MI vs SRH: ముంబయి ఇండియన్స్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ - BBC Newsreel

ఫొటో సోర్స్, Twitter/ipl
ఐపీఎల్-2020లో ముంబయి ఇండియన్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ధాటిగా ఆట ప్రారంభించినా చివర్లో వరుస వికెట్లు కోల్పోయి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది.
ముంబయి ఇండియన్స్ ఇచ్చిన 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సన్‌రైజర్స్ జట్టు చివరి ఓవర్లో 36 పరుగులు చేయాల్సి ఉండగా కేవలం రెండు పరుగులే సాధించింది.

ఫొటో సోర్స్, Twitter/ipl
సన్‌రైజర్స్ ఓపెనర్ బెయిర్‌స్టో 15 బంతుల్లో 25 పరుగులు చేసి అవుటయ్యాడు.
డేవిడ్ వార్నర్ 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగులు చేసి పాటిసన్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
మనీశ్ పాండే 30, చివర్లో అబ్దుల్ సమీద్ 20 పరుగులు చేశారు.
ముంబయి ఇండియన్స్ బౌలర్లలో బోల్ట్, పాటిసన్, బుమ్రాలు రెండేసి వికెట్లు తీయగా కృణాల్ పాండ్యా ఒక వికెట్ తీశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.
20 ఓవరు చివరి నాలుగు బంతులు ఆడిన కృణాల్ పాండ్య ఆ నాలుగు బంతుల్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదడంతో స్కోరు 208కి చేరింది.
ముంబయి జట్టులో క్వింటన్ డికాక్ 39 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 67 పరుగులు చేయడం, ఝార్ఖండ్ యువ ఆటగాడు ఇషాన్ కిషన్ 23 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేయడంతో ముంబయి మంచి స్కోరు సాధించింది.
టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ మొదట బ్యాటింగు ఎంచుకున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ మొదటి ఓవర్లోనే అవుటయ్యాడు. ఆ తరువాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో 27 పరుగులు చేశాడు.
చివర్లో హార్దిక్ పాండ్యా 19 బంతుల్లో 28( రెండు ఫోర్లు, రెండు సిక్సులు), పొలార్డ్ 13 బంతుల్లో మూడు సిక్సర్లతో 25 పరుగులు చేయడంతో జట్టు స్కోరు పరుగులు తీసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, సిద్ధార్త కౌల్ రెండేసి వికెట్లు తీశారు. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.

ఫొటో సోర్స్, Getty Images
బిహార్ ఎన్నికలు: జేడీ(యూ)తో కలిసి పోటీచేయం.. స్పష్టం చేసిన లోక్ జనశక్తి పార్టీ
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్(యునైటెడ్)తో కలిసి పోటీ చేయబోమని ఎన్టీయే కూటమిలోని లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) ప్రకటించింది.
బిహార్‌లో నితీశ్ కుమార్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లబోమని ఎల్‌జేపీ చెప్పిందంటూ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ ఖలీక్‌ను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
సైద్ధాంతిక వైరుధ్యాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అబ్దుల్ చెప్పారు.
అయితే, జాతీయ స్థాయిలో, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి సాగుతామని చెప్పారు.
ఈ రోజు జరిగిన ఆ పార్టీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ, ఎల్‌జేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, AMIT MALVIYA/TWITTER
'హాథ్‌రస్' కేసు: బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ట్వీట్‌పై జాతీయ మహిళా కమిషన్ దర్యాప్తు
బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ గత కొన్ని రోజులుగా హాథ్‌రస్ కేసుకు సంబంధించి ట్వీట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఆయన చేసిన ఒక ట్వీట్ ఆధారంగా ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక అందించిన సమాచారం ప్రకారం...హథ్‌రస్ అత్యాచార బాధితురాలి స్టేట్‌మెంట్‌గా చెప్తూ బీజేపీ ఐటీ విభాగం ప్రధాన అధికారి అమిత్ మాలవీయ పోస్ట్ చేసిన ట్వీట్‌పై దర్యాప్తు చేస్తామని జాతీయ మహిళా కమిషన్ చెప్పింది.
అక్టోబర్ 2న అమిత్ పోస్ట్ చేసిన వీడియోలో హాథ్‌రస్ బాధితురాలు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం బయట ఒక రిపోర్టర్‌తో మాట్లాడుతూ 'నా గొంతు కోసే ప్రయత్నం చేశారని' చెబుతున్నారు.
సాధారణంగా లైంగిక హింస కేసుల్లో బాధితురాలి ముఖం, మిగతా వివరాలను గోప్యంగా ఉంచుతారు. కానీ ఈ వీడియోలో బాధితురాలి ముఖం స్పష్టంగా కనిపిస్తోంది.
"జరిగిన నేరాన్ని తక్కువ చేయాలనేది నా ఉద్దేశం కాదు. కానీ ఒక ఘోరమైన నేరానికి మరొక ఘోరమైన నేరంగా రంగు పులమడం సబబు కాద"ని అమిత్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అమిత్ ఈ వీడియో ట్విట్టర్‌లో షేర్ చేయడం వివాదాస్పదమైంది.
జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో "అత్యాచార బాధితురాలి వీడియోను ఇలా షేర్ చెయ్యడం చట్టవిరుద్దం, దురదృష్టకరమ"ని చెప్పారు.
"ఈ వీడియో నేను చూడలేదు, కానీ, అందులో బాధితురాలి వివరాలు బహిర్గతం అవుతున్నట్లు ఉంటే అలాంటి వీడియో పోస్ట్ చెయ్యడం అభ్యంతరకరం. దానిపై అమిత్‌కు నోటీసులు పంపిస్తామ"ని ఉత్తరప్రదేశ మహిళా కమిషన్ అధ్యక్షురాలు విమలా బాథం అన్నారు.
భారతీయ శిక్షాస్మృతి ప్రకారం లైంగిక హింస కేసుల్లో బాధితుల గుర్తింపును ఎవరైనా బహిరంగపరిస్తే వారికి రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
2018లో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఐపీసీ సెక్షన్ 228 ఏ(2) ప్రకారం బాధితురాలి పేరుతోపాటు, ఆమెకు సంబంధించిన ఏ వివరాలనూ బహిర్గతం చెయ్యకూడదని, ఆమె మరణించినా, కుటుంబ సభ్యుల అనుమతించినా బాధితురాలి పేరు, వివరాలు, ఫొటోలు బహిర్గతం చేయకూడదని స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, BCCI/IPL
IPL 2020: విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్, రాజస్థాన్‌పై బెంగళూరు, కోల్‌కతాపై దిల్లీ విజయం
యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్-13లో భాగంగా శనివారం రెండు మ్యాచ్‌లు జరిగాయి.
మధ్యాహ్నం జరిగిన మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో గెలిచింది.
సాయంత్రం జరిగిన రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మీద దిల్లీ కాపిటల్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తడబడ్డ కోల్‌కతా
దిల్లీ కాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది.
229 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 210 పరుగులు మాత్రమే చేయగలిగింది.
కోల్‌కతా ఆటగాళ్లలో నితీశ్ రాణా(58), ఇయాన్ మార్గాన్(44), రాహుల్ త్రిపాఠీ(36) మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రారంభం సరిగా లేదు. 3 పరుగులే చేసి అవుటైన ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి విఫలం అయ్యాడు.
మంచి ఫాంలో ఉన్న మరో ఓపెనర్ శుభమన్ గిల్ నితీశ్ రాణాతో స్కోరును 72 వరకూ చేర్చాడు. శుభమన్ 1, నితీశ్ రాణా 4 సిక్సర్లు కొట్టారు.
ఆండ్రీ రసెల్ 13 పరుగులకు, కెప్టెన్ దినేశ్ కార్తీక్ 6 పరుగులకే అవుటైనా ఇయాన్ మోర్గాన్, త్రిపాఠీతో కలిసి దూకుడుగా ఆడాడు.
ఇద్దరూ సిక్సర్లు కొడుతున్నప్పుడు మ్యాచ్ ఏకపక్షంగా అనిపించింది.
త్రిపాఠీ 17వ ఓవర్ వేసిన మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు ఒక ఫోర్ కొడితే, 18వ ఓవర్లో మోర్గాన్ కూడా రబాడా బౌలింగ్‌లో వరసగా మూడు సిక్సర్లు కొట్టాడు.
ఆ తర్వాత ఓవర్లోనే అవుటైన ఇయాన్ మోర్గాన్ 18 బంతుల్లో 44 పరుగులు చేశాడు. మొత్తం ఐదు సిక్సులు కూడా కొట్టాడు.
చివరి ఓవర్లో విజయం కోసం 26 పరుగులు చేయాల్సిన సమయంలో త్రిపాఠీ రెండో బంతికే అవుట్ అయ్యాడు. అతడు 16 బంతుల్లో 36 పరుగులు చేశాడు.
చివరి ఓవర్‌లో కోల్‌కతా ఏడు పరుగులు మాత్రమే చేయగలిగింది.
దిల్లీ బౌలర్లలో ఎన్రిచ్ నార్ట్జే మూడు, హర్షల్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు.

ఫొటో సోర్స్, BCCI/IPL
దిల్లీ బ్యాటింగ్
మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 38 బంతుల్లో 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
శ్రేయస్ అయ్యర్ నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టాడు.
ఓపెనర్ పృథ్వీ షా కూడా దూకుడుగా ఆడాడు. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో మొత్తం 66 పరుగులు చేశాడు.
శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్‌తో కలిసి జట్టుకు మంచి భాగస్వామ్యాలు అందించాడు.
రిషబ్ పంత్ 17 బంతుల్లో 38 పరుగులు చేయగా, శిఖర్ ధవన్ 16 బంతుల్లో 26 పరుగులు చేశారు.
చివరి వరకూ క్రీజులో నిలిచిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును బలమైన స్థితికి చేర్చాడు.
కోల్‌కతా బౌలర్లలో ఆండ్రీ రసెల్ రెండు వికెట్లు పడగొట్టాడు.

ఫొటో సోర్స్, BCCI/IPL
రాజస్థాన్‌పై బెంగళూరు విజయం
మధ్యాహ్నం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో గెలిచింది.
విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ తో 155 పరుగుల విజయలక్ష్యాన్నిబెంగళూరు ఇంకా 5 బంతులు ఉండగానే అందుకుంది.
ఓపెనర్ దేవదత్త్ పడిక్కల్ 45 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.
బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 2 సిక్సర్లు, ఏడు ఫోర్లు కొట్టాడు.
ఆరాన్ ఫించ్(8) పరుగులు చేయగా, ఏబీ డివిలియర్స్ 12 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
చివరి ఓవర్లో విజయానికి 1 పరుగు అవసరమైన సమయంలో డివిలియర్స్ ఫోర్ కొట్టాడు
భారీ స్కోరు చేయని రాజస్థాన్
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులే చేయగలిగింది.
ఓపెనర్ జాస్ బట్లర్ 22, మహిపాల్ లోమ్రోర్ 47, రాహుల్ తేవతియా 24 పరుగులు చేశారు.
39 బంతుల్లో 47 పరుగులు చేసిన మహిపాల్ జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
బెంగళూరు బౌలర్లలో యజువేంద్ర చహల్ 3, ఇసురు ఉధన 2 వికెట్లు పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- అండమాన్ కాలాపానీలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో హత్య.. ‘‘ద ఫస్ట్ జిహాద్’’
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























