You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చైనా - అమెరికా: ట్రంప్ రీట్వీట్‌తో తమ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయిందన్న చైనా Newsreel
అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం తమ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేసిన నిరాధార ఆరోపణలను తాము రీట్వీట్ చేసినట్లు యూజర్లు గుర్తించిన తరువాత అలా జరిగిందని వెల్లడించింది.
ట్రంప్ తన ట్వీట్‌లో అంతకు ముందే చేసిన నిరాధార ఆరోపణలను మళ్లీ చేశారు. గత నెలలో వచ్చిన ఎన్నికల ఫలితాలలో తనకు ఎదురైన ఓటమికి ఎన్నికల్లో మోసాలు జరగడమే కారణమని, "ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని నడపడం ఎలా సాధ్యం" అని ఆయన ట్వీట్ చేశారు.
ఆ ఆరోపణ వివాదాస్పదం అనే హెచ్చరికతో పాటుగా ఇప్పుడు ఆ ట్వీట్ నిమిషాల వ్యవధిలో ఎంబసీ అధికారిక అకౌంటు నుంచి రీట్వీట్ అయింది. అయితే, తాము రీట్వీట్ చేయలేదని చైనా ఎంబసీ ప్రకటించింది.
నిజానికి, ఎన్నికల్లో గెలిచినందుకు ట్రంప్ ప్రత్యర్థి అయిన బైడెన్‌కు చైనా అధికారికంగా శుభాకాంక్షలు తెలిపింది. అమెరికా ప్రజల ఎంపికను గౌరవిస్తామని చైనా విదేశాంగ ప్రతినిధి ఆ ప్రకటన చేశారు.
కానీ, ట్రంప్ మాత్రం ఎలాంటి ఆధారాలు చూపకుండా ఎన్నికల్లో మోసాలు జరిగాయనే ఆరోపణలు చేస్తూనే వచ్చారు.
"చైనా ఎంబసీ ట్విటర్ ఈ మధ్యాహ్నం హాక్ అయ్యింది. ఇలాంటి చర్యలను మేం ఖండిస్తున్నాం. డిసెంబర్ 9న ఎంబసీ ఎలాంటి రీట్వీట్లూ చేయలేదని మేం స్పష్టంగా చెబుతున్నాం" అని తెలిపింది.
చైనా-అమెరికా సంబంధాలు అసలే సున్నితంగా ఉన్న సమయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఈ ట్వీట్ అప్పుడే జోరందుకుంది.
ట్రంప్ పాలనలో వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం నుంచి అనుమానాస్పద గూఢచర్యం వరకూ వివాదాలు తలెత్తడంతో రెండు ఆర్థిక సూపర్ పవర్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి.
చైనా రాయబార కార్యాలయాలు చిక్కుల్లో పడడం ఇది మొదటిసారి కాదు. సెప్టంబర్‌లో బ్రిటన్‌లోని చైనా ఏంబసీ రాయబారి అధికారిక అకౌంట్ నుంచి ఒక పోర్న్ క్లిప్‌కు లైక్ వచ్చింది. దీనిపై దర్యాప్తు చేయాలని చైనా సోష ల్ మీడియా ప్లాట్‌ఫాంను కోరింది.
"ప్రజలను మోసగించడానికి రూపొందించిన, నీచమైన కుట్రలో భాగంగా తమ రాయబారి లీ క్సియోమింగ్ అకౌంట్‌పై దాడి చేశారని" చైనా అధికారులు అప్పుడు ఆరోపించారు.
భారత రైతుల ఆందోళనపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్...
బ్రిటన్ పార్లమెంటులో లేబర్ పార్టీ సిక్కు ఎంపీ తన్మన్ జీత్ సింగ్ బుధవారం భారతదేశంలో రైతుల నిరసనపై ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ప్రశ్నించారు. దానికి బోరిస్ ఇచ్చిన సమాధానం వింటే ఆయనకు అసలు ఆ విషయం గురించి అసలేమీ తెలియదని అర్థమైంది.
తన్మన్ జీత్ అడిగింది భారత్-పాకిస్తాన్ అంశమేమోనని ప్రధానికి అనిపించింది. దాంతో, రెండు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా దానిని పరిష్కరించుకోవాలని ఆయన సమాధానం ఇచ్చారు.
భారత్‌లో రైతులు గత రెండు వారాలుగా మోదీ ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రహదారులపై నిరసన ప్రదర్శనల చేస్తున్నారు.
బ్రిటన్‌లో సిక్కు ఎంపీ తన్మన్ జీత్ సింగ్ భారతదేశంలో మోదీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. బ్రిటన్ పార్లమెంటులో ఆయన గతంలో పౌరసత్వ సవరణ బిల్లు(సీఏఏ) అంశాన్ని కూడా లేవనెత్తారు.
బుధవారం పార్లమెంటులో ఆయన ప్రధాని బోరిస్ జాన్సన్‌ను, "భారత్‌లో చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా పంజాబ్ రైతులు శాంతిపూర్వక నిరసనలు చేస్తున్నారు. వారిపై వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బ్రిటన్ ప్రధాని మన ఆందోళన గురించి భారత ప్రధానికి అర్థమయ్యేలా చెబుతారా. ప్రస్తుత పరిస్థితి ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని మేం ఆశిస్తున్నాం. శాంతిపూర్వక ప్రదర్శనలు ప్రజల ప్రాథమిక హక్కు అనేది ఆయన అర్థం చేసుకోవాలి" అన్నారు.
దీనికి సమాధానం ఇవ్వడానికి జాన్సన్ సిద్ధంగా లేనట్లు అనిపించింది. "భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఈ అంశం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఒక వివాదాస్పద అంశం. రెండు ప్రభుత్వాలు కలిసి దీనికి పరిష్కారం కనుగొనాలి" అని ఆయన అన్నారు.
తమ ప్రధాని సమాధానం విని తన్మన్ జీత్ సింగ్ షాక్ అయ్యారు. ప్రధాని బోరిస్ జాన్సన్ ఇచ్చిన సమాధానాన్ని ఆయన ట్విటర్‌లో విమర్శించారు.
"మా ప్రధానికి నిజానికి, తను దేని గురించి మాట్లాడుతున్నానో తెలిసుంటే బాగుండేది" అన్నారు. బ్రిటన్ ప్రధాని ఇచ్చిన ఈ సమాధానం గురించి అక్కడ పత్రికలు కూడా ప్రచురించాయి.
ఇవి కూడా చదవండి:
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)