కాబోయే భర్తను కోటపై నుంచి తోసేసి చంపేశారన్న ఆరోపణలతో యువతి, ఆమె ప్రియుడు అరెస్ట్.. పోలీసులు ఏం చెప్పారంటే..

పెళ్లి, హత్య, మహారాష్ట్ర

ఫొటో సోర్స్, UGC

ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

కాబోయే భర్తను లోహగడ్ కోట పైనుంచి తోసేసి, చంపేశారన్న ఆరోపణలతో ఒక యువతిని, ఆమె ప్రియుడిని అరెస్టు చేసినట్లు పుణె పోలీసులు చెప్పారు.

కాబోయే భర్తను ప్రియుడి సాయంతో కోట పైనుంచి తోసి, దానిని ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించిన కేసులో వారిద్దరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మృతుని పేరు కేతన్ అగర్వాల్. కేతన్‌కు కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌధురిలను అరెస్టు చేశారు. కేతన్‌ను హత్య చేసినట్టు వారిపై ఆరోపణలున్నాయి.

కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌తో కలిసి లోహగడ్‌కు వెళ్లానని, అక్కడ ప్రమాదవశాత్తూ జారిపడి కేతన్ అగర్వాల్ చనిపోయారని సియా గోయల్ పోలీసులకు చెప్పారు.

కానీ, విచారణలో ఆ యువతి ప్రియుడి గురించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. వారి మధ్య పాత ప్రేమ వ్యవహారం ఉందని పోలీసులకు తెలిసింది. ఆ తర్వాత, పోలీసులు దీన్ని హత్య కేసుగా నమోదు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పెళ్లి, హత్య, మహారాష్ట్ర

ఈ కేసులో అనుమానం రాడంతో దర్యాప్తు చేపట్టామని, నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారని పుణె రూరల్ ఎస్పీ సందీప్ గిల్ చెప్పారు.

నిందితులను, వారి కుటుంబాలను, వారి న్యాయవాదులను సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది. వారిలో నిందితుడు చేతన్ చౌధురి తరఫు న్యాయవాది రామ్ షహానే స్పందించారు. ఆయన మాట్లాడుతూ, "ఎఫ్‌ఐఆర్‌లో చేతన్ చౌధురి‌పై ప్రత్యక్షంగా ఎలాంటి ఆరోపణలూ లేవు. ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతికి స్నేహితుడు కావడం వల్లే ఎఫ్‌ఐఆర్‌లో పేరు చేర్చారు" అని అన్నారు.

ఆ యువతి పెళ్లికి ఒప్పుకోలేదా?

పుణెలోని మావల్ తాలూకా గహుంజేకు చెందిన కేతన్ అగర్వాల్‌కు కొన్ని నెలల క్రితం పుణెలోని మార్కెట్ యార్డు ప్రాంతానికి చెందిన సియా గోయల్ అనే యువతితో నిశ్చితార్థం జరిగింది.

ఆ కుటుంబాలకు మార్కెట్ యార్డ్ ప్రాంతంలో వేర్వేరు వ్యాపారాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

కేతన్, సియాలకు ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. ఒకట్రెండు నెలల్లో పెళ్లి జరగాల్సి ఉంది.

పెళ్లి కుదరడానికి ముందే సియాకు కొంఢ్వాకు చెందిన చేతన్ చౌధురి అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉందని పోలీసుల విచారణలో తెలిసింది.

సియా అప్పటికే చేతన్‌ను ప్రేమిస్తుండడంతో, కేతన్‌తో పెద్దలు కుదిర్చిన పెళ్లి ఆమెకు ఇష్టం లేదని పోలీసులు చెప్పారు. పెళ్లి నుంచి తప్పించుకునేందుకు సియా, చేతన్‌లు కలిసి కేతన్‌ను చంపాలని నిర్ణయించుకున్నారని అన్నారు.

హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు కేతన్‌ను లోహగడ్ కోట పైనుంచి తోసివేయడానికి ఆ ఇద్దరూ కుట్ర పన్నారని ఆరోపణలు ఉన్నాయి.

పెళ్లి, హత్య, మహారాష్ట్ర

ఫొటో సోర్స్, Getty Images

‘హత్య పథకాన్ని ఎలా అమలు చేశారంటే..’

ఈ నెల 18న కేతన్‌ను సియా విహారయాత్ర కోసం లోహగడ్ కోటకు తీసుకువెళ్లారు. మొదట సియా, కేతన్ వెళ్లారు. తర్వాత చేతన్ వారిని వెంబడించారు.

చేతన్ వెనుక నుంచి వచ్చి కేతన్‌ను కొండ అంచు నుంచి కిందకు తోశారని, దీంతో ఆయన కోట పశ్చిమం వైపున కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

అప్పుడు సియా కేకలు వేయడంతో, అక్కడున్న భద్రతా సిబ్బంది సాయం చేయడానికి వచ్చారు. కోటకు పశ్చిమాన ఉన్న పొదల్లో కేతన్ మృతదేహం లభ్యమైంది.

"కోటలో తిరుగుతుండగా కేతన్ కాలు జారి లోయలో పడిపోయారు" అని సియా గోయల్ పోలీసులతో చెప్పారు.

పోలీసులు తొలుత ఈ కేసును ప్రమాదవశాత్తూ సంభవించిన మరణంగా నమోదు చేశారు.

పెళ్లి, హత్య, వివాహేతర సంబంధం, మహారాష్ట్ర

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

విచారణలో పోలీసులకు అనుమానం

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు వాంగ్మూలాలు తీసుకుంటుండగా కొన్ని అనుమానాస్పద అంశాలు కనిపించాయి.

కేతన్, సియాల మధ్య అంతకుముందు ఒకట్రెండుసార్లు వాగ్వాదాలు జరిగాయని కొంతమంది బంధువులు విచారణ సమయంలో పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి విచారణ చేపట్టారు.

సియా, చేతన్‌ మధ్య ప్రేమ వ్యవహారం ఉందని విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత ఈ కేసును దర్యాప్తు చేసేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించారు.

మరోవైపు, కేతన్‌ను హత్య చేయడానికి సియా, ఆమె ప్రియుడు చేతన్ కలిసి కుట్ర పన్నారని ఆరోపిస్తూ కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ ఫిర్యాదు చేశారు.

ఆ తర్వాత పోలీసులు ఈ కేసులో సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు జరిపారు. ఘటన జరిగిన రోజు చేతన్ చౌధురి లోహగడ్ కోట పరిసర ప్రాంతంలో ఉన్నట్టు వెల్లడైంది.

కేసు నమోదు చేసిన అనంతరం, స్థానిక క్రైమ్ బ్రాంచ్ బృందం చేతన్ చౌధురి కోసం గాలించి ఆయన్ను అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత విచారణలో హత్యకు సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు.

హత్య జరిగిన తర్వాత దానిని ప్రమాదంగా చిత్రీకరించడానికి సియా ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారు. కేతన్ కాలు జారి లోయలో పడిపోయారని ఆమె పోలీసులకు చెప్పారు.

అయితే, దర్యాప్తులోని సాంకేతిక ఆధారాలు, సంఘటనా స్థలంలోని పరిస్థితులు, నిందితుల కదలికలను పరిశీలించిన తర్వాత పోలీసులు మొత్తం కుట్రను భగ్నం చేశారు.

కేతన్‌ను పెళ్లి చేసుకోవడం సియాకు ఇష్టం లేదని పోలీసులు చెబుతున్నారు. కేతన్ తమ ప్రేమ బంధానికి అడ్డంకి అని భావించిన సియా, చేతన్‌లు ఆయన్ను చంపేశారన్నది ఆరోపణ.

ఈ కేసులో ఇద్దరు నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని పోలీస్ సూపరింటెండెంట్ సందీప్ గిల్ తెలిపారు.

పెళ్లి, హత్య, మహారాష్ట్ర

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మృతుని తల్లి పాఖీ అగర్వాల్

మృతుడి తల్లి ఏం చెప్పారు?

"ఇప్పుడు నా కొడుకు లేడు. దీనికి సియా, ఆమె ప్రియుడే పూర్తిగా బాధ్యులు. సియాను నా కోడలిగా భావించాను. ఆమె నన్ను మోసం చేసింది. అబద్ధాలు చెప్పింది. ఇప్పుడు చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె మా ఇంటికి రెండు, మూడు సార్లు వచ్చింది.

మా ఇంట్లో పూజ జరిగినప్పుడు కూడా వచ్చింది. పుట్టినరోజు వేడుకకు వచ్చింది. అంతేకాదు రెండుమూడు సార్లు మా ఇంట్లో భోజనం కూడా చేసింది.

నేను ఆమెను చాలాసార్లు కలిశాను. మేమిద్దరం చాలాసార్లు షాపింగ్‌కు కూడా వెళ్లాం. సియా అలాంటి అమ్మాయి అని మాకెప్పుడూ అనుమానం రాలేదు. ఆమెకు మరణశిక్ష విధించాలి" అని మృతుడి తల్లి పఖీ అగర్వాల్ అన్నారు.

పెళ్లి, హత్య, మహారాష్ట్ర

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్

'పెళ్లి ఇష్టం లేకపోతే వద్దని చెప్పొచ్చు కదా?'

కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు.

"వాళ్లిద్దరికీ (సియా గోయల్, కేతన్ అగర్వాల్) ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. వారు 6వ తేదీన బాలి వెళ్లాల్సి ఉంది. నలుగురు కలిసి బాలి ప్రయాణానికి సిద్ధమయ్యారు. కానీ, కేతన్ పాస్‌పోర్ట్ పోయింది. దీంతో కేతన్ ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి రావాల్సి వచ్చింది'' అని చెప్పారు.

చేతన్ చౌధురి బైక్‌పై లోహగడ్ కోట దగ్గరకు వచ్చారు. వాళ్లిద్దరూ (చేతన్ చౌధురి, సియా గోయల్) కలిసి పైకి వెళ్లారు. కేతన్ అగర్వాల్‌ను ఒక వస్తువుతో కొట్టి పైనుంచి కిందకు తోసేశారు.

"పోలీసులు మాకు చాలా సహకరించారు. చాలా త్వరగా ఈ కేసును ఛేదించారు'' అని విశాల్ అగర్వాల్ చెప్పారు.

"స్థానిక రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ బాగా సహకరించారు. వెంటనే మాకు వివరాలు తెలియజేసి ఆ ఇద్దరినీ అరెస్టు చేశారు."

''ఆమెకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే నేరుగా చెప్పాల్సింది కదా. వెంటనే పెళ్లిని రద్దుచేసే వాళ్లం. ఇంత దారుణమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? వాళ్ల మనస్తత్వం అసలెలా ఉంది?

26 ఏళ్ల యువకుడి ప్రాణాన్ని తీసేంత క్రూరమైన మనస్తత్వం వాళ్లది. సమాజం ఇలాంటి క్రూరమైన మనస్తత్వాన్ని గమనించాలి. ఈ ఆలోచనా విధానం ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ల కుటుంబం నుంచి వచ్చిందా, వాళ్ల పెంపకం నుంచి వచ్చిందా?" ఈ కేసును త్వరితగతిన విచారించి, దోషులకు వీలైనంత త్వరగా శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు .

నిందితుల తరఫు న్యాయవాదులు ఏమన్నారంటే..

ఈ కేసు విషయమై పుణెలోని సియా గోయల్ లాయర్ రాజశ్రీ సాకత్‌ను బీబీసీ మరాఠీ సంప్రదించింది.

"పోలీసులు సియా గోయల్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే, ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలించిన తర్వాత, మా క్లయింట్‌ను పోలీస్ కస్టడీకి పంపడాన్ని వ్యతిరేకించాం. ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ ఇవ్వాలని కోర్టును కోరాం. కానీ, కోర్టు మా అభ్యర్థనను అంగీకరించలేదు. ఏడు రోజుల కస్టడీ ముగిశాక, జూన్ 29న మా క్లయింట్‌ను మళ్లీ కోర్టులో హాజరుపరుస్తారు. ఆ రోజే మా వాదనలను కోర్టు ముందు వివరంగా ఉంచుతాం" అని రాజశ్రీ చెప్పారు.

నిందితుడు చేతన్ తరఫు న్యాయవాది రామ్ షహానే మాట్లాడుతూ, "విచారణ నిమిత్తం ఇద్దరు నిందితులను 7 రోజులు కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్న విషయాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు 7 రోజుల కస్టడీకి అప్పగించింది" అన్నారు.

"ఈ కేసులో రెండో నిందితుడైన చేతన్ చౌధురి‌పై ఎఫ్‌ఐఆర్‌లో ప్రత్యక్షంగా ఎలాంటి ఆరోపణలూ లేవు. ఆ యువతికి స్నేహితుడు కావడం వల్లే ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు చేర్చారు. అంతేకాకుండా, చేతన్ లోహ్‌గడ్ ప్రాంతంలో తిరిగినట్లు పోలీసుల వద్ధ పక్కా ఆధారాలు లేవు, కోర్టుకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు" అని రామ్ షహానే అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)