వర్షాలు
కాస్త తగ్గుముఖం పట్టినా వరదల భయం ఉత్తర తెలంగాణను వెంటాడుతోంది. మహారాష్ట్ర
లాంటి ఎగువ ప్రాంతాల నుండి భారీ వరద నీరు ఇంకా చేరుతూనే ఉండటంతో ప్రాజెక్టులు
పొంగిపొర్లుతున్నాయి.
నిన్న
కడెం ప్రాజెక్ట్ వద్ద హైడ్రామా
చోటుచేసుకుంది. సామర్థ్యానికి మించి వరద ప్రవాహం చేరుతుండటంతో గేట్లు అన్నీ ఎత్తివేసిన అధికారులు ఓ సందర్భంలో చేతులెత్తేసి ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చారు. మధ్యాహ్నం
కాస్త వరద తగ్గినట్టే తగ్గి, ఆ తర్వాత మళ్లీ పెరిగింది. అదే సమయంలో లెఫ్ట్ కెనాల్,
పవర్ హౌజ్, హరిత రిసార్ట్ సమీపంలో మూడు చోట్ల కట్టకు గండి పడింది. దీంతో
ప్రాజెక్ట్ తెగిపోతుందన్న పుకార్లు చెలరేగాయి. దానికి తోడు నీటిపారుదలశాఖ
అధికారులు ఎవరూ ప్రాజెక్ట్ వద్ద లేకపోవడం, ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోలకు సంబందించిన
ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎప్పుడేమవుతోందన్న భయాందోళనలు వ్యక్తం అయ్యాయి.
కడెం
ప్రాజెక్ట్ సేఫ్‌గానే ఉందని, వరద తగ్గుముఖం పట్టిందని నిర్మల్ జిల్లా మంత్రి
ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటనతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కింద ముంపుకు
గురైన 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉంచారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో తగ్గింది. 17 గేట్ల ద్వారా లక్ష 83 వేల
క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ప్రాజెక్ట్‌కు ముప్పు తప్పినట్టే అని భావిస్తున్నారు. నిర్మల్ నుంచి మంచిర్యాల వెళ్లే రహదారి
పలు చోట్ల దెబ్బతింది.
మరోవైపు, కడెం ప్రాజెక్ట్ ద్వారా భారీ ప్రవాహం గోదావరి ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు చేరింది. 54 గేట్లు ఓపెన్ చేసి 12 లక్షల క్యూసెక్కుల మేర వరద దిగువకు వదలడంతో దాని ప్రభావం పక్కనే ఉన్న మంచిర్యాల పట్టణంపై పడింది. పలు కాలనీల్లోకి నీరు ప్రవేశించింది. రాళ్లవాగు, తోళ్ల వాగు ప్రవాహాలను గోదావరి వెనక్కి తన్నుతుండటంతో ఆ నీరు కాస్తా కాలనీల్లోకి వచ్చింది. మంచిర్యాల,చెన్నూరు లకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
గోదావరి ప్రవాహ ప్రాంతాల్లో పరిస్థితి దయణీయంగా మారింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ భారీఅవుట్ ఫ్లో తో గోదావరిఖని వద్ద గోదావరి బ్రిడ్జి పై నుంచి నీరు ప్రవహించింది. దీంతో అటువైపుగా వెళ్లే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. గోదావరిఖని, మంచిర్యాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి.
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంపై కూడా గోదావరి వరద ప్రభావం పడింది. పోలీస్ స్టేషన్‌తో పాటు పలు కాలనీల్లోకి నీరు ప్రవేశించింది. స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రభావిత కాలనీల్లో పర్యటించారు.
కరీంనగర్ సమీపంలోని నగునూరు వాగు ప్రవాహంలో ఇటుకబట్టీల్లో పనిచేసే 9 మంది కూలీలు చిక్కుకుపోవడంతో కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ డీఆర్ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలను మంత్రి గంగుల కమలాకర్ రెస్క్యూ ఆపరేషన్ కు ఆదేశించారు.
గోదావరిఖని సింగరేణి ఇంటెక్ వెల్ లో 6 గురు కార్మికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
కొమురం భీము ఆసిఫాబాద్ జిల్లా దహేగాం వద్ద ఓ గర్బిణీని వాగు దాటిస్తున్న క్రమంలో సింగరేణి రెస్క్యూ టీమ్ కు చెందిన ఇద్దరు గల్లంతై నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు.
ఉమ్మడి మెదక్ జిల్లాల్లో వరద ప్రభావ ప్రాంతాలను మంత్రి హరీష్ రావ్ పర్యటించారు. హవేళీ ఘణపూర్ లో కొట్టుకుపోయిన బ్రిడ్జీలను పరిశీలించారు. త్వరలోనే రోడ్లు, బ్రిడ్జిల పనులు చేపడతామని చెప్పారు. నిర్వాసితులకు వెంటనే వసతి, భోజన సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వర్షం వల్ల తలెత్తిన పరిస్థితులపై జనగామ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలు, పునరావాసం తదితర అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అంతకు ముందు ఆయన పలు గ్రామాల్లో పర్యటించారు.
ఇక ఉత్తర తెలంగాణలోని ప్రాజెక్టులు అన్నీ దాదాపుగా నిండిపోయాయి. నిన్న నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును మంత్రి ప్రశాంత్ రెడ్డి సందర్శించి అధికారులకు సూచనలు చేసారు. ఎగువ మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదకు అనుగుణంగా ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ లో 75 టీఎంసీల వద్ద స్థిరంగా నిల్వ ను ఉంచి మిగులు జలాలు దిగువకు వదలుతున్నట్టుగా తెలిపారు.
కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీకి గోదావరి, ప్రాణహితల నుండి భారీ ప్రవాహం కొనసాగుతోంది.
భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో ఇళ్లు, స్కూలు భవనాలు, చెట్లు , విద్యుత్ స్థంభాలు నేలకూలాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో ఆదివారం వరకు ప్రభుత్వ, ప్రైవేట్,ఎయిడెట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.