కరోనా లాక్‌డౌన్: కరోనాపై పోరులో మనకున్న ఏకైక ఆయుధాన్ని వాడుదాం - కేసీఆర్

జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తాజా సమాచారం ప్రకారం అమెరికా 1,22,666 కరోనావైరస్ కేసులతో చైనాను దాటేసింది. భారత్‌లో ఇప్పటి వరకు 25 మరణాలు నమోదు అయ్యాయి.

లైవ్ కవరేజీ

  1. భారత్‌లో 873 కేసులు, 19 మరణాలు

    భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 873కి చేరింది. వీరిలో 79 మందికి వ్యాధి నయం కాగా 19 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 180, కేరళలో 173 కేసులు నమోదయ్యాయి.

  2. ఇటలీలో ఒకే రోజు 914 మంది మృతి

    ఇటలీలో శుక్రవారం ఒక్కరోజే 914 మంది మరణించారు. కరోనావైరస్ కారణంగా ఇంతవరకు ఏ దేశంలోనూ ఒక్క రోజులో ఇంతపెద్ద సంఖ్యలో మరణాలు నమోదు కాలేదు. దీంతో ఇటలీలో మొత్తం మరణాల సంఖ్య 9,134కి చేరింది.

    కరోనా

    ఫొటో సోర్స్, epa

  3. ఏప్రిల్ 14 అర్ధరాత్రి వరకు విమానాలు బంద్

    ప్రయాణికుల విమానాల దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల పునరుద్ధరణ ఏప్రిల్ 14 అర్ధరాత్రి తరువాతేనని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. చార్టర్లు, ప్రయివేటు ఎయిర్‌క్రాఫ్టులు కూడా ఈ పరిధిలోకి వస్తాయి. తొలుత మార్చి 31 వరకు నిషేధం ఉన్నప్పటికీ దాన్ని ఇప్పుడు పొడిగించారు. కార్గో, వైద్య అవసరాలకు తిప్పేవి, డీజీసీఏ ప్రత్యేక అనుమతులున్న విమానాలను మాత్రమే అంతవరకు అనుమతిస్తారు.

    ఉత్తర్వులు

    ఫొటో సోర్స్, dgca

  4. రూ. 149 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ట్రంప్

    కరోనావైరస్ మహమ్మారి అమెరికాను చుట్టుముడుతున్న నేపథ్యంలో దేశాధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2 ట్రిలియన్ డాలర్ల (రూ.149 లక్షల కోట్ల) ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు.

    ఈ ప్యాకేజీ దేశంలోని కుటుంబాలు, కార్మికులు, వ్యాపారులకు ఎంతగానో ఉపశమనం చేకూరుస్తుందని ఆయన చెప్పారు.

    ప్యాకేజీపై సంతకం చేసే కార్యక్రమానికి డెమొక్రటిక్ పార్టీ నాయకులు ఎవరినీ ఆహ్వానించలేదు. అయితే, అధికార రిపబ్లిక్, ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ నాయకులకు ఈ సందర్భంగా ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.

    దేశవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య 33 లక్షలకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి.

    మరోవైపు కరోనావైరస్ సోకిన రోగుల సంఖ్య లక్షను దాటేసింది.

    దేశంలో ప్రైవేటు కంపెనీలన్నీ జాతి రక్షణకు అవసరమైన వస్తువులను తయారు చేసేలా డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్‌ను ట్రంప్ అమల్లోకి తెచ్చారు.

    అలాగే, దేశవ్యాప్తంగా అవసరమైన వెంటిలేటర్లను తయారు చేయాలని జనరల్ మోటార్స్‌ కంపెనీకి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.

    వీలైనంత త్వరగా జనరల్ మోటార్స్ సంస్థ 40 వేల వెంటిలేటర్లను ఇవ్వనుందని ట్రంప్ తెలిపారు.

    వీడియో క్యాప్షన్, ట్రంప్: ‘మేం బాగా పనిచేస్తున్నాం’
  5. కోవిడ్-19 కేసుల్లో చైనా, ఇటలీలను దాటేసిన అమెరికా

    కరోనావైరస్ కేసుల విషయంలో అమెరికా 1,04,007కు పైగా కేసులతో చైనాను దాటేసింది.

    చైనాలో 81,905 కేసులు నమోదు కాగా, ఇటలీలో ఇప్పటివరకు 86,498 కేసులు నమోదయ్యాయి.

  6. భారత్‌లో 724కు చేరిన కోవిడ్ కేసులు, తెలంగాణలో 59, ఏపీలో 12, తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే 10 కరోనావైరస్ కేసుల నిర్ధరణ

    కరోనావైరస్

    తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 59కి చేరింది. శుక్రవారం ఒక్కరోజే 10 కొత్త కేసులు నమోదైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఒక వ్యక్తికి వ్యాధి నయమైందని, డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 58 మందికి చికిత్స కొనసాగుతోంది. ప్రభుత్వ క్వారెంటైన్ కేంద్రాలలో దాదాపు 25,000 మంది పర్యవేక్షణలో ఉన్నారు.

    ఏపీలో కరోనా కేసుల సంఖ్య 13కు చేరుకుంది. వీరిలో ఒకరు వ్యాధి నయమై డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలోని 17 ప్రైవేటు మెడికల్ కాలేజీలలో ఒక్కోదానిలో 200 చొప్పున 3400 పడకలతో ప్రభుత్వం ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేస్తోంది.

    ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంటవవరకు ప్రజలు బయటకు వెళ్ళడానికి వెసలుబాటు కల్పించారు. మధ్నాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు పాలు, నీరు అందుబాటులో ఉంటాయి. మందుల షాపులు అన్నివేళలా తెరిచే ఉంటాయి.

    భారతదేశంలో శుక్రవారం నాటికి కోవిడ్ బాధితుల సంఖ్య 724కు చేరింది. ఇప్పటి వరకు 67 మంది కోలుకున్నారు. 17 మంది చనిపోయారు.

    ప్రపంచవ్యాప్తంగా చూస్తే, మరణాల సంఖ్య 24,906కు చేరుకుంది. కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య 5,51,337కు పెరిగింది. మొత్తంగా ఇప్పటివరకు 1,27,564 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారని జాన్స్ హాప్కిన్స్ కరోనావైరస్ రిసోర్స్ సెంటర్ డేటా చెబుతోంది.

    కరోనావైరస్ కేసుల సంఖ్యలో అమెరికా చైనాను దాటింది. చైనాలో శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు 81,897 కేసులు నమోదు కాగా, అమెరికాలో ఆ సంఖ్య 86,012కు చేరింది. మూడో స్థానంలో ఉన్న ఇటలీలో కరోనా కేసుల సంఖ్య 80,859కు పెరిగింది. స్పెయిన్‌లోనూ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ దేశంలో 64,059 మందికి కరోనావైరస్ సోకింది. ఇటలీలో 8,215, స్పెయిన్‌లో 4,858 మంది చనిపోయారు. అమెరికాలో మృతుల సంఖ్య 1,301కి చేరింది.

  7. గత్తర బిత్తర కావద్దు.. ఏప్రిల్ 15 వరకూ ఎక్కడి వాళ్లు అక్కడే ఉండండి: కేసీఆర్, 'తెలంగాణ సమాజానికి దండం పెట్టి చెబుతున్నా. ఎక్కడివాళ్లు.. అక్కడే ఉండండి’

    కేసీఆర్

    ఫొటో సోర్స్, Telangana CMO

    ‘‘యుద్ధం చేసే సమయంలో నిర్లక్ష్యం, అలసత్వం పనికిరాదు. వైద్యులు, అధికారులు, పోలీసు సిబ్బందికి ప్రజలు సహకరించాలి. బాధలైనా భరించాలి. ఏప్రిల్‌ 15 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నాం. తెలంగాణ సమాజానికి దండం పెట్టి చెబుతున్నా. గత్తర బిత్తర కావొద్దు. ఎక్కడివాళ్లు.. అక్కడే ఉండండి’’ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు.

    లాక్‌డౌన్‌ చేయకుండా ఉంటే భయంకర పరిస్థితులుండేవన్నారు. ఇతర రాష్ట్రాల ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎట్టి పరిస్థితుల్లో హాస్టల్స్‌ మూసివేయబోమని చెప్పారు.

    కేసీఆర్ శుక్రవారం వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత సీఎం మీడియాతో మాట్లాడారు.

    తెలంగాణలో ఇప్పటివరకు 59 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 10 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం 58 మందికి చికిత్స కొనసాగిస్తున్నాం. ఒకరు పూర్తిగా కోలుకుని వెళ్లారు. హోం క్వారంటైన్‌తో పాటు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో సుమారు 25,000 మంది పర్యవేక్షణలో ఉన్నారని కేసీఆర్ తెలిపారు.

    నిత్యావసరాలు, కూరగాయల కోసం ఇంటి నుంచి ఒక్కరే వెళ్లాలి. చికెన్‌, గుడ్లు తింటే కరోనా వస్తుందనేది అవాస్తవం. బలవర్దక ఆహారం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.’’

  8. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనావైరస్, బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధరించారని డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది.

    జాన్సన్‌కు స్వల్పంగా కరోనావైరస్ లక్షణాలు ఉన్నాయని, ఆయన ఇకపై స్వీయ నిర్బంధంలో ఉంటారని తెలిపారు.

    "ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టీ సూచన మేరకు ప్రధానమంత్రికి పరీక్షలు నిర్వహించాం." అని అధికారికంగా ప్రకటించారు.

    కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిన తరువాత బోరిస్ జాన్సన్ ట్విటర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. "నాలో కరోనావైరస్ లక్షణాలను స్వల్పంగా ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రత పెరగడంతో పాటు ఆగకుండా దగ్గు వస్తోంది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ సలహా మేరకు నేను పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్ అని తేలింది. నేను స్వీయ నిర్బంధం విధించుకుని ఇంటి నుంచే పని చేస్తాను" అని ఆ వీడియోలో బోరిస్ తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. కరోనావైరస్ కేసుల సంఖ్యలో చైనాను దాటిన అమెరికా, అమెరికాలో ఇప్పుడు ఏ దేశంలో లేనంతగా 85,500 కరోనాకేసులను నిర్ధరించారు.

    ట్రంప్

    జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ అందించిన తాజా వివరాల ప్రకారం కరోనావైరస్ కేసుల విషయంలో అమెరికా 85,500 కేసులతో చైనాను దాటేసింది.

    చైనాలో 81,782 కేసులు నమోదు కాగా, ఇటలీలో ఇప్పటివరకు 80,589 కేసులు నమోదయ్యాయి.

    అయితే, మరణాల విషయంలో మాత్రం అమెరికా ఈ రెండు దేశాల తరువాత స్థానంలో ఉంది. చైనాలో 3,291 మంది కోవిడ్-19 వ్యాధితో చనిపోగా, ఇటలీలో 8,215 మంది చనిపోయారు. అమెరికాలో 1,300 మృతులు రికార్డయ్యాయి.

    అమెరికా త్వరలోనే మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుందని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది.

    దీనిపై గురువారం రాత్రి ట్రంప్ విలేఖరులతో మాట్లాడుతూ, "ఇది విస్తృతంగా పరీక్షలు నిర్వహించడం వల్ల వచ్చిన ఫలితం" అని అన్నారు.

    దేశంలోని 50 రాష్ట్రాల్లో ఇప్పుడు కోవిడ్-19 రోగ నిర్ధరణ కేంద్రాలు ఉన్నాయని, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,52,000 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చెప్పారు.

    అయితే, చైనా చెబుతున్న సంఖ్యల పట్ల ట్రంప్ సందేహాలు వ్యక్తం చేశారు. "చైనాలో నంబర్ ఏమిటన్నది తెలియడం లేదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

    అయితే, ఆ తరువాత ట్రంప్, "చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో మంచి సంభాషణ జరిగింది. వైరస్‌ను అర్థం చేసుకోవడంలో చైనా సమర్థంగా వ్యవహరించింది. ఈ విషయంలో మేం కలిసి పని చేస్తాం. అధ్యక్షుడు చాలా గౌరవంతో మాట్లాడారు" అని ట్వీట్ చేశారు.

  10. బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం, ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది.

    విజయవాడ

    ఫొటో సోర్స్, ugc

    ఫొటో క్యాప్షన్, విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రజలు సామాజిక దూరాన్ని పాటించే విధంగా రైతు బజార్ ఏర్పాటు చేసిన ఏపీ పోలీసులు

    ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఈ విషయాన్ని వెల్లడించారు.

    కరోనావైరస్ నియంత్రణకు ప్రభుత్వం కఠినచర్యలు అమలు చేస్తోందని చెప్పిన నాని, "దాదాపు 28 వేల మంది విదేశీయులు రాష్ట్రానికి వచ్చారు. 104 హెల్ప్ లైన్ ఏర్పాటు చేశాం. అది 24 గంటలు పని చేస్తుంది. ప్రతి నియోజకవర్గం పరిధిలో 100 ఐసోలేటెడ్ బెడ్స్, జిల్లా పరిధిలో 200 పడకల ఆస్పత్రిని సిద్ధం చేశాం. 10 లక్షల సర్జికల్ మాస్కులు అందుబాటులో ఉన్నాయి" అని చెప్పారు.

    అంతేకాకుండా, ఇతర ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఏపీకి రావాలనుకుంటే 14 రోజుల క్వారెంటైన్‌కు సిద్ధపడితేనే రావాలని నాని చెప్పారు.

    రెండు గంటల పాటు జరిగిన క్యాబినెట్ సమావేశంలో కరోనావైరస్ వ్యాప్తి నివారణకు నిరంతర పర్యవేక్ష కమిటీ వేయడానికి నిర్ణయించారు. ఈ కమిటీలో అయిదుగురు మంత్రులు - వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆర్థిక మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబు - సభ్యులుగా ఉంటారు.

  11. ఓ వ్యక్తి వల్ల 24 గ్రామాల్లో క్వారంటైన్, 26మందికి వైరస్ పాజిటివ్

    కరోనావైరస్

    ఫొటో సోర్స్, Getty Images

    ఇటీవల ఇటలీ, జర్మనీలకు ప్రయాణించి వచ్చిన ఓ వ్యక్తే పంజాబ్ దౌబా ప్రాంతంలోని కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రబిందువని వెల్లడైంది.

    నిజానికి ఆ వ్యక్తి ఇటీవలే మరణించారు. ఆయన చనిపోయిన తర్వాతే ఆయనకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. ఆయన కారణంగా వ్యాధి సోకిన వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ వస్తోంది.

    తాజాగా హోషియాపూర్ జిల్లాలో మరో 3 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ జిల్లాలో మొత్తం కోవిడ్19 కేసుల సంఖ్య 26కి పెరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం 3 జిల్లాల్లో 24 గ్రామాల్లో క్వారంటైన్ ప్రకటించారు. మరో ఐదు గ్రామాలు అదే దారిలో నడుస్తున్నాయి.

    క్వారంటైన్‌కు గురైన గ్రామాల్లో 15 గ్రామాలు ఎస్బీఎస్ నగర్ జిల్లాలోనివి కాగా 8 గ్రామాలు హోషియాపూర్ జిల్లాలోనివి. మరో గ్రామం జలంధర్ జిల్లాకు చెందినది. మొత్తం 26 పాజిటివ్ కేసులూ ఆ గ్రామాల్లో బయటపడ్డవే.

    వ్యాధి బారిన పడ్డ వారంతా ఇటీవల మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగు వారే.

    నిజానికి ఆయన భక్తి పాటలు పాడుతూ ఉంటారు. సిక్కు మతస్థులు హోలీ తర్వాత జరుపుకునే హోరా మొహల్లా సందర్భంగా అనందపూర్ సాహిబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

  12. రాష్ట్రానికి వచ్చేవారి విషయంలో ఏపీ హైకోర్టు ఉత్తర్వులు

    తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారిపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది.

    ఆయా రాష్ట్రాలు, పోలీసులు ఇచ్చిన ఎన్‌వోసీని ఎంట్రీ పాయింట్‌లోనే పరిశీలించాలని.. ఆరోగ్యపరంగా బాగుంటేనే అనుమతించాలని స్పష్టం చేసింది.

    ఒకవేళ ఆరోగ్యంగా లేకపోతే క్వారంటైన్‌కు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.

    క్వారంటైన్‌ అవసరం లేకపోతే గృహనిర్బంధంలో ఉంచి ఎప్పటికప్పుడు డాక్టర్లు పర్యవేక్షించేలా చూడాలని సర్కార్‌కు హైకోర్టు తెలిపింది.

    ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుడటం, రాష్ట్ర సరిహద్దుల్లో నిలిచిపోతుండటంతో బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ హైకోర్టు పిటిషన్‌ వేశారు. దీనిపై శుక్రవారం నాడు హైకోర్టు విచారణ చేసి, ఉత్తర్వులు జారీ చేసింది.

  13. విశాఖలో మరో కోవిడ్-19 కేసు నమోదు

    శుక్రవారం విశాఖపట్నంలో మరో కోవిడ్-19 కేసు నమోదైంది. బర్మింగ్‌హామ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి (పేషెంట్ నెం.7) తో కాంటాక్ట్ అయిన మరో వ్యక్తికి పాజిటివ్ అని తేలింది.

    ఈ వ్యక్తి మార్చి 17న పేషెంట్ నెం.7 ను కలిశారు. ఆ తర్వాత మార్చి 21న హాస్పటల్లో చేరారు. అప్పటి నుంచి ఆయన ఐసోలేషన్‌లోనే ఉన్నారు.

    విజయవాడలోని సిద్ధార్ధ మెడికల్ కాలేజీ, కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్ అనుమతిచ్చింది.

    కోవిడ్ చికిత్సకు అవసరమైన సౌకర్యాలను సమకూర్చాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.

    కోవిడ్-19 చికిత్సకోసం ఉద్దేశించిన నాలుగు ఆస్పత్రుల్లో 2680 ఐసీయూ బెడ్లను, 330 వెంటిలేటర్లను ఏర్పాటుచేస్తున్నారు.

    జిల్లాల్లోని 13 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు కూడా కోవిడ్-19 చికిత్సకు అనుమతులిచ్చారు.

    ఇప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చిన 28028 మందిని పర్యవేక్షణల ో ఉంచారు.

    వీరిలో 27929 మంది తమ ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉండగా, 99మంది హాస్పటళ్లలో చేరి చికిత్స పొందుతున్నారు.

    ఇప్పటి వరకూ 317మంది శాంపిళ్లను పరీక్షించగా 12మందికి పాజిటివ్ అని తేలింది. మరో 55మంది నివేదికలు రావాల్సి ఉంది.

  14. రుణాల చెల్లింపుపై 3 నెలల మారిటోరియం: ఆర్బీఐ

    శక్తికాంత దాస్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, శక్తికాంత దాస్

    కరోనావైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

    అన్ని రకాల రుణ చెల్లింపుపై మూడు నెలల పాటు మారటోరియం విధిస్తున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.

    ముఖ్యమైన నిర్ణయాలు

    • రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గింపు
    • రివర్స్ రెపోరేటు 90 బేస్ పాయింట్లు తగ్గింపు
    • 4శాతానికి చేరి రివర్స్ రెపో రేటు
    • 4.4శాతానికి చేరిన రుణాల రేటు
    • అదుపులోనే ఉన్న ద్రవ్యోల్బణం
    • నగదు నిల్వల నిష్పత్తి 100 బేస్ పాయింట్ల తగ్గింపు

    ఆర్థిక స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటామని గవర్నర్ చెప్పారు.

    వైరస్ వ్యాప్తి, దాని తీవ్రత ఎంత కాలం కొనసాగనుందన్న అంశాలపైనే భవిష్యత్ వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం అంచనాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

    భారత బ్యాంకింగ్ వ్యవస్థకు వచ్చిన ముప్పేం లేదని, మూలాలు చాలా బలంగా ఉన్నాయని శక్తికాంత దాస్ భరోసానిచ్చారు.

    మార్కెట్లను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, కరోనావైరస్ కారణంగా ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉందని శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు.

    కోవిడ్-19 నేపథ్యంలో సుమారు 150 మంది ఆర్బీఐ సిబ్బంది క్వారంటైన్‌లో ఉన్నారని ఆయన తెలిపారు.

  15. కృష్ణా జిల్లాలో ఇద్దరు ఎన్నారైలపై కేసు

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఇద్దరు ఎన్నారైలపై కేసు నమోదైంది.

    క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జిల్లాలోని మైలవరంలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    మార్చి 14న అమెరికా నుంచి వచ్చిన ఈ ఇద్దరినీ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించారు. అయితే ఇప్పుడు వారిద్దరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లారని, వారెక్కడున్నారో తెలియదని పోలీసులు తెలిపారు.

  16. శుక్రవారం నమాజు ఎవరింట్లో వారే చేయండి: ముస్లిం పర్సనల్ లా బోర్డ్

    ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు

    ఫొటో సోర్స్, ANI

    కరోనావైరస్ మహమ్మారి ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో ముస్లింలు శుక్రవారం సామూహిక ప్రార్థనలు చేపట్టడం శ్రేయస్కరం కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచించింది.

    పోలీసులు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ముస్లింలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఎవరి ఇంట్లో వారే తమ ప్రార్థనలు చేసుకోవాలని కోరింది.

    మసీదుల్లో మాత్రం ఇమామ్‌తోపాటు మరికొందరు కనీస సిబ్బందితో, సామాజిక దూరం పాటిస్తూ నమాజును పూర్తి చేయాలని సూచించింది.

    వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, తమ తోటి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ చర్యలు అవసరమని స్పష్టం చేసింది.

  17. పాటతో స్ఫూర్తి నింపుతున్న వైద్య సిబ్బంది

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    రాజస్థాన్‌లోని భిల్వారాలో ఓ హాస్పటల్‌లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది తమ పాటతో జాతీయతా స్ఫూర్తిని, అంతా కలసి కట్టుగా కరోనావైరస్‌పై పోరాటం చేయాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఓ పాట పాడారు.

    ఈ ప్రయత్నాన్ని ఆన్‌లైన్‌లో ఎంతోమంది ప్రశంసిస్తున్నారు.

  18. కోవిడ్-19 కేసుల సంఖ్యలో చైనాను దాటేసిన అమెరికా

    డోనల్డ్ ట్రంప్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్

    అమెరికా కోవిడ్-19 కేసుల సంఖ్యలో చైనాను దాటేసింది.

    ప్రస్తుతం అమెరికాలో 83,500మంది కరోనావైరస్ బాధితులున్నారు. ప్రపంచంలో మరే ఇతర దేశంలోనూ ఇంతమంది బాధితులు లేరు.

    జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం అమెరికా కరోనావైరస్ బాధితుల సంఖ్యలో చైనా, ఇటలీలను దాటేసింది.

    అయితే, 1200 మరణాలతో ఇటలీ, చైనాల తర్వాత మూడోస్థానంలో నిలిచింది.

    వైట్ హౌస్ ఎలా స్పందించింది?

    ఈ గణాంకాలపై అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రశ్నించగా... ఇది మనం చేస్తున్న వైద్య పరీక్షలకు నివాళి అని వ్యాఖ్యానించారు.

    ప్రస్తుతం కరోనావైరస్ పరీక్షలు మొత్తం 50 రాష్ట్రాల్లోనూ అందుబాటులో ఉన్నాయని, 5.5 లక్షలకు పైగా ప్రజలకు పరీక్షలు చేశామని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపారు.

    బీజింగ్‌లో ఏం జరుగుతోందనే దానిపై ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేశారు. చైనాలో అసలైన గణాంకాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు కదా అని వ్యాఖ్యానించారు.

    గురువారం రాత్రి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. అయితే, చైనీస్ వైరస్ అని పిలవద్దని జిన్‌పింగ్ తనకు సూచించినట్లు వచ్చిన వార్తలను ట్రంప్ ఖండించారు.

  19. భారత్‌లో 694 కరోనా కేసులు... మృతుల సంఖ్య 16, భారతదేశంలో యాక్టివ్ కోవిడ్-19 బాధితుల సంఖ్య 694కు చేరుకుంది.

    స్పెయిన్

    ఫొటో సోర్స్, Getty Images

    గురువారం రాత్రి 8 గంటలకు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన సమాచారం ప్రకారం దేశంలో కరోనావైరస్ బాధితుల సంఖ్య 694కు చేరింది. ఇప్పటివరకు 16 మంది మరణించారు. 45 మందికి వ్యాధి నయమైంది.

    దేశంలో అత్యధికంగా 124 కేసులు నమోదయ్యాయి. ఒకరు డిశ్చార్జి కాగా, ముగ్గురు చనిపోయారు. కేరళలో 118 మందికి వైరస్ సోకింది. ఆరుగురికి వ్యాధి నయమైంది. ఈ రాష్ట్రంలో ఎవరూ చనిపోలేదు.

    రాజస్థాన్‌లో 41, గుజరాత్‌లో 43, దిల్లీలో 36, ఉత్తరప్రదేశ్‌లో 41, తెలంగాణలో 44, కర్నాటకలో 55, పంజాబ్‌లో 33, ఆంధ్రప్రదేశ్‌లో 11 కేసులు నమోదయ్యాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో ఒకరికి కోవిడ్ వ్యాధి సోకినట్లు గురువారం వెల్లడైంది.

    జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ కరోనావైరస్ రిసోర్స్ సెంటర్ ప్రచురించిన వివరాల ప్రకారం గురువారం రాత్రి 8.40 గంటలకు ప్రపంచవ్యాప్తంగా 4,92,603 మందికి కరోనావైరస్ సోకింది. 1,19,918 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య 22,184కు చేరుకుంది.

    ఇటలీలో 74,386 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 7,503 మంది చనిపోయారు. 9,362 మందికి వ్యాధి నయమైంది.

    అమెరికాలో 69,246 మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. 619 మాత్రమే వ్యాధి నయమై డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 1,046 మంది చనిపోయారు.

    స్పెయిన్‌లో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఇటలీ తరువాత అత్యధికంగా ఈ దేశంలో 4,089 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 7,015 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

    జర్మనీలో 40,585, ఫ్రాన్స్‌లో 25,604, ఇరాన్‌లో 29,406 మందికి వైరస్ సోకింది. ఇరాన్‌లో మృతుల సంఖ్య 2,234కు చేరుకుంది.

    కరోనా వైరస్
  20. స్పెయిన్‌లో పరిస్థితి తీవ్రం... 4,000 దాటిన మృతులు, కరోనావైరస్ మహమ్మారికి ప్రపంచవ్యాప్తంగా బలైన వారి సంఖ్య 22,000 దాటింది.

    అమెరికాలో కరోనావైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దక్షిణ యూరప్‌లో ఈ వైరస్ ప్రభావానికి ప్రజలు వేల సంఖ్యలో మరణించారు.

    అమెరికాలో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 70,000 దాటింది. మరణాల సంఖ్య 1,050 దాటింది. స్పెయిన్‌లో ఒక్కరోజే 655 మంది చనిపోయినట్లు అధికారిక వార్తలు వెలువడ్డాయి. దాంతో, స్పెయిన్‌లో కరోనా మృతుల సంఖ్య 4,100కు చేరుకుంది.

    బ్రిటన్‌లో 9,500 మందికి వ్యాధి నిర్ధరణ అయింది. ఇప్పటివరకు 465 మంది మృతి చెందారు.

    ఇటలీలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గిన సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, మరణాల సంఖ్య మాత్రం పెరుగుతోంది.

    ప్రపంచవ్యాప్తంగా గురువారం సాయంత్రానికి ఈ వైరస్ 4,87, 648 మందికి సోకింది. 22,030 మంది చనిపోయారు. భారతదేశంలో వైరస్ బాధితుల సంఖ్య 600 దాటింది. 13 మంది చనిపోయారు. 42 మంది కోలుకున్నారు. తెలంగాణలో 43 మంది, ఏపీలో 11 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.

    కరోనావైరస్