You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆక్స్‌ఫర్డ్-స్పుత్నిక్ వ్యాక్సీన్లను కలిపి ప్రయోగించనున్న బ్రిటన్, రష్యా - Newsreel
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రజెన్‌కా, స్పుత్నిక్-వీ వ్యాక్సీన్లను కలిపి మరింత సమర్థవతమైన వ్యాక్సీన్ తయారు చేసేందుకు బ్రిటన్, రష్యా సైంటిస్టులు ఏకం అవుతున్నారు.
రెండు వ్యాక్సీన్లను కలిపితే ఆ కొత్త వ్యాక్సీన్‌కు కోవిడ్-19 నుంచి కాపాడే సామర్థ్యం పెరుగుతుందా? లేదా? అన్నది ఈ శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు.
సాధారణంగా ఇలా రెండు వ్యాక్సీన్లను కలిపితే వచ్చే కొత్త వ్యాక్సీన్ వల్ల ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఈ కొత్త వ్యాక్సీన్‌ను రష్యాలో 18 ఏళ్లు పైబడిన వారిపై ప్రయోగిస్తారు. అయితే, ఎంత మందిపై ప్రయోగిస్తారు? ఎంతకాలం ఈ ప్రయోగం జరుగుతుంది? అన్న అంశాలపై ఇంకా స్పష్టత లేదు.
తమ వ్యాక్సీన్ సమర్థవంతంగా పనిచేస్తోందని ఆక్స్‌ఫర్డ్ ఈ మధ్యనే ప్రకటించింది.
అయితే, వృద్ధుల్లో ఈ వ్యాక్సీన్ ఎలా పనిచేస్తుందనే అంశంపై ఇంకా వివరాలు సేకరిస్తున్నారు. దీనికి ఇంకా బ్రిటన్ ప్రభుత్వం అనుమతి లభించాల్సి ఉంది.
ప్రజల రోగ నిరోధక శక్తిని పెంచి, మెరుగైన రక్షణ కల్పించే వ్యాక్సీన్ కోసం తాము వివిధ వ్యాక్సీన్ల కాంబినేషన్లను పరీక్షిస్తున్నామని ఆస్ట్రజెన్‌కా వెల్లడించింది.
డిస్నీ ప్లస్: స్టార్ వార్స్, మార్వెల్ ఫ్రాంచైజీల నుంచి కొత్త సిరీస్‌లు... ఇకపై సినిమాల విడుదల ఓటీటీలోనే
డిస్నీ తన సబ్‌స్క్రిప్షన్ స్ట్రీమింగ్ సేవల్లో స్టార్ వార్స్, మార్వెల్ ఫ్రాంచైజీలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.
త్వరలో రాబోయే తమ 'పీటర్ పాన్ అండ్ వెండీ', టామ్ హాంక్స్ 'పినోకియో' సినిమాలను థియేటర్లలో కాకుండా నేరుగా డిస్నీ ప్లస్ సేవల్లో విడుదల చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.
థియేటర్లలో విడుదలకు బదులు ఆన్‌లైన్ స్ట్రీమింగ్ మీద దృష్టిపెడుతున్న ప్రధాన స్టూడియోల్లో తాజాగా డిస్నీ కూడా చేరింది.
వార్నర్ బ్రదర్స్ కూడా 2021లో విడుదలయ్యే తమ సినిమాలన్నింటినీ మొదట హెచ్‌బీవో మ్యాక్స్ లో విడుదల చేస్తామని గతవారం చెప్పింది.
కరోనా మహమ్మారితో సినిమా, వినోద రంగాలను కష్టాలు చుట్టుముట్టాయి. మరోవైపు బిగ్ స్క్రీన్స్ మీద ప్రదర్శించే కంటెంట్‌తో ప్రేక్షకులను మళ్లీ ఆకర్షించాలని థియేటర్లు ఆశగా ఎదురుచూస్తున్నాయి.
కానీ, అలాంటి నిర్మాణ సంస్థలు మాత్రం థియేటర్లకు వెళ్లడానిక సిద్ధంగా లేని తమ ప్రేక్షకులకు వాటిని అందించాలని అనుకుంటున్నారు.
డిస్నీ ప్రణాళికలు
తమ దగ్గరున్న మార్వెల్, స్టార్ వార్స్ ఫ్రాంచైజీల నుంచి కొన్నేళ్లవరకూ 10 కొత్త సిరీస్‌లు ప్రసారం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని డిస్నీ ప్రకటించింది.
వీటిలో డిస్నీ+ బిగ్గెస్ట్ హిట్ 'ది మాండలోరియన్' కూడా ఉంది. ఇది స్టార్ వార్స్ లో ఒక పాత్ర. ఈ కొత్త సిరీస్‌లో యోడా జాతికి చెందిన పాత్ర కూడా ఉంది.
2016 'రోగ్ వన్' సినిమాలో డియేగో లూనా చేసిన పాత్ర 'ఆండోర్' పేరుతో డిస్నీ మరో స్టార్ వార్స్ సిరీస్ కూడా ప్రకటించింది.
'ది బాడ్ బాచ్', 'ఎ డ్రాయిడ్ స్టోరీ' అనే స్టార్ వార్స్ యానిమేటెడ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు డిస్నీ సంస్థ చెప్పింది.వీటితోపాటూ త్వరలో 15 లైవ్-యాక్షన్, 15 యానిమేషన్ సినిమాలను కూడా స్ట్రీమింగ్ సేవల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పింది. తమ సబ్‌స్క్రైబర్స్ ప్రతివారం కొత్తగా ఏదైనా ఊహించవచ్చని సంస్థ నిర్వాహకులు చెప్పారు.
2021లో విడుదలయ్యే మొత్తం 17 సినిమాలనూ మొదట హెచ్‌బీవో మ్యాక్స్ లో విడుదల చేస్తామని గతవారం వార్నర్ బ్రదర్స్ చెప్పిన తర్వాత, ఇప్పుడు డిస్నీ కూడా అలాంటి ప్రకటనే చేసింది.
ఏడాది క్రితం ప్రారంభమైన డిస్నీ+ కు ప్రస్తుతం ఎనిమిదిన్నర కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. సంస్థ ఊహించిన దానికంటే ఇది చాలా ఎక్కువ.
అయినా, అది ఇంకా నెట్‌ఫ్లిక్స్ కంటే వెనకబడి ఉంది. దానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది చందాదారులు ఉన్నారు.
ఆయుర్వేద వైద్యుల శస్త్ర చికిత్స ఉత్తర్వులపై డాక్టర్ల నిరసన
ఆయుర్వేద వైద్యులు కూడా శస్త్ర చికిత్సలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల డాక్టర్లు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేశారు.
ఫైజర్ టీకాను అనుమతించాలని అమెరికా నిపుణుల సిఫారసు
ఫైజర్-బయోఎన్‌టెక్ కరోనా వ్యాక్సీన్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని అమెరికా ఫుడ్ అండ డ్రగ్ అడ్మిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ)కు ఆ దేశంలోని నిపుణులు సిఫారసు చేశారు.
ఈ టీకా వేసుకోవడం వల్ల ఎదురయ్యే ముప్పు కంటే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని నిశ్చయించిన 23 మంది సభ్యుల ప్యానెల్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఫైజర్ తయారుచేసిన కోవిడ్ వ్యాక్సీన్‌ను బ్రిటన్, కెనడా, బహ్రెయిన్, సౌదీ అరేబియా ఇప్పటికే అనుమతించాయి.
ఎఫ్‌డీఏ ఈ టీకాను ఇంకా ఆమోదించాల్సి ఉంది. త్వరలో దీనికి అనుమతులు వస్తాయని భావిస్తున్నారు.
అమెరికాలో రికార్డు సంఖ్యలో ఒకే రోజు 3 వేలకు పైగా మరణాలు నమోదైన తర్వాత రోజు నిపుణులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
"ఎఫ్‌డీఏతో సమావేశం తర్వాత మేం రోజుల్లోనే వ్యాక్సీన్ పొందవచ్చు. మరో వారంలో అత్యంత బలహీనంగా ఉన్నవారికి వాటిని వేస్తాం. ఎఫ్డీఏ ఆమోదం పొందిన 24 గంటల్లో టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తాం" అని అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి అలెక్స్ అజర్ బుధవారం చెప్పారు.
అమెరికా కోసం తొలి దశలో 64 లక్షల టీకాలు సిద్ధం చేయాలని ఫైజర్ భావిస్తోంది. ఒక వ్యక్తికి రెండు డోసులు అవసరం కావడంతో 33 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో ఇవి 30 లక్షల మందికి సరిపోతాయి.
ప్రాధాన్య జాబితాలో ఉన్న దేశంలోని 2 కోట్ల మంది వైద్య సిబ్బందికి మొదట ఈ టీకా వేయనున్నట్టు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు చెప్పారు. కేర్ హోమ్స్ లో ఉంటున్న మరో 30 లక్షల మంది వృద్ధులకు కూడా వ్యాక్సీన్ వేయనున్నారు.
తర్వాత దేశంలోని కీలక రంగాలలో పనిచేస్తున్న దాదాపు 8 కోట్ల 70 లక్షల మంది కార్మికులకు తర్వాత దశలో టీకాలు వేయనున్నారు. కానీ. వీటిని ఎలా పంపిణీ చేయాలనేదానిపై రాష్ట్రాల మధ్య ఇంకా ఏకాభిప్రాయం రాలేదు. దీంతో, ఏయే రంగాల కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వాలి అనేది రాష్ట్రాలకే వదిలేయనున్నారు.
కరోనా వైరస్ వల్ల పెద్దగా ప్రమాదం లేని వారికి 2021 వేసవికి ముందే టీకాలు వేస్తామని అధికారులు చెప్పారు.
మోడెర్నా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తయారు చేసిన మరో వ్యాక్సిన్ కూడా అమెరికాలో అత్యవసర వినియోగం కోసం అనుమతులు కోరుతోంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారతదేశంలో కొంతమందికే కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తారా?
- యూరినరీ ఇన్‌కాంటినెన్స్: మహిళల్లో మూత్రం లీకయ్యే సమస్యకు కారణాలేంటి...
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- నియాండర్తల్: ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. హోమో సేపియన్స్ చేతిలో ఎంత దారుణంగా చనిపోయారంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)