కరోనా లాక్‌డౌన్: కరోనాపై పోరులో మనకున్న ఏకైక ఆయుధాన్ని వాడుదాం - కేసీఆర్
జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తాజా సమాచారం ప్రకారం అమెరికా 1,22,666 కరోనావైరస్ కేసులతో చైనాను దాటేసింది. భారత్‌లో ఇప్పటి వరకు 25 మరణాలు నమోదు అయ్యాయి.
లైవ్ కవరేజీ
క్రమశిక్షణతోనే కరోనావైరస్‌ను కట్టడి చేయగలం, ప్రెస్‌మీట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్
కరోనావైరస్ లాంటి మహమ్మారిని కేవలం క్రమశిక్షణతోనే ఎదుర్కోగలం. నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కొన్ని దేశాలను చూస్తే అర్థమవుతుంది. కాబట్టి, ఇప్పుడు కొంచెం కష్టమైనా అందరూ ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలను సవినయంగా కోరుతున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో ఇద్దరు డాక్టర్లకు కరోనావైరస్, తెలంగాణలో మరో మూడు కొత్త కేసులు. భార్యాభర్తలైన డాక్టర్లకు కోవిడ్-19 నిర్ధరణ
ఫొటో సోర్స్, UGC
ఫొటో క్యాప్షన్, తిరుపతిలో కూరగాయల కోసం సామాజిక దూరాన్ని పాటిస్తూ క్యూలో నిల్చున్న జనం
తెలంగాణలో గురువారం మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో, రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 43కు చేరింది. భార్యాభర్తలైన డాక్టర్లకు కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. వీరితో పాటు దిల్లీకి వెళ్ళి వచ్చిన ఒక వ్యక్తికి కూడా పాజిటివ్ అని తేలింది. వీరెవరూ విదేశాలకు వెళ్ళలేదు. స్థానికంగానే వీరికి వైరస్ సోకిందని తెలిపారు.
ప్రజలంతా ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే సూచించే పాటను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 26,590 మంది రాష్ట్రంలోకి వచ్చారు. వారిలో 25,942 మందిని ఐసోలేషన్‌లో ఉంచామని, కరోనావైరస్ అనుమానిత లక్షణాలతో ఉన్న 117 మందికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇంకా శాసనసభ ఆమోదం పొందలేదు.కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏం చేయాలి, అలాగే వ్యాధి నియంత్రణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించడానికి శుక్ర వారం క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 289 నెగెటివ్, 10 మందికి పాజిటివ్ అని తేలింది.
ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ కూరగాయల కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
అత్యవసర సాయం కోసం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, నిర్మలా సీతారామన్
వలస కార్మికులు, గ్రామీణ పేదలకు
అవసరమైన అత్యవసర సాయం అందించేందుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద ఈ సాయం అందిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక
మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
ఏ ఒక్క పేదవాడూ ఆకలితో చనిపోవడానికి
వీల్లేదు అని ఆమె స్పష్టం చేశారు.
“నెలకు 5 కేజీల బియ్యం లేదా 5 కేజీల
గోధుమలు అందించాలని ఇప్పటికే నిర్ణయించాం. దీనికి అదనంగా మరో 5 కేజీలను వచ్చే మూడు
నెలలూ ఉచితంగా అందిస్తాం. దీంతోపాటు ప్రతి ఇంటికీ వారి అలవాట్ల ఆధారంగా ఒక కేజీ పప్పు
కూడా ఉచితంగా అందిస్తాం” అని నిర్మల తెలిపారు.
నగదు బదిలీకి సంబంధించి 8 నిర్ణయాలు
తీసుకున్నామని నిర్మల వెల్లడించారు.
రైతులు – పీఎం కిసాన్ సమ్మాన్ నిధి
ద్వారా అందించే రూ.6000 లో మొదటి భాగం రూ.2000ను ఇప్పుడే విడుదల చేస్తున్నాం.
ఉపాధి హామీ పథకం – దీని ద్వారా
అందించే కూలీ మొత్తాన్ని పెంచుతున్నాం. దీని ద్వారా 5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం
కలుగుతుంది. ఈ పెంపు ద్వారా అదనంగా రూ.2000 ప్రతి కుటుంబానికీ అందుతుంది.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు –
రూ. 1000 ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నాం. ఇది 3 కోట్ల మందికి ప్రయోజనం
కలిగిస్తుంది.
జన్ ధన్ యోజన – 20 కోట్ల మంది మహిళా
జన్ ధన్ అకౌంటుదారులు రూ.500 ఎక్స్‌గ్రేషియాను వచ్చే 3 నెలలపాటు అందిస్తాం.
ఉజ్వల పథకం – పేదలకు గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం
ద్వారా 8.3 కోట్ల మంది పేద మహిళలు లాభపడ్డారు. ఇప్పుడు ఈ మహిళలందరికీ మూడు నెలల
పాటు ఉచిత సిలిండర్లు అందించాలని నిర్ణయించాం.
స్వయం సహాయక సంఘాలు – దీన్ దయాళ్
యోజన లైవ్లీహుడ్ మిషన్ ద్వారా అందిస్తున్న కొలేటరల్ రుణాలను రెట్టింపు
చేస్తున్నాం. దీని పరిమితి రూ.20 లక్షలు. ఇధి 7 కోట్ల మంది కుటుంబాలకు ప్రయోజనం
కలిగిస్తుంది.
వ్యవస్థీకృతరంగ కార్మికులు– వీరికి సంబంధించి రెండు ప్రకటనలు చేస్తున్నాం.
1)
ప్రావిడెంట్ ఫండ్: ఉద్యోగి, సంస్థల నుంచి చెల్లించే ఈపీఎఫ్ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.
ఇది ఉద్యోగుల సంఖ్య 100లోపు ఉన్న కంపెనీలకు, ఉద్యోగి వేతనం రూ.15000కు
మించనివారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్రయోజనం వచ్చే 3 నెలల పాటు కొనసాగుతుంది.
2) తిరిగి చెల్లించనవసరం లేని
అడ్వాన్స్‌ను అందించేందుకు పీఎఫ్ రెగ్యులేషన్ నిబంధనలను సవరిస్తాం. ఉద్యోగులు తమ
పీఎఫ్ మొత్తంలోని 75శాతం వరకూ లేదా 3 నెలల వేతనం.. ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది
తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తాం. ఇది 80 లక్షల ఉద్యోగులు, 4 లక్షల సంస్థలకు ప్రయోజనం
చేకూరుస్తుంది.
భవన నిర్మాణ కార్మికులు – 3.5 కోట్లమంది రిజిస్టర్డ్ కార్మికులకు కేంద్ర ప్రభుత్వ
సంక్షేమ నిధి నుంచి సహాయం అందించేందుకు సంబంధిత శాఖలకు తక్షణం ఆదేశాలు జారీచేస్తాం.
డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ – అన్ని రకాల వైద్యపరీక్షలు, స్క్రీనింగ్ పరీక్షలు,
అవసరమైన ఇతర అన్ని పరీక్షలు చేయడానికి ఈ నిధిని ఉపయోగించాలని అన్ని రాష్ట్రాల
ప్రభుత్వాలకూ సూచిస్తున్నాం.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన
పథకం ద్వారా ప్రకటించిన ఈ ప్యాకేజీ ద్వారా పేదలెవరూ కూడా ఆకలితో మరణించకుండా
చర్యలు తీసుకుంటున్నట్లు నిర్మల స్పష్టం చేశారు. ఈ ప్రయోజనాలకు సంబంధించిన నగదు పేదల
ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తామని ఆమె తెలిపారు.
కరోనా నుంచి కోలుకులున్న 97 ఏళ్ల వృద్ధురాలు
కరోనాతో భయపడే వృద్ధులకు దక్షిణ కొరియా నుంచి శుభవార్త అందింది.
దక్షిణ కొరియాలో ఒక 97 ఏళ్ల వృద్ధురాలు కరోనా నుంచి కోలుకున్నట్లు యాన్‌బాప్ న్యూస్ చెప్పింది.
కానీ ఆ మహిళ గురించి వేరే వివరాలేవీ లభించలేదు.
అయితే, ఇప్పటివరకూ ఈ వైరస్ నుంచి కోలుకున్న వయసు పైబడినవారు ఈమె ఒక్కరే కారు.
ఇదే మార్చిలో దేశంలో వందేళ్ల ఒక వృద్ధుడు ఈ వైరస్ నుంచి కోలుకున్నారని చైనా మీడియా జిన్హువా సంస్థ తెలిపింది.
ఇప్పటివరకూ ప్రపంచంలో ఈ వైరస్ నుంచి కోలుకున్న పెద్దవయసు వ్యక్తి ఈయనే అని చెప్పింది.
భారత్‌లో 13కు చేరిన మృతుల సంఖ్య, మొత్తం కేసులు 649
కరోనావైరస్ వల్ల భారత్‌లో మృతిచెందిన వారి సంఖ్య 13కు చేరింది. ఈ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 649కి చేరింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రస్తుతం భారత్‌లో 593 మంది కరోనా పాజిటివ్ ఉన్నారని, 42 మంది చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది.
భారత్‌లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులున్న మహారాష్ట్రలో వాటి సంఖ్య పెరుగుతోంది.
మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ముంబయి, ఠాణేలో మరో ఇద్దరికి కరోనా ఉన్నట్టు ధ్రువీకరించడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 124కు చేరిందని చెప్పింది.
ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ మహారాష్ట్రలో నలుగురు చనిపోయారు.
కశ్మీర్‌లో తొలి మరణం
ఫొటో సోర్స్, Getty Images
కశ్మీర్‌లో 65 ఏళ్ల వ్యక్తి
కోవిడ్-19 సోకి మరణించారు. ఇది ఈ ప్రాంతంలో కరోనావైరస్ బాధిత తొలి మరణం.
65ఏళ్ల వ్యక్తి ఒకరు శ్రీనగర్‌లోని
చెస్ట్ హాస్పిటల్‌లో గురువారం ఉదయం మరణించారని హాస్పటల్ వర్గాలు తెలిపాయి.
బాధితుడికి డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఊబకాయం కూడా ఉన్నాయని డాక్టర్లు
వెల్లడించారు.
“మేం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ
కార్డియాక్ అరెస్టుతో ఆయన మరణించారు. ఆయనకు సుదీర్ఘకాలంగా డయాబెటిస్, ఊబకాయం కూడా
ఉన్నాయి” అని డాక్టర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కశ్మీర్ లోయలో ఇప్పటివరకూ 8మందికి
కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థరణైంది. అయితే, జమ్మూ, కశ్మీర్ మొత్తానికి చూస్తే
వీరి సంఖ్య 11.
వింబుల్డన్ నిర్వహణపై వచ్చేవారం నిర్ణయం
ఫొటో సోర్స్, BBC Sport
ఈ సంవత్సరం
వింబుల్డన్ నిర్వహించాలా లేదా అనే దానిపై వచ్చే వారం నిర్ణయం తీసుకుంటామని ఆల్
ఇంగ్లండ్ క్లబ్ తెలిపింది.
వాయిదా వేయాలా
లేక రద్దు చేయాలా అనే విషయాన్ని వచ్చే వారం నిర్ణయం తీసుకుంటామని క్లబ్ ఓ ప్రకటనలో
బుధవారం వెల్లడించింది. వాస్తవానికి జూన్ 29 నుంచి జులై 12 వరకూ వింబుల్డన్
జరగాల్సి ఉంది.
క్లోజ్జ్ డోర్ల
మధ్యలో ఆటను నిర్వహించాలనే ప్రతిపాదనను నిర్వాహకులు తిరస్కరించారు.
ఇప్పటికే మేలో
ప్రారంభం కావాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీని వాయిదా వేసి, సెప్టెంబర్ 20 నుంచి
అక్టోబర్ 4 మధ్యలో నిర్వహించాలని గత నెలలో నిర్వాహకులు నిర్ణయించారు.
“అనూహ్యంగా ఎదురైన
కోవిడ్-19 సవాల్ మన జీవితాలపై ఊహించని ప్రభావాన్ని చూపిస్తోంది. దీని ప్రభావానికి
గురైన ప్రపంచవ్యాప్త ప్రజలకు మా సానుభూతి తెలుపుతున్నాం” అని చీఫ్
ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ లూయీస్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇప్పటికే ఆల్
ఇంగ్లండ్ క్లబ్, వింబుల్డన్ పార్క్ గోల్ఫ్ క్లబ్, రేన్స్ పార్కులు మూతపడ్డాయి.
అయితే గ్రాస్ కోర్టుల నిర్వహణ కోసం పనిచేసే కొందరు సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది
మాత్రమే ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్నారు.
మరణాల సంఖ్యలో చైనాను దాటిన స్పెయిన్
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, స్పెయిన్ ప్రస్తుతం కరోనావైరస్ మరణాల సంఖ్యలో ఇటలీ తర్వాత రెండో స్థానంలో నిలిచింది.
స్పెయిన్‌లో కరోనావైరస్ మరణాల సంఖ్య చైనాను దాటేసింది. అధికారిక సమాచారం
ప్రకారం ఇప్పుడు ఈ జాబితాలో స్పెయిన్ రెండో స్థానంలో నిలిచింది.
గత 24 గంటల్లో 738 మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 3434కు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా ఓ దేశంలో ఒక్కరోజులో ఇప్పటివరకూ సంభవించిన మరణాల సంఖ్యలో ఇదే అతి
పెద్దది. ఇటలీలో ఒకేరోజు 683మంది చనిపోయారు.
ఇప్పటివరకూ చైనాలో 3285మంది మరణించగా, తీవ్రంగా ప్రభావితమైన ఇటలీలో 6820 మంది
చనిపోయారు.
స్పెయిన్‌లో ఇన్ఫెక్షన్ల రేటు ఐదురెట్లు పెరిగింది. దాదాపు 27000 మందిని
హాస్పటళ్లలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
దేశంలో అన్నింటికన్నా మాడ్రిడ్‌లో తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే, కాటలోనియాలో
కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది.
దేశ ఉప ప్రధాని కార్మెన్ కాల్వా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఆమెను
హాస్పటల్లో చేర్చి చికిత్సచేస్తున్నారు.
“ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 460000 మంది
కరోనావైరస్ బారిన పడగా, 20000కు పైగా ప్రజలు మరణించారు. దాదాపు 110000 మంది
కోలుకున్నారు” అని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అధ్యయనం
వెల్లడించింది.
తెలంగాణలో 41కి చేరిన కరోనా కేసులు, మరో 2 కొత్త కేసులు నమోదవడంతో తెలంగాణలో కోవిడ్ బాధితుల సంఖ్య 41కి చేరింది.
ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్‌లో 43 ఏళ్ళ మహిళకు కోవిడ్-19 సోకినట్లు బుధవారం నిర్ధరించారు. విదేశీ ప్రయాణాల చరిత్ర ఆమెకు లేదని, అప్పటికే ఆమె కుటుంబంలో వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఆమెకు సోకిందని తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈమె పేషెంట్ నంబర్ 40.
41వ పేషెంట్ సౌదీ అరేబియా నుంచి వచ్చిన 3 ఏళ్ళ మగ బిడ్డ. ఈ చిన్నారికి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు.
ప్రజలెవరూ బయట తిరగవద్దని, లాక్ డౌన్ ప్రకటించినంత వరకు ఇంటికే పరిమితం కావాలని ఆరోగ్య శాఖ మరొకమారు ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
భారతదేశంలో 606 కోవిడ్ కేసులు, మృతులు 10, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు
భారతదేశంలో కరోనావైరస్ సోకినవారి సంఖ్య 606కు చేరింది. కొత్తగా మరొకరు మరణించడంతో కోవిడ్ మృతుల సంఖ్య 10కి చేరింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ సోకిన వారి సంఖ్య బుధవారం సాయంత్రానికి 4,38,749కు చేరుకుంది.మృతుల సంఖ్య 20 వేలకు చేరుకుంటోంది.
ఇటలీలో మంగళవారం 743 కోవిడ్ మరణాలు సంభవించాయి. దాంతో, ఈ దేశంలో మృతుల సంఖ్య 6,820కి చేరింది.
చైనా తరువాత ఇటలీ, అమెరికా, స్పెయిన్, జర్మనీ, ఇరాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా దేశాలలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది.
లాక్‌డౌన్‌లో నాలుగోవంతు ప్రపంచ జనాభా, కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల 20 వేల మందికి సోకింది. మృతుల సంఖ్య 20,000 దాటింది.
ఫొటో సోర్స్, Getty Images
బుధవారం సాయంత్రం 6.45 గంటల వరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం భారతదేశంలో యాక్టివ్ కరోనావైరస్ కేసుల సంఖ్య 600 దాటింది. 43 మంది వ్యాధి నయమై డిశ్చార్జి అయ్యారు. ఇప్పటికి దేశవ్యాప్తంగా 10 మంది చనిపోయారు.
మాహారాష్ట్రలో కోవిడ్ బాధితుల సంఖ్య 128కి చేరుకుంది. ముగ్గురు చనిపోయారు. కేరళలో 109 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే, ఈ రాష్ట్రంలో మరణాలేవీ రికార్డు కాలేదు. నలుగురు వ్యక్తులు వ్యాధి నయం కావడంతో ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు.
దిల్లీలో 31 మందికి కరోనావైరస్ సోకిందని, వారిలో ఆరుగురికి వ్యాధి నయమైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తెలంగాణలో 36, ఏపీలో 9 కేసులు నమోదయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలో ఒక్కొక్కరు చొప్పున వ్యాధి నయమవడంతో డిశ్చార్జి అయ్యారు.
ఎన్‌పీఆర్ నిరవధిక వాయిదా, దేశంలో జనాభా లెక్కల నిర్వహణ ప్రక్రియ వాయిదా
ఫొటో సోర్స్, Getty Images
జనాభా గణన, ఎన్‌పీఆర్ (జాతీయ జనాబా పట్టిక) నవీకరణ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత హోం శాఖ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
ఏప్రిల్ 1తో మొదలై దేశంలోని వివిధ ప్రాంతాల్లో విభిన్న తేదీల్లో ప్రారంభం కానున్న ఈ జన గణన ప్రక్రియతో పాటు, దానికి సంబంధించిన అన్ని రకాల క్షేత్ర స్థాయి కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు హోం శాఖ తెలిపింది.
కరోనా కేసులు, మృతులు, కోలుకున్న వారి వివరాలు..
ఆంధ్రప్రదేశ్: కరోనా లాక్‌డౌన్‌తో సరిహద్దులు మూసేస్తున్న గ్రామాలు
కరోనావైరస్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ప్రజలు తమ గ్రామ సరిహద్దుల్ని మూసేస్తున్నారు.
విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ క్రికెట్ స్టేడియం, అజిత్‌సింగ్ నగర్‌లోని మల్టీపర్పస్ స్టేడియంల్లో కూరగాయలను విక్రయిస్తున్నారు.
ప్రజలు పెద్ద సంఖ్యలో కూరగాయలు కొనుక్కునేందుకు ఎగబడుతున్నారు.
ఏపీలో ఇంటింటి సర్వే.. తప్పనిసరి నిర్బంధం కోసం 12131 పడకలు
విదేశాల నుండి తిరిగి వచ్చి ఇతర రాష్ట్రాల ద్వారా ఆంధ్రాలోకి ప్రవేశించే వాారితో సమగ్రంగా వ్యవహరిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకటించింది.
గ్రామ, వార్డు వలంటీర్ల నెట్‌వర్క్‌ను ఉపయోగించి ఇంటి సర్వే జరుపుతున్నామని, ఈ జాబితాతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జాబితాను సరిపోల్చుతున్నామని పేర్కొంది.
వీరిలో రోగ లక్షణాలు గల వారికి ప్రత్యేక అంబులెన్స్‌లో ఐసోలేషన్ వార్డులకు నేరుగా పంపుతామని, లక్షణాలు లేని వ్యక్తులు 28 రోజుల పాటు ఇంటి నిర్బంధానికి నోటీసులు జారీ చేస్తున్నామని వెల్లడించింది.
విదేశాల నుంచి ఏపీకి తిరిగి వచ్చినవారిలో 14,907 మందిపై పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపింది.
జిల్లాల వారీగా పర్యవేక్షణలో ఉన్న వారి వివరాలు..
అనంతపురం - 578
చిత్తూరు - 886
తూర్పుగోదావరి - 1738
గుంటూరు - 1177
కడప - 2173
కృష్ణ - 1208
కర్నూలు - 303
నెల్లూరు - 1026
ప్రకాశం - 490
శ్రీకాకుళం - 670
విశాఖపట్నం - 1417
విజయనగరం - 145
పశ్చిమ గోదావరి - 3096
కాగా, రాష్ట్రంలో అన్ని ప్రయోగశాలలు మంగళవారం నుంచి 24 గంటలూ పనిచేసేందుకు అందుబాటులోకి వచ్చాయని, కడప, విశాఖపట్నం, గుంటూరుల్లో మరో 3 ప్రయోగశాలలకు అవసరమైన పరికరాల కోసం ఆర్డర్ ఇచ్చామని తెలిపింది.
జిల్లా, ఉప జిల్లాల స్థాయిలో తప్పనిసరి నిర్బంధం కోసం 12,131 పడకలను ఏర్పాటు చేశామని వెల్లడించింది.
RRR: సినిమా టీమ్ కూడా ఇంటి నుంచే పనిచేస్తోంది - రాజమౌళి
టాలీవుడ్ అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్న RRR చిత్రం టైటిల్ లోగోను, మోషన్ పోస్టర్‌ను ఈరోజు విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటీనటులు అజయ్ దేవగణ్, ఆలియాభట్ కూడా నటిస్తున్నారు.
స్వాతంత్ర్య పోరాటం జరిపిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల స్ఫూర్తితో ఈ చిత్ర కథను రూపొందించామని గతంలో రాజమౌళి తెలిపారు.
‘‘ఇది ప్రపంచ సంక్షోభ సమయం. అయితే, అందరిలోని స్ఫూర్తిని మరింత పెంచేందుకు మావంతు ప్రయత్నం చేద్దామనుకున్నాం. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌లను విడుదల చేస్తున్నాం’’ అని మంగళవారం రాత్రి రాజమౌళి పోస్ట్ చేశారు.
అయితే, తమ బృందంలోని అందరూ తమతమ ఇళ్లనుంచే పనిచేస్తున్నందున ఇవి ఎప్పుడు విడుదల అవుతాయనే సమయాన్ని నిర్థిష్టంగా తాను చెప్పలేనని ఆయన వివరించారు.
అభిమానులంతా తమతమ ఇళ్లనుంచే వీటిని చూసి ఆనందించాలని రాజమౌళి విజ్ఞప్తి చేశారు.
దేశమంతా లాక్‌డౌన్‌లో ఉందని, కాబట్టి మూకుమ్మడిగా కలవడానికి ఏ కారణమూ ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.
ఎలాంటి ఫ్లెక్సీలు, ప్రింట్‌లు వేయొద్దని, ఇంట్లో కూర్చుని, భద్రంగా ఉండాలని, ఆన్‌లైన్ ద్వారా చూసి ఆనందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఫొటో సోర్స్, facebook/SSRajamouli
కరోనావైరస్: 'భారతదేశం మొత్తం 21 రోజులు లాక్ డౌన్' - ప్రధాని మోదీ, కరోనావైరస్‌ను నిరోధించేందుకు దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన మోదీ. ఈ వైరస్‌ను అడ్డుకోవాలంటే ఇంట్లోనే ఉండడం ఒక్కటే మార్గమని ఆయన అన్నారు.
ఫొటో సోర్స్, Doordarshan
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశం అంతా లాక్ డౌన్ ప్రకటించారు. కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ప్రజలందరూ ఇంట్లో ఉండడం ఒక్కటే మార్గమని సూచించారు.
మోదీ ఇంకా ఏమన్నారంటే...
ఈ అర్థరాత్రి నుంచి మూడు వారాలు భారతదేశం మొత్తం లాక్‌డౌన్.రాబోయే 21 రోజులు మనకు చాలా కీలకం, ఎవరూ బయటకు
రావద్దు.
21 రోజులు నియంత్రించుకోకపోతే, రాబోయే 21
ఏళ్లు బాధపడాలి.ఇది నేను ప్రధానిగా కాదు, మీ కుటుంబం
సభ్యుడిగా చెప్తున్నా.
ఒక్క కరోనా బాధితుడితో వారంలో వేలాది మందికి వైరస్
అంటుకుంటుంది.సోషల్ డిస్టన్సింగ్ రోగులకే అని కొందరు పొరబడుతున్నారు.
సోషల్ డిస్టన్సింగ్ మీకూ, నాకూ కూడా ముఖ్యం.
కొందరి నిర్లక్ష్యం రేపు దేశాన్ని పెద్ద ప్రమాదంలోకి నెడతాయి.
నిర్లక్ష్యం కొనసాగితే దేశం భారీ మూల్యం చెల్లించుకుంటుంది.
ఈ లాక్‌డౌన్ వల్ల దేశం ఆర్థికనష్టాన్ని భరించాల్సి ఉంటుంది.
ఇప్పుడు మీరు దేశంలో ఎక్కడ ఉన్నా 3 వారాలు అక్కడే ఉండండి
21 రోజులు ఇళ్లలో ఉండకపోతే కుటుంబాలు శాశ్వతంగా నష్టపోతాయి.
ఈ 21 రోజులు ఇళ్ల నుంచి బయటికి రావడం అనేది మర్చిపొండి.
లాక్‌డౌన్ మీరు మీ గుమ్మంలో గీసిన లక్ష్మణరేఖ కావాలి.
మీరు బయటికి వెళ్తే, కరోనాను ఇంటికి తీసుకురావచ్చనేది గుర్తుంచుకోండి. మనం ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. ఏదేమైనా ఇళ్లలోనే ఉందాం.
సోషల్ డిస్టన్సింగ్ అనే లక్ష్మణరేఖ దాటనప్పుడే కరోనా నుంచి బయటపడగలం.
పోలీసులు రాత్రింబవళ్లూ మీకోసం డ్యూటీ చేస్తున్నారు, మీ కోపానికి కూడా గురవుతున్నారు. రాబోయే 21 రోజులు ఇంట్లోనే ఉండకపోతే కరోనా నుంచి బయటపడటం
అసాధ్యం. లాక్‌డౌన్ అంటే కర్ఫ్యూ లాంటిదే. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకూడదు.కరోనా సైకిల్ అడ్డుకోడానికివేయడానికి
ఇదొక్కటే మార్గం.
ఒక్క విషయం గుర్తుంచుకోండి.. ప్రాణాలుంటేనే ఏదైనా చెయ్యగలం. దేశంలో లాక్ డౌన్ అమల్లో ఉన్నంత వరకూ మన సంకల్పంతో ఉండాలి.
కరోనాను ఎదుర్కొనేందుకు ఆరోగ్య శాఖకు 15 వేల కోట్ల రూపాయల
విడుదల. వైద్యులు, పోలీసులు,
24
గంటలూ పనిచేసే మీడియా, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు.
నిత్యావసరాల కొరత లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలుతీసుకున్నాయి.
కరోనా టెస్టింగ్ ఫెసిలిటీస్, పరికరాలు, ఐసొలేషన్, ఐసీయూ బెడ్స్, వెంటిలేషన్, ఇతర అవసరమైన వాటిని వేగంగా పెంచుతున్నాం.
ప్రైవేటు రంగాలుకూడా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచాయి.
వ్యాధి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ల సలహా లేకుండా ఏ మందులూ వేసుకోవద్దు, అలా చేస్తే మీ ప్రాణాలే ప్రమాదంలో పడవచ్చు.
ఈ కష్టకాలం నుంచి ప్రతి భారతీయుడు విజయవంతంగా బయటపడతాడని ఆశిస్తున్నా.
టోక్యో ఒలింపిక్స్-2020 వాయిదా, కరోనావైరస్ ప్రభావంతో వాయిదా పడిన ప్రపంచ క్రీడోత్సవం
ఫొటో సోర్స్, Reuters
ఒలింపిక్స్-2020 క్రీడావేడుక వాయిదా పడింది. కరోనావైరస్ కారణంగా ఈ ప్రపంచ క్రీడోత్సవాన్ని ఏడాది కాలానికి అంటే 2021 వరకూ వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యుడు డిక్ పౌండ్ తెలిపారు.
ఈ ఏడాది టోక్యోలో జరుగనున్న ఒలింపిక్స్‌కు తమ జట్టును పంపే అవకాశాలు లేవంటూ బ్రిటిష్ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా, కెనడా దేశాలు కూడా జపాన్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనేది లేదని ప్రకటించాయి.
ఈ పరిస్థితుల్లో జపాన్ ప్రధానమంత్రి షింజో ఆబె 'టోక్యో ఒలింపిక్స్-2020'ని ఏడాది కాలం వాయిదా వేయాలని కోరారు.
ఐఓసీకి అందిన సమచారాన్ని పరిశీలించిన తరువాత ఒలింపిక్స్ ను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు పౌండ్ యుఎస్ఏ టుడేకు తెలిపారు.
తెలంగాణలో 36, ఏపీలో 7, భారత్‌లో 491కు చేరిన కోవిడ్ కేసులు
ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాలకు విస్తరించింది. మార్చి 24 మంగళవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు 4 లక్షలకు చేరుకున్నాయి. మృతుల సంఖ్య 17,000 దాటింది. 1,00,000 మంది ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు.
భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దేశంలో ఇప్పటివరకు 491 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధితో 9 మంది మరణించారు. 36 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయినట్లు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
మహారాష్ట్రలో అత్యధికంగా 89 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దర చనిపోయారు. కేరళలో 99 మందికి ఈ వ్యాధి సోకింది.
తెలంగాణలో ఇప్పటివరకు 36 మందికి కరోనా సోకినట్లు అధికారిక సమాచారం. వీరిలో ఒకరికి వ్యాధి నయమైంది. ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం 8వ కోవిడ్ కేసు నమోదైంది.
కాగా, చైనాలో 78 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో 74 మంది విదేశాల నుంచి వచ్చినవారు. పాకిస్తాన్‌లో సోమవారం సాయంత్రం వరకు 878 కరోనా కేసులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్‌లో 33 మందికి కరోనా సోకిందని నిర్థరణ అయింది. మూడు మరణాలు నమోదయ్యాయి.
ఇటలీలో సోమవారం మరో 602 మంది కరోనాకు బలయ్యారు. మృతుల సంఖ్య 6,078కి చేరింది.
స్పెయిన్‌లోనూ పరిస్థితి తీవ్రంగా మారింది. కొత్తగా నమోదైన 514 మరణాలతో ఇక్కడి కోవిడ్-19 మృతుల సంఖ్య 2,696కు చేరింది. స్పెయిన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకరాం ఇప్పటివరకు ఆ దేశంలో 39,637 కరోనా కేసులు నమోదయ్యాయి.