జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో మాజీ పోలీసు అధికారిని దోషిగా తేల్చిన అమెరికా కోర్టు

జార్జ్ ఫ్లాయిడ్

ఫొటో సోర్స్, RUTH RICHARDSON/TWITTER

ఫొటో క్యాప్షన్, జార్జ్ ఫ్లాయిడ్
ప్రచురణ

అమెరికన్ నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో నిందితుడైన మాజీ పోలీసు అధికారని దోషిగా గుర్తిస్తూ అమెరికాలోని ఒక కోర్టు తీర్పు చెప్పింది. ఈ ఘటన గత ఏడాది మినియాపోలిస్‌లో జరిగింది.

ఫ్లాయిడ్ మెడను 45 ఏళ్ల డెరెక్ చావిన్ తొమ్మిది నిమిషాలకు పైగా మోకాలితో తొక్కి పట్టిన ఘటన వీడియోలో రికార్డయింది. ఆ వీడియోను దేశ విదేశాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో చూశారు. పోలీసుల జాతి వివక్ష వైఖరిపై అన్ని ప్రాంతాల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి.

సెకండ్ డిగ్రీ మర్డర్, థర్డ్ డిగ్రీ మర్డర్, మానవ హత్య అనే మూడు ఆరోపణల్లోనూ కోర్టు చావిన్‌ను దోషిగా నిర్ధరించింది.

అతడి బెయిల్‌ను కోర్టు వెంటనే రద్దు చేసింది. పోలీసులు చావిన్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే, అతడికి ఏ శిక్ష విధిస్తారన్నది రెండు నెలల్లో తెలిసిపోతుంది.

తీర్పును వింటున్న డెరెక్ చావిన్
ఫొటో క్యాప్షన్, తీర్పును వింటున్న డెరెక్ చావిన్

ఏమైనా, చావిన్ మీద నిరూపితమైన నేరాలను బట్టి అతడు దశాబ్దాల తరబడి జైల్లో గడపాల్సి రావచ్చు. మినెసోటాలో సెకండ్ డిగ్రీ హత్య కేసులో దోషికి 40 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. థర్డ్ డిగ్రీ హత్యకు కూడా 25 వరకు జైలు శిక్ష పడవచ్చు.

ఈ కేసులో మూడు వారాలపాటు విచారణ కొనసాగింది. వాదనలు విన్న తర్వాత 12 మంది సభ్యుల జ్యూరీ ఒక రోజు లోపే నిర్ణయానికి వచ్చింది.

సోమవారం ఇరు పక్షాలు తమ తుది వాదనలు వినిపించిన తర్వాత ఈ కేసులో ఒక నిర్ణయానికి రావడానికి జ్యూరీ ఒక హోటల్‌లో సమావేశమైంది.

ఈ కేసులో జ్యూరీ సభ్యులందరూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారని, వారు దీనిపై ఒక నిర్ణయం తీసుకునేవరకూ ఇంటికి కూడా తిరిగి వెళ్లలేదని చెబుతున్నారు.

చావిన్‌ను దోషిగా గుర్తిస్తున్నట్లు జ్యూరీ తీర్పు వెలువడగానే కోర్టు బయట గుమిగూడిన కొన్ని వందల మంది సంబరాలు చేసుకున్నారు.

ఈ తీర్పు చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అని ఫ్లాయిడ్ కుటుంబం తరఫున వాదించిన బెన్ క్రంప్ ట్వట్ చేశారు.

కోర్టు తీర్పు తర్వాత డెరెక్ చావిన్‌ను తీసుకెళ్తున్న పోలీసులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కోర్టు తీర్పు తర్వాత డెరెక్ చావిన్‌ను తీసుకెళ్తున్న పోలీసులు

జ్యూరీ తీర్పు తర్వాత అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు.

"చివరకు న్యాయం జరిగింది" అని బైడెన్ అనడం వినిపించింది.

"మేం ఇంకా చాలా చేయబోతున్నాం. జాత్యహంకారానికి వ్యతిరేకంగా చేపట్టబోయే చర్యల్లో ఇది మొదటిది కాబోతోంది" అని ఆయన అన్నారు.

ఈ కేసులో విజేతలు ఎవరూ లేరని, జ్యూరీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని పోలీసుల తరఫున వాదించిన మినియాపోలీస్ పోలీస్ ఫెడరేషన్ చెప్పింది.

అయితే, ఈ తీర్పుపై చావిన్ పైకోర్టులో అపీల్ చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, జార్జి ఫ్లాయిడ్ నిరసనలు: ‘ఒక నల్లజాతి అమెరికన్‌గా నేను భయపడుతున్నా’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)