You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రిన్స్ ఫిలిప్: ప్రపంచ దేశాధినేతల స్పందనలు
ప్రిన్స్ ఫిలిప్ 99 ఏళ్ళ వయసులో మరణించినట్లు బకింగ్‌హమ్ ప్యాలెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ప్రపంచ దేశాల నేతలు రాచ కుటుంబానికి సంతాప సందేశాలు పంపిస్తున్నారు. స్వీడన్ నుంచి భారత్ వరకూ వివిధ దేశాల అధినేతలు, మాజీ అధ్యక్షులు ప్రిన్స్ ఫిలిప్‌కు నివాళులు సమర్పించారు.
రాణితో కలసి డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా వందలాది విదేశీయాత్రలు చేశారు.
భారత్
"బ్రిటన్ పౌరులు, రాచకుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" తెలుపుతున్నానని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. "సైన్యంలో డ్యూక్ కెరీర్ అద్భుతమైనది. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన ముందుండి నడిపించారు" అని మోదీ అన్నారు.
ఆస్ట్రేలియా
డ్యూక్ నిరంతరం రాణికి వెన్నుదన్నుగా నిలిచారని, ఆస్ట్రేలియాలో కూడా ఎన్నో సహాయక సంస్థలకు నాయకత్వం వహించారని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ అన్నారు.
ఆస్ట్రేలియా మాజీ ప్రధాని జూలియా గిలార్డ్ కూడా, డ్యూక్ విద్యుక్త ధర్మాన్ని విస్మరించని వ్యక్తి అని, అదే సమయంలో సరదాగా కూడా ఉండేవారని చెప్పారు.
స్వీడన్
"ఎన్నో ఏళ్ళుగా మా కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉన్న గొప్ప స్నేహితుడ్ని కోల్పోయాం. మా అనుబంధానికి వెల కట్టలేం" అని స్వీడన్ కింగ్ కార్ల్ గుస్తాఫ్ అన్నారు.
స్వీడన్ రాచకుటుంబం అధికార ప్రతినిధి మార్గరెటా థోర్గ్రెన్ బీబీసీతో మాట్లాడుతూ, తమ రాజు, డ్యూక్ కలిసి ఇంగ్లండ్‌లో పడవ ప్రయాణం చేశారని చెప్పారు. "ఒక అద్భుత స్నేహానికి అదొక ప్రారంభం" అని ఆమె వ్యాఖ్యానించారు.
నెదర్లాండ్స్
ప్రిన్స్ ఫిలిప్‌ను ఎంతో గౌరవంతో స్మరించుకుంటామని నెదర్లాండ్స్ రాచకుటుంబం తెలిపింది. "ఆయన తన సుదీర్ఘ జీవితాన్ని బ్రిటన్ ప్రజలకు అంకితం చేశారు. తన మీద ఉన్న బాధ్యతలను ఆయన ఎన్నడూ విస్మరించలేదు. ప్రస్ఫుటమైన ఆయన వ్యక్తిత్వం ఒక చెరగని ముద్ర వేసింది" అని రాచకుటుంబం తన సంతాపాన్ని ప్రకటించింది.
అమెరికా
డ్యూక్ హుందాతనాన్ని ప్రశంసిస్తూ మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు బుష్, "ప్రిన్స్ ఫిలిప్ అత్యంత ప్రభావవంతమైన జీవితాన్ని జీవించారు.ఇతరుల బాగు కోసం, విలువైన బాధ్యతల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు" అని ఒక ప్రకటనలో తెలిపారు.
బెల్జియం
బెల్జియం కింగ్ ఫిలిప్ బ్రిటన్ రాణికి వ్యక్తిగత సందేశం పంపించారు. వీలైనప్పుడు వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుతానని రాణికి చెప్పారు.
మాల్టా
"మాల్టాను కూడా తన ఇల్లుగా భావించి, ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చిన ప్రిన్స్ ఫిలిప్ మరణవార్త ఎంతో బాధను కలిగిస్తోంది. మా ప్రజలు ఆయన జ్ఞాపకాలను ఎప్పటికీ స్మరించుకుంటారు" అని మాల్టా ప్రధాని రోబర్ట్ అబేలా ఒక ప్రకటనలో తెలిపారు.
న్యూజీలాండ్
"న్యూజీలాండ్ ప్రజలు, ప్రభుత్వం తరఫున రాణికి, రాచకుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాం" అని ప్రధాని జసిండా అన్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)