఇతర దేశాల పేరుతో నడిచే నౌకలు) ఉపయోగించడం ద్వారా ఇరాన్ చమురు మీద ఆంక్షల్ని పాక్షికంగా అధిగమించింది.

అంగీకరించిన షెడ్యూల్ ప్రకారం ఇరాన్‌పై అమెరికా "అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేస్తుందని" కొత్త అవగాహన ఒప్పందం చెబుతోంది.

ఈ ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే "ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, బ్యాంకింగ్, లావాదేవీలు, బీమాలు, రవాణాతో సహా అన్ని అనుబంధ సేవల" ఎగుమతికి మినహాయింపులు ఇవ్వడానికి ఇది వీలు కల్పిస్తుంది.

ఇందుకు ఇరాన్ మీద ఎలాంటి షరతులు పెట్టలేదు. ఇది ఇరాన్‌ను యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఉన్న పరిస్థితి కంటే మెరుగైన పరిస్థితిలో ఉంచినట్లు కనిపిస్తోంది.

ఇరాన్ "పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం" అమెరికా ప్రాంతీయ భాగస్వాములతో కలిసి కనీసం 300 బిలియన్ డాలర్లతో ఒక ప్రణాళిక రూపొందిస్తుందని అవగాహన ఒప్పంద పత్రం చెబుతోంది.

అమెరికా ఇరాన్ ఒప్పందం, ఒబామా ప్రభుత్వం, ఆయుధాలు, డబ్బులు, నౌకలు

ఫొటో సోర్స్, Reuters

నౌకలు

ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభం కావడానికి ముందు హార్ముజ్ జలసంధి గుండా చమురు, సహజవాయువు, రసాయన ఎరువుల్ని తీసుకెళ్లే నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించగలిగేవి.

జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్‌ ఒప్పందంలో హార్ముజ్ గురించి అసలు ప్రస్తావనే లేదు.

2025లో రోజుకు సగటున 94 వాణిజ్య నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి షిప్ ట్రాకింగ్ డేటా చెబుతోంది.

ఈ డేటా ప్రకారం ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన తర్వాత రోజువారీ సగటు నౌకల సంఖ్య ఆరుకు పడిపోయింది.

యుద్ధం కొనసాగిన కాలంలో చాలా నౌకలు తమ లొకేషన్ ట్రాన్స్‌మీటర్లను ఆపేసి హార్ముజ్ జలసంధి దాటాయి కాబట్టి వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చు.

అమెరికా, ఇజ్రాయెల్ తమపై దాడి చేసిన తర్వాత ఇరాన్ హార్ముజ్ జలసంధిలోని వాణిజ్య నౌకలపై దాడులు చేసింది. దీనికి తోడు ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనానికి కూడా దారి తీసింది.

తాజా అవగాహన ఒప్పందం ప్రకారం అమెరికా "30 రోజుల్లోపు " ఇరాన్‌ పోర్టుల్లో దిగ్బంధాన్ని పూర్తిగా తొలగిస్తుంది.

హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణానికి ఇరాన్ "ఎటువంటి రుసుము లేకుండా" ఏర్పాట్లు చేస్తుందని ఒప్పందంలో తెలిపారు

అయితే ఇది "కేవలం 60 రోజులకు మాత్రమే" అని పేర్కొన్నారు.

"భవిష్యత్‌లో హార్ముజ్ జలసంధి నిర్వహణ గురించి ఇరాన్ ఒమన్‌తో "చర్చలు జరుపుతుందని" అవగాహన ఒప్పందం చెబుతోంది.

హార్ముజ్ గుండా వెళ్లే నౌకల నియంత్రణకు పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీని ఏర్పాటు చేసినట్లు ఇరాన్ మే 21న ప్రకటించింది.

నౌకాయానానికి టోల్ చార్జీలు లేనప్పటికీ, జలసంధిని ఉపయోగించుకున్నందుకు 'రుసుములు' ఉంటాయని, వాటిని ' తాముఅందించే సేవలకు బదులుగా వసూలు చేస్తామని' ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది.

భవిష్యత్తులో ఇరాన్ ఈ రుసుములను వసూలు చేయకుండా నిరోధించే చర్యల గురించి ఒప్పందంలో కానీ, వైట్‌హౌస్ ప్రెస్ బ్రీఫింగ్‌లో కానీ ఎక్కడా ప్రస్తావించలేదు.

ఇది యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితితో పోలిస్తే ప్రాంతంలో ఇరాన్ ఆర్థిక శక్తి , ప్రభావాన్ని పెంచే అంశం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)