వైఎస్ జగన్: ‘కుప్పం వద్దు, హైదరాబాద్ ముద్దు... ఇదీ చంద్రబాబు పాలసీ’
నారా చంద్రబాబు నాయుడు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 33 సంవత్సరాలు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, ఇక్కడ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
14 ఏళ్లుసీఎంగా ఉండి కూడా కుప్పంలో కరవుకు చంద్రబాబు పరిష్కారం చూపలేకపోయారని వ్యాఖ్యానించారు.
చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా మూడో విడత వైఎస్‌ఆర్ చేయూత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.
అనంతరం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని మహిళల జీవితాల్లో ఎంతో మార్పు కనిపిస్తోందని అన్నారు. నాలుగు పథకాల ద్వారా రాష్ట్రంలోని మహిళలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు.
నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకే తాము చేస్తోన్న సాయం వెళ్తోందని అన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలని ప్రజలను కోరారు.
కుప్పంలో కరవు, నీటి సమస్యకు హంద్రీనీవా జలాలను తీసుకురావడం ఒక్కటే పరిష్కారం అని తెలిసినా... హంద్రీనీవా పనులకు చంద్రబాబు అవరోధంగా మారాడని అన్నారు.
తమ ప్రభుత్వంగత 39 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ... కేవలం కుప్పం నియోజకవర్గానికి రూ.1,149 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు.