సూయజ్ కాలువలో మళ్లీ క్యూకట్టిన నౌకలు

ఎవర్ గివెన్ నౌకను ప్రధాన కాలువకు పక్కన వెయిటింగ్ ఏరియాకు తరలించారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఎవర్ గివెన్ నౌకను ప్రధాన కాలువకు పక్కన వెయిటింగ్ ఏరియాకు తరలించారు.
ప్రచురణ

సూయజ్ కాలువలో చిక్కుకున్న భారీ నౌక 'ఎవర్ గివెన్' ఎట్టకేలకు సోమవారం ముందుకు కదలడంతో, ఈ మార్గంలో నౌకల రవాణాకు ఏర్పడిన అడ్డు తొలగింది. దాంతో, దాదాపు వారం రోజులుగా నిలిచిపోయిన నౌకలు ఇప్పుడు ఈ కాలువ గుండా వెళ్లేందుకు క్యూ కట్టాయి.

కాలువ మధ్యలో నిలిచిపోయిన 37 నౌకలు సోమవారం రాత్రి కదలడం మొదలుపెట్టాయి. మిగిలిన 70 నౌకలు మంగళవారం వెళ్తున్నాయి.

వీటి తర్వాత మరో 400 నౌకలు ముందుకు కదలడానికి వీలవుతుందని కాలువ నిర్వహణ సంస్థ అధికారులు అంటున్నారు.

ఇసుక తుపాను, భారీ గాలుల వల్ల 400 మీటర్ల పొడవున్న ఎవర్ గివెన్ నౌక గత వారం సూయజ్ కాలువ మధ్యలో చిక్కుకుపోయింది.

శక్తివంతమైన టగ్ బోట్లను, డ్రెడ్జింగ్ పరికరాలను ఉపయోగించి 30,000 క్యూబిక్ మీటర్ల మట్టిని, ఇసుకను తొలగించి సోమవారం ఎట్టకేలకు ఈ నౌకను పక్కకు తీసుకెళ్లారు.

సూయజ్ కెనాల్

ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12 శాతం సూయజ్ కాలువ ద్వారానే సాగుతుంది.

ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రాలను కలిపే ఈ 193 కిలోమీటర్ల కాలువ అత్యంత కీలకమైన జలమార్గాల్లో ఒకటి. ఆసియా దేశాలకు యూరోపియన్ దేశాలకు మధ్య నౌకల ప్రయాణ దూరాన్ని వేల కిలోమీటర్లు తగ్గిస్తుంది.

అయితే, ఈ మార్గంలో నిలిచిపోయిన నౌకల ట్రాఫిక్ ని సాధారణ స్థితికి తేవడానికి కొన్ని వారాల సమయం పడుతుందని షిప్పింగ్ పత్రిక లోయిడ్ లిస్టుకు చెందిన మిషెల్ వీస్ చెప్పారు.

"యూరోపియన్ ఓడ రేవుల దగ్గరకు అన్ని కంటైనర్ నౌకలు ఒకే సారి రావడం వలన కూడా రేవు దగ్గర ఒక్కసారిగా రద్దీ ‌ఏర్పడుతుంది. ఇప్పుడు నౌకల ప్రయాణంలో జరిగిన జాప్యం కంటైనర్ షిప్పింగ్ రంగం మొత్తం మీద ప్రభావం చూపిస్తుంది. ఖాళీ డబ్బాలు చైనాకి, ఆసియాకి పంపించి సరుకులు తిరిగి తెచ్చే ప్రక్రియను జాప్యం చేస్తుంది" అని ఆమె బీబీసీతో అన్నారు.

ఎవర్ గివెన్ నౌకను ప్రధాన కాలువకు పక్కన వెయిటింగ్ ఏరియాకు తరలించారు.

ఫొటో సోర్స్, Reuters

"అనుకున్నదానికంటే ఆలస్యంగా వాణిజ్య నౌకలు గమ్యాన్ని చేరడం వలన భవిష్యత్తులో నిర్దేశించిన నౌకల షెడ్యూల్ కూడా అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది" అని బీబీసీ బిజినెస్ ప్రతినిధి థియో లెగ్గెట్ విశ్లేషించారు.

ఈ ప్రభావంతో యూరప్ దేశాలకు పంపే సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే కోవిడ్ వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతిన్న సమయంలో ఇవన్నీ చోటు చేసుకున్నాయి.

ఇది మరింత దెబ్బ తింటే, సరుకుల రవాణాలో జాప్యం, అధిక ధరలు, వ్యాపారస్తులకు, వినియోగదారులకు సరుకులు అందటంతో లోటు జరగడం లాంటి సమస్యలకు దారి తీయవచ్చని బీబీసీ ప్రతినిధి లెగ్గెట్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)