దుర్గా మాత విగ్రహ నిమజ్జనంలో పోలీసులకు, భక్తుల మధ్య ఘర్షణ, కాల్పులు... ఇద్దరి మృతి - BBC Newsreel

ముంగేర్

ఫొటో సోర్స్, Neeraj Priyadarshi

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

బిహార్‌లోని ముంగేర్ జిల్లాలో సోమవారం దుర్గా మాత విగ్రహ నిమజ్జన సందర్భంగా పోలీసులకు, భక్తులకు మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది.

ఈ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరు 12 ఏళ్ల అబ్బాయి కాగా, మరో వ్యక్తిని 19 ఏళ్ల అనురాగ్ పోద్దార్‌గా గుర్తించారు.

ఈ ఘర్షణలో కొందరు పోలీసులకు కూడా గాయాలైనట్లు ముంగేర్ డీఎం రాజేశ్ మీణా చెప్పారు. భక్తులతో సహా మొత్తం 20 మంది గాయపడ్డారని వివరించారు.

''విగ్రహ నిమజ్జన సందర్భంగా జనాన్ని నియంత్రించే సమయంలో ఈ ఘటన జరిగింది. దీనిపై విచారణ జరుగుతోంది. ప్రస్తుతానికి ఇంతకుమించి చెప్పలేం'' అని ఆయన బీబీసీతో అన్నారు.

ఘర్షణలో గాయపడ్డ స్థానికుడు రోహిత్ కుమార్ కూడా బీబీసీతో మాట్లాడారు.

''ముంగేర్‌లోని పెద్ద దుర్గా మాత విగ్రహం విషయమై వివాదం రేగింది. కహార్ జాతివాళ్లు విగ్రహాన్ని మోసుకుని వెళ్లడం మా ఆనవాయితీ. కానీ, పోలీసులు బలవంతంగా నిమజ్జనం చేయించేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో ముంగేర్ సీనియర్ పోలీసు అధికారుల తప్పు ఉంది. వారి ఆదేశాలతోనే స్థానిక పోలీసు అధికారులు మాపై కాల్పులు జరిపారు'' అని అన్నారు.

ముందుగా జనమే తమపై దాడి చేశారని ముంగేర్ పోలీసులు తెలిపారు.

''మొదటగా రాళ్లు రువ్వింది, కాల్పులు జరిపింది కూడా జనమే. ఘటనాస్థలంలో నాటు తుపాకుల తూటా షెల్స్ కూడా దొరికాయి'' అని చెప్పారు.

మరో రెండు రోజుల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ మొదలవుతున్న నేపథ్యంలో ఈ ఘర్షణ చెలరేగడంతో రాజకీయంగానూ వాతావారణం మరింత వేడెక్కింది.

హాత్రాస్ బాధితులు

హాథ్‌రస్ కేసు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ: సుప్రీంకోర్టు ఉత్తర్వులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్‌రస్ (ఉత్తరప్రదేశ్) అత్యాచారం ఆరోపణల కేసుపై సీబీఐ విచారణను అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షిస్తుందని సుప్రీంకోర్టు ఆదేశించింది.

బాధితురాలి కుటుంబ సభ్యులు, సాక్షులకు భద్రత సహా అన్ని అంశాలనూ అలహాబాద్ హైకోర్టు చూస్తుందని పేర్కొంది.

ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు స్థాయీ నివేదికలను అలహాబాద్ హైకోర్టుకు నివేదించాలని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో సీబీఐని నిర్దేశించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే సారథ్యంలోని ముగ్గురు సభ్యల ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది.

కేసు విచారణను దిల్లీకి బదిలీ చేయాలన్న విజ్ఞప్తిపై స్పందిస్తూ.. దర్యాప్తు పూర్తయిన తర్వాత బదిలీ విషయాన్ని పరిశీలించవచ్చునని ధర్మాసనం పేర్కొంది.

ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున ఈ విషయంలో సందేహాలు అవసరం లేదని వ్యాఖ్యానించింది.

పాకిస్తాన్: పెషావర్ మదర్సాలో పేలుడు - ఏడుగురు మృతి

పెషవార్ పేలుడు

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ ఖైబర్ పంఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లో ఒక మసీదులో జరిగిన పేలుడులో ఏడుగురు చనిపోయారు. నలుగురు పిల్లలు సహా చాలా మంది గాయపడ్డారు.

పెషావర్ నగరంలోని దిర్ కాలనీలోని జమాత్ మసీదు, మదర్సాలో ఈ పేలుడు జరిగిందని పోలీసు అధికారి యకతూత్ చెప్పారు.

మృతుల్లో పిల్లలు కూడా ఉన్నారని తొలుత వార్తలు వచ్చినా.. మృతుల వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని తర్వాత చెప్పారు.

ఈ దాడికి తామే బాధ్యులమని ఇప్పటివరకూ ఏ సంస్థా ప్రకటించలేదు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్: మదర్సా పక్కన ఉన్న మసీదులో బాంబు పేలుడు
పెషవార్ పేలుడు

ఒక వ్యక్తి మదర్సాలోకి ఒక బ్యాగ్ తీసుకెళ్లినట్లు గుర్తించామని సీనియర్ పోలీస్ అధికారి వకార్ అజీమ్ ఏఎఫ్‌పీకి చెప్పారు.

ఆ సంచిలో పేలుడు పదార్థాలు ఉన్నట్టు పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

పేలుడు జరిగిన చోట ఒక పెద్ద గొయ్యి ఏర్పడిందని సహాయ సిబ్బంది ద్వారా తెలుస్తోంది.

మసీదులోని మదరసాలో క్లాస్ జరుగుతున్నప్పుడు ఈ పేలుడు జరిగిందని అధికారులు చెప్పారు.

పెషావర్ పేలుడు

ఫంఖ్తుంఖ్వా ఆర్థిక మంత్రి తైమూర్ జాఘ్రా ఏడుగురు చనిపోయారని, గాయపడిన 70 మందిని ఆస్పత్రులకు తరలించామని, వారిలో పిల్లలు కూడా ఉన్నారని మీడియాకు చెప్పారు.

గాయపడిన 50 మందిని, 5 మృతదేహాలను ఆస్పత్రికి తీసుకొచ్చారని ఒక ఆస్పత్రి ప్రకటన విడుదల చేసింది. మృతదేహాలు, గాయపడినవారి శరీరాలు కాలిన స్థితిలో ఉన్నాయని, వారి శరీరాల్లో పేలుడు శకలాలు ఉన్నాయని తెలిపారు.

అఫ్గానిస్తాన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న పెషావర్ నగరంలోకి తాలిబన్లు చొరబడడంతో గత కొన్నేళ్లుగా హింసాత్మక ఘటనల జరుగుతున్నాయి.

ఆరేళ్ల క్రితం సాయుధులు ఒక మిలిటరీ స్కూలులోకి చొరబడి 150 మందిని కాల్చిచంపారు. వీరిలో చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు.

అమెరికా సుప్రీంకోర్టు జస్టిస్‌గా అమీ కోనీ బరెట్ ప్రమాణం

అమీ కోనీ బరెట్

ఫొటో సోర్స్, EPA

అమెరికా సుప్రీంకోర్టు జస్టిస్‌గా జడ్జి అమీ కోనీ బరెట్‌ నియామకాన్ని అమెరికా సెనేట్ ధ్రువీకరించింది.

అధ్యక్ష ఎన్నికలకు వారం ముందు దీనిని ట్రంప్ సాధించిన విజయంగా భావిస్తున్నారు.

సుప్రీంకోర్టు జస్టిస్ నియామకం కోసం జరిగిన ఓటింగ్‌లో రిపబ్లికన్లు 52-48 ఓట్ల తేడాతో డెమాక్రాట్లపై విజయం సాధించారు.

దీంతో.. 48 ఏళ్ల కోనీ బరెట్ వైట్ హౌస్‌లో అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.

అమీ కోనీ బరెట్

ఫొటో సోర్స్, EPA

కోనీ బరెట్ నియామకంతో అమెరికా అత్యున్నత న్యాయస్థానంలో సంప్రదాయవాదుల ఆధిక్యం 6-3కు పెరిగింది.

సోమవారం సాయంత్రం జరిగిన ఓటింగ్‌లో రిపబ్లికన్ సెనేటర్ సుసాన్ కాలిన్స్ ఒక్కరే అధ్యక్షుడి నామినీకి వ్యతిరేకంగా ఓటు వేశారు.

కోనీ బరెట్ రిపబ్లికన్ అధ్యక్షుడి ద్వారా నియమితులైన మూడో జస్టిస్ అవుతారు.

డోనల్డ్ ట్రంప్ 2017లో నీల్ గోర్సచ్‌ను, 2018లో బ్రెట్ కవన్నాను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు.

చైనా ఆర్థిక సాయంతో పాకిస్తాన్‌లో పట్టాలెక్కిన తొలి మెట్రో రైలు

పాకిస్తాన్ మెట్రో రైలు

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌లో తొలి మెట్రో లైన్ అందుబాటులోకి వచ్చింది.

పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్‌లో దేశంలో తొలి మెట్రో లైన్‌పై రాకపోకలు ప్రారంభమయ్యాయి.

మొత్తం 27 కిలోమీటర్ల పొడవున్న ఈ మెట్రో ఆరంజ్ లైన్‌లో దాదాపు 25 స్టేషన్లు ఉన్నాయి.

జనాభా ఎక్కువగా ఉండే లాహోర్ నగరంలో దీనివల్ల ఎక్కడికి వెళ్లాలన్నా రాకపోకలు సులభం కానున్నాయి.

పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఆదివారం ప్రారంభించిన ఈ మెట్రో పూర్తిగా అందుబాటులోకి వస్తే రోజూ దాదాపు 2.50 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా.

పాకిస్తాన్ మెట్రో రైలు

ఫొటో సోర్స్, Getty Images

ఈ ప్రాజెక్టును 300 బిలియన్ల పాకిస్తాన్ రూపాయలతో నిర్మించారు. దీన్ని పూర్తి చేయడానికి చాలా ఏళ్లు పట్టింది.

చైనా తన వన్ బెల్ట్ అండ్ వన్ రోడ్ ప్రాజెక్ట్ కింద పాకిస్తాన్‌కు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. వాటితోనే ఈ మెట్రో ప్రాజెక్టును నిర్మించారు.

ఈ మెట్రో లైన్ నిర్మాణంపై వ్యతిరేకత కూడా వచ్చింది. దీని కోసం 600కు పైగా చెట్లను కొట్టేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)