ఛత్తీస్‌గఢ్: మావోయిస్టుల దాడిలో నలుగురు జవాన్లు సహా అయిదుగురు మృతి

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ ప్రాంతంలో మావోయిస్టులు ఒక బస్సుపై దాడి చేయడంతో డ్రైవర్, మరో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో పాల్గొన్న డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్(డీఆర్‌జీ) పార్టీ తిరిగి వస్తుండగా సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో ఓ బ్రిడ్జ్ వద్ద మావోయిస్టులు బస్సును పేల్చేశారని ఛత్తీస్ గఢ్ యాంటీ నక్సల్స్ ఆపరేషన్ డీజీ అశోక్ జునేజా చెప్పారు

డ్రైవరు, ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించారని.. మరో ఇద్దరు హాస్పిటల్‌కి తీసుకెళ్లిన తరువాత మరణించారని.. మొత్తం అయిదుగురు ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు.

ఈ దాడిలో మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని రాయ్‌పూర్‌కు చెందిన సీనియర్ పాత్రికేయుడు అలోక్ ప్రకాశ్ పుతుల్ చెప్పారు.

వారందరినీ నారాయణపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారని ఆయన చెప్పారు.

నారాయణపూర్ జిల్లాలోని కదెనార్, మందోడాల మధ్య డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సును మావోయిస్టులు పేల్చివేశారని బస్తర్ డీఐజీ పి.సుందరరాజ్ చెప్పారు.

మావోయిస్టులు దాడి చేసిన సమయానికి బస్సులో 27 జవాన్లు ఉన్నారని ఆయన చెప్పారు.

పేలుడు తీవ్రతకు బస్సు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమై డ్రైవరు, ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మరణించారని డీఐజీ చెప్పారు.

రేపటి నుంచి తెలంగాణలో విద్యాసంస్థల మూసివేత

దేశంలో మళ్లీ కరోనావైరస్ కేసులు పెరుగుతుండడం.. తెలంగాణలో స్కూళ్లలో కేసులు ఎక్కువగా కనిపిస్తుండడంతో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

''ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యా సంస్థలను మూసివేశాయి. మన రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తి విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి.

ఈ పరిస్థితులను సమీక్షించిన తరువాత విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నిటినీ బుధవారం(24.3.2021) నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వైద్య కళాశాలలు మినహా రాష్ర్టంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్ లైన్ శిక్షణ తరగతులు యథావిధిగా కొనసాగుతాయి'' అని మంత్రి చెప్పారు.

ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటినవారంతా కోవిడ్ వ్యాక్సీన్ వేసుకోవచ్చు: కేంద్రం

దేశంలో 45 ఏళ్లు దాటినవారంతా ఏప్రిల్ 1 నుంచి కరోనావైరస్ వ్యాక్సీన్ వేయించుకోవచ్చని కేంద్రం తెలిపింది.

దీని ప్రకారం అర్హత ఉన్నవారంతా వెంటనే సంబంధిత యాప్, వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని వ్యాక్సీన్ వేయించుకోవాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ కోరారు.

ప్రస్తుతం 60 ఏళ్లు దాటినివారికి వ్యాక్సీన్ వేస్తున్నారు. 45 ఏళ్లు దాటినవారిలో దీర్ఘకాలిక వ్యాధులుంటే అలాంటివారికి మాత్రమే ప్రస్తుతం అవకాశం కల్పిస్తున్నారు. తాజా ఆదేశాల ప్రకారం వ్యాధులతో సంబంధం లేకుండా 45 ఏళ్లు దాటిన ఎవరైనా వ్యాక్సీన్ వేసుకోవచ్చు.

మారటోరియం పొడిగించమని చెప్పలేం: సుప్రీంకోర్టు

గత ఏడాది మార్చి 1 నుంచి ఆగస్ట్ 31 వరకు అమలైన రుణాల మారటోరియంను పొడిగించమని కేంద్ర ప్రభుత్వాన్ని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ప్రభుత్వాన్ని కానీ, రిజర్వ్ బ్యాంకును కానీ ఉద్దీపనలు, ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించాలని తాము ఎలాంటి ఆదేశాలు జారీచేయలేమని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది.

కోవిడ్ నేపథ్యంలో మారటోరియం పొడిగించాలని, మారటోరియం కాలానికి వడ్డీ మాఫీ చేయాలని దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు ఈ మేరకు తెలిపింది.

అయితే, మారటోరియం కాలానికి రుణాలపై వడ్డీ విధించరాదని మాత్రం ఆదేశించింది.

ఇప్పటికే వడ్డీలు వసూలు చేస్తే వాటిని రుణగ్రహీతలకు తిరిగి చెల్లించడమో, వాయిదాలలో సర్దుబాటు చేయడమో చేయాలని సూచించింది.

గత ఏడాది కోవిడ్ కారణంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో 2020 మార్చి 1 నుంచి మే 31 వరకు రుణ మారటోరియం ప్రకటిస్తూ ఆ ఏడాది మార్చి 27న రిజర్వ్ బ్యాంకు సర్క్యులర్ ఇచ్చింది. మే 31 తరువాత మారటోరియంను మరో మూడు నెలలు అంటే ఆగస్టు 31 వరకు పొడిగించింది.

'ఏం జరుగుతోందో తెలీదు.. అక్కడెవరో కాల్పులు జరుపుతున్నారు.. పారిపోండి'

అమెరికా కోలరాడోలోని బోల్డర్ నగరంలో ఒక సూపర్ మార్కెట్లో దుండగుడు కాల్పులు జరిపాడు.

ఈ కాల్పుల్లో ఒక పోలీసు సహా 10 మంది చనిపోయారని పోలీసులు చెప్పారు.

కొన్ని గంటల ఆపరేషన్ తర్వాత అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనను ప్రత్యక్ష సాక్షి ఒకరు యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు.

సోమవారం (మార్చి 22) మధ్యాహ్నం స్థానిక కాలమానం ప్రకారం 2.30గంటలకు చోటు చేసుకుంది.

అనుమానితుడు కింగ్ సూపర్స్ గ్రాసరీ షాపులోకి వెళ్లి కాల్పులు జరిపాడు.

తర్వాత 20 నిమిషాలకు కింగ్స్ సూపర్స్ మార్కెట్‌లో కాల్పులు జరుగుతున్నట్లు స్థానిక పోలీసులు ట్వీట్ చేశారు.

అక్కడ చోటు చేసుకున్న సంఘటనలను ఒక వ్యక్తి చిత్రీకరించారు.

ఆ వీడియోలో స్టోర్ దగ్గరున్న కొందరు బాధితులు కనిపిస్తున్నారు.

"నాకు ఏం జరుగుతోందో తెలీదు, కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఎవరో చనిపోయారు, అక్కడెవరో కాల్పులు జరుపుతున్నారు. పారిపోండి" అంటూ ఆయన వీడియో చిత్రీకరిస్తూనే అరుస్తున్నారు.

ఆయన షాపు నుంచి పరిగెడుతూ వీడియో తీస్తుంటే, దూరంగా కాల్పుల శబ్దాలు కూడా వినిపించాయి. అదే వీడియోలో పోలీసులు ఘటనా స్థలానికి రావడం, మార్కెట్‌ను చుట్టుముట్టడం కూడా కనిపిస్తోంది.

ఆ తర్వాత కాసేపటికి పోలీసులు ఒక వ్యక్తికి బేడీలు వేసి తీసుకెళ్లారు.

అనుమానితుడు తమ అదుపులో ఉన్నట్లు బోల్డర్ పోలీస్ చీఫ్ చెప్పారు.

"ఎంత విషాదం జరిగిందో తెలిసింది. విచారంలో ఉన్న నా తోటి కొలరాడో ప్రజలతో కలిసి ప్రార్థిస్తున్నాను" అని కొలరాడో గవర్నర్ జారెడ్ పాలిస్ ట్వీట్ చేశారు.

అధ్యక్షుడు జో బైడెన్ ఈ కాల్పులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారని వైట్ హౌస్ చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)